21 ఏళ్లకే బట్టతల వచ్చినా కుంగిపోలేదు, అలొపేసియా వ్యాధిపై పోరాడుతున్న ఈమె ఎవరు?

ఫొటో సోర్స్, Olivia McVeigh
అలొపేసియాతో బాధపడుతున్న మహిళలకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉందని ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌కు చెందిన ఒలివియా మెక్‌వీగ్ అన్నారు.
ఈమె 2024 సంవత్సరానికి గానూ బీబీసీ 100 మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఒలివియా మెక్‌వీగ్‌కు 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే జట్టు రాలడం మొదలైంది. దీంతో, సోషల్ మీడియా వేదికలపై ఈ సమస్యపై అవగాహన కల్పిస్తూ, తనలాగే బాధపడుతున్న వారిని కలుసుకుంటున్నారు.
"అప్పట్లో నాకు అలొపేసియా ఉందని ఇతరులకు తెలిస్తే వారు నన్ను వింతగా చూస్తారేమోనని అనుకునేదాన్ని. కానీ, ఇప్పుడు దీని గురించి జనాలకు చెప్పడమే నాకు ఇష్టమైన పనిగా మారింది" అని ఒలివియా చెప్పారు.
"నా జుట్టు రాలిపోవడం గురించి రోజూ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో మాట్లాడుతుంటాను" అని ఆమె తెలిపారు.


ఫొటో సోర్స్, Olivia McVeigh
ఒలివియా మేకప్ ఆర్టిస్ట్‌గా శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం విగ్ పెట్టుకోవడం తన గుర్తింపులో భాగమైపోయిందని ఆమె బీబీసీతో చెప్పారు.
"నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు నా జుట్టు రాలిపోతున్నట్టు గుర్తించాను. బాత్రుమ్‌లో అద్దంలో నా జట్టును చూస్తుంటే అందులో నుంచి నా తల కనిపించేది. కానీ, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు" అని ఆమె చెప్పారు.
అయితే, 21 ఏళ్ల వయసులో బట్టతల రావడంతో, ఆమె విగ్‌ల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.
"అయితే ఈ సమస్యల చాలా మందికి పెద్ద విషయంలా అనిపించదు. కానీ, ఒకసారి మీరు అనుభవిస్తే తెలుస్తుంది మీపై ఎంత ప్రభావం చూపిస్తుందో" అని ఒలివియా అన్నారు.

ఫొటో సోర్స్, Olivia McVeigh
కొత్త స్టైల్స్ గురించి ప్రయత్నించే క్రమంలో భాగంగా ఒలివియా ఇన్‌స్టాగ్రామ్‌లో తన జుట్టు రాలడం గురించి చెప్పడం మొదలుపెట్టారు.
"నేను చాలా చిన్న ప్రాంతం నుంచి వచ్చాను. అందరికి తెలియాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో దీని గురించి మాట్లడటం మొదలుపెట్టాను. నేను విగ్ పెట్టుకుంటానని ఒక వేళ ఇతరులకు చెప్పినా కూడా వారెవరూ నా గురించి మాట్లాడరని అనుకున్నాను. కానీ, వాస్తవానికి ఆ వార్త ఒక బాంబులా పేలింది" అని ఆమె చెప్పారు.
అప్పటి నుంచి ఒలివియా దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, విగ్‌లపై వర్క్‌షాప్స్ నిర్వహించడం మొదలుపెట్టారు.
"సాధారణంగా ఒక వర్క్‌షాప్ లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడ నేను ఒక్కదానినే విగ్ పెట్టుకోవడంతో నేను ఒంటరి అనే భావన కలిగేది" అని ఒలివియా తెలిపారు.
"అయితే, క్రమంగా వర్క్ షాపులు నిర్వహించడం, నాలాంటి సమస్యతో బాధపడుతున్న మహిళలను కలుసుకోవడం, ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోవడంతో నేను దీనిని ప్రేమించడం మొదలుపెట్టాను. నేను ధరించే ఒక్కొక్క విగ్‌కు ఒక్కో పేరు కూడా ఉంది. ఆ విగ్‌లు చూపించడం అంటే నాకెంతో ఇష్టం" అని ఆమె చెప్పారు.
"ఈ సమస్యను ఇప్పటికీ అదేదో ఒక మచ్చగానే చూస్తారు. దీనిపై ఎలా స్పందించాలో ప్రజలకు తెలియదు. అందుకే, దీనిని సాధారణమైనదిగానే చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను" అని అన్నారు.
బీబీసీ 2024 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. అందులో వ్యోమగామి సునీతా విలియమ్స్, అత్యాచార బాధితురాలు, ప్రచారకర్త జీసెల్ పాలికో, నటి షారన్ స్టోన్ తదితరులు ఉన్నారు.
"అద్భుతమైన వ్యక్తుల సరసన ఈ జాబితాలో అలొపేసియాతో బాధపడుతున్న మహిళలు, విగ్ ధరిస్తున్న వారికి నేను ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది" అని ఒలివియా చెప్పారు.
తాను ఈ స్థాయికి చేరుకోవడంపై గర్విస్తున్నట్లు ఆమె చెప్పారు.
అలొపేసియా అంటే ఏమిటి?
అలొపేసియా అనేది స్వయం ప్రతి రక్షక వ్యాధి. కాపాడాల్సిన శరీర రోగనిరోధక వ్యవస్థే జుట్టు పొరలపై దాడి చేస్తుంది. దీంతో, జుట్టు రాలిపోతుంది.
ఈ సమస్య తీవ్రమైనప్పుడు శరీరం అంతటా జట్టు రాలిపోతుంది. కనురెప్పలు, ముక్కు వెంట్రుకలు, చర్మంపై ఉన్న వెంట్రుకలు ఇలా అన్ని రాలిపోతాయి.
ఈ వ్యాధి బాధితులకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
అలొపేసియా వల్ల ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు.
ఈ సమస్య స్కూల్‌లో ఉండే విద్యార్థులు, ఆఫీస్‌లో ఉండే ఉద్యోగులకు ఎదురవడం వల్ల వాళ్లు సామాజిక ఒంటరితనానికి గురయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














