‘విషవాయువులతో నా భార్యాపిల్లల్ని చంపారు, దీని గురించి నన్ను నోరెత్తనివ్వలేదు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యోగితా లిమాయే
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీతో మాట్లాడుతూ తౌఫీక్ దీమ్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే, 2018లో తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఆయన తొలిసారి స్వేచ్ఛగా మాట్లాడగలిగారు.
డమాస్కస్‌లోని తూర్పు గౌటా శివారు ప్రాంతం డౌమాలో ఆయన బీబీసీ ప్రతినిధితో సంభాషించారు.
''ఒకవేళ నేను దీని గురించి గతంలో మాట్లాడి ఉంటే, బషర్ అల్ అసద్ బలగాలు ఇప్పటికి నా నాలుక కోసేసి ఉండేవి. నా గొంతు నొక్కేసేవి. దాని గురించి మాట్లాడటానికి మాకు అనుమతి లేదు'' అని తౌఫీక్ అన్నారు.
2018 ఏప్రిల్ 7న జరిగిన ఒక రసాయన దాడిలో తౌఫీక్ భార్య, నలుగురు పిల్లలు చనిపోయారు. వాళ్ల వయసు 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉంటుంది.
అదే ఘటన గురించి గ్లోబల్ వాచ్‌డాగ్ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (ఓపీసీడబ్ల్యూ) సంస్థ కూడా గతేడాది ఒక నివేదికలో తెలిపింది.
''ఆ రోజున డుమైర్ వైమానిక స్థావరం నుంచి సాయంత్రం 7 దాటాక బయల్దేరిన సిరియా వైమానిక దళానికి చెందిన ఒక హెలికాప్టర్ రెండు పసుపు రంగు సిలిండర్లను జారవిడిచింది. రెండు అపార్ట్‌మెంట్ భవనాలను ఢీకొట్టిన తర్వాత ఆ సిలిండర్ల నుంచి అత్యంత గాఢత కలిగిన క్లోరిన్ గ్యాస్ వెలువడినట్లు భావిస్తున్నారు'' అని పేర్కొంది.


ఆ గ్యాస్ వెలువడిన సమయంలో తన కుటుంబీకులు ఇంటి ముందు ఉన్నారని తౌఫీక్ చెప్పారు.
''నాకు పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. వీధిలోని వారంతా కెమికల్స్, కెమికల్స్ అంటూ అరిచారు. నేను బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను. చాలా దుర్వాసన వచ్చింది. ప్రజల నోటి నుంచి పసుపు రంగు నురగలు రావడం చూశాను. మా పిల్లలు శ్వాస తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వీధుల్లో అందరూ కిందపడిపోవడం కనిపించింది'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Aamir Peerzada/BBC
ఆ ఘటనలో 43 మంది చనిపోయినట్లు ఓపీసీడబ్ల్యూ వెల్లడించింది. కానీ, 100 మందికిపైగా చనిపోయారని తౌఫీక్ అంటున్నారు.
''నేను కూడా చావు అంచుల వరకు వెళ్లొచ్చాను. పది రోజులు ఆసుపత్రిలోనే ఉన్నా. ఆ కాంపౌండ్‌లోని ఐదారుగురు పురుషులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు'' అని తౌఫీక్ తెలిపారు.
రసాయన ఆయుధాలను తామెప్పుడూ వాడలేదంటూ ఈ ఘటనను అసద్ ప్రభుత్వం ఖండించింది. డౌమాలో జరిగిన దాడి 'ప్రణాళికాబద్ధమైనదని' వారి మిత్ర దేశం రష్యా వ్యాఖ్యానించింది.
సిరియా అంతర్యుద్ధం సమయంలో అయిదేళ్ల పాటు అత్యంత భీకర పోరాటాలు జరిగిన ప్రదేశాల్లో తూర్పు గౌటా ఒకటి.
జైష్ అల్ ఇస్లామ్ గ్రూపు నేతృత్వంలోని తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు మిత్రదేశం రష్యాతో కలిసి సిరియా ప్రభుత్వం అక్కడ విచక్షణారహితంగా బాంబు దాడులు చేసింది. ఆ ప్రాంతాన్ని ముట్టడించింది.
ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు, నాటి విధ్వంసానికి సంబంధించిన ఆనవాళ్లు మన చుట్టూ కనిపిస్తాయి. యుద్ధపు ఆనవాళ్లు లేని ఒక్క భవనం కూడా అక్కడ లేదు. అనేక భవనాల శిథిలాలు అక్కడ కనిపిస్తాయి.
రసాయన ఆయుధాల వాడకాన్ని జెనీవా ప్రోటోకాల్, కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ నిషేధించాయి. కానీ, తూర్పు గౌటాలోని డౌమాపై ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో రసాయన దాడులు జరిగాయి.
క్లోరిన్ దాడి జరిగిన కాసేపటి తర్వాత బషర్ అల్ అసద్ బలగాలు, డౌమాను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటన తాలూకూ బాధితుల కథలు ఎప్పుడూ బయటకు రాలేదు.
''నా పిల్లలు గుర్తు రాని రోజే లేదు'' అని తౌఫీక్ అన్నారు. వారితో కలిసి తీసుకున్న ఒకే ఒక ఫోటోను బయటకు తీస్తుండగా ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.

ఫొటో సోర్స్, Aamir Peerzada/BBC
తౌఫీక్‌తో మేం మాట్లాడుతుండగా, తమ కథలను షేర్ చేసుకునేందుకు ఇంకొంతమంది ప్రజలు మా దగ్గరికి వచ్చారు.
నాటి క్లోరిన్ దాడిలో పసిపిల్ల అయిన తన కూతురు, రెండేళ్ల కొడుకు, గర్భంతో ఉన్న తన భార్య ఫాతిమా చనిపోయారని ఖాలిద్ నసీర్ తెలిపారు.
''చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే'' అని ఆయన చెబుతున్నప్పుడు ఆరేళ్లుగా లోపల దాచుకున్న ఆక్రోశం బయటపడింది.
''బషర్ అల్ అసద్ ఒక అబద్ధాలకోరు, నియంత. తన ప్రజలను తానే చంపేశాడన్న విషయం ప్రపంచమంతటికీ తెలుసు. ప్రసవానికి రెండు రోజుల ముందు నా భార్యను చంపేశారు'' అని తీవ్ర భావోద్వేగంతో ఆయన గట్టిగా అరిచారు.
ఆ ప్రాంతంలో రసాయన దాడుల పేరిట క్లోరిన్ దాడి మాత్రమే కాకుండా ఇతర రసాయన దాడులు కూడా జరిగాయి.

2013లో తూర్పు, పశ్చిమ గౌటాలో రెబెల్స్ ఆధీనంలో ఉన్న శివారు ప్రాంతాలపై సరిన్ అనే నర్వ్ ఏజెంట్ రసాయనంతో కూడిన రాకెట్లను ప్రయోగించారు. అప్పుడు వందల మంది ప్రజలు చనిపోయారు. ఈ దాడిలో సరిన్ రసాయనం ఉపయోగించినట్లు ఐక్యరాజ్యసమితి నిపుణులు ధ్రువీకరించారు.
తమ బలగాలు రాకెట్లను ప్రయోగించలేదంటూ అసద్ ఖండించారు. కానీ, కెమికల్ వెపన్స్ కన్వెన్షన్‌పై సంతకం చేయడానికి, రసాయన ఆయుధాగారాన్ని నాశనం చేసేందుకు ఆయన అంగీకరించారు.
2013-2018 మధ్య సిరియాలో 85కు పైగా రసాయన ఆయుధ దాడులు జరిగినట్లు హ్యుమన్ రైట్స్ వాచ్ నమోదు చేసింది. వీటిలో ఎక్కువ భాగం దాడులకు సిరియా ప్రభుత్వమే కారణమని ఆరోపించింది.
2018 డౌమా రసాయన దాడితో పాటు, 2017-2018 మధ్య జరిగిన మరో నాలుగు రసాయన దాడుల్లో అసలు దోషి సిరియా మిలిటరీ అని ఓపీసీడబ్ల్యూ ఇన్వెస్టిగేషన్, ఐడెంటిఫికేషన్ టీమ్ గుర్తించింది. 20 సందర్భాల్లో రసాయన ఆయుధాలను వాడినట్లు గతంలో ఒక నిజ నిర్ధరణ మిషన్ గుర్తించింది.

ఖాలిద్, తౌఫీక్ మమ్మల్ని రోడ్డు పక్కన ఉన్న ఒక మట్టిదిబ్బ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రభుత్వం తమ కుటుంబీకులను ఇక్కడే సామూహిక ఖననం చేసిందని వారు నమ్ముతున్నారు.
''నేను ఇక్కడ కాలు మోపడం ఇదే మొదటిసారి. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఒకవేళ నేను గతంలో ఇక్కడికి వచ్చి ఉంటే వారు నన్ను ఉరి తీసి ఉండేవారు'' అని తౌఫీక్ అన్నారు.
''ఈద్ రోజున నా కుటుంబం గుర్తొచ్చేది. దీంతో ఈ రోడ్డు పక్కనుంచి బైక్ మీద వెళుతూ ఆ మట్టిదిబ్బ వైపు చూసి వెంటనే తల తిప్పుకునేవాడిని. చాలా ఏడుపొచ్చేది'' అని ఆయన ఆవేదన చెందారు.
ఆ సమాధిని తవ్వాలని తౌఫీక్ కోరుకుంటున్నారు. తన కుటుంబీకులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలనేది ఆయన కోరిక.

ఫొటో సోర్స్, Aamir Peerzada/BBC
''ఈ దాడిపై మళ్లీ తాజాగా దర్యాప్తు జరిపించాలి'' అని ఖాలిద్ అన్నారు.
ఓపీసీడబ్ల్యూ నిజ నిర్ధరణ మిషన్‌కు 2019లో అందిన సాక్ష్యాధారాలు నమ్మదగినవి కాదని ఆయన భావిస్తున్నారు.
మిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిలో అబ్దుల్ రహమాన్ హిజాజి ఒకరు. ప్రభుత్వం తరఫున సాక్ష్యం చెప్పేలా తనను బలవంతం చేశారని ఆయన అన్నారు.
''ఇంటెలిజెన్స్ అధికారులు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అబద్ధం చెప్పమని బలవంతం చేశారు. రసాయనాల వల్ల కాదు, దుమ్ము పీల్చడం వల్ల వారంతా చనిపోయారని నన్ను చెప్పమన్నారు. ఇలా చెప్పకపోతే నా కుటుంబం సురక్షితంగా ఉండదని బెదిరించారు.'' అని అబ్దుల్ వివరించారు.
''భారీ షెల్లింగ్, పొగ, దుమ్మును పీల్చడం వల్ల ఊపిరాడక చాలామంది మరణించినట్లు కొందరు సాక్షులు చెప్పారు'' అని డౌమాపై 2019 ఓపీసీడబ్ల్యూ నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు జరిపించాలని రహమాన్ కూడా కోరుతున్నారు.
''నిజం బయటకు రావాలని కోరుకుంటున్నా. నాకు నిద్రపట్టడం లేదు. అందరికీ న్యాయం జరగాలి'' అని ఆయన అన్నారు.
అదనపు రిపోర్టింగ్ ఆమిర్ పీర్జాదా, సంజయ్ గంగూలీ, లీన్ అల్ సాదీ
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














