బంగారం ఆశ చూపి సెక్స్, అమెజాన్ అక్రమ గనుల్లో మహిళలపై అఘాయిత్యాలు ఎలా ఉంటాయంటే...

- రచయిత, థైస్ కారాన్కా, ఎమ్మా యేల్స్
- హోదా, బీబీసీ 100 వుమెన్, బీబీసీ బ్రెజిల్
సెక్స్ వర్కర్‌గా మారాలని డయానే లైట్ ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఆమెకు 17 ఏళ్ల వయసులోనే భర్త గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బులు లేవు తన దగ్గర.
బ్రెజిల్‌లోని ఉత్తర పారా రాష్ట్రంలో తను ఉండే ఇటైటుబా పట్టణం, దేశంలో జరిగే అక్రమ బంగారు మైనింగ్ బిజినెస్‌కు కేంద్రం.
అమెజాన్‌లోని అక్రమ బంగారు గనుల్లో పనిచేసే మైనింగ్ కార్మికులతో సెక్స్‌కు ఒప్పుకుంటే డబ్బులు వస్తాయని ఆమెకు స్నేహితురాలు సలహా ఇచ్చారు.
''గనుల్లోకి వెళ్లడమన్నది అదృష్టాన్ని పరీక్షించుకోవడంలాంటిది. అక్కడ మహిళలను తీవ్రంగా హింసిస్తారు, తిడతారు, కొడతారు’’ అని డయానే అన్నారు.
''ఒక రోజు నేను నిద్రపోతున్నప్పుడు, ఒక వ్యక్తి కిటికీలోంచి నా మీదకు దూకాడు. నా నుదుటి మీద తుపాకీ పెట్టాడు. డబ్బులు చెల్లించినందుకు, వారు మహిళను సొంతం చేసుకోవాలనుకుంటారు'' అని డయానే చెప్పారు.
తన భర్త అంత్యక్రియల కోసం డయానే సెక్స్ వర్కర్‌గా పనిచేసి డబ్బులు సంపాదించారు. 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.
గత 16 ఏళ్లుగా, ఇటైటుబాలోని చాలా మంది మహిళల్లాగే డయానే కూడా వంట పని చేయడానికి, దుస్తులు ఉతకడానికి, సెక్స్ వర్క్ కోసం గనుల్లోకి వెళ్తూ వస్తుంటారు.

ఏడుగురు వ్యక్తులున్న తన కుటుంబాన్ని డయానే పోషించాలి
అదే పట్టణంలో ఉండే నటాలియా కవాల్కాంటే కూడా సెక్స్ వర్కర్‌గా పని చేస్తున్నారు.
''ఈ నగరంలో మహిళలందరూ ఇలానే చేస్తారని నేను చెప్పడం లేదు. కానీ, చాలామంది ఈ వర్క్ చేస్తారు. ఇది ఇక్కడ మామూలే. మేం పట్టించుకోం కూడా'' అని నటాలియా అన్నారు.
ఆమె 24 ఏళ్ల వయసులోనే ఒక మారూమూల ప్రాంతంలో ఉన్న గనిలో సెక్స్ వర్కర్‌గా మారారు.
నాలుగేళ్ల తర్వాత, ఆమె ఒక బార్ ఓనర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బ్రోతల్ హౌస్‌ను నడిపిస్తున్నారు.
నగరంలో ఉన్న తన మేనకోడళ్లను చూసుకునేందుకు ప్రస్తుతం ఈ పనిని వదిలేశారు.

ఈ అడవుల్లోని గనులున్న గ్రామాల్లో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ మైనింగ్ కూలీలు కర్రతో చేసిన, చుట్టూ తెల్లటి గుడ్డ కట్టి నిర్మించిన గుడిసెల్లో, చుట్టూ పాములు, ఇతర క్రూర జంతువులు మధ్య నివసిస్తుంటారు.
జనరేటర్ ఆగితే, ఆ ప్రాంతమంతా కారుచీకటి కమ్ముకుపోతుంది.
ఈ క్యాంపులలో వంటమనుషులుగా పనిచేసే మహిళలు, అక్కడ పురుషులతో పాటు కలిసి ఉండాలి.
ఎప్పుడైనా వారికి బంగారం దొరికితే, వాటిని ఖర్చు చేసేందుకు గ్రామంలోకి వస్తారని నటాలియా అన్నారు.
కొన్నిసార్లు సెక్స్‌కు ముందు బంగారాన్ని ఆశగా చూపి, లొంగదీసుకుంటారని చెప్పారు.
బ్రెజిల్‌లో వ్యభిచార గృహాలు నడపడం చట్టవిరుద్ధం. కానీ, తానెలాంటి కమిషన్ తీసుకోలేదని, కేవలం బార్ సిబ్బందిని నియమించానని, గదులను అద్దెకు ఇస్తున్నానని నటాలియా అన్నారు.
కొందరు యువతులు పని కావాలని తనను అడుగుతుంటారని చెప్పారు.
కొన్నిసార్లు ఇటైటుబా నుంచి ఏడు గంటలు దూరం ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లేందుకు డబ్బులు కూడా ఇస్తానని తెలిపారు.
ఇతర మహిళలను కూడా ఈ పనిలో దించడం మీకేమీ తప్పుగా అనిపించడం లేదా అని అడిగినప్పుడు, ''కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటాను. నేను దీన్ని భరించాను. ఇది అంత మంచిది కాదని నాకు తెలుసు. కానీ, ఆ అమ్మాయికి కుటుంబం ఉంటుంది, కొన్నిసార్లు పిల్లల్ని కూడా పెంచాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లాలనుకుంటున్న చాలామంది అమ్మాయిలకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అందుకే మేం ఒప్పుకుంటున్నాం.'' అని నటాలియా చెప్పారు.
పెళ్లికి ముందే నటాలియా చాలా డబ్బులు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆమెకు ఇటైటుబాలో సొంతిళ్లు, బైకు, కావాల్సినంత బంగారం ఉంది. కొన్నిసార్లు సెక్స్‌కి ఒప్పుకున్నందుకు బంగారం రూపంలో ఆమెకు చెల్లింపులు చేసేవారు. ఒక్కసారికి రెండు లేదా మూడు గ్రాములు వచ్చేవి.
నటాలియా ఇప్పుడు చదువుకోవాలని అనుకుంటున్నారు. లాయర్ లేదా ఆర్కిటెక్ట్ కావాలన్నది ఆమె లక్ష్యం.

ఇటైటుబాను గోల్డ్ నగ్గెట్ సిటీగా పిలుస్తుంటారు. ఇక్కడ కొందరు మహిళలు సెక్స్ వర్క్ చేసి సంపాదించిన డబ్బుతో సొంత వ్యాపారాలు పెట్టుకుంటున్నారని నటాలియా చెప్పారు.
హింసాత్మకమైన, ఎలాంటి చట్టాలు లేని మైనింగ్ ప్రాంతాల్లో ఒక మహిళ వ్యాపారాల్లోకి దిగడం అంత సేఫ్ కాదు.
ఈ గనుల ద్వారా జరిగే పర్యావరణ ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, హింస, లైంగిక దోపిడీ, అక్రమ రవాణా అనేవి చాలా వరకు రిపోర్టు కావడం లేదని ఐక్యరాజ్యసమితి కూడా చెబుతోంది.
ఈ గనుల నుంచి సేకరించిన అక్రమ బంగారాన్ని, లైసెన్స్ ఉన్న మైనింగ్ కోఆపరేటివ్ సంస్థల ద్వారా చట్టబద్ధమైన బంగారంగా రీ లేబుల్ చేయిస్తామని ఒక మెటల్ డీలర్ బీబీసీకి చెప్పారు.
ఆ తర్వాత వీటిని ఎగుమతి చేసి, ఆ బంగారాన్ని ఆభరణాలలో, మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్‌కు సంబంధించిన పరికరాల్లో వాడుతుంటామని తెలిపారు.
బ్రెజిల్ బంగారానికి కెనడా, స్విట్జర్లాండ్, బ్రిటన్ దేశాలు టాప్ 3 కస్టమర్లు.
యూరప్‌కు వెళ్లే మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా బంగారం, చట్టవిరుద్ధంగా మైనింగ్ జరిగే ప్రాంతాల నుంచే వెళ్తుందని ఇనిస్టిట్యుటో ఎస్కోల్హాస్ థింక్ ట్యాంక్ చెప్పింది.

మైనింగ్ గ్రామాల్లో చనిపోయే మహిళల గురించి ప్రపంచానికి తెలియదు. గత ఏడాది 26 ఏళ్ల రయీలే శాంటోస్ అనే మహిళ మృతి చెందారు.
ఆమె ఇటైటుబా నగరానికి దూరంగా ఉండే ఒక గోల్డ్ మైన్ దగ్గర నివసించే వారు.
''ఒక వ్యక్తి సెక్స్ కోసం డబ్బులు ఆఫర్ చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆమె చనిపోయి కనిపించింది. తీవ్రంగా కొట్టడంతో ఆమె మరణించింది'' అని ఆమె సోదరి రయిలానే చెప్పారు.
రోజూ చాలామంది మహిళలు చనిపోతుంటారని రయిలానే తెలిపారు.
''నేను గనుల్లో పుట్టాను. గనుల్లో పెరిగాను. కానీ, ఇప్పుడు అక్కడ ఉండాలంటేనే భయమేస్తోంది'' అని అన్నారు.
రయీలే శాంటోస్ హత్యతో సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ, తనపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టివేస్తున్నారు.
బ్రెజిల్‌లో అక్రమ బంగారు గనులు విస్తరించిన భూమి 2023 నాటికి పదేళ్లలో రెండింతలకు పైగా పెరిగింది. అది గ్రేటర్ లండన్‌కన్నా పెద్దగా ఉంటుంది.
ఈ ప్రాంతంలో ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారన్నది చాలామందికి తెలియదు.
అలాగే అక్రమ మైనింగ్ కార్మికులు ఎంతమంది ఉన్నారో కూడా లెక్కల్లో లేదు.
80 వేల నుంచి 8 లక్షల మంది అక్కడ పనిచేస్తూ ఉండొచ్చని బ్రెజిల్ ప్రభుత్వం అంచనావేస్తోంది.
అక్రమ మైన్లను మూసేయడమే కాకుండా, వారు ఉత్పత్తి చేసే బంగారాన్ని డీలర్స్ కొనుగోలు చేయకుండా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
కానీ, బంగారు ధరలు అత్యధికంగా ఉండటంతో మైనింగ్ కార్మికులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
మైనింగ్ ప్రాంతాల్లో పనిచేయడం మానేయాలని డయానే అనుకుంటున్నారు. రెండు, మూడు నెలల్లో కావాల్సినంత సంపాదించుకుని, స్నాక్ బార్ ఓపెన్ చేయాలన్నది ఆమె ఆశయం.
కానీ, అదంతా సక్సెస్ కాకపోవచ్చని ఆమెకు తెలుసు. అడవుల్లో ఒక్కర్తే నడుచుకుంటూ వెళ్లేటప్పుడు తన పిల్లల గురించి భయమేస్తుందని డయానే అన్నారు.
'' ఇక నా వల్ల కాదు అనుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. మా అమ్మ బాగా కష్టపడేది. మాకోసం ఎన్నో బాధలను అనుభవించిది. ఎప్పుడూ వెనకడుగు వేయలేదు అని నా పిల్లలు అనుకుంటారని భావిస్తున్నా'' అని డయానే చెప్పారు.
(అదనపు రిపోర్టింగ్ మారియానా స్క్రీబర్, బీబీసీ బ్రెజిల్)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














