జస్‌ప్రీత్ బుమ్రా: ప్రపంచ మేటి బౌలర్లను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత పేసర్

ఫొటో సోర్స్, Getty Images
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అతి తక్కువ టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు తీసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా, మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా కొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బుమ్రాను బీబీసీఐ అభినందించింది.
''జస్సీ భాయ్‌పై మాకు విశ్వాసముంది. 200 టెస్టు వికెట్లు, బూమ్ బూమ్ బుమ్రా. ట్రావిస్ హెడ్ లాంటి పెద్ద వికెట్ తీసి ఈ ఫీట్ సాధించాడు'' అని బీసీసీఐ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
తన 44వ టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ఈ ఘనత సాధించాడు.

దీంతో క్రికెట్ చరిత్రలో, టెస్టు మ్యాచుల్లో అత్యుత్తమ సగటుతో 200 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల లీగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా చేరాడు.
వెస్టిండీస్‌కు చెందిన మాల్కమ్ మార్షల్, జోయెల్ గార్నర్, కర్ట్లీ ఆంబ్రోస్, ఇంగ్లడ్ బౌలర్ ఫ్రెడ్ ట్రూమెన్‌లను వెనక్కినెట్టి అత్యుత్తమ యావరేజ్‌తో జస్‌ప్రీత్ బుమ్రా టాప్‌లో నిలవడం విశేషం.
అతి తక్కువ పరుగులిచ్చి 200 వికెట్లు తీయడమే కాకుండా, ఆయన స్ట్రైక్ రేట్ కూడా ఇతర బౌలర్ల కంటే మెరుగ్గా ఉంది. ఈ విషయంలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా తర్వాత బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
బౌలర్లందరినీ వెనక్కినెట్టి..
ప్రపంచంలోని మేటి బౌలర్లు, వారి యావరేజ్‌లు ఇలా ఉన్నాయి.
జస్‌ప్రీస్ బుమ్రా - 19.38, మాల్కమ్ మార్షల్ - 20.94, జోయెల్ గార్నర్ - 20.97, కర్ట్లీ ఆంబ్రోస్ - 20.99, ఫ్రెడ్ ట్రూమెన్ - 21.57గా ఉంది.
భారత్ తరఫున అతి తక్కువ మ్యాచుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టు మ్యాచుల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బుమ్రా, జడేజా ఇద్దరూ తమ 44వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు.
బుమ్రా కొత్త రికార్డుతో అభినందనలు వెల్తువెత్తుతున్నాయి. భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్, మాజీ కోచ్ రవి శాస్త్రి ''అమేజింగ్ బౌలర్, మైండ్‌బ్లోయింగ్. వెరీగుడ్'' అని రాశారు.
''మన అత్యుత్తమ బౌలర్- బుమ్రా. 20 కంటే తక్కువ యావరేజ్‌తో 200 వికెట్లు తీయడం అమేజింగ్ '' అని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో రాశారు.
అత్యుత్తమ యావరేజ్‌తో 200 వికెట్లు తీసిన ప్రపంచంలోని మేటి బౌలర్ల విషయానికొస్తే, వెస్టిండీస్‌కు చెందిన మాల్కమ్ మార్షల్ 81 మ్యాచ్‌లు, జోయెల్ గార్నర్ 58, కర్ట్లీ ఆంబ్రోస్ 98 టెస్టుల్లో ఈ ఘనత సాధించారు. ఇంగ్లండ్ బౌలర్ ఫ్రెడ్ ట్రూమెన్ 67 మ్యాచుల్లో 200 వికెట్లు తీశాడు.
అయితే, అతి తక్కువ మ్యాచుల్లో 200 వికెట్లు పడగొట్టిన రికార్డు పాక్ బౌలర్ యాసిర్ షా పేరిట ఉంది. షా కేవలం 33 మ్యాచుల్లోనే 200 వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, Getty Images
జస్‌ప్రీత్ బుమ్రా కెరీర్ ఇలా..
2018 జనవరి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో తొలిసారి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 43 టెస్టులు ఆడిన బుమ్రా 12 సార్లు 5 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుత 44వ టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకూ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
2016 జనవరిలో, ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌తో బుమ్రా వన్డే కెరీర్ ప్రారంభమైంది.
ఇప్పటి వరకూ 89 వన్డే మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 233 టీ20 మ్యాచ్‌లు ఆడి 295 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్‌తో 2022లో ఓవల్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు.
ఈ మ్యాచ్‌లో మొదటి పది ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ జట్టులోని నలుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ముగ్గురిని కనీసం ఖాతా కూడా తెరవనీయలేదు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ బుమ్రాకి అత్యుత్తమ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో 71 మ్యాచ్‌లు ఆడి 286 వికెట్లు పడగొట్టాడు. యావరేజ్ 21.5గా ఉంది.
ప్రపంచకప్ పోటీల్లో భాగంగా పాకిస్తాన్‌తో ఈ ఏడాది జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ కేవలం 119 పరుగులే చేసి విజయం సాధించింది. బుమ్రా బౌలింగ్ మెరుపులతోనే ఇది సాధ్యమైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ ఎంపికయ్యాడు.
ఈ మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. విశేషమేంటంటే, ఈ మ్యాచ్‌లో బుమ్రా 15 డాట్ బాల్స్ వేశాడు. టీ20 మ్యాచుల్లో ఇది చాలా పెద్ద విషయమే.
1993 డిసెంబర్ 6న అహ్మదాబాద్‌లో బుమ్రా పుట్టాడు. అతని ప్రస్తుత ఫామ్ చూస్తుంటే మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














