బషర్ అల్ అసద్: కంటి డాక్టర్ ‘కఠిన పాలకుడు’ ఎలా కాగలిగారు.. చివరకు దేశం నుంచి ఎందుకు పారిపోయారు

ఫొటో సోర్స్, Getty Images
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి. అందులో అతి ముఖ్యమైనది కారు ప్రమాదంలో ఆయన పెద్దన్న మరణించడం.
అసద్ తన తండ్రి నుండి అధికారాన్ని వారసత్వంగా పొందేందుకు మొదట్లో ఇష్టపడలేదు. 1994 ప్రారంభంలో డమాస్కస్ సమీపంలో కారు ప్రమాదంలో ఆయన అన్న బాసెల్ మరణించిన తరువాత ఆయన అధికారం చేపట్టే అంశంపై దృష్టిపెట్టారు.
ఈ సంఘటన జరిగినప్పుడు, సొంతూరుకు వేల కిలోమీటర్ల దూరంలో లండన్‌లో ఆప్తాల్మాలజీ (కంటి వైద్య శాస్త్రం) చదువుకుంటున్నారు బషర్.
తరువాత ఆయన వందల వేల మంది ప్రాణాలను బలిగొన్న, లక్షలమందిని నిర్వాసితులుగా మార్చిన రక్తపాత యుద్ధంతో దేశంలో అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు.
వైద్యుడి నుంచి దేశాధ్యక్షుడు అయ్యే వరకు బషర్ అల్-అసద్ ప్రస్థానం ఎలా సాగింది?


ఫొటో సోర్స్, Getty Images
తండ్రి వారసత్వం
బషర్ అల్-అసద్ 1965లో హఫీజ్ అల్-అసద్, అనిసా మఖ్లౌఫ్ దంపతులకు జన్మించారు.
పశ్చిమాసియాలోని అనేక దేశాలలో ఆ రోజుల్లో అరబ్ జాతీయవాదం తీవ్ర స్థాయిలో ఉండేది. దాని ప్రభావం ఉన్న దేశాలలో సిరియా కూడా ఉంది.
స్వల్ప కాలం పాటు(1958 నుంచి 1961 వరకు) ఏకంగా ఉన్న ఈజిప్ట్, సిరియాలు మళ్లీ విడిపోయిన తరువాత సిరియాలో బాత్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
అయితే, చాలా అరబ్ దేశాల మాదిరిగా సిరియా ప్రజాస్వామ్య దేశం కాదు బహుళ పార్టీలు ప్రాతినిధ్యం వహించే ఎన్నికలు లేవు.
అసద్ కుటుంబం అలవైట్ కమ్యూనిటీకి చెందింది. సిరియాలోని అత్యంత వెనుకబడిన కమ్యూనిటీలలో అది ఒకటి.
ఆర్థిక కష్టాల కారణంగా చాలామంది ఆ కమ్యూనిటీ ప్రజలు సిరియా సైన్యంలో చేరేవారు.
అప్పట్లో బషర్ అల్-అసద్ తండ్రి హఫీజ్ అల్-అసద్‌కు మిలటరీ అధికారిగా, బాత్ పార్టీకి గట్టి మద్దతుదారుగా పేరుండేది.
1966లో ఆయన రక్షణ మంత్రి అయ్యారు. 1971లో అధ్యక్షుడయ్యారు.
2000లో మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
సిరియా స్వాతంత్య్రానంతర చరిత్రలో ఈ సుదీర్ఘ కాలం చాలా కీలకమైంది. ఈ కాలంలో సిరియాలో అనేక మిలిటరీ తిరుగుబాట్లు జరిగాయి.
ప్రతిపక్షాలను అణచివేస్తూ, ఎన్నికలను తిరస్కరిస్తూ ఉక్కు పిడికిలితో పాలన సాగించారు హఫీజ్. విదేశాంగ విధానంలో యుక్తిగా వ్యవహరించారాయన.
సోవియట్ యూనియన్‌తో స్నేహం చేశారు. 1991 గల్ఫ్ యుద్ధంలో అమెరికా నాయకత్వంలోని సంకీర్ణంతో చేతులు కలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బషర్ అల్ అసద్: లండన్‌లో వైద్యవిద్య
యువకుడిగా ఉన్న రోజుల్లో రాజకీయాలకు, సైనిక వ్యవహారాలకు దూరంగా ఉండాలని బషర్ అల్ అసద్ అనుకునే వారు. వైద్య వృత్తిలో కొనసాగాలని భావించారు.
డమాస్కస్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాక, కంటి వైద్యశాస్త్రం(ఆప్తాల్మాలజీ) చదివేందుకు 1992లో యూకే వెళ్లి లండన్‌లోని వెస్ట్రన్ ఐ హాస్పిటల్‌లో చేరారు.
2018లో బీబీసీ రూపొందించిన ‘ఏ డేంజరస్ డినాస్టీ: ది అసద్స్’ అనే డాక్యుమెంటరీలో ఆయన లండన్‌లో జీవితాన్ని ఎలా ఆస్వాదించారో ఉంది.
ఇంగ్లిష్ సింగర్ ఫిల్ కొలిన్స్ అంటే ఇష్టపడేవారు ఆయన. వెస్ట్రన్ కల్చర్‌ను చాలావరకు అనుసరించేవారు అసద్.
భార్య అస్మా అల్ అఖ్రాస్‌ను తొలిసారి లండన్‌లో కలిశారు బషర్. అప్పటికి అఖ్రాస్ లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.
తరువాత ఎంబీఏ కోసం ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. కానీ, తర్వాత ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది.
హఫీజ్ అల్-అసద్ వారసుడిగా బషర్ అన్న బాసెల్ అప్పట్లో బాగా ముందుండేవారు.
అయితే, 1994 జనవరిలో బాసెల్ మరణం బషర్ అల్ అసద్ జీవిత గమనాన్ని మార్చేసింది.
అన్న మరణం తరువాత వెంటనే లండన్ నుంచి రావాలంటూ తల్లిదండ్రులు పిలిపించారు. అప్పటి నుంచే ఆయన సిరియాకు తదుపరి నాయకుడిగా రూపాంతరం చెందడం మొదలుపెట్టారు.
బషర్ ముందుగా సైన్యంలో చేరారు. భవిష్యత్‌లో తాను నిర్వహించబోయే పాత్ర కోసం ఆయన తన పబ్లిక్ ఇమేజ్‌ని నిర్మించుకోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, AFP
రాజకీయ మార్పులు
జూన్ 2000లో హఫీజ్ అల్-అసద్ మరణించారు. 34 ఏళ్ల బషర్ వెంటనే అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పటికి అధ్యక్షుడు అయ్యేందుకు కనీస అర్హత వయసు 40 ఏళ్లుగా ఉండేది. కానీ, దాన్ని తగ్గిస్తూ సిరియా రాజ్యాంగానికి సవరణలు చేశారు.
సిరియా రాజకీయాలలో గతంలో అంతగా వినిపించని మాటలతో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, ఆధునికీకరణ, జవాబుదారీతనం, సంస్థాగత ఆలోచన’ల గురించి ఆయన మాట్లాడారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తర్వాత అస్మా అల్-అఖ్రాస్‌ను వివాహం చేసుకున్నారు బషర్.
వారికి హఫీజ్, జీన్, కరీమ్ అనే ముగ్గురు పిల్లలున్నారు.
ప్రారంభంలో, రాజకీయ సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ గురించి బషర్ తరచూ మాట్లాడుతుండటంతో చాలామంది సిరియన్లలో ఆశలు రేకెత్తాయి. అతని నాయకత్వ శైలికి, అస్మా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ కూడా జతకావడంతో మార్పు రాబోతోందని అందరూ అనుకునేవారు.
సిరియాలో భావప్రకటన స్వేచ్ఛ, పౌర చర్చలకు స్వల్పకాలంపాటు అవకాశం కలిగింది. అప్పట్లో దీన్ని "డమాస్కస్ స్ప్రింగ్" అనేవారు.
అయితే 2001 నాటికి భద్రత దళాలు అణచివేతను తిరిగి ప్రారంభించాయి. తమకు వ్యతిరేకంగా గొంతెత్తినవారిని అరెస్ట్ చేసేవారు.
ప్రైవేట్ రంగ వృద్ధిని ప్రోత్సహించే పరిమిత ఆర్థిక సంస్కరణలను బషర్ ప్రవేశపెట్టారు. బషర్ అధికారంలోకి వచ్చిన రోజుల నుంచి ఆయన దగ్గరి బంధువు రామి మఖ్‌లౌఫ్ ఆర్ధిక శక్తిగా ఎదిగారు.
ఒక విశాలమైన ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారు. ఇది అధికారం, సంపదల కలయిక అని విమర్శకులు అనేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్, లెబనాన్
2003 ఇరాక్ యుద్ధంతో బషర్ అల్-అసద్‌కు.. పాశ్చాత్య దేశాలకు మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది. ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలోని దళాల దాడిని బషర్ వ్యతిరేకించారు.
అమెరికా సైనిక చర్యల తదుపరి లక్ష్యం సిరియా కావచ్చని ఆయన భయపడినట్లు కొందరు చెబుతారు.
ఇరాక్‌పై అమెరికా దాడులను వ్యతిరేకిస్తున్న తిరుగుబాటుదారులకు సిరియా సరిహద్దుల నుంచి ఆయుధాలు అక్రమంగా అందుతున్నా డమాస్కస్ కళ్లు మూసుకుందని అమెరికా ఆరోపించింది.
వివిధ కారణాలు చూపి 2003 డిసెంబర్‌లో అమెరికా సిరియాపై ఆంక్షలు విధించింది. కేవలం ఇరాక్ వ్యవహారమే కాకుండా, లెబనాన్‌లో సిరియా ఉనికి కూడా దీనికి కొంతవరకు కారణం.
సిరియా ప్రధాన ప్రత్యర్థులలో ఒకరైన లెబనాన్ మాజీ ప్రధాన మంత్రి రఫిక్ హరిరి 2005 ఫిబ్రవరిలో బేరూత్‌లో హత్యకు గురయ్యారు.
ఇది సిరియా, దాని మిత్రదేశాల పనేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
డమాస్కస్‌పై అంతర్జాతీయ ఒత్తిడి ఒకవైపు కొనసాగుతుండగానే లెబనాన్‌లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. దాదాపు 30 సంవత్సరాల సైనిక ఉనికి తర్వాత లెబనాన్ నుంచి సిరియా వైదొలగాల్సి వచ్చింది.
అయితే, అసద్‌గానీ.. లెబనాన్‌లో ఆయనకు సన్నిహిత సంస్థ హిజ్బుల్లా కానీ హరిరి హత్యను అంగీకరించలేదు. కానీ, ఈ నేరంలో ప్రమేయం ఉన్నట్లు స్పెషల్ ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ 2020లో హిజ్బుల్లా సభ్యుడు ఒకరిని దోషిగా తేల్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అరబ్ విప్లవం
తన పాలన తొలి దశాబ్ద కాలంలో ఇరాన్‌తోపాటు ఖతార్, తుర్కియేలతో ఆయన తన సంబంధాలను పెంచుకున్నారు. తర్వాత అవి మారాయి.
సౌదీ అరేబియాతో సంబంధాలు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. బషర్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సౌదీ అరేబియా ఆయనకు మద్దతుగా నిలిచింది.
విదేశాంగ విధానంలో తన తండ్రి అడుగుజాడలను అనుసరించారు బషర్ అల్-అసద్. ప్రత్యక్ష సైనిక ఘర్షణలను తప్పించుకుంటూ జాగ్రత్తగా పాలనసాగించారు.
ఒక దశాబ్దం అధికారంలో ఉన్న తర్వాత ఆయనలో నిరంకుశ విధానాలు మొదలయ్యాయి. ప్రత్యర్థులపై అణచివేత మొదలైంది.
డిసెంబరు 2010లో అస్మా అల్-అఖ్రాస్ వోగ్ మేగజైన్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ఇంట్లో కూడా ప్రజాస్వామ్యం ఉంటుందని ఆమె ఆ సందర్భంగా చెప్పారు.
సరిగ్గా అదే రోజు ట్యునీషియాలో ఓ కూరగాయల వ్యాపారి ఒక మహిళా పోలీసు తనను చెప్పుతో కొట్టిందన్న అవమానంతో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇది ట్యునీషియాలో ప్రజా విప్లవానికి దారితీసింది. దీని కారణంగా ఆ దేశ అధ్యక్షుడు జైన్ ఎల్ అబిదిన్ బెన్ అలీ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
ట్యునీషియా తిరుగుబాటు అరబ్ ప్రపంచమంతటికీ పాకింది. ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా వరకు పాకింది.
వోగ్ ఇంటర్వ్యూ 2011 మార్చిలో ‘ఎ రోజ్ ఇన్ ది డెజర్ట్’ శీర్షికతో పబ్లిష్ అయ్యింది. (తరువాత దీనిని వెనక్కి తీసుకున్నారు).
సిరియాను ‘బాంబింగ్‌లు, ఉద్రిక్తతలు, కిడ్నాప్‌లు లేని దేశం’గా ఆ మ్యాగజీన్ అభివర్ణించింది.
ఆ తర్వాత కొద్ది నెలల్లోనే అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి.
అదే సంవత్సరం మార్చి నెల రెండోవారం దాటేటప్పటికి సిరియాలో కూడా నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి.
అసద్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వేసినందుకు దారా నగరంలో కొందరిని అరెస్టు చేశారు. దాని తర్వాత నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి.
సిరియా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు అసద్ రెండు వారాలు ఆగారు.
సిరియాను లక్ష్యంగా చేసుకుని జరిగే ‘కుట్ర’లను అడ్డుకుంటానని, పార్లమెంటులో అసద్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రజల సమస్యలను తాను ఇంకా పూర్తిగా తీర్చలేకపోయానని ఆయన అంగీకరించారు.
దారా నగరంలో నిరసనకారులపై భద్రత బలగాలు జరిపిన కాల్పులు ఆందోళనలకు మరింత ఆజ్యం పోశాయి.
అసద్ రాజీనామా చేయాలంటూ పలు నగరాలలో ప్రజలు పిలుపునిచ్చారు.
ఈ ఆందోళనకారులంతా ‘బాహ్య శక్తులు నడిపిస్తున్న విధ్వంసకారులు, చొరబాటుదారులు’ అని ఆరోపిస్తూ అధికార యంత్రాంగం వారిపై కఠినంగా వ్యవహరించింది.
నెలరోజుల్లోనే దేశమంతటా ఆయుధాలు చేపట్టిన ప్రభుత్వ బలగాలు, ప్రతిపక్ష వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు తీవ్రమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
జిహాదీలు, యుద్ధనేరాలు
సిరియాలో సంఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. అంతర్జాతీయ జోక్యం కూడా ప్రవేశించడంతో ఇక్కడ క్షతగాత్రుల సంఖ్య వందల నుంచి వేలకు పెరిగిందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
రష్యా, ఇరాన్, దానికి మద్దతిచ్చే మరికొన్ని దేశాలు అసద్ దళాలకు సాయంగా వచ్చాయి.
తుర్కియే, మరికొన్ని గల్ఫ్ దేశాలు ప్రతిపక్ష సాయుధ దళాలకు మద్ధతుగా నిలిచాయి.
అసద్ వ్యతిరేక ప్రదర్శనల్లో మొదట ప్రజాస్వామ్యం, అందరికీ స్వేచ్ఛ అనేవి ప్రధాన నినాదాలైనా, తర్వాత కమ్యూనిటీ వ్యవహారం ముందుకు వచ్చింది. దేశంలో సంపద అంతా ఒక వర్గానికే వెళుతోందన్న విమర్శలు వినిపించాయి. బషర్ తన కమ్యూనిటీ అలవైట్స్‌కు పూర్తి సహకారం అందిస్తున్నారని ఇస్లామిక్ సంస్థలు వాదించడం మొదలుపెట్టాయి. మరోవైపు ఇరాన్ నుంచి మద్ధతు అందుకుంటున్న షియా వర్గానికి చెందిన హిజ్బుల్లాలాంటి సంస్థలు అసద్ ప్రభుత్వానికి సహకరించేందుకు సిరియాలోకి ప్రవేశించాయి.

ఫొటో సోర్స్, Getty Images
సిరియాకు పొరుగున ఉన్న ఇరాక్‌లో.. ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయాలనే లక్ష్యంతో గ్రూప్ ఒకటి ఏర్పడింది. దానిపేరు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్).
ఈ గ్రూప్ కూడా సిరియాలో కొంత భాగాన్ని ఆక్రమించుకోవడానికి అంతర్యుద్ధాన్ని ఉపయోగించుకుంది. తూర్పు నగరమైన రక్కాను తమ రాజధానిగా ప్రకటించింది.
2013 ఆగస్ట్‌లో డమాస్కస్ సమీపంలోని ప్రతిపక్షాల అధీనంలో ఉన్న తూర్పు ఘౌటాపై రసాయన దాడిలో వందల మంది చనిపోయారు.
పాశ్చాత్య శక్తులు, సిరియన్ ప్రతిపక్ష వర్గాలు ఈ దాడికి అసద్ నిర్ణయాలే కారణమని నిందించాయి. డమాస్కస్ తన ప్రమేయాన్ని అంగీకరించకపోయినా, అంతర్జాతీయ ఒత్తిడి, బెదిరింపుల కారణంగా దాని రసాయన ఆయుధ నిల్వలను ధ్వంసం చేయడానికి అంగీకరించింది.
అయితే, అంతటితో సిరియా యుద్ధంలో దురాగతాలు ఆగిపోలేదు.
2015 నాటికి, దేశంలోని చాలా ప్రాంతాలపై పట్టును కోల్పోయిన అసద్ ప్రభుత్వం పతనం అంచున కనిపించింది.
కానీ, రష్యా సైనిక జోక్యంతో ఈ ఆటుపోట్లను అడ్డుకోగలిగింది. ఆ తర్వాత చాలా భాగాలను అసద్ ప్రభుత్వం తిరిగి సంపాదించింది.

ఫొటో సోర్స్, Getty Images
గాజా యుద్ధం-తాజా పరిణామాలు
ప్రాంతీయ, అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా 2018, 2020 సంవత్సరాల మధ్య అసద్ ప్రభుత్వం సిరియాలో ఎక్కువ భాగం తన నియంత్రణలోకి తెచ్చుకోగలిగింది.
అయితే ప్రతిపక్ష ఇస్లామిస్ట్ గ్రూపులు, కుర్దిష్ మిలీషియాలు ఉత్తర, ఈశాన్య ప్రాంతాలపై నియంత్రణను పంచుకున్నాయి.
ఈ ఒప్పందాలు అసద్ స్థానాన్ని తిరిగి బలోపేతం చేశాయి. ఆయన క్రమంగా అరబ్ దేశాలతో స్నేహ సంబంధాలను ప్రారంభించారు. 2023లో అరబ్ లీగ్‌లో సిరియా సభ్యత్వం మళ్లీ మొదలైంది. అరబ్ దేశాలు డమాస్కస్‌లో రాయబార కార్యాలయాలను తిరిగి ప్రారంభించాయి.
అసద్ పాలన మూడో దశాబ్దంలో సిరియా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అయినా, ఆయన ఈ సవాళ్ల నుంచి బయటపడినట్లు కనిపించారు.
అయితే, 2023 అక్టోబర్‌లో హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిని ప్రారంభించింది. గాజాలో యుద్ధం మొదలైంది. దీని పర్యవసానాలు వేగంగా లెబనాన్‌కు కూడా వ్యాపించాయి. ముఖ్యంగా అసద్ మిత్రపక్షం హిజ్బుల్లాపై దీని ప్రభావం పడింది. హిజ్బుల్లాకు భారీ నష్టం కలిగింది. అందులో దాని నాయకుడు హసన్ నస్రల్లా మరణం కూడా ఒకటి.
అదే రోజున లెబనాన్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
ఇస్లామిస్ట్ గ్రూప్ ‘హయత్ తహ్రీర్ అల్-షామ్’ నేతృత్వంలోని సిరియన్ ప్రతిపక్ష వర్గాలు ఆకస్మిక దాడులను ప్రారంభించాయి.
దేశంలోని రెండో పెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకున్నాయి. తర్వాత హమా, హామ్స్‌లు, తాజాగా డమాస్కస్‌ను కూడా విముక్తం చేసినట్లు తిరుగుబాటు దళాలు ప్రకటించాయి.
తాజాగా బషర్ అల్-అసద్ దేశం విడిచి పారిపోయినట్లుగా కూడా తిరుగుబాటు దళాలు ప్రకటించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














