ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా భారీ బాంబు దాడులు

fighter jet

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్‌లోని ఫోర్దో సహా మూడు అణు స్థావరాలపై బాంబు దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

''ఇరాన్‌లోని ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై విజయవంతంగా దాడులు చేశాం'' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్రూత్‌సోషల్‌లో రాశారు.

ముఖ్యమైన యురేనియం శుద్ధి కర్మాగారం ఉన్న ఫోర్దోపై బాంబులు వేశామని.. దాడులు జరిపిన అనంతరం తమ విమానాలన్నీ సురక్షితంగా అమెరికాకు తిరిగి వచ్చాయని ట్రంప్ రాసుకొచ్చారు.

''మన అమెరికా యుద్ద వీరులకు శుభాకాంక్షలు. ప్రపంచంలో మరే సైన్యం ఇలాంటి పని చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది'' అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్వేతసౌధంలో ట్రంప్

ఫొటో సోర్స్, The White House

శ్వేతసౌధం నుంచి ట్రంప్ ప్రసంగం

‘‘కొద్దిసేపటి క్రితం అమెరికా ఇరాన్‍‌లోని మూడు కీలక అణు స్థావరాలపై కచ్చితత్వంతో భారీ దాడులు చేసింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్. వారు ఈ స్థావరాలను నిర్మిస్తుంటే ఏళ్ల తరబడి అందరూ వాటి గురించి వింటున్నారు. ఇరాన్ అణు శుద్ధి సామర్థ్యాన్ని నాశనం చేయడం, ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ దేశం నుంచి ఎదురయ్యే అణు ముప్పును ఆపడమే మా లక్ష్యం. ఆ దాడులు అద్భుతమైన సైనిక విజయమని నేను ప్రపంచానికి చెబుతున్నాను. ఇరాన్ కీలక అణు శుద్ధి స్థావరాలు పూర్తిగా తుడిచిపెట్టేశాం. మధ్యప్రాచ్యంలో బెదిరింపులకు దిగిన ఇరాన్ ఇప్పుడు శాంతిని నెలకొల్పాలి. వారు అలా చేయకపోతే, భవిష్యత్తులో దాడులు చాలా ఎక్కువగా, చాలా సులభంగా ఉంటాయి" అని ట్రంప్ శ్వేత సౌధం నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.

‘‘అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగితే అమెరికా మరింత తీవ్రమైన దాడులు చేస్తుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్

బి-2 బాంబర్లతో దాడులు

ఇరాన్‌పై అమెరికా దాడుల్లో బి-2 బాంబర్లు పాల్గొన్నాయని అమెరికా అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. గ్వాంద్వీపానికి అమెరికా బీ-2 స్టెల్త్ బాంబర్లను పంపినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా దీన్ని ఉపయోగించుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రాత్రంతా కాల్పులు సాగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఆయుధ డిపోలను, మిలటరీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ చెప్పింది.

ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలో అమెరికా జోక్యం చేసుకోవడం చాలాప్రమాదకరమని ఇరాన్ విదేశాంగమంత్రి అంతకుముందు అన్నారు.

ఇరాన్‌కు చెందిన ముగ్గురు మిలటరీ ఉన్నతాధికారులను చంపినట్టు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

ఇస్ఫహాన్ నగరం మధ్యలో అనేక భవనాలు దెబ్బతిన్నట్టు బీబీసీ వెరిఫై గుర్తించింది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters/Maxar Technologies

ఫొటో క్యాప్షన్, ఫోర్దోలోని అణు కేంద్రంపై దాడి జరిగిందని ఇరాన్ ధ్రువీకరించింది.

అమెరికా దాడులు చేసిందన్న ఇరాన్

తమ దేశంలో అమెరికా దాడులు జరిపినట్టు ఇరాన్ అంగీకరించింది. నతాంజ్, ఇస్ఫహాన్‌లో అనేక పేలుళ్లు వినిపించాయిని, ఈ రెండు ప్రాంతాల దగ్గర దాడులు చూశామని ఇస్ఫహాన్‌ సెక్యూరిటీ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహి చెప్పారు.

ట్రంప్ చెప్పిన మూడు దాడులు జరిగినట్టు ఇరాన్ అధికారులు అంగీకరించారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

‘రెండు వారాల గడువు’ రెండు రోజులుగా మారింది

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దంలో జోక్యం చేసుకోవాలో వద్దో రెండు వారాలలో నిర్ణయం తీసుకుంటానంటూ గురువారం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అనూహ్యంగా ఆ గడువును రెండు రోజులకే పరిమితం చేశారు.

ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు విజయవంతమయ్యాయని ప్రకటించిన ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో 'ఇది శాంతికి సమయం' అని రాశారు.

ఇరాన్ సైనిక సామర్థ్యాలను తగ్గించడానికి ఇజ్రాయెలీలు గణనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, అయతుల్లా వద్ద ఇంకా ఆయుధాలు ఉన్నాయి.

తమ సార్వభౌమ భూభాగంపై దాడికి ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా సహకరిస్తే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించడం ఆశావహ దృక్పథమే కావచ్చు .

‘పెద్దనష్టమేమీ జరగలేదు’

అమెరికా దాడులు చేసిన మూడు అణు స్థావరాల నుంచి అంతకముందే ఖాళీ చేసినట్టు ఇరాన్ ప్రభుత్వ ప్రసార మాధ్యమ డిప్యూటీ పొలిటికల్ డైరక్టర్ హసన్ అబ్దేనీ టీవీలో ప్రకటించారు.

అణుస్థావరాలపై దాడులు చేశామంటూ ట్రంప్ చేసిన ప్రకటని నిజమే, కానీ ''మాకేమీ పెద్ద నష్టం జరగలేదు. మేం అప్పటికే అక్కడి నుంచి అన్నింటినీ తరలించాం'' అని చెప్పారు.

మరోపక్క ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ అమెరికాతో పూర్తి సమన్వయంతో పనిచేసినట్టు ఇజ్రాయెల్ అధికారి చెప్పారని రాయ్‌టర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

దాడుల తరువాత ట్రంప్, నెతన్యాహు సంభాషణ

ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేసిన తరువాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుకున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.

ఇరాన్‌పై దాడులకు సంబంధించి అమెరికా ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారం ఇచ్చిందని ఆ వర్గాలు సీబీసీకి చెప్పాయి.

బంకర్‌లను ధ్వంసం చేసే జీబీయు-57ఏ బాంబును ఉపయోగించినట్టు రక్షణ విభాగ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)