సుప్రీంకోర్టు: ‘8 వారాల టైమిస్తున్నాం. ఒక్క వీధి కుక్క కూడా దిల్లీ వీధుల్లో కనిపించకూడదు’’ అంటూ ఆదేశాలు, జంతు ప్రేమికులు ఏమంటున్నారు?

దిల్లీలో వీధికుక్కల సమస్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ నగరంలో వీధికుక్కలు పది లక్షల వరకూ ఉన్నాయని అంచనా
    • రచయిత, అభిషేక్ డే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
    • నుంచి, దిల్లీ

కుక్కకాటుతో ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి సోకడానికి దారితీసే ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

వీధికుక్కలు ఒక్కటి కూడా వీధుల్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

దిల్లీ, సబ్‌అర్బన్ ప్రాంతాల్లో పది లక్షల వరకూ వీధికుక్కలు ఉంటాయని అధికారుల అంచనా. వాటన్నింటినీ పట్టుకొని జంతు సంరక్షణా కేంద్రాలకు తరలించాలని న్యాయస్థానం సూచించింది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది.

నగరపాలక సంస్థ అధికారుల సమాచారం ప్రకారం...దిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రాం తదితర సబ్‌అర్బన్ ప్రాంతాల్లో వీధికుక్కల సంచారం విపరీతంగా పెరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏం చెబుతుందంటే... భారత్‌లో లక్షల సంఖ్యలో వీధికుక్కలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ సంబంధిత వ్యాధులతో మరణాలలో 36 శాతం ఇక్కడి నుంచే ఉంటున్నాయి.

''భారత్‌లో రేబిస్ వల్ల వాస్తవ నష్టం ఎంతనేదీ పూర్తిగా తెలియదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏటా 18 వేల నుంచి 20 వేల మరణాలకు ఇది కారణమవుతోంది'' అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

వీధికుక్కలు

కాటేస్తున్న వీధికుక్కలు...

అధికారిక గణాంకాల ప్రకారం... 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.

దిల్లీ, ఇతర ప్రధాన నగరాల్లో కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో సుప్రీంకోర్లు ఈ అంశంపై విచారణను చేపట్టింది.

దిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంరక్షణ కేంద్రాలు (షెల్టర్లు) తెరవాలని, ఒక్కొక్కటీ కనీసం 5వేల కుక్కలను ఉంచేలా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ షెల్టర్లలో స్టెరిలైజేషన్, వాక్సినేషన్ సౌకర్యాలతో పాటు సీసీ టీవీ కెమెరాలు ఉండాలని కోర్టు ఆదేశించింది.

వీధికుక్కలకు స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని ఎక్కడైతే బంధించారో మళ్లీ అక్కడే విడిచిపెట్టాలని ప్రస్తుతం నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని బహిరంగ ప్రదేశాల్లో విడిచిపెట్టకూడదని కోర్టు స్పష్టం చేసింది.

కుక్కకాటు, రేబిస్ కేసులను నివేదించడానికి హెల్ప్ లైన్‌ను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.

''శిశువులు, చిన్నపిల్లలు ఎట్టిపరిస్థితుల్లోనూ రేబిస్ బారినపడకూడదు. వారు వీధికుక్కల కాటుకు గురవుతామనే భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలరనే విశ్వాసం కలిగించేలా అధికారులు చర్యలు ఉండాలి'' అన్న కోర్టు ఆదేశాలను లీగల్ న్యూస్ వెబ్‌సైట్ 'లైవ్ లా' సోమవారం ఉటంకించింది.

మేనకా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ

జంతు సంక్షేమ సంఘాల ఆందోళన...

కోర్టు ఆదేశాలపై జంతు సంక్షేమ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కోర్టు విధించిన గడువు వాస్తవదూరంగా ఉందని జంతుప్రేమికులు చెబుతున్నారు.

ప్రస్తుతం భారత్‌లోని చాలా నగరాల్లోనున్న షెల్టర్లు, ఇప్పుడీ వీధికుక్కలకు ఆశ్రయం కల్పించడానికి అవసరమైన సామర్థ్యంలో ఒక శాతం కూడా లేవని ప్రముఖ జంతుహక్కుల సంఘం పాస్ (పీఏడబ్ల్యూఎస్) వ్యవస్థాపకుడు నీలేశ్ భనాగే చెప్పారు.

''కోర్టు, అధికారులు నిజంగా ఈ ముప్పును తప్పించాలనుకుంటే కుక్కల సంతతిని, రేబిస్‌ను నిరోధించడానికి ఇప్పటికే ఉన్న నిబంధనలను వేక్సినేషన్, స్టెరిలైజేషన్, గార్బేజ్ మేనేజ్‌మెంట్ సహా పటిష్టంగా అమలుచేయడంపై దృష్టిపెట్టాలి'' అని నీలేశ్ అన్నారు.

కోర్టు ఆదేశాలపై కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల ఉద్యమ నాయకురాలు మేనకా గాంధీ స్పందించారు.

''ఏబీసీ రూల్స్-2023 ప్రకారం వ్యాధులతో స్వయంగా మనుగడ సాగించలేని కుక్కలకు తప్ప వీధికుక్కలకు షెల్టర్ కల్పించడానికి జంతు సంఘాలు ఎప్పుడూ అనుకూలంగా లేవు. కాకపోతే, వీధికుక్కలు వీధుల్లోనే ఉండాలి. వాటి సంతతి నియంత్రణకు సంబంధించి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌కు నిబంధనలు ఉన్నాయి. కానీ మున్సిపాలిటీలు అలా చేయడం లేదు. అలా చేసి ఉంటే ఇప్పటికే సమస్య పరిష్కారమయ్యేది. వాటి సంతతి కూడా బాగా తగ్గి ఉండేది'' అన్నారు.

''అన్ని కుక్కలను షెల్టర్లలో బంధిస్తే, వాటి పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు. ఈ కేంద్రాలు కచ్చితంగా బాగుండవు. షెల్టర్ల ఏర్పాటుకు స్థలం, నిర్వహణకు సిబ్బంది, కుక్కలకు ఆహారం అవసరం. దేశం మొత్తంమీద కానీ, లేదా ఒక నిర్దిష్ట నగరంలో కానీ కుక్కల సంఖ్యకు సంబంధించిన అధికారిక గణాంకాలు లేవు'' అని ఆమె చెప్పారు.

''కుక్కకాటు తీవ్రమైన సమస్య. మనుషులపై దాడి చేసి చంపేస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోగలం. అయితే అన్నివేళలా ఇది సరైన వాదన కాదు. చట్టంలో నిర్దేశించిన అంశాల్లో కనీసం సగం కూడా ప్రభుత్వ సంస్థలు పనిచేయట్లేదు. ఎప్పుడూ కిల్లింగ్ ఆర్డర్స్ కోసం ఎదురుచూస్తుంటాయి'' అని మేనకా విమర్శించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)