ఎయిర్ ఇండియా విమానం వీడియో రికార్డ్ చేసిన 17 ఏళ్ల యువకుడి జీవితాన్ని ఆ ప్రమాదం ఎలా మార్చేసింది?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం
ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం జూన్ 12న కూలిపోయింది.
    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్

విమానం శబ్దం విన్నప్పుడల్లా ఆర్యన్ అసారీ దాన్ని చూసేందుకు బయటకు పరిగెత్తేవారు.

విమానాలను చూడటం ఆర్యన్ హాబీ అని అతని తండ్రి మగన్‌భాయ్ అసారీ చెప్పారు. విమానం గాలిలో, పొగతో తెల్లని చారలు వదులుతూ.. ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు.. ఇంజిన్ బిగ్గరగా చేసే శబ్దమంటే ఆర్యన్‌కు చాలా ఇష్టం.

కానీ ఇప్పుడు, దాని గురించి ఆలోచిస్తే ఆర్యన్‌కు విసుగ్గా అనిపిస్తుంది.

17 ఏళ్ల ఆర్యన్ జూన్ 12వ తేదీ మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని తన ఇంటి టెర్రస్‌పై విమానాలు వెళుతుండగా వీడియో రికార్డ్ చేస్తున్నారు. అప్పుడే, ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ 787-8 అక్కడ కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది మరణించారు. దాని కింద ఉన్న దాదాపు 30 మంది కూడా మరణించారు.

ఆర్యన్ ఆ క్షణాన్ని తన ఫోన్‌లో రికార్డ్ చేశారు.

"నేను విమానాన్ని చూశా. అది కిందకి దిగుతూ ఉంది. తర్వాత అది ఊగిపోతూ నా కళ్ల ముందే కూలిపోయింది" అని ఆర్యన్ ఈవారం ప్రారంభంలో బీబీసీ గుజరాతీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దర్యాప్తు అధికారులకు ఆ వీడియో కీలకమైన సాక్ష్యం. అది మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలైంది.

ఉన్నత పాఠశాల విద్యార్థి అయిన ఆర్యన్ దేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన ప్రమాదంలో కీలకంగా మారారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఇంటర్వ్యూ ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు. విలేఖరులు పగలు, రాత్రి మా ఇంటి బయట నిలబడి అతనితో మాట్లాడాలని అడుగుతున్నారు" అని ఆర్యన్ తండ్రి అసారీ బీబీసీతో చెప్పారు.

అయితే, ప్రమాదం, ఆ తర్వాత జరిగిన ప్రతి ఘటన - ఆర్యన్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

"నా కొడుకు చాలా భయపడ్డాడు, ఫోన్‌ వాడటం కూడా మానేశాడు" అని అసారీ అన్నారు.

అహ్మదాబాద్, ఆర్యన్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, గుజరాత్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్.

మొదటిసారి సిటీకి..

రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన మగన్‌భాయ్ అసారీ ప్రస్తుతం సిటీ మెట్రో సర్వీస్‌లో పనిచేస్తున్నారు. మూడేళ్లుగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో నివసిస్తున్నారు. ఆయన ఇటీవలే మూడంతస్తుల భవనం టెర్రస్‌పైన ఉన్న ఒక చిన్న గదిలోకి మారారు, అక్కడి నుంచి నగరం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆయన భార్య, ఇద్దరు పిల్లలు (పెద్ద కూతురు, కొడుకు ఆర్యన్) గుజరాత్, రాజస్థాన్ బోర్డర్ సమీపంలోని వారి సొంతూళ్లో ఉంటున్నారు.

"ఆర్యన్ అహ్మదాబాద్‌ రావడం ఇదే మొదటిసారి. నిజానికి, అతను ఊరు దాటి రావడం కూడా ఇదే మొదటిసారి" అని అసారీ చెప్పారు.

"నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, టెర్రస్ పైనుంచి విమానాలు చూడొచ్చా? అని ఆర్యన్ అడిగేవాడు. వందల విమానాలు ఎగురుతుంటాయని చెప్పేవాడిని" అని ఆయన అన్నారు.

ఆర్యన్‌కు విమానాలంటే చాలా ఇష్టమని, తమ గ్రామంమీదుగా ఆకాశంలో అవి వెళ్తుంటే చూస్తూ ఉండేవాడని అసారీ చెప్పారు.

అందుకే, తండ్రి ఉంటున్న అహ్మదాబాద్ ఇంటి టెర్రస్ పైనుంచి విమానాలను దగ్గరగా చూసే అవకాశం అతనికి ఉత్సాహాన్ని కలిగించింది.

అహ్మదాబాద్, ఆర్యన్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, గుజరాత్
ఫొటో క్యాప్షన్, మేఘనినగర్ అనే ప్రాంతంలో విమానం కూలిపోయింది.

స్నేహితులకు చూపించాలని వీడియోలు

గతవారం, పోలీస్ ప్రవేశ పరీక్ష రాసేందుకు అసారీ కూతురు అహ్మదాబాద్ రావాల్సి వచ్చింది. దీంతో, ఆర్యన్ ఆమెకు తోడుగా వచ్చేందుకు సిద్ధమయ్యారు.

"కొత్త నోట్‌బుక్స్, బట్టలు కొనిపెట్టాలని ఆర్యన్ అడిగాడు" అని అసారీ చెప్పారు.

ప్రమాదం జరగడానికి దాదాపు గంటన్నర ముందు, గురువారం మధ్యాహ్నం సమయంలో ఆర్యన్‌.. అతని అక్క వాళ్ల నాన్న ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ముగ్గురూ కలిసి భోజనం చేశారు. తరువాత అసారీ డ్యూటీకి వెళ్లారు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.

ఆర్యన్ టెర్రస్ పైకి వెళ్లి తన స్నేహితులకు చూపించడానికి ఇంటి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అప్పుడే ఎయిర్ ఇండియా విమానాన్ని చూసి.. దానిని రికార్డ్ చేయడం ప్రారంభించినట్లు బీబీసీ గుజరాతీకి చెప్పారు.

విమానం సరిగ్గా వెళ్లడం లేదని ఆర్యన్‌కు అనిపించింది.

"విమానం ఊగుతోంది, అటూఇటూ కదులుతోంది" అని ఆయన చెప్పారు.

విమానం పడిపోవడం మొదలైనప్పుడు ఆర్యన్ రికార్డ్ చేస్తూనే ఉన్నారు, ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు.

కానీ, దట్టమైన పొగ, భవనాల నుంచి మంటలు రావడంతో, ఆ తర్వాత అర్థమైంది. ఆర్యన్ వెంటనే ఆ వీడియోను తన తండ్రికి పంపించి, ఆయనకు ఫోన్ చేశారు.

అహ్మదాబాద్, ఆర్యన్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, గుజరాత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో విమాన ప్రమాదాలను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది.

'భయపడిపోయాడు'

"చాలా భయపడుతూ - 'నేను చూశాను నాన్న, అది కూలిపోవడం నేను చూశా' అని చెప్పాడు. నాకు ఏమైనా అవుతుందా? అని అడుగుతూనే ఉన్నాడు. ప్రశాంతంగా ఉండమని, బాధపడొద్దని చెప్పా. కానీ, షాక్‌‌కి గురయ్యాడు. వణికిపోయాడు" అని అసారీ అన్నారు.

ఆ వీడియోను ఎవరికీ పంపించొద్దని ఆర్యన్‌కు చెప్పారు అసారీ. కానీ, అప్పటికే భయంతో, గందరగోళంగా ఉన్న ఆర్యన్ తన స్నేహితుల్లో కొంతమందికి పంపారు.

"కొద్ది సమయంలోనే ఆ వీడియో వైరల్ అయింది" అని అసారీ అన్నారు. దీంతో, కొన్నిరోజులు కుటుంబానికి చాలాకష్టంగా గడిచాయి.

ఆర్యన్‌తో మాట్లాడాలని పక్కింటివారు, విలేఖరులు, కెమెరామెన్లు వారి ఇరుకైన ఇంటికి పగలు, రాత్రి వస్తూనే ఉన్నారు.

"మేం వారిని ఆపలేకపోయాం" అని అసారీ అన్నారు.

'ఇక విమానాల వైపు చూడకపోవచ్చు'

పోలీసులు కూడా వచ్చారు, ఆర్యన్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆర్యన్‌ను అరెస్టు చేయలేదని, చూసిన దాని గురించి పోలీసులు కొన్ని గంటలు ప్రశ్నలు అడిగారని అసారీ అన్నారు.

"అప్పటికే, నా కొడుకు చాలా కలత చెందాడు, కాబట్టి మేం అతన్ని ఊరికి పంపించేయాలని అనుకున్నాం" అని ఆయన అన్నారు.

ఇప్పుడు, ఆర్యన్ ఇంటికి తిరిగొచ్చేశారు, స్కూల్‌కి వెళుతున్నారు.

కానీ, "అతను ఇంకా మునుపటిలా లేడు. ఫోన్ మోగిన ప్రతిసారీ భయపడుతున్నాడని వాళ్ల అమ్మ చెబుతోంది" అని అసారీ అన్నారు.

"రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్యన్ మామూలుగా మారతాడని భావిస్తున్నా. అతను మళ్లీ ఆకాశంలో విమానాల వైపు చూస్తాడని మాత్రం అనుకోను" అని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)