కీటకాలు, జంతువులు కూడా మనుషుల్లానే తమ భాగస్వాములకు బహుమతులు ఇస్తాయని తెలుసా, వాటివల్ల అవి పొందే ప్రయోజనం ఏమిటంటే..

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, జాస్మిన్ ఫాక్స్ స్కెల్లీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కేవలం మానవ లక్షణం అని మనం అనుకుంటాం. కానీ, తమ భాగస్వామికి, సహచరులకు బహుమతులు ఇచ్చే జీవజాతులు చాలానే ఉన్నాయి.
స్కార్పియాన్‌ఫ్లై అనే ఆడ కీటకానికి మగకీటకం ఇచ్చే బహుమతి ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మగ కీటకం తన లాలాజల స్రావాలను ఆడకీటకానికి బహుమతిగా అందిస్తుంది. రుచికరమైన ఆ కానుకతో ఆడ స్కార్పియాన్‌ఫ్లై మురిసిపోతుంది. తనతో జత కట్టేందుకు సహచరునికి అవకాశం ఇస్తుంది. దీనివల్ల ఆడస్కార్పియాన్ ఈగకు అనేక పోషకాలు అందుతాయి. అలాగే అది ఎక్కువమంది మగవాటితో జతకడితే ఈ లాలాజల కానుక ద్వారా జన్యుపరమైన ప్రయోజనాలు కూడా పొందుతుంది.
నత్తలు, వానపాములు, స్క్విడ్ వంటి జీవజాతులు తమ భాగస్వాములకు బహుమతులు ఇస్తాయని గుర్తించారు. ఈ జీవజాతులు తమ భాగస్వామికి దగ్గర కావడానికి ముందు పోషకాలతోకూడిన ఆహారపు ముక్కను అందిస్తాయి.
పక్షులు కూడా బహుమతులు ఇవ్వడాన్ని ఆస్వాదిస్తాయని తెలిసింది. మగ గ్రేట్ గ్రే ష్రైక్స్ (బూడిదరంగు పిచుక) పక్షులు చిన్న చిన్న కీటకాలను ముళ్లు, కొమ్మలపై బంధించడం ద్వారా తమ ప్రతాపాన్ని ఆడతోడు ముందు ప్రదర్శిస్తూ వాటిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి.


ఫొటో సోర్స్, Getty Images
సాలీడు మాయ
బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కీటకాలు, జంతువులలో సర్వసాధారణం. ఉదాహరణకు, ఆరు మచ్చలుండే బర్నెట్ మోథ్స్ అనే మగ సీతాకోకచిలుక తన భాగస్వామికి వీర్యం ద్వారా సైనైడ్‌ను బహుమతిగా ఇస్తుంది.
తమ తోడుకు సంభోగ సందేశం అందించేందుకు కీటకాలు ఇచ్చే రసాయన సమాచారం కూడా కీలకమైనది.
నర్సరీ వెబ్‌సాలీళ్లు ప్రొటీన్ ఫైబర్ ఉండే సిల్క్ (సాలీడు గూడు అల్లే పల్చటి దారం లాంటిది)లో ఆహారాన్ని తమ భాగస్వామికి అందిస్తాయి. ఈ ఆహారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు రసాయనాలను జోడిస్తాయి. ఒకవేళ ఆడ సాలీళ్లు దీన్ని తిరస్కరిస్తే, ఆ బహుమతికి మరింత సిల్క్‌ను చుట్టి మళ్లీ అందజేస్తాయి.
కొన్నిసార్లు ఈ మగ జీవులు తక్కువ నాణ్యమైన ఆహారాన్ని లేదా పాడైన, సగం తినేసిన ఆహారాన్ని (మోర్సల్) సిల్క్‌తో చుట్టి ఆడ సాలీళ్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఆడ జీవులు ఆ బహుమతిని విప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు మగ సాలీళ్లు వాటితో సంభోగంలో పాల్గొని, అవి నకిలీవని ఆడ జీవి గ్రహించేలోగా అక్కడి నుంచి పారిపోతాయి.
మగ నర్సరీ వెబ్ స్పైడర్లు ఇచ్చే 70శాతం బహుమతులు నకిలీవేనని ఒక అధ్యయనంలో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
''మగ కీటకాలు మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. చాలా రోజుల నాటి లేదా ఎండిపోయిన ఆహారాన్ని సిల్క్‌లో చుట్టి ఇస్తాయి'' అని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన బిహేవియరల్ ఎకాలజిస్ట్ డారిల్ గ్వాన్ చెప్పారు.
ఇతర కీటకాలు కూడా బహుమతుల పరంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తాయని తెలిసింది.
''వసంత కాలంలో మా ఇంటి దగ్గర ఒక అందమైన ఘటన జరిగింది. అక్కడ ఒక మగ డ్యాన్స్ ఫ్లై కీటకం నది వద్దకు వెళ్లి నీటిలోని ఒక కీటకాన్ని నోట కరుచుకొని తిరిగి వచ్చింది. అది తీసుకొచ్చిన ఆహారం కోసం ఆడ కీటకాలు పోటపడ్డాయి. ఎందుకంటే ఆడ కీటకాలు సొంతంగా ఆహారాన్ని పొందలేవు. గుడ్లు పెట్టడానికి వాటికి ఈ పోషకాహారం అవసరం. ఒక సందర్భంలో ఒక మగ కీటకం, విల్లో గింజల నుంచి తీసిన విల్లో ఫ్లఫ్ బాల్‌ను తీసుకొచ్చింది. దాన్ని బహుమతిగా ఇచ్చేందుకు ప్రయత్నించింది'' అని డారిల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విలువలేని బహుమతులు ఇవ్వడం వల్ల మగ కీటకాలకు తాత్కాలిక ప్రయోజనమే కలుగొచ్చు. ఎందుకంటే ఆడ జీవి, ఆ బహుమతిని తెరిచి తాను మోసపోయానని గ్రహించిన తర్వాత మగ కీటకాన్ని తిరస్కరిస్తుంది. దీనర్థం మగ కీటకం కాస్త సమయం మాత్రమే ఆడ జీవితో సంభోగంలో పాల్గొనగలుగుతుంది. ఆడ కీటకాలు సాధారణంగా అనేక మగ కీటకాలతో జత కడతాయి. కాబట్టి నిజాయితీ లేని మగ కీటకం వీర్యం, గుడ్లను ఫలదీకరణం చేసే అవకాశం తక్కువ. కాబట్టి మోసం చేసిన మగ కీటకం దీర్ఘకాలంలో ఓటమిని ఎదుర్కొంటుంది.
కొన్ని కీటకాలు మాత్రం తాము ఆకర్షించాలనుకున్న ఆడ కీటకాలకు బహుమతిగా ప్రాణాన్నే పణంగా పెడతాయి.
మగ సేజ్‌బ్రష్ కీటకం జతకట్టే సమయంలో ఆడజీవిని తన రెక్కలను తొలిచేందుకు, రక్తంతో సమానమైన హీమోలింఫ్ అనే ద్రవాన్ని పీల్చుకునేందుకు అనుమతిస్తుంది.
ఇలా జరిగిన తర్వాత శక్తి క్షీణించడంతో, ఆ మగ కీటకం మళ్లీ జతకట్టే, భాగస్వామిని వెదుక్కునే అవకాశాలు తగ్గిపోతాయని ఒక అధ్యయనం పేర్కొంది.
మగ రెడ్ స్పైడర్ సంభోగం సమయంలో తన పొత్తికడుపు చివరి భాగాన్ని ఆడ జీవి కొరికేందుకు వీలు కల్పిస్తుంది.

ఫొటో సోర్స్, Alamy
''రెడ్ స్పైడర్లు జతకట్టడానికి ఒక ఆడ జీవి లభించడం చాలా అరుదు. డార్వినియన్ ఫిట్‌నెస్ పరంగా చూస్తే, ఇలా వెల్లకిలా పడుకుని, ఆహారాన్ని ఎరగా వేసి ఆడజీవి దృష్టి మరల్చడం ద్వారా సంభోగ సమయాన్ని ఇది పొడిగిస్తుంది. ఫలితంగా ఎక్కువ వీర్యాన్ని పొందుతుంది. పర్యావసానంగా ఎక్కువ మంది సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది'' అని డారిల్ వివరించారు.
ఇవన్నీ నప్షెల్ గిఫ్ట్స్. అంటే సంభోగంలో పాల్గొనేలా ఆడ జీవులను ఒప్పించడానికి మగ జీవులు ఇచ్చేవి. పైగా ఈ కానుకల్లో ఉండే పోషక విలువలు ఆడ జీవులకు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే కొన్నిసార్లు గ్రహీతను సంతోషపెట్టడానికి కూడా జంతువులు బహుమతులు ఇస్తాయని తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉదాహరణకు డాల్ఫిన్లు, మానవులను సంతోషపెట్టడానికి ట్యూనా, ఈల్స్, అక్టోపస్‌లు వంటివి తెచ్చి ఇస్తుంటాయని తెలిసింది. అలాగే కాకులు కూడా మానవులకు కానుకలు ఇచ్చినట్లు, గతంలో మానవులకు సహాయపడినట్లు కథనాలు ఉన్నాయి.
''నేను కాకుల నుంచి వాల్‌నట్స్, ఆలివ్స్, బాటిల్ మూతలు, వైన్ కార్కుల వంటివి బహమతులుగా పొందాను'' అని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌కు చెందిన కంపారిటివ్ కాగ్నిషన్ ప్రొఫెసర్ నికోలా క్లేటన్ చెప్పారు.
కాకి కుటుంబానికి చెందిన యురేసియన్ జేస్ అనే పక్షులు ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించడం కోసం తమ భాగస్వాములకు బహుమతులు అందిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
మానవ డీఎన్‌ఏ దాదాపు 99 శాతం ఉండే గ్రేట్ యాప్ కుటుంబానికి చెందిన బొనోబోస్‌లు కూడా ఇతరులను ఆనందపరచడానికి బహుమతులను ఇస్తాయి. మనుషుల్లాగే బొనోబోస్‌లు కూడా పరిచయం లేని వాటికి కానుకలు ఇస్తుంటాయని 2013 నాటి ఒక అధ్యయనం తేల్చింది.
బోనోబోస్‌లు ఆపిల్స్, అరటిపండ్లు వంటి వాటిని తమ గ్రూపుకు చెందని జంతువులతో కూడా పంచుకుంటాయి. అపరిచిత జంతువులతో పరిచయం కోసం తమ ఆహారాన్ని సైతం వదులుకునేందుకు సిద్ధపడతాయి.
ఇదంతా చూస్తే, జంతువులు పరస్పరం బహుమతులను ఎందుకు ఇచ్చి పుచ్చుకుంటాయనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వివిధ జీవజాతుల ప్రవర్తనలు ఎన్నో రెట్లు పరిణామం చెందాయి. ఇలా చేయడం వల్ల మగ, ఆడ జీవుల్లో పునరుత్పత్తి వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశం పెరిగింది. కీటకాలు, సాలీళ్లు వంటి జాతుల్లో ఇది కచ్చితంగా జరుగుతుంది.
''మగ జీవులు, ఆడజీవులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆడ జీవులు పునరుత్పత్తి జరిగేందుకు మగ జీవులకు సహకరిస్తున్నాయి'' అని డారిల్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














