జీసెల్ పెలికో: ‘భార్యపై 50 మందితో అత్యాచారం చేయించిన భర్త’ కేసులో లారీ డ్రైవర్ల నుంచి జర్నలిస్టుల వరకు నిందితులుగా పలువురు

50 మంది ప్రతివాదుల స్కెచ్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, లారా గోజి
    • హోదా, బీబీసీ న్యూస్, ఫ్రాన్స్

(ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు)

వారిలో కొందరు యువకులు, మరికొందరు వృద్ధులు.. వారిలో ఫైర్‌ఫైటర్స్, లారీ డ్రైవర్లు, మాజీ సైనికులు, సెక్యూరిటీ గార్డులు, జర్నలిస్ట్, డీజే.. ఇలా రకరకాల వృత్తులకు చెందినవారు ఉన్నారు. వీరంతా ఒక వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో నిందితులు.

మొత్తం 50 మంది.. జీసెల్ పెలికో అనే మహిళపై ఆమె భర్త డొమినిక్ పెలికో సహకారంతో అత్యాచారానికి పాల్పడ్డారన్నది వీరిపై ఆరోపణ.

దశాబ్ద కాలం పాటు భర్త ఆమెకు నిద్రమాత్రలు ఇస్తూ అత్యాచారం చేయించారన్న ఈ కేసు ఫ్రాన్స్‌ను కుదిపేసింది.

డొమినిక్ పెలికో జీసెల్‌కు నిద్రమాత్రలు, మత్తు మందులు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా.. ఇంటర్నెట్లో 50 మందికి పైగా వ్యక్తులను పిలిచి వారితోనూ అత్యాచారం చేయించారని.. 2011 లో మొదలైన ఈ హింస దాదాపుగా ఒక దశాబ్దం వరకు సాగిందనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.

సాధారణంగా ఇలాంటి తీవ్రమైన లైంగిక కేసులలో బాధితుల పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతారు.

కానీ, జీసెల్ తన వివరాలు వెల్లడించడమే కాకుండా కేసు విచారణ కూడా బహిరంగంగానే సాగాలని కోరారు.

ఈ కేసు ఏమిటి? నిందితులు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? వారి కుటుంబీకులు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ కేసు విచారణ పూర్తి కావడంతో వచ్చే వారం తీర్పు రానుంది.

నేరం రుజువైతే నిందితులు అందరికీ కలిసి 600 ఏళ్లకు పైగా జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.

వారిలో కొందరు ఈ నేరాన్ని అంగీకరించలేదు. కానీ, జడ్జిలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు తలలు కిందకి దించుకున్నారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న 50 మంది కూడా పెలికో స్వగ్రామం మజాన్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్వేరు పట్టణాలు, గ్రామాలకు చెందినవారే.

''సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ పనులు చేస్తుంటారు'' అని ముగ్గురు ప్రతివాదుల తరఫున వాదించిన న్యాయవాది ఆంటోయిన్ మినియర్ అన్నారు.

'నా శరీరం ఆమెను అత్యాచారం చేసింది, కానీ నా బ్రెయిన్ కాదు'

తీవ్రమైన ఈ నేరారోపణల ఆధారంగా వారికి ఎలాంటి శిక్షలు విధించాలనేది ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు.

నిందితులు ఎన్నిసార్లు పెలికో ఇంటికి వెళ్లారు? వారు జీసెల్ పెలికోను లైంగికంగా వేధించారా? అన్న దాని ప్రకారం ఈ శిక్షలు పడనున్నాయి.

పదవీ విరమణ చేసిన స్పోర్ట్స్ కోచ్ అయిన 69 ఏళ్ల జోసెఫ్ సీ నేరం చేసినట్లు రుజువైతే, లైంగిక వేధింపుల కింద ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష పడనుంది.

ప్రాసిక్యూటర్లు కోరిన అత్యంత తక్కువ శిక్ష ఇదే.

మరోవైపు రోమైన్ వీ అనే 63 ఏళ్ల వ్యక్తిపై నేరం రుజువైతే ఆయన 18 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఆయనకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నప్పటికీ ఎలాంటి రక్షణ పద్ధతులు పాటించకుండా జీసెల్ పెలికోపై ఆరు సార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నిందితులుకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. డొమినిక్ పెలికో దశాబ్దం పాటు ఈ లైంగిక వేధింపులను వీడియో తీశారంటూ ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పించింది.

డొమినిక్ తనపై అభియోగాలన్నిటినీ అంగీకరించారు.

అంతేకాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 మందికి ఈ కేసులో ప్రమేయం ఉందని ఆయన కోర్టుకు తెలిపారు.

వీడియో ఆధారాలు ఉండడంతో పెలికో ఇంటికి తాము వెళ్లలేదని ఎవరూ చెప్పలేకపోయారు.

ఫ్రాన్స్ చట్టాల ప్రకారం అత్యాచారం అంటే హింస, బలవంతం, బెదిరింపు ద్వారా ఏదైనా లైంగిక చర్యలకు పాల్పడటం. దీనిలో సమ్మతి అవసరం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

చాలామంది వారు చేసిన పనిని టెక్నికల్‌గా అత్యాచారంగా గుర్తించారు. కానీ, వారు ఈ తప్పును ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే, జీసెల్ పెలికో సమ్మతి తెలిపేందుకు స్పృహలో లేరన్న విషయం తమకు తెలియదని అంటున్నారు.

‘ఉద్దేశపూర్వకంగా చేయకపోతే అది నేరం కాదు’ అని డిఫెన్స్ లాయర్ ఒకరు వాదించారు.

''నా శరీరం ఆమెను అత్యాచారం చేసింది. కానీ, నా బ్రెయిన్ కాదు'' అని నిందితుల్లో ఒకరైన ఫైర్‌ఫైటర్ క్రిస్టియన్ ఎల్ అన్నారు.

నిందితుల్లో ఒకరైన 63 ఏళ్ల జీన్-పియర్ మారిచెల్ జీసెల్ పెలికోను అత్యాచారం చేయనప్పటికీ డొమినిక్ పెలికోకు ఆయన శిష్యుడని, ఈ నేరాల్లో డొమినిక్‌కు ఆయన సహకరించారన్నది ఆరోపణ.

అయిదేళ్ల పాటు ఆమెకు మత్తు మందు ఇచ్చినట్లు మారిచెల్ అంగీకరించారు.

మారిచెల్‌కు 17 ఏళ్ల జైలు శిక్ష వేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు.

54 ఏళ్ల అహ్మద్ ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. 30 ఏళ్ల క్రితమే తన చిన్ననాటి స్నేహితురాలిని ఆయన పెళ్లి చేసుకున్నారు. తాను అత్యాచారం చేయాలనుకుంటే 60 ఏళ్ల వృద్ధురాలిని అందుకు ఎంపిక చేసుకోనని అహ్మద్ అన్నారు.

40 ఏళ్ల రెడౌనే నిరుద్యోగి. తాను జీసెల్‌ను అత్యాచారం చేసి ఉంటే వీడియో తీసేందుకు అనుమతించేవాడిని కానని అంటున్నారు.

డొమినిక్ తమను బెదిరించి ఇదంతా చేయించారని కొందరు చెప్పారని న్యాయవాదుల్లో ఒకరు ‘బీబీసీ’తో చెప్పారు.

మరికొందరికి వారు తాగిన పానీయాల్లో డ్రగ్స్ కలిపి ఇచ్చినట్లు తెలిసింది. అందుకే, వారికేం గుర్తుకు లేదని అంటున్నారు. అయితే, డొమినిక్ పెలికో మాత్రం తానలా చేయలేదని ఖండించారు.

దంపతుల అంగీకారంతో జరిగే సెక్స్ గేమ్‌లో మీరొక భాగమంటూ తమకు చెప్పి డొమినిక్ పెలికో తమతో ఇదంతా చేయించారని.. ఆయన తమను మోసగించారని చాలామంది చెప్పారు.

అయితే, ఈ విషయం గురించి తన భార్యకు తెలియదన్న విషయం ఆ వ్యక్తులకు చాలా స్పష్టంగా తెలిపానని డొమినిక్ పెలికో కోర్టులో చెప్పారు.

అత్యాచారం తర్వాత అక్కడ తమకు చెందిన ఎలాంటి ఆనవాళ్లు విడిచిపెట్టడానికి వీలులేదని.. తన భార్యను తాకే ముందు కూడా చేతులు శుభ్రం చేసుకోవాలని వారిని హెచ్చరించినట్లు డొమినిక్ చెప్పారు. పర్‌ఫ్యూమ్ లేదా సిగరెట్ వాసన కూడా వారి నుంచి రాకుండా చూసుకున్నారు డొమినిక్.

కోర్టు రూమ్ నుంచి బయటికి వస్తోన్న ఇద్దరు వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

త్వరితగతిన విచారణ

సెప్టెంబర్ నుంచి ఈ 50 మంది ఒకరి తర్వాత ఒకరు కోర్టు ముందు హాజరయ్యారు. సాధారణంగా అత్యాచార కేసులలో క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్‌కు చాలా రోజుల సమయం పడుతుంది.

ఈ కేసు విచారణలో చాలా మంది ప్రతివాదులు ఉండటంతో వారి విచారణ సమయాన్ని బాగా కుదించారు. రికార్డు స్పీడులో వారి జీవితాలను విశ్లేషించారు.

నిందితుల్లో ఒకరైన 43 ఏళ్ల సిమోన్ నిర్మాణ రంగ కార్మికుడు. సిమోన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు న్యూ కాలెడోనియాలో పశువులను చూసుకునేందుకు ఆయన్ను చిన్నప్పుడే పనికి పెట్టుకున్నారు.

తనకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సిమోన్ చెప్పారు.

నలుగురు పిల్లల తండ్రి జీన్-లుక్ ఎల్‌కు 46 ఏళ్ల వయసు. తన చిన్నప్పుడు తమ కుటుంబం ఒక పడవలో వియత్నాం వెళ్లినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.

వియత్నాం నుంచి ఫ్రాన్స్ రావడానికి ముందు కొన్నేళ్ల పాటు థాయిలాండ్‌లో శరణార్థుల క్యాంపులో నివసించినట్లు చెప్పారు.

డ్రగ్ వ్యవహారాలు, మైనర్‌ను లైంగికంగా వేధించడం వంటి పలు కేసులలో శిక్షలు ఎదుర్కొన్న 39 ఏళ్ల ఫాబియన్ ఎస్‌ను చిన్నతనంలో తల్లిదండ్రులు కొట్టారు, వేధించారు.

చాలామంది ఇతరుల మాదిరిగా, తాను చిన్నప్పుడు ఎదుర్కొన బాధాకరమైన క్షణాలు అత్యాచారం కిందకి వస్తాయని కోర్టు సైకియాట్రిస్ట్‌ను నియమించిన సమయంలోనే తాను గ్రహించానని ఆయన అన్నారు.

ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వ్యక్తుల భార్యలను, జీవిత భాగస్వామ్యులను, కుటుంబ సభ్యులను పిలిపించి వారి వాదననూ రికార్డ్ చేశారు.

తమ జీవితాల్లోని వ్యక్తులు ఈ పరిస్థితిలోకి ఎలా వెళ్లారు, ఎలా చిక్కారు అనే దానిపై సమాధానం కావాలని వారు కోరుతున్నారు.

''నేను షాకయ్యాను. అసలు అలాంటి వాడు కాదు. నా జీవితానికి సంతోషం వీడే'' అని క్రిస్టియన్ ఎల్ తండ్రి అన్నారు.

పిల్లల్ని వేధించే చిత్రాలు ఉన్న కేసులోనూ ఈ ఫైర్‌ఫైటర్‌పై విచారణ జరుగుతోంది. దోషిగా తేలితే ఈయన 16 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది.

జీసెల్ పెలికో కేసు విచారణ

'ఏది జరిగినా ఆయన తరఫున నిలబడతా'

తన విషయంలో, పిల్లల విషయంలో తన మాజీ భర్త చాలా గౌరవంగా, దయతో ఉంటారని 54 ఏళ్ల థియరీ పా మాజీ భార్య కోరిన్ అన్నారు.

తన 18 ఏళ్ల కొడుకు చనిపోయినప్పుడు, తన మాజీ భర్త తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయారని, మద్యం తాగడం ప్రారంభించారని, ఈ సమయంలోనే డొమినిక్ పెలికోతో కాంటాక్ట్ అయినట్లు కోరిన్ తెలిపారు.

''ఏది జరిగినా నేను ఆయన తరఫునే నిలబడతాను'' అని గయానాలో పుట్టిన జాన్ కే మాజీ ప్రేయసి అన్నారు.

ఫ్రెంచ్ సైన్యంలో పనిచేసిన జాన్ కే వయసు 27 ఏళ్లే. నిందితులందరిలో ఆయనే చిన్నవాడు.

రెండుసార్లు జీసెల్ పెలికోపై అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. జీసెల్ పెలికో స్పృహలో లేరని తనకు తెలుసని, అయితే, ఆమె అంగీకారం తెలుపలేదని తనకు తెలియదని అన్నారు.

పెలికో దగ్గరకు జెరోమ్ వీ ఆరుసార్లు ఎందుకు వెళ్లారో తెలుసుకునేందుకు మూడున్నరేళ్ల పాటు ప్రయత్నించానని కన్నీటితో చెప్పారు సమీరా అనే మహిళ.

జీసెల్‌ను అత్యాచారం చేసినట్లు అంగీకరించిన కొందరిలో జెరోమ్ వీ ఒకరు.

అత్యాచారం విషయంలో పూర్తి స్వేచ్ఛ, నియంత్రణ తనకే ఉండే ఆలోచన నచ్చిందని అన్నారు. తన 'అనియంత్రిత లైంగికతే' దీనికి కారణమని జెరోమ్ చెప్పారు.

 జీసెల్ పాలికో

ఫొటో సోర్స్, Reuters

'పూర్తి స్పృహలోనే వారు నన్ను అత్యాచారం చేశారు'

జీసెల్‌కు మత్తు మందు ఇచ్చినట్లుగా నిందితులు తమ మాజీ భార్యలకు, భాగస్వామ్యులకు కూడా ఇలా ఏమన్నా డ్రగ్ ఇచ్చారా అన్నది తెలుసుకోవడం కోసం వారికి పరీక్షలు చేశారు.

ఈ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి, ఈ పురుషులందరికీ ఏమైనా సంబంధాలున్నాయా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

వారంతా స్వతాహాగానే పెలికో ఇంటికి వెళ్లారని, వారి ఆనవాళ్లు దొరకకుండా చేశారని జీసెల్ న్యాయవాది అన్నారు.

‘మీ భర్త వారందరినీ మేనిపులేట్ చేశారని మీరు భావిస్తున్నారా ?’ అని జీసెల్ పెలికోను ఈ విచారణ ప్రారంభంలో అడిగారు.

'నా తలపై గన్ పెట్టి నన్ను అత్యాచారం చేయలేదు. తెలిసే నన్ను అత్యాచారం చేశారు’ అని ఆమె అన్నారు.

కొద్దిసేపటి తర్వాత.. ''ఒకవేళ ఇతరుల ఒత్తిడితో అత్యాచారం చేశారనుకుంటే ఆ తరువాత పోలీసు స్టేషన్‌కు ఎందుకు వెళ్లలేదు? ఎవరైనా కనీసం పోలీసులకు ఫోన్ చేసినా ఆ ఫోన్ కాల్ నన్ను కాపాడేది కదా?'' అన్నారామె.

''కానీ ఎవరూ ఆ పని చేయలేదు. కనీసం ఒక్కరూ కూడా..'' అని జీసెల్ పెలికో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)