కొన్ని జంటలు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏంటి?

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

"పిల్లలు పెద్దయి మనల్ని చూస్తారనే ఉద్దేశంతో జీవితంలో విలువైన 18-20 సంవత్సరాలు వాళ్లను పెంచడానికి వెచ్చించడంలో అర్థం లేదు" అని జెరోధ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ డబ్ల్యుటిఎఫ్ పాడ్‌కాస్ట్‌లో అన్నారు.

తీరా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లలు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అంటూ ఆయన ఒక ప్రశ్న వేశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

మానవ సంబంధాలు, పిల్లలను కనడంపై ఈ పాడ్ కాస్ట్ లో నిఖిల్ కామత్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆధునిక యుగంలో చాలా మంది ఆలోచనలు ఇలాగే ఉన్నాయా? ముఖ్యంగా మెట్రో నగరాల్లో, ఈ మధ్య కొంత మంది భార్యా భర్తలిద్దరూ కెరీర్ కోసం పిల్లలు వద్దనుకుంటున్నారా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సర్గమ్ కౌశల్

ఫొటో సోర్స్, Sargam Kaushal

ఫొటో క్యాప్షన్, సర్గమ్ కౌశల్ (మధ్యలో) మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు

ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం

కెరీర్‌తో పాటు ఆర్ధిక స్వాతంత్య్రం ముఖ్యం అంటున్న సర్గమ్ కౌశల్, ఆదిత్య శర్మ దంపతులు బీబీసీ న్యూస్ తెలుగుతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

"పెళ్లి అంటే, కలిసి నక్షత్రాలు లెక్కపెడదాం, లేదా రొమాంటిక్ పాటలు పాడుకుందాం" అని ఊహల్లో విహరించడం కంటే కూడా, పెళ్లితో దగ్గరవ్వబోతున్న వాళ్లు తమ జీవిత లక్ష్యం ఏమిటి, పిల్లలు, కుటుంబం లాంటి విషయాలను మాట్లాడుకోవడం అవసరం" అని ముంబయికి చెందిన సర్గమ్ కౌశల్ అన్నారు.

ఈమె ఒక మోడల్, పబ్లిక్ స్పీకర్. తన కెరీర్ కోసం పిల్లలను కనాలనుకోలేదు. ఆమె 2022 డిసెంబరులో మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు.

"జీవితంలో మోయలేని బాధ్యతలను నెత్తిన వేసుకోవాలని లేదు" అంటారు సర్గమ్ కౌశల్.

సర్గమ్ కౌశల్

ఫొటో సోర్స్, Sargam Kaushal

కెరీర్..పెళ్లి... పిల్లలు

సర్గమ్ ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఆదిత్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై ఏడేళ్లు అవుతోంది. ఇద్దరూ ఉమ్మడి కుటుంబాలు, ప్రేమ పూరిత వాతావరణంలో పెరిగిన వారే.

సర్గమ్ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళ నాన్నప్రభుత్వ ఉద్యోగం కారణంగా సుమారు ఒక దశాబ్దానికి పైగా ఇంటికి దూరంగా ఉన్నారు.

"ఇంటి పని, పిల్లల బాధ్యత, అన్నీ అమ్మ పైనే ఉండేవి. దీంతో, అమ్మ తన జీవితాన్ని మా కోసమే వెచ్చించింది. దీనివల్ల ఆమెకు తన వ్యక్తిగత ఇష్టాలు, అభిరుచుల కోసం సమయం లేకపోయింది. ఇది నన్ను చాలా బాధపెట్టిన విషయం. అమ్మ మా కోసం ఇంత త్యాగం చేయాలా? అనిపించింది. నాకొక సోదరుడు కూడా ఉన్నారు. చాలా ప్రేమపూరిత వాతావరణంలో అమ్మ మమ్మల్ని పెంచింది. తన జీవితాన్ని మా చుట్టూ నిర్మించుకుంది".

"పిల్లలంటే ఇష్టం లేక కాదు. కానీ, మొదటి నుంచి కెరీర్‌కు ప్రాధాన్యం ఇచ్చాను. భారతీయ కుటుంబాల్లో పెళ్లి కాగానే ఇంకా పిల్లలు పుట్టలేదా? ఎప్పుడు కంటారు? ఇలాంటి ప్రశ్నలు చాలా సహజం. కానీ, నా విషయంలో మా పుట్టిల్లు, అత్తింట్లోనూ పిల్లల ప్రసక్తి తీసుకు రాలేదు. విచిత్రమేమిటంటే, ఇంట్లో వాళ్ళ కంటే, బయట వాళ్ళు నన్ను ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు. "పెళ్లయి ఏడేళ్లయింది, ఇంకా పిల్లలు పుట్టలేదా"? వయసు పెరిగితే పిల్లల్ని కనడం కష్టం" అంటూ ఉంటారు.

"పిల్లలు పుట్టడాన్ని మా దాంపత్య జీవితానికి ప్రతీకగా చూస్తారా? లయన్ అనే సినిమా కూడా నా పై ప్రభావం చూపించింది. ఈ సినిమాలో భారతదేశంలో ఒక అనాథ బిడ్డను ఒక ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు పెంచుతారు. నేను మోయలేని భారాన్ని నా భుజాలపై పెట్టుకోవాలనుకోలేదు" అని సర్గమ్ అన్నారు.

సర్గమ్ కౌశల్

ఫొటో సోర్స్, Sargam Kaushal

‘పిల్లలను ఎందుకు కనాలి?’

సర్గమ్ భర్త ఆదిత్య ఈ విషయాన్ని సమర్థిస్తూ, "ఆర్ధిక స్వావలంబన లేనిదే పిల్లలను భూమి పైకి తేవడం సరైన విషయం కాదు" అని అన్నారు.

"నేను ఎంపిక చేసుకున్న వినోద రంగంలో ఉంటూ పిల్లలను పెంచడం అంత సులభం కాదు. ఏ రోజు నా షెడ్యూల్ ఎలా ఉంటుందో నాకే తెలియదు. అలాంటప్పుడు ఒక కొత్త ప్రాణాన్ని ఈ భూమి పైకి తేవడం ఎందుకు?" అని సర్గమ్ ప్రశ్నించారు.

"పిల్లలు లేకపోతే మీ జీవితానికి సార్ధకత లేదు లాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ, మా కెరీర్ ని బ్యాలన్స్ చేసుకుంటూ మేమిద్దరం ఎలా ఆనందంగా ఉండగలమో మేము ఆలోచించుకుంటున్నాం. మా కోసం మేం సమయం ఎలా కేటాయించుకోవాలో చూసుకుంటున్నాం" అన్నారు.

"మా ఖాళీని భర్తీ చేసే బాధ్యతను ఒక బిడ్డపై పెట్టాలనుకోవడం ఒక పెద్ద బాధ్యతను ఆ పిల్లలపై పెట్టడమే అవుతుంది. మన సంతోషం మరొకరి పై ఆధారపడి ఉండటం సరైంది కాదని నా అభిప్రాయం" అని అన్నారు.

"37 ఏళ్ళు వచ్చేశాయి. పిల్లల్ని కనడం కష్టమవుతుంది, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తాయి. అయితే, నేనొక ప్రశ్న వేస్తాను."

"నేను పిల్లల్ని ఎందుకు కనాలనే విషయంలో, వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకోవడానికి, లేదా మా సంతోషం కోసం కాకుండా మరేదైనా కారణం చెప్పమని అడిగినప్పుడు, ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు".

"పిల్లలను కంటే, వాళ్ళంతట వాళ్ళే పెరుగుతారు లాంటి మాటలు కూడా చెబుతారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. నేను పిల్లల్ని కని ఆ బాధ్యతను మా అమ్మా నాన్నలు, లేదా మా అత్తా మామల మీదో పెట్టలేను".

"పిల్లల్ని పెంచడం ఒక రోజుతో పూర్తయ్యే బాధ్యత కాదు. ఇది జీవితాంతం మోయాల్సిన బాధ్యత. 18 ఏళ్ళు వచ్చాక నీ జీవితం నువ్వు చూసుకో అంటూ వదిలేయలేం. ఈ బాధ్యతను మోసేందుకు నేను సిద్ధంగా లేను" అన్నారు.

ఆదిత్య కూడా తన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ, తాను ముగ్గురు అక్కలున్న కుటుంబం నుంచి వచ్చానని చెబుతూ. తమ ఇంట్లో కెరీర్ కి ప్రాధాన్యం ఇచ్చారని, కెరీర్ తర్వాతే పెళ్లి, పిల్లలని అన్నారు. తన ఇంట్లో కూడా పిల్లలను కనమని ఎటువంటి ఒత్తిడి తీసుకురారని చెప్పారు. పిల్లలు కావాలా వద్దా అనేది భార్యా భర్తలు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయం కానీ, ఇతరులు కాదని ఆదిత్య అంటారు.

పిల్లలను పెంచేందుకు అవసరమైన ఆర్ధిక స్వతంత్రం రానంత వరకు పిల్లలను కనాలని అనుకోలేదని, ప్రస్తుతానికి పిల్లలను కనే ఆలోచన లేదని అన్నారు.

"అప్పుడప్పుడూ వేరే వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు ఒక్క క్షణం మనకి కూడా పిల్లలుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ, అది క్షణకాలం మాత్రమే. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం" అని అన్నారు.

"సాధారణంగా పిల్లల బాధ్యత తల్లిదే అంటారు. ఒక వేళ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతే ఆ నింద అంతా తల్లిపైనే పడుతుంది. మేమిద్దరం, మాకొక కుక్క పిల్ల...చాలు..జీవితం ఇలా హాయిగా ఉంది" అని సర్గమ్ ముగించారు.

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలు వద్దనుకునేవారి సంఖ్య పెరుగుతోంది

కెరీర్‌లో ఉన్నతి సాధించి, సరదాగా జీవితం గడపాలంటే పిల్లలు లేకుండా ఉంటే బాగుంటుందని 50 ఏళ్ళు లోపు ఉన్నవారిలో నిర్వహించిన ఒక అధ్యయనంలో 61 శాతం మంది అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ అధ్యయనాన్ని ఫ్లేమ్ యూనివర్సిటీ, పుణె లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసిన డాక్టర్ మైత్రేయి దాస్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వ్యాసం ‘ది సెంటినెల్ ’పత్రికలో ప్రచురించారు. అమెరికాలో 57 శాతం మంది పిల్లలు వద్దనుకుంటున్నట్లు మరో అధ్యయనంలో తెలిసినట్లు ఇదే వ్యాసంలో పేర్కొన్నారు.

పిల్లలు వద్దనుకుంటున్న 50 ఏళ్ళు లోపు జంటలు 2018లో 37 శాతం ఉంటే అది 2023 నాటికి 47 శాతానికి పెరిగినట్లు ప్యూ రీసర్చ్ సెంటర్ అధ్యయనం చెబుతోంది.

"భారతదేశంలో 2024 నాటికి మహిళల పునరుత్పత్తి రేటు 2.03 ఉంది" అని లాన్సెట్ నివేదిక పేర్కొంది. వీటిని దృష్టిలో పెట్టుకునే ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనమని పిలుపునిచ్చారు.

‘సామాజిక ఒత్తిడి ఉంటుంది’

పిల్లలను వివిధ కారణాలతో వద్దనుకోవడం ఎప్పటి నుంచో ఉందంటారు మెల్‌బోర్న్‌లో అడల్ట్ సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ మిరియాల.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలంటే తల్లి తండ్రులిద్దరూ సంపాదించాల్సి వస్తోంది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే, మెటర్నిటీ సెలవులు, పిల్లల పెంపకం కెరీర్ కి ఆటంకంగా మారుతుందేమో అనే భయం బాగా ఎక్కువగా ఉందన్నారు శ్రీకాంత్ మిరియాల

జనాభా, నిత్యావసర ఖర్చులు పెరిగిపోతున్న రోజుల్లో సొంత పిల్లలే ఎందుకుండాలి, ఎవరినైనా పెంచుకోవచ్చు కదా అనే భావాలతో కూడా కొందరు పిల్లల్ని కనాలని అనుకోవడం లేదు. బిడ్డ మొదటి సంవత్సరం తల్లికి దగ్గరగా గడపడం బిడ్డ మానసిక ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది. ఇంత సమయాన్ని వెచ్చించలేమనే భయం కూడా చాలా మంది మహిళల్లో వెంటాడుతోంది" అని అన్నారు.

కొంత మంది బాల్యంలో అనుభవించిన పరిస్థితులు కూడా పిల్లలు కావాలో వద్దో అనే నిర్ణయం పై ప్రభావం చూపుతుందంటారు శ్రీకాంత్.

తన దగ్గరకు వచ్చే కొంత మంది క్లయింట్ల గురించి చెబుతూ, స్కిజోఫ్రెనియా , నరాల సమస్యలు లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కొంత మంది పిల్లలకు జన్యుపరమైన సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో కూడా పిల్లలు వద్దనుకుంటున్నట్లు చెప్పారు.

న్యూక్లియర్ కుటుంబాలు ఎక్కువవడంతో పాటు, కుటుంబ సహకారం లేకపోవడం కూడా పిల్లలు వద్దనుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పిల్లలకు బదులు పెంపుడు జంతువులను పెంచుకుందాం అనే ధోరణి కూడా ఎక్కువయింది" అని శ్రీకాంత్ అన్నారు.

పిల్లలు వద్దనుకోవడం వల్ల దంపతులు తమ కోసం కొంత సమయం కేటాయించుకోవచ్చు, లేదా బాధ్యతలు లేకుండా చేసుకోవచ్చు కానీ, సామాజికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నల వల్ల సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా అనే ఆలోచనలు వచ్చి ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులకు దారి తీయవచ్చు. ఒక్కొక్కసారి తీవ్రమైన వెలితి భార్యా భర్తలు విడిపోయే పరిస్థితికి కూడా దారి తీయవచ్చంటారు శ్రీకాంత్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)