ప్రార్థనా స్థలాల చట్టం: పదే పదే ఎందుకు చర్చనీయాంశం అవుతోంది? దీని మీద వాదనలేంటి?

భారతదేశం, అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు, అజ్మీర్ దర్గా, షాహీ దర్గా, దేవాలయాలు, సంభల్ మసీద్, ప్రార్థనా స్థలాల చట్టం 1991

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై వివాదం కోర్టులో ఉంది.
    • రచయిత, నియాజ్ ఫరూఖీ, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అస్థిత్వంలో ఉన్న మతపరమైన కట్టడాలు. వాటి గుర్తింపు, స్వభావాన్ని, నిర్మాణాన్ని రక్షించేందుకు దశాబ్దాల కిందటి నుంచి ఉన్న చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తోంది.

1991లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రార్థనాలయాలు అప్పటికి ఉన్న స్థితిని, స్వభావాన్ని మార్చడాన్ని నిషేధిస్తోంది. అంతే కాకుండా బాబ్రీ మసీదు మినహా, మిగతా వాటి స్టేటస్ గురించి కోర్టులు జోక్యం చేసుకోవడాన్ని కూడా అడ్డుకుంటోంది.

ఈ చట్టం నుంచి బాబ్రీ మసీదు కేసుకు మాత్రమే స్పష్టమైన మినహాయింపు ఉంది.

బాబ్రీ మసీదు 16వ శతాబ్ధం నాటిది. 1991కు ముందు నుంచే వివాదంగా ఉంది. 1992లో దీన్ని హిందువుల సమూహం కూలగొట్టింది. 2019లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ స్థలాన్ని హిందువులకు కేటాయించింది. ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ వ్యవహారం భారత దేశపు మతపరమైన, లౌకికపరమైన పొరపాట్లపై చర్చకు కారణమైంది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లలో ఒకటి భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యుడు దాఖలు చేశారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం మతపరమైన స్వేచ్ఛను, రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక భావనను ఉల్లంఘిస్తోందని ఆయన అందులో వాదించారు.

గతంలో దేశంలోని అనేక మసీదులు హిందూ దేవాలయాలను పడగొట్టి నిర్మించారని హిందూ సంఘాలు కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.

హిందువులు మెజార్టీగా ఉన్న దేశంలో మైనార్టీలకు చెందిన ప్రార్థనాలయాల సంరక్షణకు ఈ చట్టం అవసరమని ప్రతిపక్షపార్టీలు, ముస్లిం సంఘాల నాయకులు అంటున్నారు. దేవాలయాలను కూల్చివేసి మసీదులు నిర్మించారని కేసులు వేసినవారు చూపిస్తున్న చారిత్రక ఆధారాల స్వభావాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ ఈ చట్టాన్ని తొలగించినా లేక బలహీనపరిచినా అది ఇలాంటి అనేక పిటిషన్లకు గేట్లు తెరవడం లాంటిదేనని ప్రతిపక్ష నాయకులు, ముస్లిం సంఘాల నేతలు భావిస్తున్నారు.

దీని వల్ల దేశంలో హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారతదేశం, అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు, అజ్మీర్ దర్గా, షాహీ దర్గా, దేవాలయాలు, సంభల్ మసీద్, ప్రార్థనా స్థలాల చట్టం 1991

ఫొటో సోర్స్, Getty Images

ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చారు ?

భారతదేశంలో మతపరమైన కట్టడాలు అంటే అవి దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు...ఏవైనా కావచ్చు, 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వాటి స్వరూపం ఎలా ఉందో అలాగే కొనసాగించాలని ఈ చట్టం చెబుతోంది.

అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించాలని బీజేపీ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమం బలం పుంజుకోవడంతో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో ‘ది ప్లేస్ ఆఫ్ వర్షిప్ (స్పెషల్ ప్రొవిజన్స్)’ చట్టం తీసుకొచ్చింది.

అప్పటికి బీజేపీ చేపట్టిన పోరాటం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని అంచనాల ప్రకారం ఈ సమయంలో చెలరేగిన ఉద్రిక్తతల్లో కొన్ని వందల మంది చనిపోయి ఉండవచ్చు.

అప్పట్లో చెలరేగిన హింస 1947లో దేశ విభజన సమయంలో మతపరమైన విభజన వల్ల చెలరేగిన హింసను గుర్తుకు తెచ్చింది.

ఈ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతూ నాటి హోంమంత్రి ఎస్‌బీ చవాన్ "స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్న అసహనం ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతోంది" అని అన్నారు.

ఈ వర్గాలు, కొత్త వివాదాల్ని సృష్టించేందుకు ప్రార్థనా స్థలాలను 'బలవంతంగా మార్చి వేసేందుకు' ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.

అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించింది. బిల్లును నిరసిస్తూ కొంతమంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లును మైనార్టీలను బుజ్జగించేందుకు తీసుకువచ్చారని, దీని వల్ల హిందువులు ముస్లింల మధ్య అంతరం మరింత పెరుగుతుందని బీజేపీ ఎంపీ ఒకరు చెప్పారు.

అవి మతపరమైనవి అయినా కాకున్నా, పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నవాటితోపాటు, స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి వివాదంలో ఉన్న బాబ్రీ మసీదుకు ఈ చట్టం నుంచి మినహాయింపు నిచ్చారు.

ప్రార్థనా స్థలాల బిల్లు చట్టంగా మారిన కొన్ని నెలల్లోనే కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. వివాదాస్పద స్థలాన్ని హిందువులకు చెందినదిగా తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు విధ్వంసం చట్ట వ్యతిరేకమైన చర్య అని పేర్కొంది.

భారతదేశం, అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు, అజ్మీర్ దర్గా, షాహీ దర్గా, దేవాలయాలు, సంభల్ మసీద్, ప్రార్థనా స్థలాల చట్టం 1991

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 16వ శతాబ్దానికి చెందిన మసీదులో సర్వే చేపట్టేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సంభల్ పట్టణంలో హింస చెలరేగింది.

ఈ చట్టం ఎందుకు వార్తల్లోకి వస్తోంది ?

ప్రార్థనా స్థలాల చట్టం1991 మీద దాఖలైన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పు మీద దేశంలో ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న డజన్ల కొద్దీ ప్రార్థనాలయాల భవిష్యత్ ఆధారపడి ఉంది.

ఇందులో ఎక్కువ భాగం కట్టడాలు ముస్లింలకు చెందినవి. వీటి మీద హిందూ సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. కోర్టు కేసుల్లో చిక్కుకున్న వాటిలో జ్ఞానవాపి, షాహి ఈద్గా, వారణాసి, మధురలోని రెండు వివాదాస్పద మసీదులు ఉన్నాయి.

రెండు వారాల కిందట అజ్మీర్ దర్గా విషయంలో దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అజ్మీర్‌లో ప్రతిరోజూ వేలమంది సందర్శించే 13వ శతాబ్దానికి చెందిన ఈ సూఫీ మందిరాన్ని హిందూ ఆలయం మీద నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలైంది.

నెల రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లోని 16వ శతాబ్దానికి చెందిన మసీదులో సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో హింస చెలరేగింది. ఇందులో నలుగురు మరణించారు. సర్వే నిర్వహించాలన్న కోర్టు నిర్ణయంపై ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

కోర్టులు సర్వేకు ఆదేశాలు జారీ చేసినప్పుడల్లా ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. జ్ఞానవాపి మసీదు విషయంలోనూ ఇదే జరిగింది. 17వ శతాబ్ధంలో కాశీ విశ్వనాధుడి ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మసీదు నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపించాయి. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలను ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. ఇది 1991 ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధమనేది వారి వాదన.

అయితే 2022లో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సర్వేను ఆపాలని చెప్పలేదు. 1947 ఆగస్టు 15నాటికి ఉన్నప్రార్థనాలయాల స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించనంత వరకు, వాటిపై దర్యాప్తును 1991 చట్టం నిరోధించలేదని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

ఈ ఉత్తర్వులను అనేక మంది విమర్శించారు. "1991చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే న్యాయస్థానాల ఆదేశాలకు ఈ ఉత్తర్వులు వరద గేట్లు తెరిచినట్లుగా మారాయి" అని మాజీ ప్రభుత్వ ఉద్యోగి హర్ష్ మందర్ అన్నారు.

"మీరొక మసీదు కింద దేవాలయం ఉందా అని నిర్ణయించేందుకు సర్వేకు అనుమతించి, ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరణ చర్యలను నిషేధిస్తే, ఇది కొన్ని ఏళ్ల పాటు వివిధ విశ్వాసాల మధ్య ద్వేషం, భయాన్ని పెంపొందించడానికి కారణమవుతుంది" అని మందర్ రాశారు.

వివిధ ఆరోపణల వల్ల స్థలాల చారిత్రక స్థితిని నిర్ణయించడం అనేది మతాల మధ్య ఘర్షణలను, హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)