మదర్స్ డే: సినిమా ‘అమ్మ’ ఎలా మారిందంటే?

ఫొటో సోర్స్, Sarada,Jayasudha,Ramyakrishna,Nadiya/FB
- రచయిత, మహర్షి
- హోదా, బీబీసీ కోసం
తెలుగు సినిమాల్లో అమ్మకు ప్రత్యేక స్థానముంది. మదర్ సెంటిమెంట్‌తోనే హిట్టయిన సినిమాలు కోకొల్లలు. కాలంతో పాటు అమ్మ రూపం, వ్యక్తిత్వం కూడా మారింది. 1950-60 నాటి అమ్మ 2010-25 అమ్మ ఒకటికాదు.
ఒకప్పుడు ఆమె భర్త మీద ఆధారపడే నిస్సహాయురాలు, సెంటిమెంట్లకు బందీ. ఇపుడు సొంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యవంతురాలు, డొల్ల అనుబంధాలను గుర్తించగలిగే స్వతంత్రురాలు. ఒంటరిగా నిలబడగలిగే సింగిల్ మదర్.
సమాజంలో ఉన్నదే సినిమా చెబుతుంది. కళ కాబట్టి కొంచెం అతిశయోక్తులుంటాయి. వాస్తవం అట్టడుగునైనా వుండి తీరాలి. 1950 నాటికి సినిమా అనివార్య వినోదమైంది.
జానపద, పౌరాణికాలు రాజ్యమేలుతున్నా మెల్లిగా సాంఘిక ఇతివృత్తాలు కూడా ప్రవేశించాయి. అప్పటికీ ఇప్పటికీ హీరోదే డామినేషన్ అయినా అమ్మ పాత్ర కూడా కీలకమే.


ఫొటో సోర్స్, YTGRAB
జానపద సినిమాల్లో హీరో ఏదో ఒక సాహసం చేస్తాడు. బిడ్డకు కష్టాలేవీ రాకూడదని తల్లి ప్రార్థిస్తుంది. లేదంటే భర్తకు, కొడుకుకుమధ్య నలిగిపోతుంది.
జగదేకవీరుని కథలో (1961) భర్త మూర్ఖుడు. కొడుకు దేవకన్యల గురించి కలలు కంటాడు. ఇద్దరికి మధ్య ఘర్షణ. మాటలు ముదురుతున్నాయని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
దర్శకుడు కెవి.రెడ్డి ప్రత్యేకత ఏమంటే జానపదమైనా, పౌరాణికమైనా మానవ స్వభావాన్ని వ్యక్తీకరిస్తాడు. ఆయన సినిమాల్లో తల్లి పాత్ర చిత్రణ ప్రత్యేకంగా వుంటుంది. జగదేకవీరుని కథలో రుష్యేంద్రమణి ఎందుకు అంతలా గుర్తుంటుందంటే కొడుకు కోసం ఆమె పడే తపన, ప్రార్థనల వల్ల.
పాతాళభైరవిలో (1951) తల్లి అమాయకురాలు. కొడుకే ఆమె లోకం. కొడుకు మహారాజులా పెళ్లి చేసుకుంటున్నపుడు కూడా సాదాసీదాగా పూలు కుడుతూ వుంటుంది.
మాయాబజార్ (1957)లో ముగ్గురు తల్లులు మూడు రకాలుగా వుంటారు. రేవతికి (ఛాయాదేవి) కూతురి మీద ప్రేమతో పాటు, సంపద మీద ఆశ. రాజ్యం పోయిన తర్వాత సుభద్రని గుమ్మంలోనే అవమానిస్తుంది.
సుభద్ర (రుష్యేంద్రమణి) కొడుకు కోసం యుద్ధానికి కూడా సిద్ధమవుతుంది. అభిమన్యుడు మూర్ఛపోతే , విల్లు అందుకుంటుంది. బిడ్డలకు ప్రమాదం వస్తే సాదాసీదా తల్లి కూడా ఉగ్రరూపిణిగా మారుతుంది.
సూర్యకాంతం (హిడింబి)కు కొడుకు పరాక్రమం మీద నమ్మకం కన్నా, దూకుడంటేనే భయం. అందుకే రావడం రావడమే ‘సుపుత్రా నీకిది తగదంటిని కదరా’ అని వస్తుంది. అమ్మ పాత్ర చిత్రణలో కెవి.రెడ్డి తరువాతే ఎవరైనా.

ఫొటో సోర్స్, YTGRAB
తొలితరం సినిమా అమ్మలంటే..
తొలితరం అమ్మలంటే, కన్నాంబ, రుష్యేంద్రమణి, హేమలత, సురభి కమలాబాయి గుర్తుంటారు. తరువాత తరంలో శాంతకుమారి, ఎస్. వరలక్ష్మి, అంజలీదేవి, పండరీబాయి వస్తారు. ఆ తరువాత నిర్మలమ్మ, సావిత్రి.
1985-2000 మధ్యలో శారద, అన్నపూర్ణ. ఆ తరువాత చెప్పుకోదగిన అమ్మ జయసుధ, వాణిశ్రీ. ప్రస్తుతం రమ్యకృష్ణ, నదియా.
1960కుముందు సినిమా అమ్మ కేవలం భర్త చాటు భార్య, పిల్లల్ని ప్రేమించే తల్లి, కోడల్ని వేధించే అత్త. 60 తర్వాత సొసైటీలో చాలా మార్పులొచ్చాయి. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగంతో పాటు ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం మొదలైంది.
కొడుకులు కళ్ల ముందే విడిపోతుంటే తల్లి వేదన వర్ణనాతీతం. డబ్బు జీవితాల్లోకి వేగంగా ప్రవేశించడంతో పిల్లల ప్రవర్తనలో మార్పు మొదలైంది.
ఆస్తితో పాటు తల్లీతండ్రిని వాటాలుగా పంచుకున్నారు.
బడిపంతులు (1972) సినిమాలో ఎన్టీఆర్, అంజలి చెరో కొడుకు దగ్గరికు వెళుతూ విడిపోతున్నపుడు ప్రేక్షకుల కన్నీళ్లకి అంతేలేదు. సినిమా సూపర్‌హిట్‌కి ఈ సీన్లే కారణం.

ఫొటో సోర్స్, YTGRAB
1960 తరువాత నిరుద్యోగం పెరిగింది. కుటుంబంలో ఆకలి, పేదరికం మొదట తాకేది తల్లినే. తాను పస్తులుండి పిల్లల ఆకలి తీరుస్తుంది. కానీ పిల్లలే పస్తులుంటే!
1969లో వచ్చిన ‘మనుషులు మారాలి’లో సరికొత్త అమ్మ కనిపించింది. 68లో మలయాళంలో వచ్చిన ‘తులాభారం’ రీమేక్ ఈ సినిమా. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లిని కోర్టులో విచారిస్తుండగా సినిమా ప్రారంభమవుతుంది.
శారదకు విపరీతమైన పేరు తెచ్చిన సినిమా ఇది. మహిళల కోసమే ప్రత్యేక ఆటలు వేసారు. కంటతడి పెట్టని ప్రేక్షకులు లేరు ఆనాడు. నిరుద్యోగం, కార్మిక సమస్యల విశ్వరూపం కనిపించే సినిమా.
ఆకలికి తట్టుకోలేక ముగ్గురు పిల్లలు అడుక్కుంటున్నపుడు , ఒక హోటల్ వాడు అట్లకాడతో వాతలు పెట్టే సీన్‌ని చాలాకాలం ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.
పిల్లలకు విషం ఇస్తున్న తల్లిగా శారద నటన కదిలిస్తుంది.

ఫొటో సోర్స్, YTGRAB
1993లో వచ్చిన మాతృదేవోభవలో పిల్లల్ని అమ్మ చంపదు. తాను చనిపోతానని తెలిసి పిల్లల్ని దత్తత ఇస్తుంది. తల్లి ఎమోషన్ సినిమాని సూపర్‌హిట్ చేసింది.
కాలం మారేసరికి అమ్మ రూపు రేఖలు మారాయి.
పాత సినిమాల్లో అమ్మ అంటే చెంపలు నెరిసిపోయి, వంగిపోయి , కుట్టు మిషన్ ముందు వుండేది. భర్తతోనైనా , పిల్లల వల్ల అయినా వచ్చే బాధ, అవమానం తనలోనే దిగమింగేది, భరించేది. ఎదిరించేది కాదు.

ఫొటో సోర్స్, Jayasudha Kapoor/Facebook
ఇప్పటి అమ్మ ముసలమ్మ కాదు. గ్లామరస్‌గా, చలాకీగా వుంటుంది. పిల్లలతో స్నేహంగా వుంటుంది. అవసరమైతే ఎదిరిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్‌లు వేసిన అమ్మగా జయసుధ సంథింగ్ స్పెషల్.
బొమ్మరిల్లు క్లైమాక్స్‌లో పిల్లల గురించి చెబుతూ ప్రకాశ్‌రాజ్‌ని ఎదిరించిన సీన్‌లో ఇళ్లలోని అమ్మలు చాలా మారిపోయారని అర్థమవుతుంది.
‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’లో సింగిల్ మదర్‌గా ఆమె నటన చప్పట్లు కొట్టించుకుంది. భర్తతో విడిపోయి, కొడుకుని ధైర్యంగా పెంచిన విధానం సొసైటీలో కొత్త తల్లిని ఆవిష్కరించింది.
అవసరమైతే కొడుకుని హింసకి ప్రేరేపించే తల్లుల పాత్రలు కొత్త సినిమాల లక్షణం. నిజం , కేజీఎఫ్, సలార్ ఈ కోవకి చెందినవే. ఇంట్లో గానుగెద్దులా పని చేయకుండా, తనకీ కొన్ని హక్కులున్నాయని చెప్పే తల్లి ‘అమ్మ రాజీనామా‘ (1991)లో కనిపిస్తుంది.
మహిళలు ఎప్పుడైతే స్వయంసమృద్ధి సాధించారో, ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడ్డారో అప్పుడే సినిమా కథల్లో అమ్మలు కూడా మారిపోయారు. పిల్లల్ని ఎలా పెంచాలో, వంచాలో కూడా వారికి తెలుసు.
సెంటిమెంట్, ఎమోషన్ కంటే వాస్తవికతని గుర్తించే కొత్త తల్లుల కాలం ఇది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














