ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించాడని తల్లిదండ్రుల ఆత్మహత్య

సుబ్బారాయుడు, సరస్వతీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సుబ్బారాయుడు దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసులు ఎవరినీ నిందితులుగా చేర్చలేదు.
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గమనిక: ఈ కథనంలో కలిచివేసే అంశాలు ఉన్నాయి.

ట్రాన్స్ జెండర్‌తో యువకుడి ప్రేమ ఆయన తల్లిదండ్రుల ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో జరిగింది.

''ట్రాన్స్ జెండర్‌తో కొడుకు ప్రేమను అంగీకరించాలంటూ ట్రాన్స్ జెండర్ల బృందం పట్టుబట్టడంతో అతని తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు'' అని నంద్యాల జిల్లా పోలీసులు బీబీసీతో చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన సుబ్బారాయుడు, సరస్వతి దంపతులు ఒక చిన్న పూల దుకాణం నడుపుతున్నారు. వారికి సునీల్ ఒకే ఒక కొడుకు. చదువుపై ఆసక్తి లేదని బీటెక్ మధ్యలోనే వదిలేసిన సునీల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నారు.

''ఆటో నడిపే క్రమంలో ఇతనికి ఒక ట్రాన్స్ జెండర్‌తో పరిచయం అయింది. ఆ ట్రాన్స్ జెండర్‌ను సునీల్ పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నారు. కానీ సునీల్ తల్లితండ్రులు ఒప్పుకోలేదు. పైగా అతని మనసు మార్చడం కోసం బంధువుల ఊరికి పంపేశారు. అలా రెండు నెలలపాటూ దూరంగా ఉంచారు. ఈ విషయం సునీల్ ఫోన్ ద్వారా ఆ ట్రాన్స్ జెండర్‌తో చెప్పడంతో గొడవ మొదలైంది. ట్రాన్స్ జెండర్ల బృందం సుబ్బారాయుడు ఇంటికి వచ్చి, సునీల్, ట్రాన్స్‌జెండర్ ప్రేమకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో సుబ్బారాయుడు మనస్తాపం చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు'' అని ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

ఈ ఘటన నంద్యాల మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే కేసు తీవ్రత దృష్టా జిల్లా ఎస్పీ ఈ కేసును ప్రత్యేక విచారణా బృందానికి అప్పగించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రాన్స్ జెండర్

ఫొటో సోర్స్, Getty Images

డబ్బు తీసుకున్నారని..

ఇరు పక్షాల వారిని పోలీసులు స్టేషన్‌కి పిలిచినప్పుడే, ఆ ట్రాన్స్ జెండర్ల బృందం నుంచి సునీల్ కొంత డబ్బు తీసుకున్నారని తెలిసింది.

''సుమారు లక్షన్నర ఇచ్చినట్టు ట్రాన్స్ జెండర్ల బృందం చెప్పింది. అయితే ఇంటి దగ్గర గొడవ మాత్రం డబ్బు గురించి కాదు, పెళ్లి గురించే జరిగిందని మాకున్న సమాచారం'' అని పోలీసు అధికారి చెప్పారు.

పెళ్లి విషయంలో ఫిర్యాదు అందడంతో సునీల్‌ని స్టేషన్‌కి పిలిచి అతని అభిప్రాయం కూడా తీసుకోవాలని పోలీసులు అనుకున్నారు. కానీ అప్పటికి సునీల్ నంద్యాలలో అందుబాటులో లేరు. పోలీసులు ఫోన్ చేస్తే రెండు రోజుల్లో వస్తానని చెప్పిన సునీల్ తరువాత తన ఇంటికి చేరుకున్నారు.

''సునీల్ తిరిగి ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులతో వాగ్వాదం అయింది. ట్రాన్స్ జెండర్‌తో పెళ్లి వద్దని సునీల్‌కు సూచించారు. కానీ ఆయన వినలేదు. ఇలా అయితే మేం చచ్చిపోతాం అని బెదిరించారు. సుబ్బారాయుడు, సరస్వతి ఇద్దరూ తమ సెల్‌ఫోన్లు సునీల్ దగ్గరే పెట్టి ఇంటి నుంచి తమ స్కూటీపై ఊరి చివరకు వెళ్లి పురుగుల మందు తాగారు'' అని పోలీసులు బీబీసీతో చెప్పారు.

ఆ తరువాత సునీల్ తల్లిదండ్రులను నంద్యాల ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. కొన్ని గంటల తేడాలో భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు పోలీసులు. సుబ్బారాయుడు, సరస్వతి ఏ ఆత్మహత్య లేఖా రాయలేదు.

బంధువులు కానీ, కుమారుడు కానీ ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదు. అనుమానాస్పద మృతిగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరినీ ఇంకా నిందితులుగా చేర్చలేదు.

సునీల్ ఏమన్నారు?

''నేను ట్రాన్స్ జెండర్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకు మా తల్లిదండ్రులకు కోపం వచ్చింది. అందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు'' అంటూ స్థానిక మీడియా ముందు చెప్పారు సునీల్.

మీడియా ఈ మరణాలకు వేరే ఎవరినో బాధ్యులను చేస్తుందంటూ ఆరోపించిన సునీల్ ''వారి మరణానికి నేనే కారణం'' అని చెప్పారు.

''నా మనవడి పెళ్లి గురించి వివాదం తలెత్తింది. అతడిని రెండు నెలలు వేరే చోట ఉంచాం. కానీ ఇలా జరిగింది. కారణం నాకు పూర్తిగా తెలియదు. వారి నుంచి (ట్రాన్స్‌జెండర్ల నుంచి) 30 వేలు తీసుకున్నారనీ, వారు వడ్డీతో కలపి 50 వేలు అడుగుతున్నారని మాత్రమే నాకు తెలుసు. అంతకుమించి ఇంకేమీ తెలియదు.'' అని మీడియాతో చెప్పారు సుబ్బారాయుడి తల్లి.

ట్రాన్స్ జెండర్స్

ఫొటో సోర్స్, Getty Images

ప్రేమకు లింగభేదం లేదు

ఈ ఘటనపై ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్తలతో బీబీసీ మాట్లాడింది. అవగాహన పెంచడం, చట్టాలు చేయడం ద్వారానే వీటిని నివారించగలమని వారు అభిప్రాయపడ్డారు.

''ఇద్దరు వ్యక్తులు అందునా తల్లిదండ్రులు చనిపోవడం బాధాకరం. ట్రాన్స్ జెండర్లుగా మేమంతా తల్లిదండ్రులు ఉండీ లేనట్టే ఉంటాం (వారు దూరం పెడతారు కాబట్టి). మాకు ఆ బాధ తెలుసు. కానీ ఈ ఘటనలో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది, ఆ అబ్బాయి మీడియా ముందు మాట్లాడిన తీరు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా తప్పు మా ట్రాన్స్ జెండర్లపై వేసేసి, వారు తప్పించుకుంటారు. కానీ ఈ అబ్బాయి ''అవును, నేను ప్రేమించాను. మీరంతా దీన్ని చాలా పెద్ద విషయం చేస్తున్నారు. వారి చావుకు నేనే బాధ్యుడిని'' అంటూ ఎంతో ఆవేదనతో చెప్పారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధలో ఉండి కూడా అతను వేరేవాళ్ల మీద నేరం వేయలేదు'' అని ట్రాన్స్ జెండర్ల కోసం పోరాడుతోన్న రచన ముద్రబోయిన బీబీసీతో చెప్పారు.

''చాలా చోట్ల కులం-మతం కోణంలో ప్రేమ పెళ్లిళ్ల విషయంలో ఇలా జరుగుతుంటుంది. ఈ కేసులో లింగ భేదం ఉంది, అన్నిటికీ మూల కారణం అవగాహన లేకపోవడం. ప్రేమ అనేది కులం, మతంతో పాటూ జెండర్ కూడా చూడదని అర్థం చేసుకోవాలి. అవగాహన రావాలి. చట్టాలు కూడా మారాలి. ఏదో ఒక రక్షణ చట్టం ఉంటే కనీసంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఘటనలా కాకుండా దాని మూల కారణాలను పరిశీలించాలి'' అని రచన అన్నారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)