అడవి జంతువులను వేటాడే పులులు 'మ్యాన్ ఈటర్స్'గా ఎందుకు మారుతున్నాయి?

పులులు, లెపర్డ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల తమిళనాడులోని వాల్పరైలో నాలుగేళ్ల బాలికను లెపర్డ్ చంపడం ప్రజల్లో భయాందోళన సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలకు వెళ్లే నడక దారిలోనూ ఇలాంటి ఘటన గతంలో జరిగింది. సాధారణంగా, అడవి జంతువులను వేటాడి తినే పులులు.. మనుషులను ఎందుకు వేటాడుతున్నాయనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.

పులులు, లెపర్డ్‌లు కొన్ని సందర్భాల్లో 'నరభక్షకాలు'గా మారవచ్చని వన్యప్రాణి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ ఇప్పటికీ సమస్యగానే ఉంది. అడవిలో సహజంగా ఇతర జంతువులను వేటాడే పులి, లెపర్డ్ ఎలాంటి పరిస్థితులలో మనుషులను వేటాడుతాయి?.

పులి ఇలా 'నరమాంస భక్షకం'గా ఎందుకు మారుతుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పులులు, లెపర్డ్

ఫొటో సోర్స్, Getty Images

మనుషులను ఎందుకు వేటాడుతాయి?

పులి 'నరమాంస-భక్షకం'గా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో వెటర్నరీ డాక్టర్ రాజేష్ చెప్పారు.

రాజేష్ వివరణ ప్రకారం..

  • కొన్ని పులులు వృద్ధాప్యంలోకి వెళ్లి వేటాడే సామర్థ్యాన్ని కోల్పోతే, ఆహారం కోసం మనుషులపై దాడి చేయవచ్చు.
  • వయసులో ఉన్న పులులు గాయపడి వేటాడే సామర్థ్యం తగ్గితే, మనుషులపై దాడికి ప్రయత్నిస్తాయి.
  • కొన్ని ప్రదేశాలలో అడవిలోకి వచ్చిన వ్యక్తులపై పులులు దాడి చేస్తాయి.

"పులులు గాయపడినా లేదా ముసలివైనా అడవిని అంత సులువుగా వదిలి వెళ్లవు. చాలావరకు అక్కడే ఉండి చనిపోతాయి. అలాంటి ప్రాంతంలోకి ఎవరైనా మనుషులు వెళితే వారిని వేటాడతాయి. అవి ఒకసారి మనుషులను సులభంగా వేటాడగలిగితే, మళ్లీ వేటాడే ప్రమాదం కూడా ఉంది" అని రాజేష్ చెప్పారు.

పులులు మనుషులను వేటాడటం గురించి 'మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమావోన్' పుస్తకంలో జిమ్ కార్బెట్ రాశారని నీలగిరి వైల్డ్‌లైఫ్ సొసైటీకి చెందిన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సత్యమూర్తి అన్నారు.

పులి, లెపర్డ్ 'మ్యాన్ ఈటర్స్'గా మారితే, వాటిని చంపడమే పరిష్కారం అని అందులో రాశారని చెప్పారు.

తమిళనాడు, టీ ఎస్టేట్స్, పులులు

ఫొటో సోర్స్, NCF

1900, 1930 మధ్య మనిషి ప్రాణాలను బలిగొన్న పులులు, లెపర్డ్‌లను కాల్చి చంపిన జిమ్ కార్బెట్, వాటి జీవనశైలి, వేటపై నిశితమైన పరిశోధనలు నిర్వహించారు. అంతేకాదు, పులులు, లెపర్డ్‌లను రక్షించాల్సిన అవసరంపై ఆయన పలు పుస్తకాలు రాశారు.

"మనిషి మాంసాన్ని పులులు రుచి చూశాక, అవి మళ్లీ మనుషులను వేటాడటానికి వచ్చే ప్రమాదం ఉంటుందని జిమ్ కార్బెట్ అన్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. అడవులకు మానవ నివాసాలు దగ్గరగా వచ్చాయి. ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి" అని సత్యమూర్తి చెప్పారు.

పులులు, లెపర్డ్

ఫొటో సోర్స్, NCF

ఫొటో క్యాప్షన్, పులిని కాల్చడానికి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అనుమతించదు, అది 'నరభక్షకం'గా మారిందని అటవీ శాఖ ఆధారాలతో నిరూపించగలిగితే అనుమతిస్తుంది.

"అడవిలో పులి, పట్టణానికి దగ్గరగా లెపర్డ్"

పులులు సాధారణంగా సిగ్గుపడే జంతువులని, అవి మనుషులను చూసినప్పుడు వెనక్కి వెళతాయని, మానవులు నివసించే ప్రాంతాలలో ఎక్కువ మనుగడ సాగించలేవని రాజేష్ చెప్పారు.

కానీ, లెపర్డ్‌కు ఆ భయం ఉండదని, మానవులు నివసించే ప్రాంతాలలో దాక్కునైనా మేకలు, కుక్కలు, కోళ్లను వేటాడగలవని ఆయన చెప్పారు.

నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సీనియర్ శాస్త్రవేత్త ఆనందకుమార్ దీనిపై మాట్లాడుతూ, "నగరంలో పులి కనిపించదు. కానీ మిశ్రమ అడవులు, మానవ నివాస ప్రాంతాలలో లెపర్డ్ ఉండగలదు. కోయంబత్తూర్ వంటి పెద్ద నగరాల్లో కూడా లెపర్డ్‌లు వచ్చి వెళ్లడం చూడవచ్చు" అని అన్నారు.

పులులు అన్ని వయసుల వారిపై దాడి చేస్తాయని, లెపర్డ్ మాత్రం వాటి ఎత్తు, బరువు ఆధారంగా వేటాడుతుందని ఆనందకుమార్ చెప్పారు.

"సాధారణంగా ఒక పెద్ద పులి 250-300 కిలోల బరువు ఉంటుంది. కానీ, ఆరోగ్యకరమైన లెపర్డ్ గరిష్టంగా 70–80 కిలోల బరువే ఉంటుంది. ఒక పులి 120 సెం.మీ ఎత్తుకు ఎగురగలదు. కానీ, లెపర్డ్ గరిష్టంగా 70 సెం.మీ. ఎత్తు మాత్రమే ఎగురుతుంది. కాబట్టి అవి ఆ ఎత్తులో ఉన్న పిల్లలపై దాడి చేస్తాయి" అని ఆయన చెప్పారు.

"లెపర్డ్ ప్రధాన ఆహారం అడవి పందులు. అంతేకాదు మచ్చల జింకలు, మేకలు, అడవి కుందేళ్లు, అడవి కోళ్లు, వీధి కుక్కలను కూడా వేటాడతాయి. కొన్నిసార్లు ముళ్లపందులు, కప్పలను కూడా వేటాడి తింటాయి. టీ తోటల ప్రాంతాలలో జింక పిల్లలు వాటికి ప్రధాన ఆహారం" అని వెటర్నరీ డాక్టర్ రాజేష్ చెప్పారు.

లెపర్డ్ సాధారణంగా వాటి కంటికి కనిపించే దూరంలో లేదా వాటి పరిమాణంలో ఉన్న చిన్న జీవులను మాత్రమే వేటాడుతుందని, అందుకే పిల్లలపై ఎక్కువగా దాడి చేస్తుందని రాజేష్ చెప్పారు.

జిమ్ కార్బెట్ పుస్తకం కవర్
ఫొటో క్యాప్షన్, జిమ్ కార్బెట్ రాసిన 'మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమావున్' పుస్తకం కవర్

ఆవాసాల ఆధారంగా..

టీ ఎస్టేట్లలో పెంచే వీధి కుక్కలను కూడా లెపర్డ్స్ ఇటీవల లక్ష్యంగా చేసుకుంటున్నాయని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త రమేష్ అన్నారు.

ఇద్దరు మహిళలను పులులు దాడిచేసి చంపిన ఘటనలను జిమ్ కార్బెట్ తన పుస్తకంలో ప్రస్తావించారని రమేష్ గుర్తుచేశారు. కట్టెలు సేకరించడానికి మహిళలు వంగినపుడు వారిపై జంతువులు దాడి చేసినట్లు రాశారని ఆయన తెలిపారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయని రమేష్ చెప్పారు.

"లెపర్డ్‌లు వీధి కుక్కలను వెతుక్కుంటూ వస్తాయి. కుక్కలు, పిల్లలు ఒకే ఎత్తులో ఉండటంతో లెపర్డ్ వారిపై దాడి చేస్తుంది. ఈ ఘటనలపై లోతైన అధ్యయనాలు జరగాలి. అటవీ, నివాస ప్రాంతాల కలయికే దీనికి కారణమనే వాదనను కాదనలేం" అని ఆనందకుమార్ అన్నారు.

పులులు, లెపర్డ్‌ల ఆవాసాల ఆధారంగా వాటి జీవనశైలి, వేట అలవాట్లు ఉంటాయని శాస్త్రవేత్త రమేష్ అభిప్రాయపడ్డారు.

"పులులు సాధారణంగా 2 ఏళ్ల వయస్సులోనే తల్లులను విడిచిపెట్టి వేట ప్రారంభిస్తాయి. ఆ సమయంలో పులులు సులభంగా లభించే ఎలాంటి ఆహారంపైనైనా దాడి చేస్తాయి. అదేవిధంగా, పులులు గాయపడితే సులువుగా ఉంటుందని మనుషులను వేటాడతాయి" అని రమేష్ చెప్పారు.

శాస్త్రవేత్త రమేష్
ఫొటో క్యాప్షన్, శాస్త్రవేత్త రమేష్

మనిషిని పులి వేటాడిన తర్వాత, మళ్లీ మళ్లీ చేస్తుందా?

ముదుమలై టైగర్ రిజర్వ్‌లో జరిగిన ఒక సంఘటనను అటవీ అధికారి ఒకరు ఉదాహరణగా చెబుతూ.. 2023 జనవరి 31న, ముదుమలై తెప్పకాడు శిబిరానికి 100 మీటర్ల దూరంలో కట్టెలు సేకరించడానికి అడవిలోకి వెళ్లిన గిరిజన మహిళపై ఒక రెండున్నరేళ్ల పులి దాడిచేసిందని, ఆ తర్వాత రెండేళ్లు అది మనుషులపై దాడిచేయలేదని తెలిపారు.

ఇటువంటి యాదృచ్ఛిక సంఘటనల కారణంగా పులులు వెంటనే 'నరభక్షకాలు'గా మారే అవకాశం లేదని ఇది చూపిస్తుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

అందుకే పులిని కాల్చడానికి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అనుమతించదని, అది 'నరభక్షకం'గా మారిందని అటవీ శాఖ ఆధారాలతో నిరూపించగలిగితే అనుమతిస్తుందని చెప్పారు.

బోను

ఫొటో సోర్స్, NCF

ఫొటో క్యాప్షన్, పులులు, లెపర్డ్‌లను బోనులో బంధించడమే పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు.

మానవ-వన్యప్రాణుల సంఘర్షణను ఎలా నివారించాలి?

మానవ-వన్యప్రాణుల సంఘర్షణపై పరిశోధనలో డాక్టరేట్ పొందిన సెంటర్ ఫర్ నేచర్ కన్జర్వేషన్ శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, "నగరంలో రోడ్ల పక్కన ఇళ్లుంటాయి. అక్కడ నివసించే పిల్లలకు రోడ్డుపైకి వెళ్లకూడదని నేర్పిస్తుంటారు. అలాగే అడవికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలలో కొన్ని సమయాల్లో బయటకు వెళ్లకూడదని లేదా ఆడకూడదని కుటుంబాలకు ముఖ్యంగా పిల్లలకు అవగాహన కల్పించాలి" అని అన్నారు.

"పులులు, లెపర్డ్‌లను బోనులో బంధించడమే పరిష్కారం కాదు, సంబంధిత ప్రాంతానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలి" అని శాస్త్రవేత్త రమేష్ సూచించారు.

మానవ-వన్యప్రాణుల సంఘర్షణకు అడవుల నరికివేత ఒక ప్రధాన కారణమని తన సంస్థ పరిశోధనలో వెల్లడైందని రమేష్ తెలిపారు.

"ఒక ప్రాంతంలో ప్రమాదం జరిగిన తర్వాత పరిష్కారాలను కనుగొనడం కంటే, అది జరగకుండా నిరోధించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం అవసరం" అని రమేష్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)