సిరియా అధ్యక్షుడి పతనం రష్యా ప్రతిష్ఠను దెబ్బతీసిందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
- హోదా, బీబీసీ రష్యా ఎడిటర్
- చదివే సమయం: 3 నిమిషాలు
రష్యా సైనిక సహకారంతో బషర్ అల్-అసద్ దాదాపు పదేళ్లపాటు సిరియాలో అధికారంలో ఉన్నారు. రెండు రోజుల కిందటి వరకు ఆయన పాలన కొనసాగింది.
అసద్ పాలన అంతమై ఆయన దేశం నుంచి పారిపోయారు.
అసద్‌కు, ఆయన కుటుంబానికి మానవతా సాయం కింద రష్యా ఆశ్రయం అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని రష్యన్ మీడియా సంస్థలు వెల్లడించాయి.
సిరియాలో పరిణామాలు కొద్దిరోజుల్లోనే మారిపోవడంతో రష్యా ప్రభుత్వం ఈ పరిస్థితులను నివారించలేకపోయింది.
దీంతో సిరియాలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు రష్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

పశ్చిమకు విసిరిన సవాలు అది..
అసద్ పతనం రష్యా ప్రతిష్ఠకు భారీ దెబ్బ.
ఒక గ్లోబల్ పవర్‌గా అవతరించాలని సంకల్పించిన రష్యా, అసద్‌కు మద్దతుగా 2015లో వేలాది సైనికులను పంపింది.
సోవియట్ యూనియన్ వెలుపల పశ్చిమ దేశాల ఆధిపత్యానికి వ్లాదిమిర్ పుతిన్ విసిరిన మొదటి సవాలు ఇది.
పుతిన్ అనుకున్నట్లుగానే ఆయన ప్రయత్నం ఫలించింది. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ, పుతిన్ 2017లో సిరియాలోని రష్యన్ మేయ్‌మిమ్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. మిషన్ పూర్తయిందని ఆయన ప్రకటించారు.
రష్యన్ వైమానిక దాడులతో పౌరుల ప్రాణాలకు నష్టం అధికంగా సంభవిస్తుందనే వార్తలున్నప్పటికీ, సిరియాలోని రష్యన్ మిలిటరీ ఆపరేషన్లను పరిశీలించేందుకు అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించింది రష్యా.
ఆ సందర్శనలో ఒక అధికారి నాతో(స్టీవ్ రోసెన్‌బర్గ్) మాట్లాడుతూ 'రష్యా సిరియాలో దీర్ఘకాలం ఉండబోతోంది' అని అన్నారు.

సిరియాలో రష్యన్ బేస్‌లు
సైనిక సహకారానికి బదులుగా సిరియన్ ప్రభుత్వం మేయ్‌మిమ్‌లోని ఎయిర్ బేస్, టార్‌టూస్‌లోని నావెల్ బేస్‌ను రష్యాకు 49 సంవత్సరాలకు లీజుగా ఇచ్చింది.
దీంతో తూర్పు మధ్యధరాలో రష్యా ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకున్నట్లైంది. ఆఫ్రికాలో, బయట మిలిటరీ సామగ్రి సరఫరాకు ఈ బేస్‌లు కీలకంగా మారాయి.
ఇప్పుడు రష్యా ముందున్న కీలకమైన ప్రశ్న: సిరియాలోని రష్యన్ బేస్‌ల పరిస్థితేంటి?.
మాస్కోకు అసద్ రాక ప్రకటనలోనే రష్యా అధికారులు 'సిరియన్ సాయుధ ప్రతిపక్ష' ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
సిరియాలోని రష్యన్ మిలిటరీ బేస్‌ల భద్రతకు, దౌత్య కార్యకలాపాలకు అక్కడి ప్రతిపక్ష నాయకులు హామీ ఇచ్చారని రష్యా ప్రభుత్వ టీవీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
సిరియాలో ఉన్న రష్యన్ బేస్‌లను అప్రమత్తం చేశామని, ఇప్పటివరకైతే వాటికి తక్షణ ముప్పు లేదని రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, AFP
పోరాడకుండానే వదిలేశారా?
మిడిల్ ఈస్ట్ నాయకుల్లో అసద్ రష్యాకు అత్యంత సన్నిహితులు.
ఆయనతో క్రెమ్లిన్ ఎక్కువగా సఖ్యతతో ఉంది. ఇప్పుడు అసద్ పతనం రష్యాకు ఎదురుదెబ్బే. ఈ విషయాన్ని ఏ రష్యన్ అధికారి దాచలేరు. అయినప్పటికీ కొందరు ఆ నెపాన్ని మిగతావారిపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
రెబెల్స్‌కు వ్యతిరేకంగా సిరియన్ సైన్యం పోరాడనందుకు రష్యా అధికారిక టీవీ ఛానల్ యాంకర్ తప్పు పట్టారు. సిరియాలో పరిస్థితి అక్కడి అధికారులకు ఆందోళనకరంగా మారిందని యాంకర్ ఎవ్‌జెనీ కిసెలెవ్ అన్నారు.
''కానీ అలెప్పోలో పరిస్థితి వేరుగా ఉంది. ఉదాహరణకి పోరాడకుండానే పదవులు వదులుకున్నారు. రెబల్స్ కంటే ప్రభుత్వ బలగాలు అనేక రెట్లు ఉన్నప్పటికీ, బలమైన ప్రాంతాలు ఒకదాని తర్వాత మరొకటి లొంగిపోయాయి. ఇది ఒక మిస్టరీ'' అని చెప్పారు.
సిరియాలోని ఇరు పక్షాల సత్సంబంధాలనే రష్యా కోరుకుంటోందని కిసెలెవ్ అన్నారు.
'సిరియాలో పరిస్థితిపై మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం కానీ, మాకు రష్యా భద్రతే ముఖ్యం. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జోన్‌లో యుక్రెయిన్‌తో యుద్ధమే మా ప్రధాన లక్ష్యం. ఇక్కడ రష్యన్ ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం ఉంది. తొమ్మిది సంవత్సరాల వరకు అసద్‌ను అధికారంలో ఉంచేందుకు కృషి చేసినా, అంతకన్నా ఆందోళన చెందాల్సి విషయాలు వేరే ఉన్నాయి' అని కిసెలెవ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














