‘అమ్మా..అతని దగ్గరికి వెళ్లను. నన్ను చంపేస్తాడు’- అని చెప్పిన కొన్ని వారాలకే హర్షిత బ్రెల్లా కారులో శవమై కనిపించారు

ఫొటో సోర్స్, family
- రచయిత, సమీరా హుస్సేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తూర్పు లండన్‌లో హర్షిత బ్రెల్లా ఒక కారులో శవమై కనిపించారు. దీనికి కొన్ని వారాల ముందు, భర్త తనను చంపుతాడని హర్షిత బ్రెల్లా తల్లికి చెప్పారు.
నార్తాంప్టన్‌షైర్‌లోని కార్బీలో నవంబర్ 10న హర్షిత బ్రెల్లాను గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత, ఇల్‌ఫోర్డ్‌కు ఆమె మృతదేహాన్ని తరలించినట్లు భావిస్తున్నారు.
నవంబర్ 14న ఇల్‌ఫోర్డులో ఒక కారులో ఆమె శవాన్ని గుర్తించారు పోలీసులు. ఈ హత్య కేసులో ఆమె భర్త పంకజ్ లాంబాను ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు.
''ఆమె జీవితాన్ని అతడు దయనీయంగా మార్చేశాడు'' అని కన్నీళ్లు పెట్టుకుంటూ బీబీసీకి చెప్పారు హర్షిత బ్రెల్లా తల్లి సుదేష్ కుమారి.
''నేను అతని దగ్గరికి తిరిగి వెళ్లను. అతడు నన్ను చంపేస్తాడు'' అని తన కూతురు చెప్పినట్లు సుదేష్ కుమారి గుర్తు చేసుకున్నారు.

పంకజ్ లాంబా ప్రస్తుతం భారత్‌లో ఉన్నట్టు హర్షిత కుటుంబం అనుమానిస్తోంది. తాము ఈ విషయం చెబుతున్నా భారత పోలీసులు పట్టించుకోవడంలేదని హర్షిత కుటుంబం అంటోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని యూకే అధికారులు తమల్ని కోరలేదని స్థానిక పోలీసులు బీబీసీకి చెప్పారు.
దిల్లీలో వారు ఉంటోన్న ఇంట్లో ఒక గదిలో కూతురు ఫోటో పట్టుకుని కూర్చున్న హర్షిత తండ్రి సత్బీర్ బ్రెల్లా, న్యాయం చేయాలని వేడుకున్నారు.
''నేను చనిపోతే, నా అంత్యక్రియలు నువ్వే చేయాలని నేనెప్పుడూ ఆమెకు చెప్పేవాడిని. కానీ, ఆమె అంత్యక్రియలు నేను చేయాల్సి వస్తుందని అసలు అనుకోలేదు'' అని కన్నీరుమున్నీరయ్యారు సత్బీర్.
ఆమె మరణించడానికి కొన్ని వారాల ముందు హర్షితకు గర్భస్రావం జరిగినట్లు కూడా కుటుంబం చెబుతోంది.
యూకేలో నేరం జరిగినట్లు ఆరోపణలు ఉండటంతో, తాము నేరుగా విచారణ చేయలేకపోతున్నామని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు భారత్‌లో లేకపోతే, విచారణ చేసే అవకాశాలు చాలా తక్కువని అన్నారు.
తమ విచారణ వేగంగా కొనసాగుతోందని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. కానీ, భారత్‌లోని అధికారులను సంప్రదించారా? అన్నది మాత్రం వారు ధ్రువీకరించలేదు.
''మా విచారణ సమగ్రతను కాపాడటం, హర్షితకు న్యాయం దక్కేలా చేయడం మా మొదటి ప్రాధాన్యత. దీనివల్ల, ఈ సమయంలో ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలపై మేం వ్యాఖ్యానించలేం'' అని అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ ఎమ్మా జేమ్స్ చెప్పారు.

లాంబా తన భార్యను కొట్టేవారని, ఆగస్టు 29న ఏడుస్తూ ఫోన్ చేసేంత వరకు కూడా దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని తండ్రి సత్బీర్ బ్రెల్లా, ఆమె సోదరి సోనియా దబాస్ ఆరోపించారు.
"పంకజ్ తనను బాగా కొడుతున్నారని హర్షిత చెప్పింది. ఆమె వీధిలోకి పరుగెత్తినా పంకజ్ వెంటాడి మరీ కొట్టినట్లు చెప్పింది" అని సత్బీర్ బ్రెల్లా చెప్పారు. ''నా కూతురు బాగా ఏడ్చింది'' అని తెలిపారు.
సెప్టెంబర్ 3న పంకజ్ లాంబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు బెయిల్ లభించి విడుదలైనప్పుడు గృహ హింస రక్షణ ఉత్తర్వుల (డీవీపీఓ)ను జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ద్వారా హర్షితను వేధించకుండా, భయపెట్టకుండా ఉండేలా ఆయనపై నిషేధం విధించింది. అంతేకాక, పోలీసులకు 480 పౌండ్లు(రూ. 51,446) ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.
ఈ ఉత్తర్వులు 28 రోజుల వరకే వర్తించాయి. అక్టోబర్ 1న ఈ ఉత్తర్వులకు కాలం చెల్లింది. నవంబర్ 24న ఈ ఉత్తర్వులకు కాలం చెల్లుతుందేమోనని హర్షిత, తన కుటుంబం భావించినట్లు దబాస్ చెప్పారు. అయితే, ఈ ఉత్తర్వుల ఎక్స్‌పైరీ తేదీని హర్షితకు చెప్పినట్లు నార్తాంప్టన్‌షైర్ పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, BBC / Neha Sharma
''ఆమె హృదయం చాలా స్వచ్ఛమైనది''
హర్షిత, పంకజ్ లాంబాల వివాహం 2023 ఆగస్టులో చట్టబద్ధంగా జరిగిందని సోనియా తెలిపారు.
2024 మార్చి 22న సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక చేశారు. ఏప్రిల్ 30న ఆ దంపతులు యూకే వెళ్లారు. అక్కడ నార్తాంప్టన్‌షైర్‌లోని కార్బీకి వెళ్లి స్థిరపడ్డారు.
''ఆమె చాలా అమాయకురాలు'' అని సోదరి సోనియా దబాస్ చెప్పారు. ''ఆమె ఇంకా చిన్నపిల్లనే. ఆమె హార్ట్ చాలా స్వచ్చమైనది'' అని తెలిపారు.
పంకజ్ లండన్‌లో చదువుకుంటున్నారని, హర్షిత ఒక గోదాంలో పనిచేసేవారని సోనియా తెలిపారు. హర్షిత ఇండియాలో టీచర్‌గా పనిచేయాలని కోరుకున్నారని ఆమె సోదరి అన్నారు. లండన్‌లో తన సోదరి జీవితం ఏమాత్రం ఆనందంగా సాగలేదని ఆమె అన్నారు.
చివరిసారి హర్షితను యూకేలో కొత్త జీవితం ప్రారంభించడానికి వెళ్లే ముందు దిల్లీలోని విమానాశ్రయంలో చూసినట్లు ఆమె తల్లి చెప్పారు.
''నన్ను వదిలి వెళ్తున్నందుకు చాలా ఏడ్చింది. కానీ, చివరిసారి నాకు గుడ్‌బై చెబుతోందని నేనసలు అనుకోలేదు'' అని సుదేష్ చెప్పారు.
ఆమె భర్త మొదట్నుంచీ హర్షితను బాగా కంట్రోల్ చేసేవాడని తల్లి పక్కన కూర్చున్న సోదరి సోనియా దబాస్ తెలిపారు.
''వ్యక్తిగతంగా నాకు ఆయన నచ్చరు. మీ సోదరితో మాట్లాడవద్దని ఆయన ఆమెకు చెప్పారు. కాల్ చేయొద్దని హర్షిత మాతో అన్నారు. పంకజ్ లేనప్పుడే ఆమే కాల్ చేస్తానని చెప్పింది'' అని సోదరి తెలిపారు.
''ఆయన ఆమెను మానసికంగా మార్చేసేవారు. మంచి జీవితాన్ని గడపాలనే ఆమె కలను నాశనం చేశారు. ఆయన్ను ఆమె నమ్మింది. ఆయన ఉచ్చులో పడింది'' అని సోనియా ఆరోపించారు.
తన సోదరికి ఆర్థికంగా ఎలాంటి స్వేచ్చ ఉండేది కాదని, గోదాంలో ఆమె చేసే ఉద్యోగం నుంచి వచ్చిన డబ్బులను, బ్యాంకు అకౌంట్‌ను ఆమె భర్తనే కంట్రోల్ చేసేవారని సోనియా దబాస్ తెలిపారు.
''ఆమె కోసం సొంతంగా ఒక చాక్లెట్ కూడా కొనుక్కునేది కాదు'' అని గుర్తుచేసుకున్నారు. టార్చర్ అనుభవిస్తూ ఆమె గడిపారని, శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యారని చెప్పారు.

ఫొటో సోర్స్, Northamptonshire Police
లాంబా అరెస్ట్ అయినప్పుడు, హర్షితకు ముప్పు పొంచి ఉందని పోలీసులు భావించారు.
అదే సమయంలో హర్షిత భద్రత కోసం చర్యలు తీసుకున్నామని ఉత్తర నార్తాంప్టన్‌షైర్ కౌన్సిల్ లీడర్ జాసన్ స్మిథర్స్ చెప్పారు.
హర్షిత ఆరోగ్యం బాలేకపోవడంతో, ఆస్పత్రిలో చేరారని ఆమె సోదరి తెలిపారు. ఆ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిసిందని, కానీ కొన్నిరోజులకే ఆమె బిడ్డను కోల్పోయినట్లు హర్షిత సోదరి చెప్పారు.
ఆమెతో మాట్లాడి మూడు రోజులు కావడంతో, హర్షితకు జరగరానిది ఏదో జరిగిందని భావించి నార్తాంప్టన్‌షైర్ పోలీసులను హర్షిత కుటుంబం సంప్రదించింది. తాము దర్యాప్తు చేయగా హర్షిత మృతదేహం లభ్యమైందని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు వెల్లడించారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు. డిసెంబర్ 3న హర్షిత మృతదేహం స్వదేశానికి తీసుకురావడంతో, వారి ఇంటి ముందు పదుల సంఖ్యలో ప్రజలు గుమికూడారు.
హర్షిత కుటుంబంతో నార్తాంప్టన్‌షైర్ పోలీసులు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉంటున్నారని ఏసీసీ జేమ్స్ చెప్పారు.
''హర్షిత బ్రెల్లాకు, ఆమె కుటుంబానికి న్యాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. మా డిటెక్టివ్‌ల బృందం ఈ కేసు కోసం రేయింబళ్లు పనిచేస్తోంది'' అని ఆమె తెలిపారు.
''మా విచారణ గురించి, హర్షితను చంపిన వ్యక్తుల గురించి ప్రజలకు మరింత సమాచారం ఇవ్వగలిగినప్పుడు, కచ్చితంగా మేం అందిస్తాం'' అని జేమ్స్ చెప్పారు.
అదనపు రిపోర్టింగ్ ఆకృతి థాపర్
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














