తల తెగినా.. ఆహారం, నీరు లేకపోయినా బొద్దింకలు ఎలా బతుకుతాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కె.శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
బొద్దింక.. ఈ పేరు వినగానే చాలామంది భయపడతారు. అయితే, వీటి జీవన శైలికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి.
తల తెగిపోయినా బొద్దింకలు కొన్ని రోజుల పాటు బతకగలవనే దానిపై చాలాకాలంగా సందేహం ఉంది. ముఖ్యంగా, ఆహారం, నీరు తీసుకోకుండా బొద్దింకలు ఎంతకాలం బతకగలవనే సందేహమూ ఉంది.
అలాగే, అణు పేలుడు సంభవించినా బొద్దింకలు చనిపోకుండా జీవించగలవనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వాదనలు ఎంతవరకు నిజమనే విషయమై మేం కొంతమంది పరిశోధకుల, జీవశాస్త్రవేత్తల సాయం తీసుకున్నాం. వారు చెప్పిన వివరణలు బొద్దింకల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాయపడ్డాయి.


ఫొటో సోర్స్, Subagunam Kannan/BBC
అణు బాంబు పేలినా బొద్దింకలకు ఏమీ కాదా?
అణుపేలుడు జరిగినా బొద్దింకలు చనిపోవు అనే వాదనపై జీవశాస్త్రవేత్త లూయిస్ విల్లాసోన్ కచ్చితంగా అలా జరగదని, దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని వివరించారు.
బొద్దింకలకు రేడియేషన్‌ను తట్టుకునే సామర్థ్యం ఉండటం మొదటి కారణం. మనుషులతో పోలిస్తే ఇవి మరింత దృఢంగా ఉంటాయన్నది నిజం. కానీ, ఇది అన్ని కీటకాలకు వర్తిస్తుంది. వాటి సరళమైన శారీరక నిర్మాణం వాటికి ఈ శక్తిని ఇస్తుంది.
మనుషులకు ప్రాణాంతకమైన రేడియేషన్ మోతాదును 6 నుంచి 15 రెట్ల మేర ఎక్కువగా బొద్దింకలు తట్టుకోగలవని లూయీస్ చెప్పారు. అలాగే రేడియేషన్ మోతాదును 180 రెట్లు అధికంగా తట్టుకోగల ఏకైక పరాన్నజీవి హాబ్రోబ్రాకాన్ అని తెలిపారు. బొద్దింకలు మనుషులతో కలిసి జీవించడానికి అలవాటు పడటం వల్ల అవి అణుపేలుడును తట్టుకోలేవని మరో కారణాన్ని వివరించారు.
'' అణు బాంబుల వల్ల ఒకవేళ మనుషులు చనిపోతే, బొద్దింకల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటికి అందుబాటులో ఉన్న ఆహారమంతా తింటాయి. కానీ, ఆ తర్వాత మనుషులు లేకపోవడంతో వాటికి కావాల్సిన ఆహారం దొరకదు. ఈ క్రమంలో వాటి సంఖ్య మెల్లగా తగ్గిపోతుంది. ఒకవేళ కొన్ని బతికినా, సహజ వనరులపై పూర్తిగా ఆధారపడే కీటకాల కంటే తక్కువగా ఉంటాయి.'' అని లూయిస్ వివరించారు.
అయితే, ఆహారం, నీరు లేకుండా బొద్దింకలు ఎంతకాలం బతకగలవు? వాటి శరీర నిర్మాణం ఏంటి?

ఫొటో సోర్స్, Subagunam Kannan/BBC
ఆహారం, నీరు లేకుండా ఎలా?
ఎక్కువ కాలం పాటు ఆహారం లేదా నీరు లేని వాతావరణంలో చిక్కుకున్నప్పటికీ, ఆ వాతావరణానికి తగ్గట్లు బతకగలిగేలా వాటి శరీరాన్ని బొద్దింకలు మార్చుకుంటాయని అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్, బొద్దింకల శరీర నిర్మాణంపై పరిశోధనలు చేసే డాక్టర్ జోసెఫ్ కాంకెల్ చెప్పారు.
బొద్దింకల శరీరాలకు బయట వైపు వాక్సీ కోటింగ్ (మైనపు పూత) ఉంటుంది.
''ఇది వాటి శరీరం నుంచి నీరు బయటికి పోకుండా సాయపడుతుంది. అందుకే, నీరు లేకుండా అవి ఎక్కువ కాలం బతకగలవు.'' అని డాక్టర్ జోసెఫ్ కాంకెల్ చెప్పారు.
ఒకవేళ బొద్దింకలు ప్రారంభదశలోనే ఎక్కువ ఆహారం పొందగలిగితే, అవి తమ తరువాత జీవనదశలలో, ప్రతిదశలోనూ కేవలం 4గంటలు మాత్రమే ఆహారం తింటాయానే వాస్తవాన్ని ఆయన గుర్తించారు.
బొద్దింకలు తమ శరీరంలో నిల్వ ఉంచిన వ్యర్థాలను రీసైకిల్ చేసుకుంటాయి. వాటిని ప్రొటీన్ లేదా ఎనర్జీ వనరుగా వాడుకుంటాయని డాక్టర్ జోసెఫ్ అన్నారు.
అదనంగా ట్రెహలోజ్ అని పిలిచే గ్లూకోజ్ అణువులతో తయారయ్యే రక్తంలోని చక్కెర కూడా వాటికి శక్తినిచ్చేదిగా ఉపయోగపడుతుందని చెప్పారు.బొద్దింకల కొవ్వు కణజాలంలో నివసించే బ్యాక్టీరియా కూడా విటమిన్ ఫ్యాక్టరీలాగా ఉపయోగపడుతుందన్నారు.
‘‘బొద్దింకల శరీరంలో ఉండే బ్యాక్టీరియో సైట్స్ ప్రత్యేక రకమైన కణాలు. బొద్దింకలకు అవసరమైన అన్ని విటమిన్లను ఇవి ఉత్పత్తి చేస్తాయి. పోషకాల కోసం ఇవి పూర్తిగా బయట ఆహారంపైనే ఆధారపడవు’’ అని జోసెఫ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
గోవాలోని పర్యావరణ పరిశోధన సంస్థలో పనిచేసే కీటక శాస్త్రవేత్త డాక్టర్ ప్రనోయ్ బైద్య చెప్పిన ప్రకారం.. శీతాకాలాల్లో కొన్ని జంతువులు తమ శక్తిని కాపాడుకునేందుకు చేసే పనిని ఈ బొద్దింకలు కూడా చేస్తుండొచ్చని చెప్పారు.
సుప్తావస్థ అనేది చాలా జంతువులు, ఉభయచరాలు, కీటకాలలో సాధారణ ప్రక్రియ. ఆహారం లభించని శీతాకాల నెలల్లో ఇవి గాఢ నిద్రలోకి వెళుతుంటాయి. శీతాకాలం పూర్తయ్యాక ఈ జీవులు నిద్రనుంచి లేచి, తమ జీవనాన్ని కొనసాగిస్తాయి.
గాఢ నిద్రలో జంతువుల శరీర ఉష్ణోగ్రతలు 1 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. వాటి హృదయ స్పందన రేటు కూడా నిమిషానికి 8 నుంచి 50 సార్లకు పడిపోతుంది. వాటి శక్తిని వృథా చేయకుండా ఈ గాఢ నిద్ర శీతాకాలంలో వాటికి ఉపయోగపడుతుంది.
అయితే బొద్దింకలు అలాంటి సుప్తావస్థలోకి వెళ్ళకపోయినా , వాటికి తమ శక్తిని కాపాడుకునే గుణం ఉందని డాక్టర్ ప్రనోయ్ బైద్య తెలిపారు. ''ఇతర జీవుల మాదిరి బొద్దింకలు నీటిని తాగినప్పటికీ, గాలిలోని తేమను కూడా ఇవి పీల్చుకోగలవు. అలా, నీటి పోషకాలను పొంది జీవిస్తాయి.'' అని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటకాల శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాపన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తల తెగినా బొద్దింకలు ఎలా బతుకుతాయి?
తినకుండా జీవించగలిగేలా వాటికున్న సామర్థ్యం అవి అంత తేలికగా మరణించకుండా కాపాడుతుందని కీటక శాస్త్రవేత్త డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్ చెప్పారు.
తల లేకపోయినా అవెలా బతకగలవనే దానికి ఇదొకటే కారణం కాదని అన్నారు.
బొద్దింకలకు ఉండే డీసెంట్రలైజ్డ్ నెర్వస్ సిస్టమ్ (వికేంద్రీకృత నాడీ వ్యవస్థ) వల్ల, తల తెగిన తర్వాత కూడా కొంత సమయం పాటు అవి బతకగలుగుతాయని చెప్పారు.
బొద్దింకల శరీర నిర్మాణం మనుషులు, ఇతర జంతువుల మాదిరి ఉండదు.
'' మనుషుల, ఇతర జంతువుల నాడీ వ్యవస్థ కేంద్రీకృతంగా ఉంటుంది. నాడీ వ్యవస్థకు చెందిన నియంత్రణ అంతా ఒక ప్రాంతంలోనే ఉంటుంది. కానీ, కీటకాల విషయంలో అలా కాదు. వాటికి వికేంద్రీకృత నాడీ వ్యవస్థ ఉంటుంది. వాటి మెదడు శ్వాస తీసుకోవడాన్ని లేదా శరీరమంతా ఆక్సీజన్ సరఫరాను నియంత్రించదు'' అని వివరించారు.
''ఈ రకమైన నిర్మాణం ఉన్నప్పుడు, శరీర కదలికలను నియంత్రించే న్యూట్రాన్లు శరీరమంతా వ్యాపించే ఉంటాయి. అందుకు తల తెగినా, మొత్తం కదలికలు వెంటనే ఆగిపోవు. శరీరమంతా పూర్తిగా క్రియారహితంగా మారేందుకు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు పట్టొచ్చు'' అని డాక్టర్ ప్రియదర్శన్ చెప్పారు.
(బీబీసీ న్యూస్ తెలుగులో జూన్ 9, 2025న ప్రచురితమైన ఈ కథనానికి సంపాదకీయ ప్రమాణాల దృష్ట్యా జూన్ 11, 2025న కొన్ని దిద్దుబాట్లు చేశాం.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














