అగ్నిపర్వతం అంచులకు వెళ్లిన బాలుడు..

ఫొటో సోర్స్, USGS
హవాయి నేషనల్ పార్క్ లో ఒక బాలుడు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
తన కుటుంబం నుంచి దారితప్పిన ఆ బాలుడు సెకన్ల వ్యవధిలోనే 400 అడుగుల ఎత్తున్న కిలొవేయ అగ్నిపర్వతం అంచు వరకు వెళ్లిపోయాడని పార్కు అధికారులు తెలిపారు.
‘‘బిడ్డ తమ నుంచి దూరంగా వెళ్లినట్టు గ్రహించిన తల్లి గట్టిగా కేకలు వేస్తూ, ఇక మరో అడుగు వేస్తే లావాలో పడిపోయే సమయంలో బిడ్డను వెనక్కు లాగారు' అని పార్క్ నిర్వాహకులు చెప్పారు.
ఈ ఘటనానంతరం నేషనల్ పార్క్ పర్యటకులకు ఓ హెచ్చరిక జారీ చేసింది. పర్యటకులు జాగ్రత్తగా ఉండాలని, మూసివేసిన ప్రాంతాలు దాటడానికి ప్రయత్నించవద్దని కోరింది.
సంఘటనను ప్రత్యక్షంగా చూసిన పార్క్ రేంజర్ జెస్సికా ఫెర్రాకేన్ బీబీసీతో మాట్లాడారు.
సంఘటన వివరాలను పంచుకోవడం ‘భవిష్యత్తు విషాదాలను నివారించడానికి’ సహాయకారి కాగలదని భావిస్తున్నట్టు చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
హవాయి బిగ్ ఐలాండ్‌లోని కిలొవేయ, ప్రపంచంలో క్రియాశీలకంగా ఉండే అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి.
ఇది తరచుగా బద్దలయ్యే అగ్నిపర్వతం. ఈ పర్వతం ఈ ఏడాది డిసెంబర్ 23న భారీగా విస్ఫోటనం చెంది, లావాను ఎగజిమ్ముతున్న దృశ్యాలు విడుదలయ్యాయి.
ప్రస్తుతం ఈ పర్వతం సందర్శకులను అనుమతించని ప్రాంతంలో నెమ్మదిగా విస్ఫోటనం చెందుతోందని యూఎస్‌జీఎస్ హవాయిన్ అగ్నిపర్వత పరిశోధనాలయం డిసెంబర్ 28న ప్రకటించింది.
లావా వెల్లువను వీక్షించేందుకు క్రిస్మస్ రోజున కొన్ని కుటుంబాలు పార్క్‌ను సందర్శించాయి. ఆ సమయంలోనే బాబు వీరి నుంచి తప్పించుకుని అగ్నిపర్వతం అంచుకు పరిగెత్తాడు. ఒకవేళ బాబు అందులో పడి ఉంటే చనిపోయి ఉండేవాడు అని జెస్సికా అన్నారు.
ఇలాంటి ప్రాంతాలలో మీ పిల్లలపై ఎల్లప్పుడూ కన్నేసి ఉంచాలి. ప్రత్యేకించి పర్యటక ప్రాంతాలలో నిషిద్ధ ప్రదేశాలకు పిల్లలని తీసుకువెళ్లకూడదు. వాళ్ళు ఎల్లపుడూ మీ వెంటే ఉండేటట్టు చూసుకోవాలి.
''ఒక అగ్నిపర్వతం దగ్గరకు వెళుతున్నప్పుడు అక్కడి పరిస్థితులపై కాస్తయినా అవగాహన కలిగి ఉండాలి. అక్కడ ఏయే ఆంక్షలు ఉన్నాయి. ప్రజల భద్రత కోసం స్థానిక అధికారులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం. భద్రతా సమాచారం కోసం స్థానిక పర్యటక వెబ్‌సైట్లను చూడాలి. నేషనల్ పార్క్‌లకు వెళ్లినప్పుడు వార్నింగ్ అలర్టులు ఫోన్‌కు వచ్చేలా లాగిన్ అవ్వాలి'' అని హవాయి వోల్కనో అబ్జర్వేటరీలో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న మాథ్యూ ప్యాట్రిక్ గతంలో బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














