మహా కుంభమేళా: ప్రయాగ్‌రాజ్ ఎక్కడుంది, తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జనవరి 13, 2025 నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరిగే ఈ మహా ఉత్సవానికి దాదాపు 40 కోట్ల మంది తరలివస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
జనవరి 13న పుష్య పౌర్ణమి మొదలుకుని, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది.12 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవానికి ఎప్పటిలానే దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.
దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
మరి, ప్రయాగ్‌రాజ్‌కు ఎలా చేరుకోవాలి? తెలుగు రాష్ట్రాల నుంచి ఏయే ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? అనేవి ఈ కథనంలో తెలుసుకుందాం.


తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి ఒక రైలు అందుబాటులో ఉంది. అదే దానాపూర్ ఎక్స్‌ప్రెస్. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ ఈ రైలు నడుస్తోంది.
ఇది ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ సమయం దాదాపు 25 గంటలు.
కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ బీబీసీకి చెప్పారు.

జనవరి 8 నుంచి స్పెషల్ ట్రైన్స్
''ఇప్పటివరకు 16 స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 8 నుంచి సికింద్రాబాద్, మౌలాలి, తిరుపతి, మచిలీపట్నం, నరసాపూర్ నుంచి రైళ్లు నడపనున్నాం'' అని ఆయన చెప్పారు.
ఇవి కాకుండా కుంభమేళా జరిగే రోజుల్లో మరో 40 రైళ్లు నడపాలనే ప్రణాళిక ఉందని శ్రీధర్ తెలిపారు.
''మరో 26 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా ప్రయాణించనున్నాయి. దానివల్ల కూడా ఇక్కడి ప్రయాణికులకు లబ్ధి కలుగుతుంది. ఇవి అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి'' అని చెప్పారు.

ప్రత్యేక ప్యాకేజీలు
భారత్ గౌరవ్ రైళ్లను కుంభ్‌మేళా స్పెషల్ యాత్ర పేరుతో జనవరి 19, ఫిబ్రవరి 14 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను వేరుగా నడుపుతోంది ఐఆర్‌సీటీసీ.
''ఐఆర్‌సీటీసీ రైళ్లలో వారం రోజుల ప్యాకేజీ ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు వారణాసి, అయోధ్య యాత్ర కూడా ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఉండడానికి టెంట్ సౌకర్యం కూడా కల్పిస్తోంది'' అని శ్రీధర్ బీబీసీకి చెప్పారు.
రెగ్యులర్ రైళ్లతో పోల్చితే స్పెషల్ రైళ్లలో 1/3 వంతు ఛార్జీలను దక్షిణ మధ్య రైల్వే అదనంగా వసూలు చేస్తోంది.
అలాగే విజయవాడ నుంచి ఆది, మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉంది. విశాఖపట్నం నుంచి స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు చెప్పారు.
కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ జంక్షన్, రాంబాగ్, సుబేదార్ గంజ్, నైనీ, చివకి, సంగమం రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేసింది.
ఇందులో ప్రయాగ్ రాజ్ జంక్షన్, సంగమం స్టేషన్లలో దిగితే కుంభమేళా జరిగే ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి బ్యాటరీ రిక్షా, ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో కుంభమేళా జరిగే ప్రదేశానికి చేరుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
విమాన సర్వీసులు ఉన్నాయా?
డిసెంబర్ చివరివారంలో నేను ప్రయాగ్‌రాజ్‌కు విమానంలో ప్రయాణించాను.
తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ నుంచే ప్రయాగ్‌రాజ్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. ఇండిగో సంస్థ ఉదయం 10.50 గంటలకు ఒక విమానం నడుపుతోంది. మరో సర్వీసు కూడా ఉంది కానీ అది కనెక్టింగ్ ఫ్లైట్.
అలాగే విజయవాడ, విశాఖపట్నం నుంచి సర్వీసులు ఉన్నట్లుగా ట్రావెల్ బుకింగ్ సైట్లలో సమాచారం అందుబాటులో ఉంది. కానీ, ఆ సర్వీసులన్నీ నేరుగా కాకుండా కనెక్టింగ్ విమానాలుగా ఉన్నాయి.
కుంభమేళా జరిగే ప్రాంతానికి హైదరాబాద్ నుంచి మరికొన్ని విమాన సర్వీసులు నడిపేందుకు అవకాశం ఉందని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు. దీనిపై ఇంకా వారేమీ నిర్ణయం తీసుకోలేదు.

ఫొటో సోర్స్, https://kumbh.gov.in
హైదరాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్ విమాన ప్రయాణానికి గంటా 40 నిమిషాల సమయం పడుతుంది. ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టు బయటకు రాగానే ప్రీపెయిడ్ ట్యాక్సీలు, బ్యాటరీ రిక్షాలు అందుబాటులో ఉన్నాయి.
ట్యాక్సీ సర్వీసు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్ పట్టణానికి చేరుకోవడానికి రూ.800, కుంభమేళా ప్రాంతానికి చేరుకునేందుకు రూ.1000 వరకు ఛార్జీ వసూలు చేస్తున్నారు ట్యాక్సీ డ్రైవర్లు.
అదే బ్యాటరీ రిక్షాలోనైతే ప్రయాగ్‌రాజ్ పట్టణానికి రూ.200, కుంభమేళా ప్రాంతానికి రూ.400 వరకు తీసుకుంటున్నట్లుగా వికాస్ అనే బ్యాటరీ రిక్షా డ్రైవర్ బీబీసీకి చెప్పారు. ఇవి కాకుండా విమానాశ్రయంలో పార్కింగ్చా ర్జీ అదనంగా ఉంటుందన్నారు. విమానాశ్రయం బయటకు నడుచుకుంటూ వస్తే, ఈ పార్కింగ్ చార్జీలు ఉండవు అని ఆయన చెప్పారు.
ఎయిర్‌పోర్ట్ ఉన్న బమ్‌రౌలి ప్రాంతం నుంచి ప్రయాగ్‌రాజ్ పట్టణానికి 15-16 కిలోమీటర్ల దూరం ఉండగా.. పట్టణం నుంచి కుంభమేళా ప్రాంతానికి మరో ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అలాగే డిసెంబర్ చివరి వారంలో నేను వెళ్లే సమయంలో హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమాన టికెట్ ధర రూ.8,990గా ఉంది. విమాన టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకుంటే, కొంత తక్కువ ధరకే లభించే వీలుంటుంది. నేరుగా ప్రయాగ్‌రాజ్‌కు టికెట్లు లేకపోయినా, వారణాసికి చేరుకుని అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్ చేరుకునే వీలుంది.

రోడ్డు ప్రయాణం.. సమయం-రిస్క్.. రెండూ ఎక్కువే
ప్రస్తుతం నేరుగా ఏపీఎస్ఆర్టీసీ గానీ, టీజీఎస్ఆర్టీసీ గానీ ప్రయాగ్‌రాజ్‌కు బస్సులు నడపడం లేదు.
ఎక్కువ మంది ఉంటే మాత్రం అందుకు తగ్గట్టుగా అద్దెకు బస్సులు నడపనున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు. బస్సుకు సరిపడా సంఖ్యలో భక్తులు ఉండి.. సంబంధిత డిపోను సంప్రదిస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు.
కొన్ని ప్రైవేట్ బస్సులు ప్రయాగ్‌రాజ్‌కు హైదరాబాద్ నుంచి బస్సులు నడుపుతున్నాయి. నాలుగు స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నట్లుగా ట్రావెల్ ఏజెన్సీలకు చెందిన పోర్టళ్లలో చూపిస్తున్నాయి, కానీ, ఈ ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉంది.
బస్సుల ప్రయాణ మార్గాన్ని బట్టి 23 నుంచి 31 గంటల వరకు చూపిస్తోంది.
ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ప్రయాగ్‌రాజ్ రావాలంటే నాగ్‌పుర్, జబల్‌పుర్, రివి మీదుగా వీలుందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
అయితే ఈ మార్గాలలో బీబీసీ నేరుగా ప్రయాణించి ధ్రువీకరించలేదు.
ఇది కొంత రిస్క్‌తో కూడుకోవడంతోపాటు ప్రయాణ సమయం కూడా దాదాపు 25-30 గంటల వరకు ఉంటుంది. దీనివల్ల చాలా అప్రమత్తత పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది.

వసతి కోసం టెంట్లు
కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
2019లో జరిగిన అర్థ కుంభమేళాకు 20 కోట్ల మంది హాజరయ్యారని ఆ ప్రభుత్వ అంచనా. ఈసారి కుంభమేళాకు ఈ సంఖ్య రెండింతలు అవుతుందని భావిస్తోంది.
ఇందుకు తగ్గట్టుగానే ప్రైవేటు సంస్థలతో కలిసి 1.60 లక్షల టెంట్లు సిద్ధం చేసింది.
డిసెంబర్ చివర్లో నేను ప్రయాగ్‌రాజ్ చేరుకున్న సమయంలో టెంట్ల నిర్మాణ పనులు ఇంకా కొన్నిచోట్ల నడుస్తున్నాయి.
ఈ టెంట్లు ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఉత్తరప్రదేశ్ పర్యటక శాఖ ప్రకటించింది.
https://kumbh.gov.in/ లేదా upstdc.co.in వెబ్‌సైట్లలో వీటిని బుక్ చేసుకునే వీలు కల్పించింది.
అలాగే 8887847135 నెంబరుకు Hi అని వాట్సాప్ సందేశం పంపితే, చాట్ బాట్ అందుబాటులోకి వస్తుంది. దాని సూచనలను అనుసరించి వసతి బుకింగ్ సమాచారం తెలుసుకునే వీలు కల్పించామని యూపీ టూరిజం శాఖ చెబుతోంది. అలాగే టెంటు రకాన్ని, సౌకర్యాలను బట్టి బుకింగ్ చార్జీలు ఉంటాయి.

ఇంకా ఏమైనా చూడవచ్చా?
ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాతో పాటు దగ్గర్లో మరికొన్ని దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ప్రయాణానికి ప్రణాళిక వేసుకుంటే సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది.
ప్రయాగ్‌రాజ్‌లో హనుమాన్ ఆలయం, అలోప్ మందిరం, అలహాబాద్ కోట, ఆనంద్ భవన్, చంద్రశేఖర్ అజాద్ పార్కు వంటివి ప్రముఖ పర్యటక స్థలాలుగా పేరొందాయి.
ప్రయాగ్‌రాజ్ నుంచి అయోధ్య సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. 130 కిలోమీటర్ల దూరంలో వారణాసి, చిత్రకూట్‌లు ఉన్నాయి. ఇవన్నీ ప్రముఖ పర్యటక, అధ్యాత్మిక ప్రదేశాలుగా పేరొందాయి.
సమయాన్ని బట్టి, వీలును బట్టి ఈ స్థలాలను దర్శించుకోవచ్చని ఉత్తరప్రదేశ్ పర్యటక శాఖ భక్తులకు సూచిస్తోంది .

ప్రయాగ్‌రాజ్‌లో వణికించే చలి
ప్రయాగ్‌రాజ్‌లో డిసెంబరు చివరి వారంలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. చలి , పొగమంచు ఎక్కువగా ఉంది.
దక్షిణ భారతదేశంతో పోల్చితే ఉత్తర భారతం.. అందులోనూ ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
కుంభమేళా జరిగే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులు చలి వాతావరణానికి తగ్గట్టుగా రక్షణ ఏర్పాట్లతో కుంభమేళకు రావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














