బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ తినడాన్ని నిషేధించిన అస్సాం, ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు బీజేపీ మీద చేస్తున్న విమర్శలేంటి?

ఆవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బహిరంగంగా బీఫ్ తినడాన్ని నిషేధిస్తున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.
    • రచయిత, నికిత యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో, రెస్టారెంట్లలో గొడ్డు మాంసం తినడాన్ని నిషేధించింది.

గతంలో దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలకు సమీపంలో గొడ్డు మాంసం అమ్మకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించింది.

ఈ ఆంక్షలను విస్తరిస్తూ ఇప్పుడు బహిరంగంగా గొడ్డు మాంసం తినడాన్ని కూడా నిషేధిస్తున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

అయితే, గొడ్డు మాంసాన్ని షాపుల నుంచి కొనుగోలు చేసి, ఇళ్లల్లో, ప్రైవేట్ స్థలాల్లో తినవచ్చు.

ఇటీవలి కాలంలో బీఫ్ అనేది చాలా సున్నితమైన అంశంగా మారింది. దేశంలో 80 శాతం జనాభా హిందువులే. వీరు దైవంగా లేదా పవిత్రంగా భావించే ఆవును ఆహారంగా తినడంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు, గత కొన్నేళ్లుగా గోహత్యపై కఠిన చర్యలకు దిగుతున్నాయి.

బీఫ్ వినియోగంపై ఆ రాష్ట్రాలు పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధాన్ని విధించాయి. (ఈ ప్రాంతాల్లో కొన్నింట్లో గేదె మాంసం చట్టబద్ధమే.)

అనేక ప్రాంతాల్లో గోసంరక్షక బృందాలు ఈ నిషేధాన్ని అమలు చేయాలంటూ హింసకు పాల్పడుతున్నాయి.

అనేకసార్లు ఈ హింస ముస్లిం మాంసం వ్యాపారులు, పశువుల వ్యాపారులు, దళితులపై దాడులకు కూడా దారి తీశాయి.

చౌకగా దొరికే బీఫ్‌ను దళితులు తమ ప్రధానమైన ఆహారంగా భావిస్తారు.

అస్సాంలో గోమాంసం తినని హిందువులు, జైనులు, సిక్కులు ఉండే ప్రాంతాల్లో బీఫ్ అమ్మకం, కొనుగోలుపై 2021లోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

అంతేకాక, ఆలయాలకు సమీపంలో గొడ్డు మాంసం అమ్మకాన్ని కూడా నిషేధించింది.

బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఫొటో క్యాప్షన్, బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

నిషేధానికి ముందు ఏం జరిగింది?

అస్సాంలో ముస్లింలు అధికంగా ఉండే సమగురి నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో గెలిచేందుకు హిమంత బిశ్వ శర్మ 'బీఫ్'ను పంచుతున్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపించిన కొన్నిరోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. గొడ్డు మాంసాన్ని పంచుతున్నామన్న కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ కొట్టివేసింది.

ఓటర్లకు గోమాంసాన్ని పంచడం ద్వారా తన సొంత పార్టీ హిందుత్వ విలువలకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ద్రోహం చేశారని కాంగ్రెస్ శాసనసభ్యులు రకీబుల్ హుస్సేన్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

కాంగ్రెస్ కోరిక మేరకు, బీఫ్‌పై పూర్తి నిషేధానికైనా తాము సిద్ధం అంటూ బుధవారం నాడు హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తర్వాత నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు, బీఫ్‌పై నిషేధం విధించడాన్ని ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.

ప్రజలు తాము ఏం తినాలనుకుంటున్నారో దానిని తిననీయకుండా, వారి హక్కులను కాలరాస్తున్నారని పలు పార్టీలు ఈ నిర్ణయాన్ని విమర్శించాయి. ప్రజల ఆహార హక్కును ఈ నిషేధం ఉల్లంఘిస్తోందని అన్నాయి.

తాము అధికారంలో ఉన్న గోవాతోపాటు, మిగిలిన ఈశాన్య రాష్ట్రాలలో లేని నిషేధం అస్సాంలోనే ఎందుకని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్‌ నేత హఫీజ్ రఫీకుల్ ఇస్లాం అన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న గోవా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీఫ్ అమ్మకం, కొనుగోలు చట్టబద్ధమే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)