‘మహిళల ఆరోగ్య సమస్యలపై తప్పుడు సమాచారం ఇస్తూ డబ్బు చేసుకుంటున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాక్వి వేక్‌ఫీల్డ్
- హోదా, బీబీసీ 100 విమెన్ అండ్ గ్లోబల్ మిస్‌ఇన్ఫర్మేషన్ యూనిట్
సోఫీ గత పన్నెండేళ్లుగా పీరియడ్స్ నొప్పి, అధిక బరువు, డిప్రెషన్, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో బాధపడుతున్నట్లు నిర్ధరణ అయింది.
ఇది ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి వచ్చే సమస్య. కానీ, వైద్యం ఆమెకు సాంత్వన చేకూర్చలేకపోయింది. అదే సమయంలో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కోర్ట్నీసిమ్మాంగ్ పరిచయం అయ్యారు. పీసీఓఎస్ సమస్యకు మూల కారణాన్ని పరిశోధకులు ఇప్పటికీ గుర్తించనప్పటికీ, దానికి చికిత్స చేస్తానని కోర్ట్నీ హామీ ఇచ్చారు.
కస్టమర్ ల్యాబ్ పరీక్షలు, 'హెల్త్ ప్రోటోకాల్' (డైట్, సప్లిమెంట్ ప్లాన్), కోచింగ్ పేరిట కోర్ట్నీ రూ.3 లక్షలు ఫీజుగా తీసుకున్నారు. కోర్ట్నీ సూచనల మేరకు పలు వెబ్‌సైట్స్‌లో ప్రోడక్టులను కొనుగోలు చేయడానికి సోఫీకి మరికొన్ని వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది.
రోగులకు టెస్ట్‌లు చేయడానికి కోర్ట్నీకి అర్హత లేదని స్త్రీ వ్యాధుల నిపుణులు, మహిళా ఆరోగ్య అధ్యాపకులు డాక్టర్ జెన్ గుంటర్ చెప్పారు.
అంతేకాదు, క్లినికల్‌గా వాటిని తక్కువగా ఉపయోగించారని జెన్ అన్నారు.
ఏడాది పాటు ఆ ప్రోడక్టులను వాడినా ఉపయోగం లేకపోవడంతో కోర్ట్నీ కోర్సును సోఫీ ఆపేశారు.
"నా శరీరానికి ఆహారం పడకపోవడంతో ప్రోగ్రామ్‌ను విడిచిపెట్టాను. నా పీసీఓఎస్ మెరుగుపడదని భావించాను" అని సోఫీ చెప్పారు.
దీనిపై కోర్ట్నీని సంప్రదించినా ఆమె స్పందించలేదు.
లక్షలాది ఫాలోవర్లున్న కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వైద్యపరంగా అర్హత లేకపోయినా కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. పీసీఓఎస్ కోసం సులువైన వైద్య చికిత్స లేకపోవడాన్ని అనువుగా మలుచుకుంటున్నారు. తమను తాము నిపుణులుగా ప్రచారం చేసుకుంటూ నకిలీ నివారణ చికిత్సలను విక్రయిస్తున్నారు.
కొందరు తమను తాము పోషకాహార నిపుణులు లేదా 'హార్మోన్ కోచ్‌లు'గా చెప్పుకొంటారు. ఆన్‌లైన్‌లో కొన్ని వారాలు కోర్సులు చేసి ఇలాంటి ట్యాగులు సంపాదించుకుంటున్నారు.


బీబీసీ పరిశోధనతో..
సెప్టెంబర్‌లో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో 'పీసీఓఎస్' హ్యాష్‌ట్యాగ్ ఉండి అత్యధిక వ్యూస్ కలిగిన వీడియోలను బీబీసీ వరల్డ్ సర్వీస్ పరిశోధించింది.
సగం వీడియోలు తప్పుడు సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించాం. ఈ బృందం ఇంగ్లిష్, స్వాహిలి, హిందీ, పోర్చుగీస్‌లో టాప్ 25 వీడియోలను పరిశీలించింది. అనేక ఆంగ్ల వీడియోలు భారత్, నైజీరియా, కెన్యా బ్రెజిల్‌లోనూ ప్రాచుర్యం పొందాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది మహిళలు పీసీఓఎస్‌తో బాధపడుతున్నారు. రోగ నిర్ధరణ జరిగినప్పటికీ చాలామంది మహిళలు సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.
ఇన్‌ఫ్లూయెన్సర్లు షేర్ చేసే కొన్ని తప్పుడు ప్రకటనలు:
- తక్కువ కార్పొహైడ్రేట్, అధిక కీటో ఆహారం వంటివి పీసీఓఎస్‌ను నయం చేయగలవు.
- జనన నియంత్రణ మాత్రలు పీసీఓఎస్‌కు కారణమవుతాయి లేదా పరిస్థితిని మరింత దిగజార్చుతాయి.
- పీసీఓఎస్‌ను డైట్ సప్లిమెంట్స్‌తో నయం చేయవచ్చు.
- మెడిసిన్లు పీసీఓఎస్ లక్షణాలను బయటికి కనిపించనివ్వవు కానీ, దాని 'మూల కారణాన్ని' అవి పరిష్కరించవు.
కానీ.. కఠినమైన క్యాలరీ కంట్రోల్ ఆహారాలు పీసీఓఎస్‌పై ప్రభావం చూపుతాయనడానికి ఎటువంటి రుజువు లేదని, కీటో డైట్ అనేది పీసీఓఎస్ లక్షణాలను మరింత దిగజార్చవచ్చని నిపుణులు అంటున్నారు.
గర్భనిరోధక మాత్రలు పీసీఓఎస్‌కి కారణం కాదని చెప్పారు. పీసీఓఎస్‌కు ఒక్క కారణం కూడా లేదన్నది నిపుణుల మాట.
అయితే, టిక్‌టాక్ తప్పుడు లేదా హానికరమైన కంటెంట్‌ను అనుమతించదని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు అన్నారు.
మహిళల ఆరోగ్యం గురించిన సమాచారం ఎలాంటి పరిమితి లేకుండా అనుమతిస్తామని మెటా ప్రతినిధి ఒకరు తెలిపారు. తప్పుడు ఆరోగ్య సమాచారాన్ని తొలగించడానికి థర్డ్ పార్టీ కంపెనీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పీసీఓఎస్?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పీసీఓఎస్ అనేది 8-13 శాతం మంది మహిళలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక హార్మోన్ల కండీషన్.
యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం పీసీఓఎస్ లక్షణాలు ఇలా ఉన్నాయి: బాధాకరమైన, క్రమరహిత పీరియడ్స్, అధిక జుట్టు, బరువు పెరుగుట.
వంధ్యత్వానికి ప్రధాన కారణాలలో పీసీఓఎస్ కూడా ఒకటి. అయినప్పటికీ, పీసీఓఎస్ ఉన్న చాలామంది మహిళలు సరైన చికిత్సతో గర్భం దాల్చవచ్చని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య
భారత్, కెన్యా, నైజీరియా, బ్రెజిల్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల నుంచి 14 మంది మహిళలతో బీబీసీ మాట్లాడింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రచారం చేసిన ఉత్పత్తులను ఆ మహిళలు వాడారు.
వారిలో ఒకరు బెంగుళూరుకు చెందిన వైష్ణవి. అన్య శర్మ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌ను వైష్ణవి నమ్మారు. డైట్ ప్లాన్, డీటాక్స్ వంటి 'సహజ' నివారణలను అన్య ప్రోత్సహిస్తుంటారు. బరువు తగ్గే సూచనలు కూడా ఇస్తుంటారు. అన్య చెప్పిన డైట్ ప్లాన్ అనుసరించారు వైష్ణవి. ఆ డైట్ ప్రకారం రోజుకు 1,000 నుంచి 1,200 కేలరీల శక్తినిచ్చే ఆహారం తినేవారు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పీసీఓఎస్ లక్షణాలను తగ్గిస్తాయి. కానీ, కఠిన కేలరీల పరిమితులు రుగ్మతలకు దారితీయవచ్చు. సగటు స్త్రీకి రోజుకు 2,000 కేలరీలు అవసరమని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ సలహా ఇస్తోంది.
కోర్సు అనుసరించాక వైష్ణవికి ఆరు నెలల పాటు పీరియడ్స్ ఆగిపోయాయి, తక్కువ తినడం వల్ల కలిగే దుష్ఫలితమిది. అదేసమయంలో అన్య చెప్పినట్లు త్వరగా బరువు కూడా తగ్గలేదు. ఇది ఆమెను కుంగదీసింది.
పీసీఓఎస్ లక్షణాలను మెరుగుపరచవచ్చు లేదా తగ్గించవచ్చు కానీ, నివారణ ఉందని చెప్పలేదని అన్య శర్మ వాదిస్తున్నారు. తన కస్టమర్లకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నట్లు ఆమె చెప్పారు. బెంగళూరుకు చెందిన మనీషా (27) కూడా ఇలాగే మోసపోయారు.
చనిపోవాలనుకున్నా: మనీషా
సోఫీ మాదిరి మనీషా కూడా శరీరంపై వెంట్రుకలు, బరువు పెరగడం, పీరియడ్స్ నొప్పి, వంధ్యత్వానికి సంబంధించిన ఆందోళనలపై వైద్యుల నుంచి సరైన సహాయం అందలేదన్న కారణంతో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఆశ్రయించారు.
"నాకు తెలిసిన కొంతమందికి పీసీఓఎస్ ఉందని, వారు గర్భం దాల్చలేరని వివాహాలు రద్దు చేసుకున్నారు" అని మనీషా అంటున్నారు.
"నేను పీసీఓఎస్ నివారణ కోరుకున్నాను" అని ఆమె చెప్పారు.
ఆమె చాలా ఎక్కువగా ఉపవాసం, కీటో డైట్ వంటి వివిధ ఫ్యాడ్ డైట్‌లను ప్రయత్నించారు. శాఖాహారి అయిన మనీషాకు ఇది చాలా కష్టమైంది.
ఆమె "మిరాకిల్ క్యూర్స్" అని చెప్పిన సప్లిమెంట్లను కూడా కొనుగోలు చేశారు. వీటిలో ఒకటి అశ్వగంధ, సంప్రదాయ భారత ఆయుర్వేద సప్లిమెంట్. పాశ్చాత్య ఔషధం తీసుకోవద్దని ఆమెకు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు సలహా ఇచ్చారు. అది కేవలం పీసీఓఎస్ లక్షణాలు కనిపించకుండా చేస్తుందని చెప్పారు.
కానీ డైట్స్, 'నివారణ పద్దతులు ఆమె నొప్పి, ఇతర లక్షణాలను మరింత దిగజార్చాయి.
"ఒకానొక సమయంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఈ పద్దతులు నాకు మాత్రమే పనిచేయకుండా మిగతావారికి ఎలా పని చేస్తున్నాయి?. చాలా నిస్సహాయంగా అనిపించింది" అని మనీషా అన్నారు.
ఆ తర్వాత మనీషా డాక్టర్‌ను సంప్రదించారు. ఆమెకు టైప్ 2 మధుమేహం ఉన్నట్లు నిర్ధరించారు. పీసీఓఎస్ ఉన్న చాలామంది మహిళలకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే వారికి చక్కెరను ప్రాసెస్ చేయడంలో సమస్య ఉంటుంది, ఇది చాలా ప్రమాదకరం.
మనీషా ఇంతకుముందు మెట్‌ఫార్మిన్ అనే ఔషధాన్ని తీసుకుంటే ఈ ప్రమాదం ఉండకపోయేది. ఈ మెడిసిన్ పీసీఓఎస్ చికిత్సకు, మధుమేహాన్ని నివారించడానికి వినియోగిస్తారు.
మొదట పీసీఓఎస్‌కు చికిత్స కోసం వెళితే తనను వారు అంత సీరియస్‌గా పరిగణించలేదని మనీషా చెప్పారు. గర్భవతి కావాలనుకున్నప్పుడు తిరిగి రావాలని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.
తప్పుడు సమాచారం అనేది రోగులకు వైద్య సహాయం పొందడంలో ఆలస్యం చేస్తుందని, ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు పెరగడానికి దారితీస్తుందని డా. జెన్ తెలిపారు.

పీసీఓఎస్ చుట్టూ ఉన్న అపోహలను తగ్గించడానికి నైజీరియాలోని మెడ్లిన్ అనే వైద్య విద్యార్థి కృషి చేస్తున్నారు. డైట్‌లు, సప్లిమెంట్‌లను ప్రయత్నించి దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళలు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
వైద్యుల చికిత్సలను అనుసరించాలని మెడ్లిన్ సలహా ఇస్తున్నారు.
"మీకు పీసీఓఎస్ ఉన్నట్లు నిర్ధరణ అయితే చాలా అవమానంగా ఉంటుంది. మీరు సోమరితనంగా ఉన్నారని, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం లేదని లేదా మీరు గర్భవతి కాలేరని ప్రజలు అనుకుంటారు" అని మెడ్లిన్ అన్నారు.
"ఎవరూ మిమ్మల్ని డేటింగ్ చేయడానికి లేదా పెళ్లి చేసుకోవడానికి ముందుకురారు" అని ఆమె అన్నారు.
పీసీఓఎస్ బాధితులు గర్భం దాల్చడానికి వైద్య చికిత్స సహాయపడుతుందని, అయితే దానికి కొంత సమయం పడుతుందని యూకే స్వచ్ఛంద సంస్థ పీసీఓఎస్ ఛాలెంజ్‌కి చెందిన సాషా ఒట్టే అన్నారు.
"కొంతమంది మహిళలకు మెరుగైన సంరక్షణ కోసం విశ్వసనీయ ఎండోక్రినాలజిస్ట్ లేదా ప్రసూతి, గైనకాలజీ నిపుణులు అవసరం" అని డాక్టర్ జెన్ చెప్పారు.
వైద్య సహాయం పొందిన మనీషా ఇపుడు మెట్‌ఫార్మిన్ తీసుకుంటున్నారు, ఇది ఆమె లక్షణాలను మెరుగుపరిచింది. ఆమె టైప్ 2 డయాబెటిస్‌తో ఉపశమనం పొందాలని భావిస్తున్నారు. వైష్ణవి రోజువారి వ్యాయామం చేస్తున్నారు. సోఫీ బరువు తగ్గడానికి డైటీషియన్ సలహాలు తీసుకుంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














