అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో అసలేం జరిగింది? బీబీసీతో విద్యార్థులు, ప్రొఫెసర్లు ఏం చెప్పారు

- రచయిత, విజయానంద ఆర్ముగం
- హోదా, బీబీసీ తమిళ్
తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. మరోవైపు యూనివర్సిటీ క్యాంపస్‌లో భద్రతను కూడా పెంచారు.
విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఆ రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టింది.
చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఆరోపించారు. శుక్రవారం ఆయన తనకు తాను ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు.
అన్నా యూనివర్సిటీలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు గవర్నర్, చాన్సలర్ ఆర్ఎన్ రవి ఆదివారం యూనివర్సిటీని సందర్శించి, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ ఘటన డిసెంబర్ 23, సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ విద్యార్థిని ఆరోపించారు.
యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. విద్యార్థులతోనూ విడివిడిగా మాట్లాడి క్యాంపస్‌లో భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్యాంపస్‌లోనే కాకుండా క్లాస్ రూంలోనూ వేధింపులకు పాల్పడుతున్నట్లు మరికొందరు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి గురించి కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు చేసినా యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
అయితే, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లోని ఫిర్యాదుల కమిటీల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
అసలు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలేంటి? వారి ఫిర్యాదులను నిజంగా పట్టించుకోలేదా?

అసలేం జరిగింది?
చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో డిసెంబరు 23, రాత్రి 8 గంటలకు స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది.
ఆ తర్వాత విద్యార్థిని కొత్తూర్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు, అంటే డిసెంబర్ 24న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అడయార్‌లో బిర్యానీ స్టాల్ నడుపుతున్న జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, ఆ వీడియోను యూనివర్సిటీ అధికారులకు చూపిస్తానని, వైరల్ చేస్తానంటూ బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు విద్యార్థిని ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
" లభించిన శాస్త్రీయ ఆధారాల మేరకు, కొత్తూరు(క్యాంపస్‌కి సమీపంలో ఉన్న ప్రాంతం)లో జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని అరెస్టు చేశాం. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతను ఫుట్‌పాత్‌పై బిర్యానీ స్టాల్ నడుపుతుంటాడు" అని పోలీసులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
అతనికి నేరచరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లైంగిక దాడి ఘటనను ఖండిస్తూ డిసెంబర్ 25న విద్యార్థి, మహిళా సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ(SFI), ఐద్వా (AIDWA) యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరసనకు దిగాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
క్యాంపస్‌లో విద్యార్థులకు సరైన భద్రత లేదని వారు ఆరోపించారు.
డిసెంబర్ 26న ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ(ABVP) గురువారం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. డీఎంకే ప్రభుత్వ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ, డీఎంకే ప్రభుత్వానికి జబ్బు చేసిందని, సరైన చికిత్స అందించాలంటూ ఆస్పత్రి ఎదుట ఏబీవీపీ నిరసన తెలిపింది. పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్టు చేశారు.
ఆ తర్వాత, యూనివర్సిటీ రిజిస్ట్రార్ జె.ప్రకాష్ విద్యార్థులతో చర్చించారు. విద్యార్థుల భద్రతకు యూనివర్సిటీ అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థులు ఏం చెబుతున్నారు?
చెన్నైలోని గిండీ ప్రాంతంలో, దాదాపు 180 ఎకరాల విస్తీర్ణంలో అన్నా యూనివర్సిటీ ఉంది. ఈ క్యాంపస్‌లోనే గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఏసీటీ (ACT) క్యాంపస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (SAP) కూడా ఉన్నాయి.
ఈ క్యాంపస్‌లో దాదాపు 13 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. క్యాంపస్ ఆవరణలో మూడు హాస్టళ్లు కూడా ఉన్నాయి.
తన వివరాలు బహిర్గతం చేయకూడదన్న షరతుతో యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి బీబీసీతో కొన్ని విషయాలు చెప్పారు. ''ఎవరు, ఎప్పుడైనా క్యాంపస్‌లోకి రావొచ్చు. కావాలనుకుంటే రాత్రిళ్లు కూడా ఉండొచ్చు. అడిగే నాథుడు లేడు.''
''క్యాంపస్‌లో బెదిరించి డబ్బు, నగలు దోచుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది, కానీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులూ చేయడం లేదు'' అని ఆయన అన్నారు.
తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేస్తే తిరిగి తమనే ప్రశ్నిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
''ఫిర్యాదులు తీసుకునే కౌంటర్‌లో ఉన్న ప్రొఫెసర్, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఏం చేయడానికి వెళ్తున్నారు?'' వంటి ప్రశ్నలు అడుగుతున్నారని విద్యార్థులు చెప్పారు.
దీని కారణంగా ఫిర్యాదు చేసేందుకు చాలా మంది విద్యార్థులు భయపడుతున్నారని విద్యార్థులు చెప్పారు.
''లైంగిక వేధింపులతో సహా అన్ని ఫిర్యాదులపై విచారణ జరపాలి. కానీ, అది తూతూమంత్రంగానే జరుగుతోంది'' అని యూనివర్సిటీ మాజీ విద్యార్థిని కృతిక (పేరు మార్చాం) చెప్పారు.
''కొందరు ప్రొఫెసర్లు నన్ను మానసికంగా వేధిస్తున్నారని 2019లో ఫిర్యాదు చేశా. కానీ, నా ఫిర్యాదును కమిటీ తీసుకోలేదు. కనీసం విచారణకు కూడా పిలవలేదు'' అని ఆమె చెప్పారు.
''నా ఫైనలియర్. ఆ సమయంలో సహ విద్యార్థి లైంగికంగా వేధించాడు. అతనిపై ఫిర్యాదు చేశా. కానీ, యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఏడాది పాటు పోరాడినా న్యాయం జరగలేదు. ఆ తర్వాత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నేను కూడా వదిలేశాను'' అన్నారామె.
తల్లిదండ్రుల సహకారంతో ధైర్యంగా పోరాటం కొనసాగించేందుకు ప్రయత్నించానని, కానీ తనకు నిరాశే మిగిలిందని ఆమె చెప్పారు.

ప్రొఫెసర్లు ఏమంటున్నారు?
బీబీసీతో మాట్లాడుతూ, ఒక ప్రొఫెసర్ క్యాంపస్‌లో జరుగుతున్న ఘటనల గురించి మరిన్ని విషయాలు చెప్పారు. ఆయన తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడలేదు.
యూనివర్సిటీతో సంబంధం లేని కొందరు వ్యక్తులు క్యాంపస్‌లోకి వచ్చి రహస్యంగా జంటలను వీడియోలు తీస్తున్నారని, వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రొఫెసర్ చెప్పారు.
''కొంతమంది విద్యార్థులకు ఈ విషయం తెలిసి వాళ్లని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు, ఆ బయటి వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. కొన్నేళ్ల ముందు ఇది జరిగింది.'' అని ఆయన చెప్పారు.
''అధ్యాపకులను ఐడీ కార్డులు అడుగుతారు, కానీ బయటి వ్యక్తులు మాత్రం యథేచ్చగా వచ్చేస్తారు. కనీస భయం కూడా లేదు. యూనివర్సిటీ కమిటీ కూడా వీటిని పట్టించుకోదు'' అని ప్రొఫెసర్ అన్నారు.

క్యాంపస్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
''విద్యార్థుల భద్రత కోసం క్యాంపస్‌లో 350కి పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ, క్యాంపస్‌లోకి ప్రవేశించే ఏ ఒక్కరిని కూడా సరిగ్గా పర్యవేక్షించడం లేదు'' అని యూనివర్సిటీ ఉద్యోగి ఒకరు చెప్పారు.
క్యాంపస్‌లో క్యాంటీన్ ఉందని, ఇక్కడికి విద్యార్థులే కాకుండా బయటి వారు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారని ఆయన తెలిపారు.
క్యాంటీన్‌లో రేట్లు తక్కువ కావడంతో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. అయితే, బయటి వ్యక్తులు రావడాన్ని యాజమాన్యం కూడా అడ్డుకోవడం లేదన్నారు.
ఇక్కడికి సమీపంలోనే చెన్నై యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఉందని, అక్కడి నుంచి కూడా వస్తుంటారని ఆయన చెప్పారు.

రిజిస్ట్రార్ ఏం చెప్పారంటే..
విద్యార్థులు చేస్తున్న ఆరోపణల గురించి వర్సిటీ రిజిస్ట్రార్ ప్రకాష్‌తో బీబీసీ మాట్లాడింది. కానీ, వాటికి ఎలాంటి సమాధానం రాలేదు.
వాట్సాప్ ద్వారా సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు.
ఇదే విషయమై ఉన్నత విద్యా శాఖ మంత్రి కోవి చెలియన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదు.
అయితే, అదే సమయంలో క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత గురించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకాష్ ప్రకటన చేశారు.
క్యాంపస్‌లో భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నిఘా కెమెరాలు కూడా ఉన్నాయని, కానీ ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు అందులో పేర్కొన్నారు.
విద్యార్థుల ఆరోపణలపై యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఓ అడ్మినిస్ట్రేటర్ బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు.
యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల కమిటీ, లైంగిక వేధింపుల నిరోధక కమిటీ, ఫ్యాకల్టీ గ్రీవెన్స్ కమిటీ వంటి వివిధ కమిటీలు పనిచేస్తున్నాయని చెప్పారు.
అంతేకాకుండా, విద్యార్థికి ఏ సమస్య వచ్చినా ముందుగా ఫ్యాకల్టీ అడ్వైజర్‌కు ఫిర్యాదు చేయాలని, ఆ బాధ్యతల కోసం ఓ ప్రొఫెసర్‌ను నియమించినట్లు చెప్పారు.
''ఈ అడ్వైజర్ విషయాన్ని ఆ క్లాస్ చైర్మన్‌కు నివేదిస్తారు. ఆయన అందుబాటులో లేకుంటే, విభాగాధిపతి(హెచ్‌వోడీ)కి ఫిర్యాదు చేస్తాం. దీనిపై విచారణ జరుగుతోంది. తదనుగుణంగా చర్యలు ఉంటాయి.''
విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏమేం చర్యలు తీసుకున్నారనే దానిపై సెమిస్టర్‌కు రెండుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఒకవేళ విద్యార్థులు ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్తామని, తదనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు

మంత్రి కోవి చెలియన్ ఏమన్నారంటే..
అన్నా యూనివర్సిటీలో లైంగిక దాడి ఘటనపై డిసెంబర్ 27న ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్ ప్రకటన చేశారు.
యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాలేజీలు, యూనివర్సిటీలను పరిశీలిస్తున్నట్లే రానున్న రోజుల్లో ఫిర్యాదుల కమిటీల కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తామన్నారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు.
''మహిళలపై లైంగిక వేధింపులపై విచారణ జరిపేందుకు కాలేజీల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేశాం'' అని మంత్రి చెప్పారు.
''విద్యార్థుల ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపిస్తే, కమిటీయే స్వయంగా వారిని విచారించి తగిన చర్యలు తీసుకుంటుంది.''
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














