కాకినాడ పోర్టు నుంచి సీ పోర్టుకు మారిన వివాదం: వైసీపీ నేతలు బెదిరించి వాటాలు తీసుకున్నారా? సీఐడీకి కేవీ రావు చేసిన ఫిర్యాదులో ఏముంది?

ఫొటో సోర్స్, kakinadaseaports.in
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్.
- హోదా, బీబీసీ ప్రతినిధి
''ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆయన తండ్రి పౌరసరఫరాల సంస్థ చైర్మన్. చంద్రశేఖరరెడ్డి సోదరుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేత. అంతా కలిసి రూ.15వేల కోట్ల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారు''
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కాకినాడలో జరిగిన ప్రచారంలో టీడీపీ అధినేత, నేటి సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైఎస్సార్‌సీపీ నేత ద్వారంపూడి కుటుంబంపై చేసిన ఆరోపణలు ఇవి.
అధికారంలోకి రాగానే కాకినాడ నుంచి బియ్యం తరలింపుపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 640 టన్నుల 'పీడీఎస్' బియ్యం నిల్వలు ఉన్న పనామా దేశానికి చెందిన స్టెల్లా ఎస్ నౌకను తనిఖీ చేయడం, 'సీజ్ ది షిప్' అని అక్కడికక్కడే ఆదేశాలివ్వడం తెలిసిందే.
అయితే యాంకరేజ్ పోర్టుకి వచ్చిన ఆ నౌక సీజ్ విషయమై ఇప్పటికీ అధికార యంత్రాంగంలో స్పష్టత లేదు.
పవన్ ఆదేశాలను ఎలా అమలు చేయాలా అని మల్లగుల్లాలు పడుతుంటే, ఇప్పుడు కాకినాడ సీపోర్టులో వాటాల మళ్లింపు వివాదం కలకలం రేపుతోంది.
గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ (కేసీపీఎల్)లో రూ.2500కోట్ల విలువైన వాటాలను రూ.404 కోట్లకు, కాకినాడ సెజ్‌లోని రూ.1100 కోట్ల విలువైన వాటాలను కేవలం రూ.12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని వ్యాపారవేత్త, కాకినాడ సీపోర్ట్స్ అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.


ఫొటో సోర్స్, https://kakinadaseaports.in/
ఎవరీ కర్నాటి వెంకటేశ్వరరావు
కాకినాడలో రెండు పోర్టులు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన యాంకరేజ్ పోర్టు. ఇది సముద్రానికి సుమారు 13 కిలోమీటర్ల లోపల ఉంటుంది.
దీన్ని 1805 నుంచి నాటి బ్రిటిష్ ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు ఉండవు.
ఇలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ పోర్టులు భారత్‌లో మూడు మాత్రమే ఉన్నాయి. ఒకటి కాకినాడ కాగా మరొకటి తమిళనాడులోని టుటికోరిన్. మూడోది గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది.
కాగా దేశంలోని 40 మైనర్ పోర్టుల్లో కాకినాడ యాంకరేజి పోర్టు పెద్దది. మొదట్లో అన్ని వస్తువులను ఈ పోర్టు నుంచే రవాణా చేసేవారు.
1995లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో మొదలైన డీప్ వాటర్ (సీ) పోర్టును మరింతగా విస్తరించి రవాణా, ఉపాధి అవకాశాలు పెంచాలని 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు.
అయితే, అందుకు తగ్గ నిధులు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో ఈ పోర్టును ప్రైవేటు సంస్థకు అప్పగించారు.
అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి అల్లుడు డాక్టర్ శ్రీనివాస్‌కు పోర్టు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
అయితే పోర్టు వ్యాపారంపైనే తప్ప, విస్తరణపై దృష్టి పెట్టడం లేదని భావించిన నాటి బాబు ప్రభుత్వమే 1999లో కర్నాటి వెంకటేశ్వరరావుకు చెందిన కాకినాడ సీపోర్ట్స్‌కి పోర్టు నిర్వహణ, విస్తరణ, బాధ్యతలు కట్టబెట్టింది.
19 ఏళ్ల కాల పరిమితికి నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఫొటో సోర్స్, ugc
వై.ఎస్.ఆర్. హయాంలో 50ఏళ్లకి లీజు
తర్వాత వచ్చిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది.
వై.ఎస్.కి అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావుకు ఈ కేవీరావు అత్యంత సన్నిహితుడు కావడం వల్లనే లీజును ఏకంగా యాభై ఏళ్లకి పెంచారన్న ప్రచారం అప్పట్లో సాగిందని కాకినాడకు చెందిన జర్నలిస్టు కె.స్వాతి ప్రసాద్ బీబీసీతో అన్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత ..
వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవీరావు ఆధ్వర్యంలోని సీపోర్ట్స్ సంస్థ ప్రభుత్వానికి రాయల్టీ చెల్లింపులో తప్పుడు లెక్కలు చూపిస్తోందన్న వాదనను తెరపైకి వచ్చింది.
ఆ నేపథ్యంలోనే పోర్టులోని 41% వాటాను అరబిందో సంస్థకు బదలాయించారు. ఆ ఒప్పందానికి సంబంధించే ఇప్పుడు కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు ఇచ్చారు.
తమతో బలవంతంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ugc
కేవీ రావు ఫిర్యాదులో ఏముంది?
''కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్)కు సీపోర్టులో 41.12 శాతం వాటాతో 2,15,50,905 షేర్లు ఉండేవి.
2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేఎస్‌పీఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు, ఏపీ మారిటైమ్ బోర్డు నుంచి సహకారం కొరవడింది.
1999లో కేఎస్‌పీఎల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం కేఎస్‌పీఎల్ స్థూల రాబడిలో 22 శాతం సర్కార్‌కి చెల్లించాలి.
2014–2019 మధ్య పోర్టులో జరిగిన అన్ని వ్యవహారాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడిట్ చేయించింది.
కేఎస్‌పీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965.65 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో ఆడిట్ సంస్థ నివేదిక సమర్పించింది. "దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలని తనను బెదిరించారు'' అని కేవీరావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
''వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మేలో ఫోన్ చేసి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్‌రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారు.
ఆయనతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డికి సోదరుడు, అరబిందో యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి కూడా ఉంటారని చెప్పారు. ఆ మేరకు నేను వారితో చర్చించగా, స్పెషల్ ఆడిట్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వానికి కేఎస్‌పీఎల్ రూ.965.65 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని విక్రాంత్‌రెడ్డి చెప్పారు. ఆ సొమ్ము చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వం నోటీసులిస్తే కేఎస్‌పీఎల్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందంటూ విక్రాంత్‌రెడ్డి హెచ్చరించారు.
ఈ క్రమంలోనే మా కంపెనీ నుంచి వాటాల బదిలీకి ఒప్పందాలను సిద్ధం చేస్తున్నామని అందుకు సహకరించాలని విక్రాంత్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్న క్రమంలోనే కేఎస్‌పీఎల్, కాకినాడ సెజ్‌లోని వాటాల్ని అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమ్ముతున్నట్టు తెలిసింది" అని కేవీరావు తన ఫిర్యాదులో తెలిపారు.
"వాటా విలువ నిర్ణయించేందుకు అరబిందో సంస్థ చెన్నైకు చెందిన ఓ ఆడిట్ సంస్థను నియమించగా, అది మొత్తం 41.12 శాతం వాటాల విలువను రూ.494 కోట్లుగా లెక్కించింది. ఇది చాలా దారుణమని, మొత్తం 41.12 శాతం వాటా విలువ రూ.2500 కోట్ల కంటే తక్కువ ఉండదని అతి నామమాత్రపు ధరకు వాటాలు లాగేసుకోవటం సహేతుకం కాదని విక్రాంత్‌రెడ్డికి వివరించినా పట్టించుకోలేదు.
పైగా అరబిందో సంస్థ పేరిట చట్టబద్ధంగా వాటాలు బదిలీ కావాలి కాబట్టే రూ.494 కోట్లు చెల్లిస్తున్నామని, ఇస్తున్నదాంతో సరిపెట్టుకోవాలని విక్రాంత్‌రెడ్డి నన్ను బెదిరించారు. 2020 జూన్ 24న విక్రాంత్‌రెడ్డి ఇంట్లో నన్ను తీవ్రంగా బెదిరించి అత్యంత మోసపూరితంగా, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో వాటా కొనుగోలు ఒప్పందం చేయించుకున్నారు'' అని కేవీ రావు సీఐడీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాటాలన్నీ అరబిందో పరమయ్యాక అంతకుముందు ఆడిట్ నివేదికలో పేర్కొన్న రూ.965.65 కోట్ల నష్టాన్ని రూ.9.03 కోట్లకు కుదించుకున్నారని కేవీ రావు వివరించారు.

ఫొటో సోర్స్, https://www.ksez.in/gallery/screen grab
కాకినాడ సెజ్‌లోని వాటాలనూ అలాగే..
అదేవిధంగా కాకినాడ సెజ్‌లో 48.74 శాతం వాటాలనూ తమ నామినీల పేరిట బదిలీ చేయాలని విక్రాంత్‌రెడ్డి 2020 మేలో బెదిరించారని కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.12 కోట్లకు వాటాలు అమ్ముతున్నట్లు ఒప్పందపత్రం రూపొందించి తమ చేత 2020 అక్టోబర్ 12న బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు.
ఈ వాటాల బదిలీ పూర్తయిన తర్వాత అరబిందో సంస్థ కాకినాడ సెజ్‌లో వాటాదారుగా మారిందని పేర్కొన్నారు.
2020 మే నుంచి 2021 ఫిబ్రవరి మధ్య ఈ దందాలు జరిగాయన్న కేవీ రావు రాష్ట్రంలో అధికారం మారడంతో ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నట్లు సీఐడీకి వివరించారు.
కాగా, ఇదే విషయమై కేవీ రావుతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా, కేసు విచారణ దశలో మీడియాతో మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కాకినాడ సీ పోర్ట్ ప్రతినిధి తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబిందో సంస్థ వివరణ కోరుతూ బీబీసీ వారికి ఓ మెయిల్ పంపించింది. వారి స్పందన రాగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, UGC
సీఐడీ ఎవరెవరిపై కేసులు నమోదు చేసిందంటే..
ఏ1గా వై విక్రాంత్ రెడ్డి, ఏ2గా ఎంపీ విజయసాయిరెడ్డి, ఏ3గా విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి శరత్ చంద్రారెడ్డి, ఏ4గా ఆడిట్ సంస్థలు, ఏ5గా అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు ఇతరులపై కేసు నమోదు చేశారు.
వీరిపై ఐపీసీ సెక్షన్లు 506, 384, 420, 109, 467, 120 (బీ) రెడ్ విత్ 34 బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద సీఐడీ విజయవాడ కార్యాలయంలో కేసులు నమోదయ్యాయి.
"కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నాటి ఒప్పంద పత్రాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వాటాల బదిలీ బలవంతంగా జరిగిందా లేదా అనేది పూర్తి స్థాయి విచారణలోనే తేలుతుంది. అవసరమనుకుంటే నిందితులందరినీ సీఐడీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తాం" అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, ugc
చంద్రబాబు బినామీ కేవీ రావు: విజయసాయిరెడ్డి
కాకినాడ పోర్టుకు సంబంధించి తమపై సీఐడీకి ఫిర్యాదు చేసిన కేవీ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలాకాలంగా బినామీ అని వైఎస్సార్సీపి ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
సాయి రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గురువారం ఢిల్లీలో సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేవలం నిబంధనల మేరకే అరబిందోకి వాటాలు ఇవ్వడం జరిగిందే తప్ప కేవీ రావును బెదిరించారనేది పచ్చి అబద్ధమని అన్నారు.
వయసులో చిన్నవాడైన సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి.. ఏడాదిలో ఆరు ఏడు నెలలు అమెరికాలో ఉంటూ ఎంతో మందిని ప్రభావం చేయగలిగిన కేవీ రావును బెదిరించడం అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదన్నారు.
ఈ కేసుపై తాము చంద్రబాబుతో పాటు కేవీ రావుకు లీగల్ నోటీసులు ఇస్తామని, పరువు నష్టం దావా వేస్తామని సాయిరెడ్డి తెలిపారు.
మళ్లీ వైఎస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కేసులో చంద్రబాబు నాయుడుని జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు తనపై ఆరోపణలతో పాటు కాకినాడలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై త్వరలోనే పూర్తి వివరాలతో మాట్లాడతానని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బీబీసీతో అన్నారు.
విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉన్నానని, కాకినాడలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నాని, సరైన సమయంలో స్పందిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ugc
కాకినాడలో రెండు పోర్టులు ఎందుకున్నాయి?
కాకినాడ పోర్టు నుంచి రవాణా పెరగడంతో ఇక్కడే డీప్ వాటర్ (సీ) పోర్టు నిర్మాణానికి 1990 ప్రాంతంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది.
1995లో పోర్టు నిర్మాణం పూర్తయి నిర్వహణ మొదలు పెట్టింది.
సంప్రదాయ సరకు రవాణాను పూర్తిగా యాంకరేజ్ పోర్టు నుంచి, కార్గో రసాయనాలను డీప్ వాటర్ పోర్ట్ నుంచి రవాణా చేయాలని తొలుత నిర్ణయించారు.
కాలక్రమంలో కేవలం కూలీలతో లోడింగ్ జరిగే యాంకరేజ్ పోర్టుకు బియ్యం రవాణా ఒక్కటే మిగలగా, యంత్రాలతో లోడింగ్ చేసే మిగిలిన అన్ని సరకుల రవాణా సీపోర్ట్‌కు మళ్లింది.
"పోర్టులు కేంద్రంగా తప్పులు చేసే వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా చట్టపరంగా శిక్షించండి. అంతే కానీ కాకినాడ పోర్టుల కేంద్రంగా స్మగ్లింగ్ జరుగుతోందంటూ అనవసర ఆరోపణలు చేసి పోర్టుల ప్రతిష్ట దెబ్బతీయొద్దు. ఈ రెండు పోర్టుల ఆధారంగా 20వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. దాదాపు లక్షమంది జీవితాలను ఈ పోర్టులు ప్రభావితం చేస్తాయి. అలాంటి పోర్టులను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయండి. ప్రతీకార రాజకీయాల కోసం మాత్రం పోర్టులను బలిచేయొద్దు" అని కాకినాడకి చెందిన సీనియర్ జర్నలిస్టు స్వాతి ప్రసాద్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














