ఏఐ టెక్నాలజీకి అణుశక్తికి ఏమిటి సంబంధం? మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ డబ్బులు ఎందుకు పెడుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తియో లెగ్గెట్
- హోదా, బీబీసీ బిజినెస్ ప్రతినిధి
ఒక దశాబ్దం కిందటి వరకూ ప్రపంచ అణుశక్తి పరిశ్రమ కోలుకోలేనంతగా దెబ్బతిన్నట్లు కనిపించింది.
భద్రతా కారణాలు, వ్యయం, రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ వంటి ఆందోళనలు.. ఒకప్పుడు చవకైన, విప్లవాత్మక మార్పుగా కనిపించిన అణుశక్తి ఉత్పత్తిపై ఆసక్తిని నీరుగార్చాయి.
కానీ, ఇటీవలి కాలంలో టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఈ రంగంలో పెట్టుబడులను ప్రకటించడం, కర్బన ఉద్గారాల నియంత్రణకు సంబంధించి డబ్బున్న దేశాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో మరోసారి అణుశక్తిపై చర్చ ఊపందుకుంది.


ఫొటో సోర్స్, Reuters
చెర్నోబిల్, ఫుకుషిమా ఘటనలతో ఆందోళన
1950 - 1960లలో అణుశక్తిని తొలిసారి వాణిజ్యపరంగా అభివృద్ధి చేసినప్పుడు, దాని అపరిమిత శక్తి ప్రపంచ దేశాలను ఊరించింది.
ఒక కిలో బొగ్గుతో పోలిస్తే ఒక కిలో యురేనియం దాదాపు 20,000 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని, ఇక న్యూక్లియర్ ఎనర్జీదే భవిష్యత్తు అనిపించింది.
కానీ, ఈ అణు సాంకేతికత ప్రజలను భయాందోళనకు కూడా గురిచేసింది. 1986 ఆరంభంలో యూరప్ అంతటా రేడియోధార్మిక కాలుష్యానికి కారణమైన చెర్నోబిల్ విపత్తు ఈ భయందోళనకు బలాన్ని చేకూర్చింది.
దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా న్యూక్లియర్ ఎనర్జీని తీవ్రంగా వ్యతిరేకించాయి. అలా అణుశక్తి పరిశ్రమ వృద్ధిరేటు దారుణంగా పడిపోయింది.
2011లో జపాన్‌లోని ఫుకుషిమా ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం భద్రతాపరమైన ఆందోళనలను మరింత పెంచింది. ఈ ఘటన తర్వాత జపాన్ తక్షణమే తన అణుశక్తి ప్లాంట్లు అన్నింటినీ మూసేసింది. ఆ తర్వాత కూడా కేవలం 12 ప్లాంట్లను మాత్రమే పునరుద్ధరించింది.
జర్మనీ అణుశక్తి వినియోగాన్ని దశలవారీగా తగ్గిస్తూ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇతర దేశాలు కొత్త పవర్ ప్లాంట్లపై పెట్టుబడులు పెట్టడంతో పాటు అప్పటికే ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించుకున్నాయి.
ఫలితంగా, 2011 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా 48 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంచనా వేసింది.
కానీ, కొన్నిదేశాలు అణుశక్తి ఉత్పత్తిని ఆపలేదు, ఉదాహరణకు చైనా.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ న్యూక్లియర్ ఎనర్జీ వైపు చూపు?
2011లో చైనాలో 13 అణు రియాక్టర్లు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 55కి చేరింది. మరో 23 రియాక్టర్ల నిర్మాణం జరుగుతోంది. వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు చైనాకు న్యూక్లియర్ ఎనర్జీ చాలా అవసరం.
ఇటీవలి కాలంలో, మళ్లీ ఈ రంగంపై ఆసక్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పారిస్ ఒప్పందం ప్రకారం, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యాలను చేరుకోవడంతో పాటు విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం కోసం అభివృద్ధి చెందిన దేశాలు ఇతర మార్గాలను అన్వేషించడమే దీనికి కారణం.
2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డ్ కానుందనే అంచనాలతో కర్బన ఉద్గారాలు తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతోంది. అలాగే, యుక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రపంచ దేశాలు ఇంధన భద్రతపై దృష్టిసారించడం కూడా మరో కారణం.
ఉదాహరణకు, రానున్న నాలుగు దశాబ్దాల్లో అణువిద్యుత్ కేంద్రాలను దశలవారీగా తొలగించాలని తొలుత భావించిన దక్షిణ కొరియా, దానికి బదులు మరిన్ని కేంద్రాలను నిర్మించేందుకు సిద్ధమైంది.
తనకు అవసరమైన విద్యుత్‌లో 70 శాతం విద్యత్‌ను అణువిద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఫ్రాన్స్ కూడా తొలుత అలానే భావించినప్పటికీ, ఇప్పుడు మరో 8 కొత్త రియాక్టర్లను నిర్మించాలని అనుకుంటోంది.
అలాగే, 2050 నాటికి అణువిద్యుత్ ఉత్పత్తిని మూడురెట్లు పెంచాలని భావిస్తున్నట్లు అమెరికా, ఇటీవల అజర్‌బైజాన్‌లో జరిగిన కాప్ 29 (యునైటెడ్ నేషన్స్ క్లైమేజ్ చేంజ్ కాన్ఫరెన్స్) సదస్సులో పునరుద్ఘాటించింది.
గతేడాది జరిగిన కాప్ 28 సదస్సులోనే అమెరికా ఈ విషయం చెప్పింది. యూకే, ఫ్రాన్స్, జపాన్ సహా మొత్తం 31 దేశాలు 2050 నాటికి అణుశక్తి వినియోగాన్ని మూడు రెట్లు పెంచేందుకు అంగీకరించాయి.
నూతన న్యూక్లియర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయనున్నట్లు కాప్ 29 సదస్సులో అమెరికా, యూకే ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏఐ కోసం అణుశక్తిపై టెక్ దిగ్గజాల ఆసక్తి
అయితే, కాలుష్య కారకం కాని క్లీన్ ఎనర్జీ కోసం కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ)ను ఉపయోగించి మరిన్ని అప్లికేషన్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్న టెక్ దిగ్గజాలు కూడా కోరుకుంటున్నాయి.
ఏఐ ప్రధానంగా డేటాపై ఆధారపడుతుంది, కాబట్టి డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ అవసరం. బార్‌క్లేస్ సంస్థ పరిశోధన ప్రకారం, అమెరికా మొత్తం విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 3.5 శాతం. ఇది రానున్న దశాబ్ద కాలంలో 9 శాతానికిపైగా పెరిగే అవకాశముంది.
గత సెప్టెంబర్‌లో, కన్స్టలేషన్ ఎనర్జీ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన 20 ఏళ్ల ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ సంతకం చేసింది. ఈ ఒప్పందం పెన్సిల్వేనియాలోని త్రీ మైల్ ఐలాండ్ పవర్ స్టేషన్ పున:ప్రారంభానికి దారితీయనుంది. 1979లో అమెరికా చరిత్రలో అత్యంత ఘోరప్రమాదం జరిగిన ప్రదేశమిది. త్రీ మైల్ ఐలాండ్ పవర్ స్టేషన్ రెండో యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే, మొదటి యూనిట్ 2019 వరకూ విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.
ఈ ఒప్పందం ''అణుశక్తి పునర్జన్మకు శక్తివంతమైన చిహ్నం లాంటిది'' అని కాన్స్టెలేషన్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో డొమింగ్యూజ్ అభివర్ణించారు.
గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఇతర విధానాలను అనుసరిస్తున్నాయి. అణుశక్తి ఉత్పత్తిని సులభతరం చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో, సులువుగా ఏర్పాటు చేయగలిగిన కొత్త టెక్నాలజీ 'స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్'(ఎస్ఎంఆర్) ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ కొనుగోళ్లకు గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమెజాన్ కూడా ఎస్ఎంఆర్ సాంకేతికత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది.
ఆధునిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నూతన అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగే, వాటి నిర్మాణం కూడా చాలా కష్టం కావడంతో వాటికి పరిష్కార మార్గంగా ఎస్ఎంఆర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇవి సంప్రదాయ రియాక్టర్ల కంటే చిన్నవిగా ఉంటాయి. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని తక్కువ సమయంలోనే ఏర్పాటు (అసెంబుల్) చేయవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 80 రకాల ఎస్ఎంఆర్ డిజైన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే, ఇంటర్నేషనల్ అటామిక్ న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం, వాణిజ్యపరంగా ఎస్‌ఎంఆర్‌ల సామర్థ్యం ఇంకా నిరూపితం కాలేదు.
అణుశక్తిపై భిన్నాభిప్రాయాలు
వాతావరణ మార్పులకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఈ టెక్నాలజీ అవసరమని దాని మద్దతుదారులు అంటున్నారు. న్యూక్లియర్ టెక్నాలజీలో పెట్టుబడులను ప్రోత్సహించే రాడ్ ఆడమ్స్ కూడా వారిలో ఒకరు.
''సురక్షితమైన విద్యుదుత్పత్తి వనరుల్లో అణుశక్తి ఒకటని ఏడు దశాబ్దాల చరిత్ర తెలిజేస్తోంది. ఇది తక్కువ ఖర్చుతో కూడిన మన్నికైన, నమ్మదగిన వనరు. కాకపోతే వాటి ఏర్పాటుకు పాశ్చాత్య దేశాల్లో భారీగా ఖర్చవుతోంది'' అన్నారాయన.
కానీ, దానిని వ్యతిరేకించే వారు మాత్రం అణువిద్యుత్ ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని వాదిస్తున్నారు.
న్యూక్లియర్ ఎనర్జీని క్లీన్ ఎనర్జీగా (అణుశక్తి కాలుష్య కారకం కాదని) భావించడం మూర్ఖత్వమని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎంవీ రమణ అభిప్రాయపడ్డారు. విద్యుదుత్పత్తికి భారీగా ఖర్చయ్యే విధానాల్లో ఇదొకటని ఆయన అన్నారు.
దానికి బదులుగా కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదల చేసే చౌకైన వనరులపై పెట్టుబడులు పెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదని, కర్బన ఉద్గారాల సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆయన అన్నారు.
అయితే, న్యూక్లియర్ ఎనర్జీపై మళ్లీ ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, ఒక పాత సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. అది రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ. అణువిద్యుత్ ప్లాంట్లు విడుదల చేసే రేడియోధార్మిక వ్యర్థాలను ఏం చేయాలి? అనేదే పెద్ద సమస్య. దీనిపై 70 ఏళ్ల తర్వాత కూడా స్పష్టత లేదు. ఎందుకంటే, రేడియోధార్మిక వ్యర్థాలు వందల, వేల ఏళ్ల వరకూ ప్రమాదకరమే.
దీనికోసం అనేక ప్రభుత్వాలు సమర్థిస్తున్న విధానం భూమిలోపల కప్పేయడం. భూగర్భంలోకి లోతైన సొరంగాలు తవ్వి వ్యర్థాలను పూడ్చేయడం. ఫిన్‌లాండ్ మాత్రమే అలాంటి సొరంగాన్ని తవ్వింది. కానీ, అలా పూడ్చేసి వదిలేయడం, మర్చిపోవడం చాలా ప్రమాదకరమని పర్యావరణవేత్తలు, అణుశక్తిని వ్యతిరేకించే వారు వాదిస్తున్నారు.
ఈ సమస్య పరిష్కారంపైనే న్యూక్లియర్ ఎనర్జీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














