రిలేషన్‌షిప్: ఒకే పార్ట్‌నర్ ఉండాలని మనుషులు అనుకోవడం ఎప్పుడు మొదలైంది?

రిలేషన్‌షిప్, వివాహం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్రౌడ్‌సైన్స్ ప్రోగ్రామ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

లెక్కలేనన్ని డేటింగ్ యాప్‌లు.. రిలేషన్ షిప్స్ రోజురోజుకీ మారిపోతున్న ఈ రోజుల్లో.. మనుషులు సహజంగానే ఒకే భాగస్వామి(మోనోగమోస్) పద్దతిలో ఉన్నారా? అనే ప్రశ్న గతంలో కంటే ఇప్పుడు చాలా సందర్భోచితంగా అనిపిస్తుంది.

లండన్‌లో నివసిస్తున్న రొమేనియన్ మహిళ అలీనా బహుళ భాగస్వాములను (పొలియామోరి ) ప్రయత్నించిన తర్వాత దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.

"నేను ఇటీవల బహుళ సంబంధాలున్న వ్యక్తిని కలిశాను" అని అలీనా చెప్పారు.

"నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది: మనం ఒకే భాగస్వామి విధానాన్ని ఎందుకు ఎంచుకున్నాం?"

మనిషి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఏంటంటే, మనుషులకు దగ్గరి పోలికలుండే జంతువులను, వాటి పునరుత్పత్తి వ్యూహాలను అధ్యయనం చేయడం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గొరిల్లాలు, పొలిజినస్

ఫొటో సోర్స్, Getty Images

గొరిల్లాలు ఎలా జతకడతాయి?

"గొరిల్లాలు బహుభార్యత్వ(పొలిజినస్) సంబంధం కలిగి ఉంటాయి" అని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఎవల్యూషనరీ బయోలజిస్ట్ కిట్ ఓపీ అంటున్నారు.

"ఒక మగ గొరిల్లా చాలామంది ఆడవాటితో జతకడుతుంది. శిశువులకు ఒకే తండ్రి, వేర్వేరు తల్లులు ఉంటాయి" అని ఆయన అన్నారు.

కానీ, ఇది మంచి పద్దతి కాదని, శిశుహత్య వంటి ప్రమాదాలకు దారితీస్తుందని ఓపీ అన్నారు.

"మగ గొరిల్లాలు తమవి కాని పిల్లలను చంపుతాయి. దీంతో వాటి తల్లి మళ్లీ పిల్లల్ని కనాల్సి వస్తుంది, ఆ సమయంలో ఈ మగ గొరిల్లా దానితో జతకడుతుంది. మనం అనుసరించడానికి ఇది సరైన వ్యవస్థ కాదు" అని డాక్టర్ ఓపీ సూచించారు.

బోనోబో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిశుహత్యను నివారించేందుకు బోనోబో ఆడ జంతువులు బహుళ మగ జంతువులతో జత కడతాయి.

చింపాంజీలు భిన్నం

చింపాంజీలు, బోనోబోస్ వంటి కోతులలో ఆడ జంతువులు అనేక మగ జంతువులతో సంబంధాలు ఏర్పరుచుకుంటాయి. ఇది పిల్లల అసలు తండ్రి ఎవరో గందరగోళ పరుస్తుంది, పిల్లలను రక్షించడంలో సహాయపడుతుంది.

ఆదిమానవులు ఇలాంటి సంబంధాలనే కొనసాగించేవారు, చాలామంది పురుష, స్త్రీ భాగస్వాములున్న గ్రూపులలో నివసించేవారు. కానీ, దాదాపు 20 లక్షల సంవత్సరాల కిందట, పరిస్థితులు మారిపోయాయి.

దీనికి "వాతావరణ మార్పులు కారణం" అని జీవశాస్త్రవేత్త అయిన ఓపీ చెప్పారు.

''మన పూర్వీకులు నివసించిన ఆఫ్రికాలో భూమి ఎండిపోయి, చాలా ప్రాంతం సవన్నా(గడ్డి భూమి)లుగా మారింది. వేటాడే జంతువుల నుంచి సురక్షితంగా ఉండటానికి మనుషులు గుంపులుగా ఉండటం ప్రారంభించారు. పిల్లలను కూడా ఎక్కువ కాలం రక్షించాల్సిన అవసరం ఏర్పడింది'' అని ఓపీ అన్నారు.

"శిశువును పెంచేందుకు ఆడవారికి ఆ గుంపులోని ఒక మగవారి సహాయం అవసరం. కాబట్టి, వారు మోనోగమి (ఒకే మగవాడి) విధానాన్ని ఎంచుకున్నారు" అని డాక్టర్ ఓపీ చెప్పారు.

మోనోగమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మోనోగమి ఉత్తమమా?

మోనోగమి ఉత్తమ విధానమని మానవులు ఎంచుకోలేదని, అవసరం కాబట్టి ఎంచుకున్నారని డాక్టర్ ఓపీ అభిప్రాయం.

మెదడు పెద్దగా ఉండి, ఎదుగుదల నెమ్మదిగా ఉండే మనిషి పిల్లలకు తల్లిదండ్రుల సంరక్షణ అవసరం, దీనికి ఒక తల్లి మాత్రమే సరిపోదు. కాబట్టి ఆదిమానవులు మోనోగమీకి మారారు. కానీ నేటికీ, ఒకే భాగస్వామికి విధేయంగా ఉండటం చాలామందికి కష్టంగా ఉంటోంది.

"కొన్ని జాతులు జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి, మోసం చేయవు, కానీ అవి చాలా అరుదు" అని డాక్టర్ ఓపీ చెప్పారు.

''గిబ్బన్లు మోనోగమీ పాటించే జీవులు. కానీ, అవి జంటగా, ఇతర జంతువులకు దూరంగా జీవిస్తాయి. కాబట్టి విశ్వాసపాత్రంగా ఉండటం సులభం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

"కానీ, మానవులు పెద్ద సమూహాలలో జీవిస్తారు. భాగస్వామి మోసం చేస్తున్నారో లేదో తెలుసుకోవడం కష్టం" అని ఓపీ చెప్పారు.

మోనోగమి అనేది సహజ జీవన విధానం కంటే.. మనుగడ కోసం ఎంచుకున్నదని చెప్పొచ్చు. దాని సమస్యలు దానికి ఉన్నాయి.

జంటల మధ్య కెమెస్ట్రీ

మనం ప్రేమలో పడినప్పుడు లేదా విశ్వాసపాత్రంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు మన మెదడులో ఏం జరుగుతుంది?

సారా బ్లుమెంటల్ అమెరికాలో న్యూరో సైన్స్ విద్యార్థిని, ఆమె ప్రైరీ వోల్స్ (ఒక భాగస్వామితో ఉండే చిన్న జంతువుల)పై అధ్యయనం చేస్తున్నారు.

ప్రైరీ వోల్స్

ఫొటో సోర్స్, Getty Images

ప్రైరీ వోల్స్ మెదడులో ఎక్కువ ఆక్సిటోసిన్ గ్రాహకాలు ఉంటాయి. స్పర్శ, బలమైన బంధం ఏర్పడిన క్షణాల్లో ఈ ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది.

"మనం ప్రైరీ వోల్స్‌లో ఆక్సిటోసిన్‌ను నిరోధించినట్లయితే, అవి బలమైన బంధాన్ని ఏర్పరుచుకోలేవు. వాటి భాగస్వామితో తక్కువ సమయమే ఉంటాయి" అని సారా చెప్పారు.

మానవులలో కూడా ఆక్సిటోసిన్ ఉంటుంది, ఇది వేరేవారితో బంధం ఏర్పడినపుడు మెదడుకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

పాలిజిని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మరో హార్మోన్ అయిన డోపమైన్ ఒక వ్యక్తితో అతుక్కుపోయే బదులు కొత్తదనం కోసం కోరికను ప్రభావితం చేస్తుంది.

జంట మధ్య బంధం ఏర్పడే సమయంలో డోపమైన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనల్ని ఉత్సాహంగా భావింపజేస్తుంది. ఒకసారి బంధం ఏర్పడితే, డోపమైన్ స్థాయిలు మారుతాయి.

పాలియాండ్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎక్కువ భర్తలున్న మహిళలు

మానవులు మోనోగమిగా పరిణామం చెందినప్పటికీ, అనేక సంస్కృతుల్లో విభిన్న రకాల సంబంధాలున్నాయి.

నేపాల్, టిబెట్, ఆఫ్రికా, అమెరికా వంటి ప్రదేశాల్లో ఒక స్త్రీకి అనేక మంది భర్తలు (బహుభర్తృత్వం-పాలియాండ్రి) ఉన్న 50కి పైగా ఉదాహరణలను షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌లో ఆంత్రోపాలజిస్ట్, డాక్టర్ కేటీ స్టార్క్‌వెదర్ కనుగొన్నారు.

పాలిజిని(బహుభార్యత్వం- ఒక పురుషుడికి అనేక మంది భార్యలు)తో పోలిస్తే పాలియాండ్రి చాలా అరుదు. అయితే, పాలియాండ్రి అసంభవమన్నట్లు చూడవద్దని కేటీ అంటున్నారు.

"ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములు ఉంటే మహిళలు ఆర్థికంగా మద్దతు పొందవచ్చు. భర్త చనిపోతే లేదా చాలాకాలం దూరంగా ఉంటే, మరొకరు సహాయం చేయగలరు. కొన్ని ఉత్తర అమెరికా సమూహాలలో ఉన్నట్లుగా.." అని ఆమె అభిప్రాయపడ్డారు.

కానీ, ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములను ఉంచుకోవడంలోనూ సమస్యలున్నాయి.

"ఆడవారైనా, మగవారైనా బహుళ భాగస్వాములతో ఉండాలంటే సమయం, భావోద్వేగాలు, డబ్బు వెచ్చించాలి. ఆర్థికంగానే కాకుండా, ఎమోషనల్‌గానూ కష్టం" అని కేటీ చెప్పారు.

అందుకే, మోనోగమి ఇప్పటికీ వివాహంలో అత్యంత సాధారణ పద్దతిగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒక్కరు కంటే ఎక్కువ మందితో రిలేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఒక్కరి కంటే ఎక్కువ మందితో..

గతంలో అలీనాకు మోనోగమీ(ఒకే భాగస్వామి) సంబంధం వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకున్న తర్వాత ఆమె అసూయ వంటి భావోద్వేగాలను ఎదుర్కొంటున్నారు. ఎవరైనా మీతో నిజాయితీగా లేరని తెలిస్తే అది పెరుగుతుంది, ఒకవేళ వారు నిజాయితీగా ఉన్నారని తెలిస్తే అసూయ తగ్గిపోతుందని ఆమె చెప్పారు.

కాగా, బహుళ ఆరోగ్యకర సంబంధాలను కొనసాగించడానికి సమయం, ఎమోషనల్ ఎనర్జీ వెచ్చించాల్సి ఉంటుందని అలీనా భాగస్వామి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఇద్దరూ దానిని విలువైనదిగా భావిస్తున్నారు.

"స్థిరమైన నియమాలు లేవు. ఇదే ఇద్దరం ఎక్కువగా మాట్లాడుకునేలా చేస్తుంది. బంధం బలపడటానికి సాయపడుతుంది" అని అలీనా చెప్పారు.

కాబట్టి, మనం సహజంగా మోనోగమీనా? అంటే సమాధానం అవును అని కాదు అని కూడా వస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)