సిరియా అంతర్యుద్ధం: ప్రపంచాన్ని కన్నీరు పెట్టించిన ఈ చిన్నారి గుర్తున్నాడా?

అలాన్ కుర్దీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో ఒడిశా తీరంలో అలాన్ కుర్దీపై సుదర్శన్ పట్నాయక్ గీసిన సైకత చిత్రం

దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా నెలకొన్న అసంతృప్తి తాజాగా సిరియా అధ్యక్షుడు దేశాన్ని వదిలిపోయేలా చేసింది. ఈ మధ్య కాలంలో జరిగిన అనేక తిరుగుబాట్లను బషర్ అల్-అసద్ నాయకత్వంలోని ప్రభుత్వం కఠినంగా అణచివేసింది.

ప్రధానంగా 2011లో మొదలైన అరబ్ స్ప్రింగ్ ఉద్యమం సిరియాలో కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ అణచివేత, అక్కడ జీవించలేని పరిస్థితులు ఎందరినో వలస బాట పట్టించాయి.

తమ దేశం నుంచి పారిపోవడంలో భాగంగా, యూరప్ దేశాలకు వలస వెళ్లాలని చాలామంది నిర్ణయించుకున్నారు. వలస వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

అలా ప్రమాదానికి గురైన చిన్నారి పేరే అలాన్ కుర్దీ. 2015లో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయి, ఒడ్డుకు చేరుకున్న ఈ మూడేళ్ల చిన్నారి ఫోటో అప్పట్లో సంచలనం సృష్టించింది. సిరియా వదిలి పారిపోతున్న వేలమంది జీవితాలు ఎంత భయంకమైన ప్రమాదాలగుండా ప్రయాణిస్తున్నాయో ఈ ఘటన ప్రపంచానికి చాటి చెప్పింది.

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక కష్టాలను అనుభవిస్తున్న వలసదారుల దుస్థికి ఈ చిత్రం అద్దం పడుతుంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అలాన్ కుర్దీ, సిరియా

ఫొటో సోర్స్, AFP/Getty

ఫొటో క్యాప్షన్, అలాన్ కుర్దీ మృతదేహాన్ని ఒడ్డు నుంచి తీసుకువస్తున్న భద్రతా సిబ్బంది

ఆ రోజు ఏం జరిగింది?

సిరియాలో అంతర్యుద్ధం, బతకలేని పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి మరో దేశానికి వలస వెళ్లాలని భావిస్తున్న వారిలో అలాన్ కుర్దీ తండ్రి అబ్దుల్లా కూడా ఒకరు. మొదట సిరియా నుంచి నుంచి తుర్కియేకు వలస వెళ్లింది అబ్దుల్లా కుటుంబం.

అక్కడి నుంచి తన సోదరి ఉంటున్న కెనడాకు వెళ్లాలన్నది అబ్దుల్లా యోచన. అయితే, సరైన సర్టిఫికెట్లు లేనందువల్ల ఆయన వీసాను కెనడా నిరాకరించింది. దీంతో ఏదో ఒక మార్గంలో కెనడా చేరుకోవాలని అబ్దుల్లా ప్రయత్నించారు.

అలా మూడేళ్ల చిన్న కొడుకు అలాన్ కుర్దీ, పెద్ద కొడుకు ఘాలిబ్ కుర్దీ, భార్య రెహనాతో కలిసి అక్రమ మార్గంలో కెనడాకు బయలుదేరారు అబ్దుల్లా.

తమలాగే వలస బాట పట్టిన ఓ గ్రూప్‌తో వీళ్లు కలిశారు. సెప్టెంబర్ 2న వారు ప్రయాణించాల్సిన బోటు బయలుదేరింది. అయితే, అలాన్ కుర్దీ తోపాటు తన కుటుంబం మొత్తానికి అదే చివరి ప్రయాణమవుతుందని అబ్దుల్లా ఊహించలేదు.

అబ్దుల్లా కుటుంబంతో పాటు మరొక 23 మంది తుర్కీయే వైపుగా వెళ్తున్న ఆ బోటులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఎగసిపడిన అలలు బోటును బోల్తాకొట్టించాయి.

ఈ ప్రమాదంలో అబ్దుల్లా భార్య , ఇద్దరు పిల్లలు ఆయన కళ్ల ముందే నీళ్లలో మునిగిపోయారు.

బోటులో ప్రయాణిస్తున్న వారిలో 14 మంది మరణించినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు.

అలాన్ కుర్దీ, సిరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు కుర్దీ మరణాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.

ఒడ్డుకు కొట్టుకు వచ్చిన అలాన్ కుర్దీ మృతదేహం

ఇలాంటి ప్రమాదాలు మధ్యధరా సముద్రంలో కొత్తకాదు. కానీ, చిన్నారి అలాన్ కుర్దీ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి తీరంలో పడి ఉన్న తీరు మాత్రం ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది.

తుర్కియే తీరంలో అలలు తాకుతుండగా, ఇసుకలో నిర్జీవంగా పడి ఉన్న మూడేళ్ల అలాన్ కుర్దీ మృతదేహం ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. నిమిషాల వ్యవధిలో ఇది ప్రపంచమంతా వ్యాపించింది.

పత్రికలు, టీవీలు, ఆన్‌లైన్ వెబ్‌సైట్లన్నీ ఈ ఫోటోను ప్రముఖంగా ప్రచురించాయి. ఈ చిత్రాన్ని నేరుగా చూపించడంవల్ల సున్నిత మనస్కులు కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉండటంలో అప్పట్లో బీబీసీ ఈ ఫోటోను ప్రచురించలేదు. అందుకు బదులుగా బాలుడి మృతదేహాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఒడ్డు నుంచి తీసుకువస్తున్న ఫోటోలను ప్రచురించింది బీబీసీ.

అలాన్ కుర్దీ ఫోటోను ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక కార్టూన్లు, ప్రతీకాత్మక చిత్రాలు, సంతాప సందేశాలు విస్తృతంగా ప్రచురితమయ్యాయి. మీడియాలో అలాన్ వార్త హెడ్‌లైన్‌గా నిలిచింది.

‘‘ఈ ప్రపంచాన్ని నిద్ర నుంచి మేల్కొల్పడానికి దేవుడే ఆ ఫోటోను వెలుగులోకి తెచ్చాడు’’ అని కెనడాలో ఉండే అలాన్ మేనత్త టీమా అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత సిరియాలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయాలంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి.

అలాన్ కుర్దీ, సిరియా
ఫొటో క్యాప్షన్, నాన్న, అన్నతో చిన్నారి అలాన్ (ఎర్ర టీషర్ట్ ) -ఫైల్ ఫోటో

అబ్దుల్లా ఎవరు?

అలాన్ కుర్దీ కుటుంబం కుర్ద్ కమ్యూనిటీకి చెందినది. ఆనాటి సిరియన్ ప్రభుత్వం ఈ వర్గాన్ని నిర్వాసితులుగా ప్రకటించింది. 2011 నుంచి అక్కడ చెలరేగుతున్న అల్లర్ల కారణంగా ఎంతో మంది కుర్దులు శరణార్థులుగా మారి, ఆశ్రయం కోసం దేశదేశాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది.

ప్రస్తుతం అల్ అసద్‌ను పదవిని వీడిపోయేలా చేసిన ఉద్యమాలకు కేంద్రమైన సిరియా రాజధాని డమాస్కస్ లోనే అబ్దుల్లా కుటుంబం నివసించేది.

2011లో ఘర్షణల సమయంలో అబ్దుల్లా కుటుంబం తుర్కీయే వలస వెళ్లింది. కానీ అక్కడ శరణార్ధుల క్యాంపు‌లో గడిపారు. పౌరసత్వ హోదా దక్కే పరిస్థితి కనిపించలేదు.

అప్పటికే అబ్దుల్లా సోదరీ టీమా, కెనడాలో స్థిరపడ్డారు. అబ్దుల్లా కుటుంబం కెనడా రావడం కోసం ఆమె జీ5 వీసాకు అప్లై చేశారు. అయితే, పాస్‌పోర్టు, సరైన పత్రాలు లేనందువల్ల వీసా రిజెక్ట్ అయ్యింది. ఇలా మూడుసార్లు పౌరసత్వం, వీసా కోసం పలు విధాల్లో ప్రయత్నించి విఫలమయ్యాక బోటులో వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నారు అబ్దుల్లా.

'అక్కా, వచ్చేస్తున్నాం, ఇప్పుడే బయలుదేరాము' అని అబ్దుల్లా తనకు మెసేజ్ చేశారని అప్పట్లో టీమా వెల్లడించారు.

‘‘నేను మా నాన్నకి వాళ్ల రాక గురించి చెప్పాను. అబ్దుల్లా తన కుటుంబంతో వచ్చేస్తున్నారు, వాళ్ల భద్రత కోసం ప్రార్ధించండి అని మా నాన్నతో అన్నాను’’ అని ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత టీమా చెప్పారు. కానీ వారి ప్రార్ధనలు ఫలించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)