ఈ భారీ దుంపలు ఎక్కడ దొరుకుతాయి? వీటిని ఏం చేస్తారు?

ఫొటో సోర్స్, Sai Krishan, Thirunelly Tribal Special Intervention Programme
- రచయిత, కమలా త్యాగరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళలోని ఒక ఆదిమ తెగ, అందులో కొందరు మహిళల బృందం దేశంలో పురాతన స్థానిక దుంప జాతి మొక్కలను పునరుద్దరించి వాటిని దైనందిన జీవితంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.
లక్ష్మి ప్రతీ రోజూ నిండుగా వేళ్లు ఉన్న పొడవాటి ముద్దల్లాంటి దుంపలు తవ్వేందుకు గంటల తరబడి సమయం కేటాయిస్తుంటారు.
వీటిలో కొన్ని 5 కేజీల బరువు, 4.5 అడుగుల పొడవు ఉంటాయి. వీటిని భూమిలోంచి వెలికితీయడం చాలా కష్టమైన పని అని 58 ఏళ్ల లక్ష్మి చెప్పారు.
ముందుగా ఆమె నేల మీద ఉండే కొమ్మలను కత్తిరించాల్సి ఉంటుంది. తర్వాత ఆమె మట్టిని తవ్వుతూ లోపల ఉన్న కొమ్మల్ని తొలగిస్తూ చిన్నగా దుంపను బయటకు తీస్తారు.
దుంప వేర్లకు ఎలాంటి నష్టం జరక్కుండా దుంప చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తారు. దుంపను బయటకు తీసిన తర్వాత అది మట్టి రంగులోనే ఉంటుంది. అలా తీసిన దానికి పునరుజ్జీవనం కల్పిస్తామని ఆమె చెప్పారు.


ఫొటో సోర్స్, Sai Krishan, Thirunelly Tribal Special Intervention Programme
లక్ష్మి కేరళలోని వయనాడ్‌లో నివసిస్తున్నారు. ఈ పనిలో ఆమె ఒక్కరే కాదు, ఆమెతో పాటు నూరంగ్ అని పిలిచే మహిళల బృందం అంతా పాల్గొంటుంది. వీళ్ల గ్రూపును స్థానికులు ‘నురు కిలంగు’ అని పిలుస్తారు. నురు కిలంగు అంటే స్థానికంగా వైవిధ్యభరితమైన దుంప అని అర్థం.
ఈ బృందంలో అందరూ కేరళలో అతి పురాతన తెగలలో ఒకటైన వెట్ట కురుమన్ అని పిలిచే సంచార జాతికి చెందినవారు.
ఈ పురాతన దుంపలను వీళ్లు స్థానికంగా కొన్ని శతాబ్దాల నుంచి పండించేవారు.
లక్ష్మి చిన్న తనంలో ఆహారం కోసం అడవుల్లో వెతికేవారు. ఆ సమయంలో పచ్చిగా ఉండే వేర్లు, ఆకులు, తేనె, పండ్లు, దుంపలు (కిలంగు) బాగా దొరికేవి. అవే తినేవాళ్లం. వాటిలో చాలా వెరైటీలు ఉండేవి. అందుకే మాకెప్పుడూ ఆహారం బోర్ కొట్టేది కాదు” అని లక్ష్మి చెప్పారు.
“మాకెప్పుడూ రకరకాల కంద గడ్డలు, చిలగడదుంపలు (స్వీట్ పొటాటో) ఒక పూట ఆహారంగా ఉండేవి. వాటిని వేయించుకుని, ఉడకబెట్టి లేదా వండుకుని తినేవాళ్లం. నా చిన్నప్పటి జ్ఞాపకాలలో ఇది చాలా ముఖ్యమైనది” అని ఆమె చెప్పారు.
అయితే వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ దుంపలు ఇప్పుడు కేరళలోని గిరిజన తెగల ఆహారంలో భాగంగా లేవు. అనేక రకాలైన ఇతర ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకించి బియ్యం, గోధుమలు వీరి ఆహారంలో భాగంగా మారాయి.
తమ పూర్వీకులకు ప్రత్యేక ఆహారమైన దుంపలను వీరిప్పుడు పట్టించుకోవడం లేదని టీవీ సాయి కృష్ణన్ చెప్పారు. ఆయన వయనాడ్‌లోని తిరునెల్లి గిరిజన సామూహిక అభివృద్ధి పథకంలో సమన్వయకర్తగా పని చేస్తున్నారు. ఈ సంస్థ రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం పని చేస్తుంది.
ఇటీవలి ఏళ్లలో మారిన వాతావరణ పరిస్థితులు కూడా దుంపల సాగును దెబ్బ తీశాయి. దుంపలు వేడి పరిస్థితుల్ని తట్టుకోగలిగినవే అయినా, 2019 నుంచి వయనాడ్ ప్రాంతంలో తరచూ వరదలు వస్తున్నాయి. వర్షాకాలంలో నీరు నిలిచిపోయి పంటలు దెబ్బతింటున్నాయి.
2005-2015 మధ్య కేరళలో దుంపల్ని పండించే భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. ఇందులో ఎక్కువ శాతం భూములలో ప్రస్తుతం రబ్బర్ పండిస్తున్నారని సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేరళ నివేదిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, Sai Krishan, Thirunelly Tribal Special Intervention Programme
ఈ దుంపలను రక్షించడం, పురాతన అలవాట్లు, విధానాలను భద్రపరచుకోవడమే కాదు, పౌష్టికాహారాన్ని పెంపొందించుకోవడం కూడా అని వి. షకీలా చెప్పారు. ఆమె వయనాడ్‌లోని ఎంఎస్ స్వామినాథన్ కమ్యూనిటీ ఆగ్రో బయోడైవర్సిటీ సెంటర్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
“ప్రస్తుతం గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఇది పరిష్కారం. ప్రత్యేకించి వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న ఆహర భద్రతకు ముప్పు, పౌష్టికాహర లోపం వంటి సమస్యలకు ఎదుర్కొనేందుకు ఇదే మార్గం” అని షకీలా చెప్పారు.
మిగతా వారితో పోలిస్తే ఆదిమ జాతుల ప్రజలు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారని నేషనల్ డేటా సూచిస్తోంది.
“మొదట్లో, మహిళలు ఈ దుంపల్ని పండించి వీటితో వారి కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించేవారు. ఈ పురాతన వైవిధ్యభరితమైన దుంప రకాలు అంతరించిపోకుండా చూసుకోవాలి” అని షకీలా చెప్పారు.
దుంపల్ని ఏరుకోవడంలో తమ సమూహంలోని మహిళలు నాయకత్వం వహించేవారని లక్ష్మి చెప్పారు. వాటి కోసం అడవుల్లో చాలా దూరం వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. వాటిని తెచ్చుకోవడం, దాచుకోవడం తేలిక.
“ఈ పురాతన దుంపల్లో ఔషధ విలువలు ఉన్నాయని మేము నమ్ముతాం” అని శాంత చెప్పారు. ఆమె నూరంగ్ బృందం సభ్యురాలు.
“దుంపలకు పసుపు రుద్ది వండుకుని తింటే జీర్ణ ప్రక్రియ, కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయని ఇక్కడున్న అనేక మంది తల్లులు బలంగా నమ్ముతారు” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Sai Krishan, Thirunelly Tribal Special Intervention Programme
కనుమరుగవుతున్న జీవనశైలి
వెట్ట కురుమన్ తెగ ప్రజలు ఒకప్పుడు వయనాడ్ అడవుల్లో చిన్న చిన్న తండాల్లో నివసించేవారు. వరదలు వచ్చినప్పుడు, కొండచరియలు విరిగిపడినప్పుడు వారి ఇళ్లకు ముప్పు ఎక్కువ ఉండేది.
గతంలో ఈ సమూహం నివసించిన చోట కేరళ ప్రభుత్వం కొత్త ఇళ్లు నిర్మించి 2003లో 700 మందిని తరలించింది.
2016లో ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అర ఎకరం పొలం ఇచ్చింది. దీంతో ఎక్కువ మంది ఈ భూమిని వ్యవసాయం కోసం, పశువుల్ని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ట్రైబల్ కమ్యూనిటీస్ ఆహారపు అలవాట్లు మారిపోయాయని సాయి కృష్ణన్ చెప్పారు.
2022 మే, కోవిడ్ సమయంలో నూరంగ్ గ్రూపుకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా వారి భూముల్లో సంప్రదాయ ఆహారమైన దుంపలతో పాటు, వరి అరటి, కూరగాయల్ని పండించేలా ది తిరునెల్లి ట్రైబల్ కాంప్రహెన్సివ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు.
ఈ ప్రాజెక్టు కుడుంబశ్రీ మిషన్‌లో భాగం. ( కుడుంబశ్రీ అంటే మలయాళంలో కుటుంబ శ్రేయస్సుఅని అర్థం). ఆదివాసీ మహిళల్లో పేదరికాన్ని తొలగించి సాధికారత పెంచేందుకు వారికి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ మిషన్‌ను ప్రారంభించింది.
“కోవిడ్19 సమయంలో ఆదివాసీ తెగల పిల్లల కోసం మేమొక అవగాహన కార్యక్రమం నిర్వహించాం. వాళ్లు తినే ఆహారం గురించి ఒక రేఖా చిత్రాన్ని రూపొందించాం. వారిలో చాలా మందికి తమ పూర్వీకులు ఆహారంగా తీసుకున్న ఈ దుంపల గురించి ఎలాంటి అవగాహన లేదని మాకు అర్థమైంది” అని సాయి కృష్ణన్ చెప్పారు.
ఈ తెగ ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని ఈ సర్వే చూపిస్తోందని ఆయన అన్నారు. పిల్లలు బియ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్పాదాయ వర్గాలకు ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాయి.
“మాకు గతంలో వేగంగా ప్రొటీన్ అందించే ఆహారం ఈ దుంపలే” అని లక్ష్మి చెప్పారు. “మా పిల్లలు మా సంప్రదాయ ఆహారం నుంచి దూరం జరిగితే, అది మాకు చాలా పెద్ద నష్టం. తరతరాలుగా మనం ఆధారపడిన పోషకాలను కోల్పోవడం మన అస్తిత్వానికి భారీ నష్టం” అని ఆమె అన్నారు.
2022లో బృందంగా ఏర్పడిన పది మంది నూరంగ్ సభ్యులు 180 రకాల అడవి దుంప జాతులను సంరక్షించగలిగారు. అందులో 15 వైల్డ్ యమ్ , మూడు ఎలిఫెంట్ యమ్, ఎనిమిది రకాల కొలొకెసియ( వీటిని ఏనుగు చెవులు, బంగాళాదుంప లాంటి గడ్డ అంటారు) 16 రకాల పసులు, నాలుగు రకాల టపియోక, ఏడు రకాల స్వీట్ పొటాటొ, రెండు అల్లం, మూడు ముల్లంగి, చైనీస్ పొటాటొ ఉన్నాయి.
"మాకు దొరికే అరుదైన విత్తనాలను భద్రపరచడం, మరిన్ని దుంపలను పండించడమే మా లక్ష్యం” అని నూరంగ్ సభ్యుడు సరసు చెప్పారు.
విత్తనాలు నాటేందుకు మొదట భూమిని చదును చెయ్యడం మొదలు పెట్టినప్పుడు, వాళ్లు చాలా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందని సరసు చెప్పారు. ఎందుకంటే ఆ భూమిలో మొలకెత్తిన లాంటానా కెమెరా అని పిలిచే ముళ్ల జాతి మొక్కలు, ఇతర ముళ్లపొదలను తొలగించడానికి కూలీలను తెచ్చుకోవడం వారికి కష్టమైన వ్యవహారం. ఈ ముళ్ల చెట్లు 2 నుంచి 4 మీటర్ల ఎత్తు ఎదుగుతాయి. పదునైన ముళ్లతో పొదలాగా విస్తరిస్తాయి.
“నేలను శుభ్రం చేసే పనిలో ప్రతీ రోజూ మా చేతులు రక్తం కారేవి. చేతులు కాయలు కాచి, పుండ్లు ఏర్పడేవి” అని సరసు చెప్పారు.
“పనంతా మేమే చేసుకున్నాం. పెద్ద రైతులు ఉపయోగించే ట్రాక్టర్ల సాయం లేకుండానే చేసుకున్నాం. వాటితో పని చేయించుకునేందుకు డబ్బులు కూడా లేవు. అవసరమైనన్ని డబ్బులు లేకపోవడంతో సొంతగా పని చేసుకోవాల్సి వచ్చింది” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Sai Krishan, Thirunelly Tribal Special Intervention Programme
నూరంగ్ గ్రూప్ తమ వద్ద ఉన్న కొద్ది పాటి నిధులతోనే పని చేస్తోంది. ఈ భూమిని నూరంగ్ బృందం సభ్యురాలు శాంతా కుటుంబం ఇతర సభ్యులకు ఐదేళ్ల లీజుకు ఇచ్చింది.
దీనికి బదులుగా మిగతా మహిళలు తమ వంతుగా ఏడాదికి 5వేల రూపాయలు చెల్లించాలి. ఇది అందరికీ చెందిన లక్షన్నర రూపాయల ఆదాయంలో 3.5 శాతం
దీనితో పాటు అడవిలో దుంపలు, గడ్డి పెంచేందుకు స్థానిక రైతులు ఉచితంగా ఇచ్చిన విత్తనాలను నూరంగ్ సభ్యులు ఉపయోగించారు. రైతులు ఈ బృందానికి సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
“దుంపల్ని మంచి వేసవిలో అంటే ఏప్రిల్, మే మధ్యలో నాటాలి. ఎందుకంటే రుతుపవనాలు వస్తే వర్షపు నీరు వల్ల పంటకు మేలు జరుగుతుంది. దుంపల్ని నాటేందుకు డిసెంబర్ నుంచి మార్చి వరకు సీజన్” అని సాయి కృష్ణన్ చెప్పారు.
మహిళలు సేకరించి నాటిన దుంపలు వేగంగా పెరిగాయి. మహిళలు రోజు మార్చి రోజు కలుపు తీస్తున్నారు. భార్యలుగా, తల్లులుగా తమ పాత్రను పోషిస్తూనే అదనపు ఆదాయం కోసం కోళ్ల పెంపకం లాంటి పనులు చేస్తున్నారు.
“మా పనికి మంచి ఫలితం రావాలి. అప్పుడే మా కుటుంబాలకు అవసరమైనంత ఆదాయం వస్తుంది” అని సరసు చెప్పారు.
“ఇన్ని కష్టాలున్నా, దుంపలు పెంచడం అనేది మన కోసం మనం చేసుకునే పని. వాటి వల్ల ఎంత వచ్చినా, నా మటుకు ఇది మా వారసత్వాన్ని స్వీకరించడం లాంటిది” అని ఆమె అన్నారు.
మహిళలు తాము పండించిన పంటను కేరళలోని మార్కెట్లు, సంతలలో స్వయంగా అమ్ముతున్నారు.
“మేము వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎంత పండించగలం అనే దానికి పరిమితులు ఉంటాయి” అని లక్ష్మి చెప్పారు.
మహిళలు వేరే సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. కోతులు, అడవి పందులు వారి పంటను పాడు చేస్తున్నాయి. అలాగే ఏనుగులు కూడా పంటను ధ్వంసం చేస్తున్నాయి.
దుంపలు గట్టిగా ఉండే పంటే అయినా, వేడిని తట్టుకుంటాయి. ఎక్కువ నీరు అవసరం లేదు. వరదలు, కొండచరియలు పంటకు ముప్పుగా మారాయని మహిళలు చెప్పారు. రుతుపవనాల సమయంలో వరదలు వస్తే , వేసవిలో కరవు పరిస్థితులు కూడా పంటల్ని పాడు చేస్తున్నాయి, దుంపలకు నీరు అందకపోతే అది పెద్దగా ఎదగదు. దుంప ఎండిపోయి పంట నాణ్యత దెబ్బ తింటుంది.
ఏటా ప్రారంభంలో, తిరగలి అని పిలిచే ఏరువాక రోజున తమ పంటను మహిళలు తిరునెల్లి విత్తనాల పండగలో ప్రదర్శిస్తారు. వారితో పాటు ఇంకా అనేకమంది రైతులు వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే విత్తనాలు, పంటను ప్రదర్శనకు పెడతారు.
“రైతులతో విస్తృతంగా చర్చించడం మాకు ఎప్పుడూ స్ఫూర్తిని అందిస్తుంది” అని శాంత చెప్పారు. “దీని వల్ల మేము ఎవరూ చేయని పని చేస్తున్నామని, ఒంటరి వాళ్లమనే భావన రాదు. మేము చేస్తున్న పని గురించి తెలుసుకోవడం ముఖ్యం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది” అని ఆమె అన్నారు.
స్థానికంగానూ, వారి కష్టానికి గుర్తింపు దక్కింది. తాము పండించిన దుంపలను చూసేందుకు ఏరువాక రోజున అధికారులు వచ్చారని, తమ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నారని సరసు చెప్పారు.
కొన్నిసార్లు మహిళలు ఇతర రైతులు, విదేశీయులను కలిసినప్పుడు తాము పండించిన దుంపలను వారికి చూపిస్తున్నారు. “వారిని కలవడం, మాట్లాడుకోవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి” అని సరసు చెప్పారు. అయితే మహిళలు పట్టుదలగా ఉండటానికి మరో కారణం ఉంది.
“మేము చేపట్టిన కార్యం ప్రత్యేకమైనదని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాం. అంటే మేం చేసే పని అర్థవంతమైనది” అని శాంత చెప్పారు.
మలయాళంలో మహిళలతో చేసిన ఇంటర్వ్యూలను బొటనిస్ట్ ఏంజెల్ అబ్రహం అనువదించి చెప్పారు. ఆయన ఎంఎస్ స్వామినాధన్ రీసర్చ్ ఫౌండేషన్‌లో రీసర్చ్ ఫెలోగా పని చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














