ఇస్లామిక్ బ్యాంకులు వడ్డీ వసూలు చెయ్యకుండా లాభాలు ఎలా ఆర్జిస్తున్నాయి? ఈ వ్యాపార రహస్యం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఏంజెల్ బెర్ముడెజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సంప్రదాయ బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించాలన్నా వడ్డీరేట్లు కీలకం. అయితే ఇస్లామిక్ బ్యాంకింగ్‌లో అలాంటిదేమీ లేదు.
ఖాతాదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే, బ్యాంకుకు వెళ్లినప్పుడు తమ డిపాజిట్ల మీద వడ్డీ ఎంత వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. రుణాలు తీసుకునే వారు తాము ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందోనని లెక్కలు వేసుకుంటుంటారు.
అయితే ఇస్లామిక్ బ్యాంకుల్లో వడ్డీ ఇవ్వరు, తీసుకోరు. నిజానికి, ఈ బ్యాంకుల్లో వడ్డీని నిషేధించారు.
ఈ తరహా బ్యాంకింగ్ అంతా షరియా నిబంధనల ప్రకారం నడుస్తుంది.
ధనం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదన్న ఇతర నిబంధనలు కూడా దీనికి కారణమే.
"దీని ఫలితంగా, ఇస్లామిక్ ఆర్థిక సంస్థలు ఆల్కహాల్, పొగాకు, జూదం వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవు" అని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది. ఈ బ్యాంకు ఇస్లామిక్ బ్యాంకులకు రుణం ఇస్తున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అయితే ఇస్లామిక్ బ్యాంకుల్లో వడ్డీ వసూలు చెయ్యడం మీద నిషేధం విధించడానికి కారణం ఏంటి? ఈ బ్యాంకులకు లాభాలు ఎలా వస్తాయి?


ఫొటో సోర్స్, Getty Images
డబ్బు, నిజమైన ఆర్థిక వ్యవస్థ
వడ్డీని తిరస్కరించడం కేవలం ఇస్లామిక్ సంప్రదాయానికి మాత్రమే పరిమితమైన అంశం కాదని, దాని మూలాలు పశ్చిమ దేశాల్లోనూ ఉన్నాయని స్పెయిన్‌కు చెందిన ఐఈ యూనివర్సిటిలో ఇస్లామిక్ ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నసెలియా డి అంకా చెప్పారు.
"యూదు- క్రైస్తవ, ఇస్లామిక్ సంప్రదాయాల్లో వడ్డీ తీసుకోవడంపై నిషేధం ఉంది. స్పెయిన్, ఫ్రాన్స్‌లో అధిక వడ్డీతో అప్పులు ఇవ్వడానికి వ్యతిరేకంగా చట్టాలున్నాయి. ఈ మూడు సంప్రదాయాల పవిత్ర గ్రంథాలు ‘అధిక’ వడ్డీలను నిషేధించాయి. అయితే ‘అధికం’ అంటే ఎంత వరకు అనేది ప్రశ్న. ముస్లింలకు సంబంధించినంత వరకు ఎంతైనా వడ్డీ అనేది అధికమే. అందుకే వడ్డీని నిషేధించారు’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.
పాశ్చాత్య సంప్రదాయంలోనూ వడ్డీ మీద నిషేధం ఉంది. తర్వాతి కాలంలో అదే చట్టంగా మారింది. అధిక వడ్డీ వసూలు చెయ్యడానికి వ్యతిరేకంగా ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల్లో చట్టాలు ఉన్నాయని డి అంకా చెప్పారు.
అయితే, ఇస్లామిక్ బ్యాంకింగ్ రంగం వడ్డీ వసూలు చెయ్యకున్నా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చర్యలు చేపట్టడం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాయి.
"ధనానికి ఎలాంటి విలువ లేదనే నమ్మకం మీద ఇస్లామిక్ బ్యాంకుల ఆర్థిక లావాలేవీలు ఆధారపడి ఉన్నాయి. ఉత్పత్తులను పరస్పరం మార్చుకోవడం, దాని వల్ల సేవల్ని పొందడం అనే వాటికే ఇస్లాంలో విలువ ఉంది" అని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
క్రైస్తవ వేదాంతానికి సంబంధించి ప్రముఖ వ్యక్తి సెయింట్ థామస్ అక్వినాస్ వంటి వారు కూడా వడ్డీని తిరస్కరించాలని చెప్పారని డి అంకా వివరించారు.
"ప్రతి వస్తువుకూ సొంత ప్రయోజనం, మార్పిడి విలువ ఉంటుందని సెయింట్ థామస్ అంగీకరించారు. అయినప్పటికీ మధ్యవర్తిత్వం, ఒక ఏజెంట్ అవసరం లేకుండా విలువ పెరగలేని వస్తువు డబ్బు అని ఆయన పరిగణిస్తారు" అని మెక్సికన్ ఫ్రొఫెసర్, పరిశోధకుడు హెక్టర్ జగల్ అరెగన్ చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ నుంచి డబ్బు రాదనే అంశాన్ని ఇస్లామిక్ సంస్కృతి తిరస్కరిస్తుంది. దీనికి బదులుగా ఎలాంటి శ్రమ లేకుండా లాభాలను పొందడాన్ని ప్రోత్సహిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ బ్యాంకులు వ్యాపారం ఎలా చేస్తాయి?
ఇస్లామిక్ బ్యాంకింగ్‌లో వడ్డీలు ఉండవు, లాభాలు ఉంటాయి.
ఇస్లామిక్ బ్యాంకులు వడ్డీని వసూలు చెయ్యకపోయినా, అనేక ఇతర మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నాయి.
"వడ్డీ, లాభం వేర్వేరు. ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం కూడా లాభాలు సంపాదించడానికి అనుకూలమైనదే. పైగా ఇస్లామిక్ ప్రపంచానికి ఒక వాణిజ్య సంప్రదాయం ఉంది. అది ఎప్పుడూ వ్యాపారానికి దగ్గరగా ఉంటుంది" అని డి అంకా చెప్పారు.
ఉదాహరణకు, బ్యాంకులు వాణిజ్య కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి రుణాలు ఇవ్వవచ్చు. లేదా వస్తువుల ఉత్పత్తిలో భాగస్వామిగా పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే ఇక్కడ బ్యాంకింగ్ రంగం లాభమైనా నష్టమైనా వస్తువుల ఉత్పత్తిలో పాల్గొంటుంది.
"బ్యాంకులు ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడతాయి. ఆ ప్రాజెక్టుల్లో వచ్చే లాభాలను బ్యాంకులు కూడా తీసుకుంటాయి. అది ప్రాజెక్టు కొనసాగుతున్నప్పుడైనా కావచ్చు, లేదా ముగిసిన తర్వాతైనా కావచ్చు. లాభాల్లో వాటా సగం సగం ఉండాలని ఏమీ లేదు. ఒక్కోసారి 80:20 కూడా ఉంటుంది. లేదా మరోలా ఉండవచ్చు. అది పెట్టుబడి పెట్టే భాగస్వాముల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టి ఉంటుంది" అని డి అంకా వివరించారు.
"ఇస్లామిక్ బ్యాంకింగ్ భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే అవకాశం ఉన్న ప్రతి చోటా వారు(సంస్థలు కూడా కావొచ్చు) లాభాల్ని, నష్టాలను షేర్ చేసుకుంటారు. ఇద్దరు వ్యక్తులు, లేదా అంతకమంటే ఎక్కువ మంది వ్యక్తులు, సంస్థలతో ఇది జరుగుతుంది" అని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చెబుతోంది.
వ్యక్తులతో జరిపే లావాదేవీల్లోనూ ఇదే నిబంధన ఉంటుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఇస్లామిక్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచి, అందులో నగదు డిపాజిట్ చేస్తే దాని మీద వడ్డీ రాదు. అయితే ఆ వ్యక్తి డిపాజిట్ చేసిన సొమ్మును సదరు బ్యాంకు తీసుకెళ్లి ఏ ప్రాజెక్టులో పెట్టుబడి పెడుతుందో, ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాల్లో కొంత భాగం ఆ ఖాతాదారుకు ఇస్తుంది.
అలాగే రుణాలు ఇచ్చే విషయంలోనూ ఇలాంటి మార్గాలున్నాయి.
1. ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే, ముందుగా బ్యాంకు ఆ ఇంటిని ‘కొని’, ఆ వ్యక్తికి అద్దెకు ఇస్తుంది. ఒప్పందం ప్రకారం, ఆ వ్యక్తి పూర్తి డబ్బు చెల్లించిన తర్వాత ఇంటిపై పూర్తి హక్కులను ఆ వ్యక్తికి బదిలీ చేస్తుంది. ఇదొక తరహా లీజింగ్ లాంటిది. ఆ ఇంటిపై పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తం అద్దె రూపంలో బ్యాంకు రాబట్టుకుంటుంది.
2. మరో మార్గం ఏంటంటే బ్యాంకు, ఇల్లు కొనాలనుకున్న వ్యక్తి కలిసి ఇల్లు కొంటారు. తర్వాత ఆ వ్యక్తి ఇంటిని అద్దెకు ఇస్తారు. ఆ అద్దె ద్వారా వచ్చే లాభంలో బ్యాంకుకు వాటా వెళ్తుంది. ఆ వ్యక్తి ఆ ఇంటిని సొంతం చేసుకునే వరకు ఇలాగే చెల్లిస్తారు. అంటే, నేరుగా వడ్డీ రూపంలో కాకుండా అద్దె రూపంలో ఎక్కువ డబ్బు ఆ బ్యాంకుకు వస్తుంది.
3. మూడోది ఒక ప్రాపర్టీని బ్యాంకు కొని, ఎక్కువ ధరకు ఇతర వ్యక్తులకు అమ్ముతుంది. ప్రాపర్టీ కొనుగోలులో తనకు అయిన ఖర్చులు, లాభం, కమీషన్ అన్నింటినీ చూసుకుని ధర నిర్ణయిస్తుంది. అలా ఈ బ్యాంకులు లాభాలు సంపాదిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
విస్తరిస్తున్న ఇస్లామిక్ బ్యాంకింగ్
ఇస్లామిక్ బ్యాంకింగ్ రంగం షరియా నిబంధనలకు అనుగుణంగా పని చేస్తున్నప్పటికీ, అది ఆధునిక పరంపరకు అనుగుణంగా నడుస్తోంది.
ఈజిప్టు, పాకిస్తాన్‌లో చేపట్టిన కొన్ని చర్యల వల్ల ఇస్లామిక్ బ్యాంకులు 1950, 1960ల నుంచి అభివృద్ధి చెందడం మొదలైంది. అయితే 1970ల్లో ముడి చమురు పరిశ్రమ పుంజుకున్నప్పటి నుంచి ఇస్లామిక్ బ్యాంకుల ప్రాధాన్యత పెరిగింది.
"ముడి చమురుకు గిరాకీ పెరిగిన తర్వాత అనేక మంది వ్యాపారులు తమ డబ్బును సంప్రదాయ నిర్వాహకులకు ఇచ్చారు. ఆ సొమ్మును ఇస్లామిక్ పద్దతిలో వడ్డీలు తీసుకోకుండా వ్యాపారం చేసి లాభాలు గడించేలా చూడాలని కోరారు" అని బ్యాంకింగ్ వ్యవహారాల నిపుణులు ఒకరు చెప్పారు.
దీంతో ఇస్లామిక్ బ్యాంకింగ్ కొత్త మలుపు తిరిగింది. అది ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చెయ్యడం మొదలైంది.
"ఇస్లామిక్ విలువల ప్రకారం డబ్బును పెట్టుబడి పెట్టడం, వాటి మీద లాభాలు ఆర్జించాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకింగ్ రంగం నుంచి కొత్త కొత్త మార్గాలు అమల్లోకి వచ్చాయి" అని ఆయన చెప్పారు.
షరియా ప్రకారం నడుస్తున్న బ్యాంకులు అభివృద్ధి చెందడం, లాభాలు ఆర్జిచండంతో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ట్రెండ్ పెరిగింది.
"ఇస్లామిక్ దేశాల్లో బ్యాంకులు సంప్రదాయ పద్దతిలో నడుస్తున్నాయి. అయితే ఎక్కువ మంది ప్రజలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నారు. దీంతో బ్యాంకులు కూడా ఇస్లామిక్ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.
బ్యాంకులు డిపాజిట్ల మీద వడ్డీలు ఇవ్వడం, రుణాల మీద వడ్డీ వసూలు చేస్తూ ఉండటం వల్ల ముస్లింలు మెజార్టీగా ఉన్న దేశాల్లో ఎక్కువ మంది బ్యాంకింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత కూడా చాలా కొద్ది మంది మాత్రమే బ్యాంకు సేవల్ని వినియోగించుకుంటున్నారు.
2002 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ నియమాల ప్రకారం నడుస్తున్న ఇస్లామిక్ బ్యాంకింగ్ ఆస్తులవ లువ 4.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2027 నాటికి ఇది 6.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అబ్జర్వేటరీ ఆఫ్ ఇస్లామిక్ ఫైనాన్స్ ఆఫ్ స్పెయిన్ SCIEF – Casa Árabe ప్రచురించిన నివేదిక తెలిపింది.
ఇందులో 70 శాతానికి పైగా ఆస్తుల్ని ఇస్లామిక్ బ్యాంకింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 77 దేశాల్లో ఇస్లామిక్ బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇస్లామిక్ బ్యాంకుల ఆస్తులు ఎక్కువ భాగం కో ఆపరేషన్ కౌన్సిల్ ఫర్ అరబ్ స్టేట్స్ ఆఫ్ ది గల్ఫ్ సభ్య దేశాల్లో ( 53.60 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత అగ్నేయాసియాలో 23.20 శాతం, మధ్య, దక్షిణాసియాల్లో 18.6 శాతం, ఆఫ్రికాలో 2.7 శాతం, యూరప్ దేశాల్లో 1.7 శాతం ఉన్నాయి.
భారత్‌లో ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని అనుమతించే ఆలోచన లేదని 2017 నవంబర్‌లో ఆర్బీఐ చెప్పినట్టు వార్తా సంస్థ పీటీఐ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
లాటిన్ అమెరికాలో ఎందుకు లేదు?
అబ్జర్వేటరీ ఆఫ్ ఇస్లామిక్ ఫైనాన్స్ ఆఫ్ స్పెయిన్ SCIEF – Casa Árabe ప్రచురించిన నివేదికలో లాటిన్ అమెరికా గురించి ప్రస్తావించలేదు.
షరియా నిబంధనల ప్రకారం బ్యాంకుల నిర్వహణకు ఇచ్చే సుకుక్(షరియా నిబంధనలు ఉన్న బాండు)ను ఇచ్చే అంశాన్ని మెక్సికో పరిగణిస్తోందని దినార్ స్టాండర్డ్ అనే కన్సల్టెన్సీ రూపొందించిన గ్లోబల్ స్టేట్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎకానమీ రిపోర్ట్ 2023-2024 నివేదిక తెలిపింది. ఇస్లామిక్ బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టడానికి "సుకుక్" ఎంట్రీ పాసు లాంటిది.
అయితే ప్రస్తుతం లేదా త్వరలోనైనా లాటిన్ అమెరికన్ దేశాల్లో ఇస్లామిక్ బ్యాంక్ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
"లాటిన్ అమెరికాలో ఇస్లామిక్ బ్యాంక్‌లేవీ లేవు, వచ్చే అవకాశం కూడా లేదు" అని ఐఈ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ గొంజాలో రోడ్రిగెజ్ మార్టిన్ చెప్పారు.
లాటిన్ అమెరికాలో ఇస్లామిక్ బ్యాంక్ ఎందుకు సాధ్యం కాదనే దానికి ఆయన రెండు ప్రధాన కారణాలను వివరించారు.
"లాటిన్ అమెరికాలో ముస్లిం జనాభా ఎక్కువగా లేదు. దీంతో ఇక్కడ ఇస్లామిక్ బ్యాంక్ కోసం డిమాండ్ కూడా లేదు. ఇస్లామిక్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేసేందుకు రాజకీయ చొరవ అవసరం. లాటిన్ అమెరికన్ రాజకీయ పార్టీల అజెండాలో ఇలాంటి అంశాలు ఉండవు. ఎందుకంటే వారు ఇస్లామిక్ బ్యాంక్ ఎందుకు అవసరం అనే అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సి ఉంటుంది" అని రోడ్రిగో మార్టిన్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














