కాకినాడ సెజ్ భూములు మళ్లీ రైతులకే, ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వెలగపూడిలోని సెక్రటేరియేట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా కాకినాడ సెజ్ పరిధిలో ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకోకుండా భూముల కోసం పోరాడుతున్న రైతులకు వాటిని తిరిగి అప్పగించాలని నిర్ణయించారు. 2,100 ఎకరాలను కాకినాడ సెజ్ పరిధి నుంచి తొలగిస్తూ వాటిని రైతులకే చెల్లేలా నిర్ణయం తీసుకున్నారు.
అంతేగాకుండా సుదీర్ఘకాల ఉద్యమాల్లో రైతులపై నమోదైన వివిధ కేసులను ఉపసంహరించుకుంటూ తీర్మానం చేసినట్టు సమాచార మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
కాకినాడ సెజ్‌తో పాటుగా, సమీపంలోని దివీస్ పరిశ్రమ వల్ల ఎటువంటి కాలుష్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. రొయ్య పిల్లల హేచరీలకు ఎటువంటి నష్టం రాకుండా జాగ్రత్తలు పాటించాలని కంపెనీలకు సూచించామన్నారు.

కాకినాడ సెజ్ పేరుతో 2005 నుంచి చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా కొందరు రైతులు 16 ఏళ్లుగా పోరాడుతున్నారు. ప్రభుత్వం , ఆ తర్వాత జీఎంఆర్ యాజమాన్యం ప్రకటించిన పరిహారం తీసుకోవడానికి నిరాకరించారు. అనేక మంది రైతులు పరిహారం తీసుకున్నప్పటికీ మొత్తం 10 వేల ఎకరాల పరిధిలోని సెజ్‌లో 2100 ఎకరాలకు చెందిన రైతులు దానికి నిరాకరించారు. పలు ఉద్యమాలు నిర్వహించారు.
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఆ రైతులను ఆదుకుంటానని చెప్పిన మాటకు అనుగుణంగా భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారికి ఊరట కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఈడబ్ల్యూఎస్ కులాల మహిళలకూ చేయూత పథకం
ప్రభుత్వం చేయూత పథకం ద్వారా డ్వాక్రా మహిళకు అందిస్తున్న సహాయం ఈడబ్ల్యూఎస్ కులాల పరిధిలోని మహిళలకు వర్తింప చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ కులాలకు చెందిన పేదలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. రాబోయే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున రూ.45 వేల ఆర్ధిక సాయం అందిస్తామన్నారు.
రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ పథకాల అమలు కోసం నవరత్నాలు క్యాలెండర్ కూడా ఆమోదించినట్టు తెలిపారు.
కడపలో నిర్మించనున్న వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పేర్ని నాని చెప్పారు. దీంతో పాటే కడప జిల్లాలో రెండు ఇండస్ట్రియల్ పార్కులకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో పోర్టు నిర్మాణానికి 160 ఎకరాల కేటాయింపు చేశామన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం, టిడ్కో ఇళ్ల కేయాయింపు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల వంటి కీలక అంశాలు కేబినెట్ దృష్టికి రాగా వాటిపై కూడా చర్చ జరిగింది.

ఇవి కూడా చదవండి:
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- కాకినాడ సెజ్: విజయసాయిరెడ్డి బంధువుల చేతుల్లోకి భూములు వెళ్తున్నాయా?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









