ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ చిన్నారులు ప్రాణ స్నేహితులు ఎలా అయ్యారంటే..

లాసీ, బెట్సీ
ఫొటో క్యాప్షన్, బెస్ట్ ఫ్రెండ్స్ అయిన లాసీ (ఎడమ), బెట్సీ (కుడి)లు ఒకే స్కూల్లో చదువుకుంటారు. కానీ, అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా నిర్ధరణ అయిన తర్వాతే ఒకరినొకరు కలుసుకున్నారు
    • రచయిత, నికోలా బ్రియాన్
    • హోదా, బీబీసీ న్యూస్

బెట్సీ, లాసీలది అత్యంత ప్రత్యేకమైన స్నేహం.

బెట్సీ వయసు ఏడేళ్లు. లాసీ వయసు అయిదేళ్లు.

వీళ్లిద్దరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉన్నప్పటికీ, ఒకే స్కూలుకు వెళ్తున్నప్పటికీ 2023 ఏప్రిల్ వరకు వీరిద్దరికి ఒకరికొకరు తెలియదు.

మూడు వారాల వ్యవధిలో వీరిద్దరికీ అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా (ఏఎల్‌ఎల్) నిర్ధరణ అయింది.

అప్పటి నుంచి ఈ ఇద్దరు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఒకే కుటుంబంలా మారిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కీమోథెరపీ, జుట్టు ఊడిపోవడం వంటి కఠిన సమయాల్లో ఈ పిల్లలిద్దరూ ఒకరికొకరు అండగా నిలిచారు. ఒంటరిగా ఉండాల్సి వచ్చిన సమయంలోనూ ఒకరికోసం మరొకరు నిలబడ్డారు.

‘‘మనం ఆసుపత్రిలో చేరినప్పుడు ఎల్లప్పుడూ మనతో పాటే ఉండే ఒక ఫ్రెండ్ ఉండటం చాలా బాగుంది’’ అని బెట్సీ అన్నారు.

‘‘ఆమె నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. తను నా బెస్ట్ ఫ్రెండ్’’ అని లాసీ చెప్పారు.

లాసీ, బెట్సీ

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, ఇద్దరూ కలిసి ఆడుకుంటారు

బ్రిటన్‌లోని కార్డిఫ్‌లో ఉన్న నోవాస్ ఆర్క్ చిల్ట్రన్ హాస్పిటల్‌లో బెట్సీ, లాసీ కుటుంబాలు తొలిసారి కలుసుకున్నాయి. ఈ పరిచయం లేకుండా గత 18 నెలల కాలాన్ని ఎదుర్కోవడాన్ని కనీసం ఊహించుకోలేకపోతున్నామని వారిద్దరి తల్లులు చెప్పారు.

‘‘మనలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటూ, మన బాధను అర్థం చేసుకునే ఒక వ్యక్తి దొరకడం చాలా కష్టం’’ అని లాసీ తల్లి జెస్ అన్నారు.

‘‘ఈ స్నేహం మాకు చాలా ముఖ్యం. ఎలాంటి అవధుల్లేకుండా మా ప్రయాణంలో ఈ స్నేహం చాలా సహాయపడింది’’ అని బెట్సీ తల్లి చార్లెట్ చెప్పారు.

లాసీ

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, నాలుగేళ్ల వయసులో లాసీకి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది

2022 అక్టోబర్‌లో లాసీ తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. శరీరం బాగా వేడెక్కడం, జలుబు, చికెన్ పాక్స్ వంటి రకరకాల సమస్యలతో దాదాపు ఆరు నెలల పాటు తరచుగా ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది.

తర్వాతి ఏప్రిల్ నెలలో ఆమె మెడపై ఒక పెద్ద కణితి ఏర్పడింది. పరీక్షలు చేయించగా, ఆ చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోందని తల్లిదండ్రులకు తెలిసింది.

‘‘ఆ క్షణమే మేం కుప్పకూలిపోయాం. ఇదంతా ఒక పీడకల అని చెబుతాడేమో అని నా భర్త వైపు దీనంగా చూశాను’’ అని జెస్ గుర్తు చేసుకున్నారు.

తమకు సమీపంలోనే నివసించే చార్లెట్ కూడా గత మూడు వారాలుగా ఇలాంటి వ్యథనే అనుభవిస్తున్నారనే సంగతి అప్పుడు జెస్‌కు తెలియదు. తన కూతురికి ప్రాణాంతక జబ్బు ఉన్నట్లు మూడు వారాల ముందు చార్లెట్‌కు తెలిసింది.

బెట్సీ

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, అయిదేళ్లున్నప్పుడు బెట్సీకి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధరణ అయ్యింది

నెలల తరబడి కడుపు నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత బెట్సీకి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధరణ జరిగింది.

రక్త పరీక్షల తర్వాత ఆమెకున్న జబ్బు బయటపడింది.

‘‘అదొక పెద్ద షాక్. మా జీవితాలు తలకిందులయ్యాయి’’ అని చార్లెట్ వివరించారు.

బెట్సీకి కీమోథెరపీ మొదలైన కొన్ని వారాల తర్వాత చార్లెట్‌కు ఒక ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఈ సందేశమే ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహానికి పునాది వేసింది.

‘‘నా మరో స్నేహితురాలి కూతురికి కూడా నీ కూతురి తరహాలోనే క్యాన్సర్ నిర్ధరణ అయింది. వాళ్లు కూడా మీకు సమీపంలోనే ఉంటారు. పిల్లలిద్దరూ ఒకే స్కూలులో చదువుకుంటారు. ఒకసారి తనకు మెసేజ్ చేయండి’’ అని ఆ సందేశంలో తన స్నేహితురాలు సూచించినట్టు చార్లెట్ తెలిపారు.

చార్లెట్, జెస్

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, 18 నెలల కిందట తొలిసారిగా కలుసుకున్నప్పటి నుంచి చార్లెట్ (ఎడమ), జెస్ (కుడి) మంచి స్నేహితులుగా మారారు

అది చదవగానే తను షాక్‌కు గురైనట్లు ఆమె చెప్పారు.

వెంటనే జెస్‌కు మెసేజ్ చేయాలని చార్లెట్ నిర్ణయించుకున్నారు.

చార్లెట్ తనకు మెసేజ్ చేసినందుకు చాలా సంతోషించానని జెస్ అన్నారు.

‘‘చికిత్స ఎలా జరుగుతుందో? ఎలాంటి మార్పులు వస్తాయో ముందుగానే చార్లెట్ చెప్పడం వల్ల నేను మానసికంగా సిద్ధమయ్యా’’ అని జెస్ చెప్పారు.

పిల్లలిద్దరూ కూడా తొలిసారి ఆసుపత్రిలోనే కలుసుకున్నారు.

‘‘తొలి పరిచయంలో పిల్లలిద్దరూ స్నేహితులయ్యారు. జీవితాంతం ప్రాణ స్నేహితులుగా ఉంటామన్నట్లుగా వారు ప్రవర్తించారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. మాట్లాడుకున్నారు. ఆడుకున్నారు. అక్కడి నుంచే వారి ప్రయాణం మొదలైంది’’ అని జెస్ వివరించారు.

లాసీ, బెట్సీ

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, చికిత్స సమయంలో లాసీ, బెట్సీ ఒకరికొకరు మద్దతుగా నిలిచేవారు

ఆ తర్వాతి నుంచి వారిద్దరికి కఠిన చికిత్స జరిగింది.

కీమోథెరపీకి బెట్సీ శరీరం సరిగ్గానే స్పందించింది.

అయితే, లాసీకి చికిత్స మొదలుపెట్టిన తొలి ఆరు నెలల్లో ఆమె శరీరం ట్రీట్‌మెంట్‌కు స్పందించడం లేదని తల్లిదండ్రులకు వైద్యులు చెప్పేవారు.

‘‘కీమోథెరపీ మేం భావించినంతంగా లాసీ శరీరంపై పని చేయడం లేదని వైద్యులు చెప్పినప్పుడల్లా గుండె పగిలిపోయేది’’ అని జెస్ తెలిపారు.

‘‘నాకు చాలా బాధగా ఉండేది. ఎందుకంటే బెట్సీ చికిత్స సవ్యంగా సాగుతోంది. మేం కోరుకున్నట్లుగా అంతా జరుగుతోంది. అదే సమయంలో లాసీ, జెస్‌లు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. నాకు ఆమె అండగా నిలిచినట్లు, కష్టసమయంలో నేను ఆమెకు మద్దతుగా నిలవాలని అనుకున్నా’’ అని చార్లెట్ చెప్పారు.

లాసీ, బెట్సీ

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, కీమోథెరపీ సమయంలో పిల్లలిద్దరూ జుట్టు కోల్పోయారు

లాసీకి ఖరీదైన మందు అవసరమైంది. ‘బ్లినా’గా పిలిచే ఈ మందు ఒక టార్గెటెడ్ ఇమ్యునోథెరపీ డ్రగ్. విరాళాలతో ఈ మందును కొనగలిగారు.

ఈ మందు ఉండే ఒక సంచిని నాలుగు వారాల పాటు 24 గంటలు లాసీ ధరించాల్సి వచ్చింది. చేతికి అమర్చిన ఒక పైప్ ద్వారా ఈ సంచిలోని మందు ఆమె రక్తంలోకి చేరుతుంది.

‘దేవుని దయవల్ల ఆ మందు లాసీకి పనిచేసింది’’ అని జెస్ చెప్పారు.

లాసీ, బెట్సీ

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, ఇమ్యునోథెరపీ డ్రగ్ ఉండే సంచిని నాలుగు వారాల పాటు లాసీ ధరించాల్సి వచ్చింది

ఈ పిల్లలిద్దరికీ ఇప్పుడు చివరి దశ చికిత్స జరుగుతోంది. వచ్చే ఏడాదికి ఈ చికిత్స కూడా పూర్తవుతుంది.

వారు తరచుగా మందులు వేసుకోవడంతో పాటు, ఆసుపత్రికి వెళ్లాలి.

అయినప్పటికీ వారు తిరిగి పాఠశాలకు వెళ్తున్నారు.

పీడియాడ్రిక్ ఆంకాలజీ అవుట్‌రీచ్ నర్స్ స్పెషలిస్ట్ లెస్లీ ప్రతివారం వారిద్దరికి రక్త పరీక్షలు చేస్తారు.

వాళ్ల మధ్య స్నేహ బంధాన్ని ఆమె ప్రత్యక్షంగా చూశారు.

‘‘ఒకరి ఆరోగ్య పరిస్థితి గురించి మరొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. రక్త పరీక్ష చేసే సమయంలోనూ ఒకరికొకరు మద్దతుగా ఉంటారు’’ అని లెస్లీ తెలిపారు.

లాసీ, బెట్సీ
ఫొటో క్యాప్షన్, ప్రతీ గురువారం బాలికలిద్దరికీ రక్త పరీక్షలు చేయాలి
చార్లెట్, జెస్
ఫొటో క్యాప్షన్, చార్లెట్ (ఎడమ), జెస్ (కుడి) పరస్పరం మద్దతుగా నిలిచారు

వాళ్ల తల్లులు కూడా ఇలాగే ఒకరికొకరు అండగా నిలబడతారు.

‘‘మద్దతుగా నిలిచే స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు ఉన్నారు. కానీ, ఏం చెప్పకుండానే నా నవ్వు చూసి నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం నిజంగా ప్రత్యేకం. ఈ స్నేహం నాకు చాలా ముఖ్యం’’ అని చార్లెట్ అన్నారు.

‘‘నువ్వు లేకుండా నేను ఇదంతా చేసి ఉండేదాన్ని కాదు. ఏమీ తోచని స్థితిలో ఉన్న నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు. నా బాధను పంచుకున్నావు. ఇదంతా తల్చుకుంటే ఉద్వేగానికి లోనవుతాను. నువ్వు నా వెన్నంటే నిలిచావు’’ అని చార్లెట్‌కు జెస్ చెప్పాను.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)