డోనల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం కేసులో రూ.127 కోట్లు చెల్లించేందుకు అంగీకరించిన ఏబీసీ న్యూస్, అసలు కేసు ఏంటంటే..

డోనల్డ్ ట్రంప్, ABC న్యూస్ చానల్, పరువు నష్టం దావా, న్యూయార్క్ కోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాబిన్ లెవిన్సన్ కింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌‌కు15 మిలియన్ డాలర్లు (127.21 కోట్ల రూపాయలు) చెల్లించేందుకు ఏబీసీ న్యూస్ అంగీకరించింది.

"రేప్ కేసులో నిందితుడు" అని ట్రంప్ గురించి ఏబీసీ యాంకర్ తప్పుగా చెప్పారని డోనల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. ఈ దావాను సెటిల్ చేసుకునేందుకు 15 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ఏబీసీ న్యూస్ అంగీకరించింది.

2024 మార్చిలో ట్రంప్‌కు మద్దతిస్తున్న ఒక మహిళా ప్రజా ప్రతినిధితో ఇంటర్వ్యూ సందర్భంగా ఏబీసీ న్యూస్ యాంకర్ జార్జ్ స్టెఫానోపోలోస్ పదే పదే ప్రకటనలు చేశారు.

గతేడాది ఒక సివిల్ కేసులో ట్రంప్ ‘‘లైంగిక వేధింపులకు’’ బాధ్యులు అని కోర్టు నిర్ధరించింది. ‘‘లైంగిక వేధింపు’’ల గురించి న్యూయార్క్ చట్టం ప్రత్యేకంగా నిర్వచిస్తోంది.

పరువు నష్టం దావా కేసు సెటిల్‌మెంట్‌లో భాగంగా తమ యాంకర్ చేసిన ప్రకటన మీద "క్షమాపణలు" చెబుతూ ప్రకటన జారీ చేసేందుకు ఏబీసీ న్యూస్ అంగీకరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, ABC న్యూస్ చానల్, పరువు నష్టం దావా, న్యూయార్క్ కోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటర్వ్యూలో రేప్ కేసు గురించి జార్జ్ స్టెఫానోపౌలోస్ పదే పదే తప్పుడు ప్రకటనలు చేశారు.

క్షమాపణలు చెబుతూ ప్రకటన

ఈ సెటిల్‌మెంట్ ప్రకారం ఏబీసీ న్యూస్ 15 మిలియన్ డాలర్లు "ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్ మ్యూజియం" లేదా దావా వేసిన డోనల్డ్ ట్రంప్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని గతంలో అమెరికా అధ్యక్షులుగా పని చేసినవారు నెలకొల్పారు.

ఈ కేసులో ట్రంప్‌కు కోర్టు ఖర్చులు, లాయర్ల ఫీజుల కింద మిలియన్ డాలర్లు చెల్లించేందుకు కూడా ఏబీసీ న్యూస్ నెట్‌వర్క్ అంగీకరించింది.

సెటిల్‌మెంట్ ప్రకారం 2024 మార్చి 10న ప్రచురించిన ఆన్‌లైన్ వార్తా కథనం కింద ఏడిటర్ నోట్‌ను ప్రచురించాలి.

"2024 మార్చి 10న ప్రజా ప్రతినిధి నాన్సీ మేస్‌తో, జార్జ్ స్టెఫానోపౌలోస్ జరిపిన ఇంటర్వ్యూలో డోనల్డ్ ట్రంప్‌ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏబీసీ న్యూస్ చింతిస్తోంది" అని ఆ నోట్‌లో పేర్కొనాలి.

"కోర్టులో దాఖలు చేసిన షరతులకు లోబడి దావాను కొట్టివేసేందుకు కేసులో వాదులు, ప్రతివాదులు ఒక ఒప్పందానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది" అని ఏబీసీ న్యూస్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

1996లో ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఈ జీన్ కారోల్‌ అనే మహిళను డోనల్డ్ ట్రంప్ లైంగికంగా వేధించినట్లు 2023లో న్యూయార్క్ సివిల్ కోర్టు తేల్చింది. ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ట్రంప్‌ను దోషిగా తేల్చింది.

"న్యూయార్క్ శిక్షాస్మతిలోని నిర్ధిష్ట విభాగానికి చెందిన సాంకేతికంగా పరిమితమైన అర్థంలో" ట్రంప్ తనపై అత్యాచారం చేశారని నిరూపించడంలో కారోల్ విఫలమయ్యారని జడ్జ్ లూయిస్ కప్లన్ చెప్పారు.

కొన్ని నిఘంటువులు, వేరే చోట్ల క్రిమినల్ చట్టాల్లో అత్యాచారం గురించి ఆధునిక పరిభాషలో ఇచ్చిన నిర్వచనం కంటే రేప్ నిర్వచనం పరిమితమైనదని జడ్జ్ కప్లాన్ గుర్తించారు.

డోనల్డ్ ట్రంప్, ABC న్యూస్ చానల్, పరువు నష్టం దావా, న్యూయార్క్ కోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ మీద వేసిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు 2024, జనవరి 26న మన్ హట్టన్ ఫెడరల్ కోర్టుకు వస్తున్న ఎలిజబెత్ జీన్ కారోల్

జడ్జ్ కప్లాన్ విచారించిన మరో కేసులో కారోల్ పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలకు గాను డోనల్డ్ ట్రంప్ ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించారు.

2024 మార్చ్ 10న ప్రసారం చేసిన కార్యక్రమంలో భాగంగా స్టెఫానోపౌలోస్ సౌత్ కెరొలినా కాంగ్రెస్ విమెన్ నాన్సీ మేస్‌తో ఇంటర్వూ సమయంలో ట్రంప్ గురించి ప్రస్తావిస్తూ రేప్ కేసులో బాధ్యులైన వ్యక్తిని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.

‘‘న్యాయమూర్తులు, రెండు ప్రత్యేక కోర్టులు ఆయన రేప్‌కు బాధ్యులని తేల్చాయి" అని స్టెఫానోపౌలోస్ తప్పుగా చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలో ఆయన ఆ వ్యాఖ్యల్ని పదిసార్లు పునరావృతం చేశారు.

పరువు నష్టం కేసులో తీర్పుకు ముందు, ట్రంప్, స్టెఫానోపౌలోస్ వచ్చే వారం కోర్టు ఎదుట హాజరై తమ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని సూచించారు.

కమలా హారిస్‌తో ఓ ఇంటర్వ్యూ సమయంలో బీబీసీ అమెరికా ప్రసార భాగస్వామి సీబీఎస్ న్యూస్ చానల్ ట్రంప్‌ను ఉద్దేశించి "మోసపూరిత ప్రవర్తన" అంటూ చేసిన వ్యాఖ్యల గురించి సీబీఎస్ పైనా పరువు నష్టం దావా వేశారు.

తనను అడాల్ఫ్ హిట్లర్‌తో ముడిపెడుతూ సీఎన్ఎన్ న్యూస్ చానల్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ వేసిన దావాను 2023లో కోర్టు కొట్టివేసింది.

న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ మీద ట్రంప్ దాఖలు చేసిన దావాలను కూడా కోర్టులు కొట్టివేశాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)