నెహ్రూ నుంచి మోదీ వరకు.. భారత్, సిరియాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
సిరియాలోని మూడో అతిపెద్ద పట్టణం హామ్స్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తిరుగుబాటు దళాలు ప్రకటించాయి.
అంతకుముందు దక్షిణ సిరియాలోని డేరా ప్రాంతాన్ని ఈ రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. 2011లో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది ఈ డేరాలోనే.
మరోవైపు, కర్దిష్ ఫైటర్లు కూడా ముందుకు సాగుతున్నారు. వారు సిరియా తూర్పు ఎడారిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, సిరియాలో నెలకొన్ని తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత విదేశీ వ్యవహారాల శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
తాజా పరిస్థితులపై అమెరికా, రష్యా, తుర్కియే, జోర్డాన్‌లతో సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సిరియాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ఆయా దేశాలు చెప్పాయి.


ఫొటో సోర్స్, Getty Images
సిరియా ప్రభుత్వ బలగాలతో హింసాత్మక ఘర్షణల తరువాత స్థానిక తిరుగుబాటు గ్రూపులు పలు ఆర్మీ స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని బ్రిటన్‌లోని సిరియన్ అబ్జర్వేటరీ తెలిపింది.
ఆ సంస్థ ప్రకారం.. డేరా ప్రాంతానికి దక్షిణంగా దాదాపు 90 శాతం ప్రాంతాన్ని రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడి సనామ్యన్ ప్రాంతం మాత్రమే ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉంది. సైన్యం డేరా నుంచి వెళ్లిపోవాలని, ఆర్మీ డమాస్కస్ చేరడం కోసం సురక్షిత మార్గం ఇవ్వడానికి రెబల్స్, సైన్యం మధ్య ఒక ఒప్పందం కుదిరిందని వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది.
ఈ నివేదికలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
గతవారం సిరియాలో ఇస్లామిక్ రెబల్స్ దాడులకు దిగారు. అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలెప్పోకు దక్షిణంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న హమాను కూడా అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ దాదాపు పది లక్షల మంది నివసిస్తున్నారు. ఇపుడు సిరియాలో మూడో అతిపెద్ద నగరమైన హామ్స్‌ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని రెబల్స్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, @DrSJaishankar
భారత పౌరులకు అడ్వైజరీ జారీ
సిరియాలోని పరిస్థితుల దృష్ట్యా భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం అర్ధరాత్రి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.
సిరియాలో నివసిస్తున్న భారత పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అంతేకాకుండా భారత పౌరులు సిరియాకు వెళ్లడంపై నిషేధం విధించారు.
సిరియాలో నివసిస్తున్న భారతీయులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది.
అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ (+963 993385973)ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. [email protected] మెయిల్ ఐడీకి ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించింది.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సిరియాలో దాదాపు 90 మంది వరకు భారతీయ పౌరులు ఉన్నారని, వారు అక్కడ కొన్ని ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఉత్తర సిరియాలో ఘర్షణలు పెరిగాయని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, PEDRO UGARTE/AFP via Getty Images
సిరియాతో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయి?
భారత్, సిరియాల మధ్య చాలాకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాలు కొన్ని ప్రాజెక్టులలో కలిసి పనిచేస్తున్నాయి. 2022లో సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్ మక్దాద్ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
"సిరియాలో పవర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి భారత్ రూ.2,370 కోట్లు ఆర్థిక సహాయం చేయనుంది" అని తెలిపింది.
స్వాతంత్య్రానంతరం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అలీన ఉద్యమ పరిధిని దాటి అరబ్ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. నెహ్రూ 1957,1960లలో సిరియా పర్యటనకు వెళ్లారు.
నెహ్రూ పర్యటన గురించి స్థానిక పత్రికలు చాలా కథనాలు రాశాయని ఇజ్రాయెల్‌లోని బార్ ఇలాన్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రామి గినాట్ తన పరిశోధనా పత్రాలలో తెలిపారు.
"ప్రజలలో చాలా ఉత్సాహంగా తరలివచ్చారు. నెహ్రూకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో 10 వేల మందికి పైగా జనం నిలబడి ఉన్నారు. నెహ్రూను చూడగానే వారంతా ఒక స్వరంలో - ‘ప్రపంచ శాంతి వీరుడికి స్వాగతం’ అంటూ నినదించారు. ‘ఆసియా నాయకుడు చిరకాలం జీవించాలి’ అంటూ నినాదాలు చేశారు’’ అంటూ ఆ పత్రాలలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి హయాంలో ఎలా ఉండేది?
1978, 1983లలో అప్పటి సిరియా అధ్యక్షుడు హఫీజ్ అల్ అస్సాద్ భారత్‌లో పర్యటించారు. 2003లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిరియాలో పర్యటించారు.
వాజ్‌పేయి సిరియా పర్యటన సందర్భంగా అప్పటి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి నవతేజ్ సర్నా సిరియా టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అరబ్ ప్రపంచంతో ముఖ్యంగా సిరియాతో భారత్‌కు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వాజ్‌పేయి పర్యటన భారత్‌కు సిరియా ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని అన్నారు.
తర్వాత 2008లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ భారత్‌లో పర్యటించారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందాల రాకపోకలు కొనసాగాయి.
2010లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సిరియాలో పర్యటించారు. అస్సాద్ కుటుంబంతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగిస్తుందని చెప్పారు. బషర్ అల్-అస్సాద్ తండ్రి హఫీజ్ అల్-అస్సాద్ 1971 నుంచి 2000 వరకు సిరియాలో అధికారంలో ఉన్నారు. 2000 నుంచి అధికారం బషర్ అల్-అస్సాద్ చేతుల్లోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
జెనీవా సమావేశంలో భారత్ ఏమన్నది?
2011లో ప్రారంభమైన అరబ్ స్ప్రింగ్ (ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు) తర్వాత బషర్ అల్-అస్సాద్‌కు కష్టాలు పెరిగాయి. రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి వచ్చింది. దీనికి అమెరికా మద్దతిచ్చినా అది సాధ్యపడలేదు. ఆ సమయంలో సైనిక బలగాలను ఉపయోగించకుండా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. సిరియాలోని అన్ని పార్టీలను కలుపుకొని చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని తెలిపింది. ఈ సమయంలో డమాస్కస్‌లో భారత రాయబార కార్యాలయం సేవలు కూడా నడిచాయి.
2013లో సిరియాలో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి జెనీవా-II సమావేశం జరిగింది. ఈ సదస్సుకు అప్పటి భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరయ్యారు.
జెనీవాలో ఖుర్షీద్ మాట్లాడుతూ.. " సిరియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా భారత ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయి. మాకు పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాలతో మంచి సంబంధాలున్నాయి. సిరియాలో ఘర్షణలు భారత ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ గట్టిగా మద్దతు ఇస్తుంది'' అని అన్నారు.
2022లో సిరియా విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'డమాస్కస్ నుంచి దిల్లీకి చేరుకోవడానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సిరియాకు ఏదైతే ప్రమాదకరమో, భారత్‌కు అదే ప్రమాదకరం. భారత్, సిరియాలు రెండు లౌకిక దేశాలు. మేం ప్రజాస్వామ్య సూత్రాలను నమ్ముతాం'' అని అన్నారు.
సిరియా ముస్లిం మెజారిటీ దేశం కావచ్చు, కానీ దాని రాజ్యాంగంలో అధికారిక మతం ప్రస్తావన లేదు. సిరియా ఒక రిపబ్లిక్, రాజ్యాంగపరంగా లౌకిక దేశం.

ఫొటో సోర్స్, Getty Images
తాజా పరిస్థితిపై ఆందోళన
సిరియా తాజా పరిస్థితిపై తుర్కియే, ఇరాన్, రష్యా విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు సహాయం చేయడానికి సైనిక సలహాదారులతో పాటు క్షిపణులు, డ్రోన్‌లను పంపుతామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తిరుగుబాటుదారులపై నిఘా ఉంచుతామని తుర్కియే అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్దొవాన్ ప్రకటించారు.
సిరియాలో మారుతున్న పరిస్థితులపై అమెరికా ఓ కన్నేసి ఉంచుతోందని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కరీన్ జాన్ పియర్ శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
పాశ్చాత్య దేశాలు తిరుగుబాటుదారులకు సహాయం చేస్తున్నాయని బషర్ అల్-అస్సాద్ ఆరోపించారు. ఈ వారంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులకు అమెరికాతో పాటు ఇతర పశ్చిమ దేశాలే కారణమని ఆరోపించారు. తిరుగుబాటుదారులను 'ఉగ్రవాదులు'గా ప్రకటించారు బషర్ అల్-అస్సాద్. అంతేకాదు వారిని అంతం చేస్తామని కూడా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














