‘మీ కూతుర్ని అత్యాచారం చేయించడానికి మీరు ఎంత చెల్లించారు’ అంటూ బోర్డులు...ఏమిటీ వివాదం ?

ఫొటో సోర్స్, Twitter/Greg Abbott
- రచయిత, లీర్ సేల్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''టెక్సస్‌కు వలస వెళ్లాలని ప్రయత్నించిన చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. మీ కుటుంబం కోసమైనా అక్కడికి వెళ్లాలన్న ఆలోచన మానుకోండి’’ అని రాసి ఉన్న ఒక బోర్డు నేల మీద పడి కనిపిస్తోంది.
''మీ భార్య, కూతురు శవాలుగా మారేందుకు మీరు డబ్బులు చెల్లిస్తున్నారు. కోయోట్‌లు అబద్ధాలు చెబుతున్నారు. మీ కుటుంబాన్ని ప్రమాదంలో పడేయకండి'' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో గర్భంతో ఉన్న మహిళ ఫోటోతో మరొక బోర్డ్ రాసి ఉంది.
వలసదారుల్ని ముఖ్యంగా లాటిన్ అమెరికన్లను అమెరికాలోకి అక్రమంగా సరఫరా చేసే వారిని కోయోట్‌లు అంటారు.
''మీ కూతుర్ని అత్యాచారం చేయించడానికి మీరెంత చెల్లించారు'' అనేది మరో బోర్డు.
ఉత్తరం నుంచి వలసదారులు రాకుండా అడ్డుకునేందుకు అమెరికా దక్షిణాది సరిహద్దులో, అలాగే మెక్సికో, మధ్య అమెరికాలలో ఇలాంటి బోర్డులు పెట్టాలని రిపబ్లికన్ పార్టీ నేత, టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆదేశించారు.

అక్రమంగా టెక్సస్‌లోకి ప్రవేశించినా, ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నించినా వారికేం జరుగుతుందో వలసదారులకు తెలియజేయడమే తమ క్యాంపెయిన్ ఉద్దేశ్యమని గవర్నర్ చెప్పారు.
''ఈ పోస్టర్లు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన భయంకరమైన నిజాలను తెలియజేస్తున్నాయి. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని మధ్య అమెరికాలోని వారిని కోరుతున్నాం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
పలు భాషల్లో..
ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికోల నుంచి వచ్చే వలసదారులకు కనిపించేలా మెక్సికోకు ఆనుకుని ఉండే అమెరికా రాష్ట్రం టెక్సస్ సరిహద్దుల్లో కనీసం 40 చోట్ల ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది.
ఈ బోర్డులు చాలా వరకు స్పానిష్ భాషలోనే ఉన్నాయి. కొన్నింటిని చైనీస్, అరబిక్, రష్యన్ భాషలలో కూడా పెట్టారు. వివిధ దేశాలకు, భాషలకు చెందినవారు మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా వలస రావడం ఇటీవల పెరుగుతోంది. .
టెక్సస్ గవర్నర్ మొదలుపెట్టిన వలసదారుల వ్యతిరేక ప్రచార కార్యక్రమాల పరంపరలో ఇది తాజాది. వలసలను ముఖ్యమైన అంశంగా టెక్సస్ గవర్నర్ పరిగణిస్తున్నారు. బైడెన్ పరిపాలనను ఎక్కువగా విమర్శించే నేతలలో ఈయన ఒకరు.
అయితే ఇలా బోర్డులు పెట్టడాన్ని వలసదారుల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివి రాజకీయ ప్రేరేపితమైనవని, కొన్నిసార్లు ఓట్ల కోసం ఇలా చేస్తున్నారని అన్నారు.
మరికొన్ని రోజుల్లో దిగిపోనున్న బైడెన్ ఇమ్మిగ్రేషన్ విధానంపై ఆయనెన్ని విమర్శలు గుప్పించినా, డెమొక్రాట్ ప్రభుత్వం చివరి ఏడాది కాలంలో, ఈ దశాబ్దంలోనే అత్యంత ఎక్కువమంది వలసదారుల్ని వెనక్కి పంపినట్లు నివేదికలు వచ్చాయి.
అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో 2,71,484 మందిని తమ దేశం నుంచి 192 దేశాలకు తిప్పిపంపింది అమెరికా.
డాక్యుమెంట్లు లేని వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించేందుకు చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని చెప్పారు డోనల్డ్ ట్రంప్. నవంబర్ 5 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.
అయితే, అంతకుముందున్న రిపబ్లికన్ల రికార్డును ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం దాటింది. ఒక్క 2019 ఏడాదిలోనే రిపబ్లికన్ ప్రభుత్వం 2,67,260 మంది వలసదారుల్ని దేశం నుంచి పంపించింది.
మరోవైపు, అక్రమ వలసల్ని అడ్డుకోవడం ద్వారా సరిహద్దుల్లో అరెస్టులను భారీగా తగ్గించే చర్యలకు జూన్ నెలలో బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ప్రయాణమంతా హింసే
అక్రమ వలసలను అరికట్టేందుకు గురువారం నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌తో పాటు టెక్సస్ లైంగిక వేధింపుల వ్యతిరేక సంఘం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రోజ్ లునాలు కూడా ఉన్నారు.
‘‘టెక్సస్ సరిహద్దులోకి వలస వచ్చే మహిళలు, బాలికలపై పెద్ద ఎత్తున లైంగిక వేధింపులు ఘటనలు జరుగుతున్నాయి'' అని బిల్‌బోర్డులపై ఉన్న కొన్ని మెసేజ్‌లను ఉద్దేశిస్తూ రోజ్ లునా చెప్పారు.
''ఈ సమస్యతో పాటు వీటి నుంచి ప్రాణాలతో బయటపడిన వారిపై పడిన ప్రభావాన్ని గుర్తించడం చాలా ముఖ్యం’’ అని అన్నారు.
అమెరికాకు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లేవారిపై లైంగిక వేధింపులతో పాటు అన్ని రూపాల్లో హింస జరుగుతోంది.
డారియన్‌లో అమానవీయమైన, దారుణమైన లైంగిక హింస పెరుగుతోందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ గత ఏడాది రిపోర్టు చేసింది.
డారియన్ అనేది కొలంబియా, పనామా మధ్యలో ఉన్న అడవి. దీని గుండా వేల సంఖ్యలో వలసదారులు ప్రయాణిస్తుంటారు. వీరిలో వెనిజ్వెలా, ఈక్వెడారియన్లతో పాటు, వివిధ దేశాలు, ఖండాలకు చెందినవారు ఉంటారు.
950 మందికి ఈ అంతర్జాతీయ మానవతా సంస్థ సేవలు అందించింది. వారిలో చాలా వరకు మహిళలే. ఏప్రిల్ 2021 నుంచి డారియన్ గ్యాప్ దాటుతున్నప్పుడు వారిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఈ మహిళలు రిపోర్టు చేశారు.

ఫొటో సోర్స్, EPA
అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024 తొలి మూడు నెలల్లో వివిధ దేశాలలో వలసదారులపై జరిగిన లైంగిక హింస కేసులకు తాము ఎక్కువగా చికిత్స చేసినట్లు ఈ సంస్థ డిప్యూటీ మెడికల్ కోఆర్డినేటర్ మారియా లారా చాకోన్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
''చాలా మంది అత్యాచారానికి గురైనట్లు నేను చూశాను. కొందరు దుస్తులు లేకుండా బయటికి వచ్చారు. వారిని చిత్రహింసలు పెట్టి, కొట్టినట్లు చూశాను.'' అని డారియన్‌లో చికిత్స పొందిన బాధితుల్లో ఒకరు చెప్పినట్లు ఈ ఎన్‌జీవో నివేదిక వెల్లడించింది.
డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారం సగం వలసదారుల సమస్యపైనే సాగింది. అక్రమ వలసలు, అమెరికాలో నేరాలు పెరుగుదలతో ముడిపెట్టే ఏ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు.
ఆయన ప్రచారం ప్రధాన వాగ్దానం, డాక్యుమెంట్లు లేని వలసదారుల్ని బహిష్కరిస్తామని చెప్పడమే. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్దది కాబోతుందని కూడా ఆయన ప్రచారం సాగింది. జనవరి 20న పదవిలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
యాంటీ ఇమ్మిగ్రేషన్ పాలసీలను అందరికంటే ఎక్కువగా వల్లించేది ఎవరంటే అది గ్రెగ్ అబాటే. ఆయన మాటలకు పరిమితం చేతల్లో కూడా చూపిస్తున్నారు.
టెక్సస్, మెక్సికో మధ్యలో అడ్డుగోడలను నిర్మించడమే కాకుండా, టెక్సస్, న్యూ మెక్సికో మధ్యనున్న సరిహద్దును కూడా బలోపేతం చేయాల్సి ఉందని ఈ ఆదేశాలకు సంవత్సరం ముందు అబాట్ చెప్పారు.
ఇది కేవలం కిలోమీటర్ పొడవైన తీగనే అయినప్పటికీ, రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఏకైన ఫిజికల్ బారియర్ ఇదే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














