సిరియా: మూడో పెద్ద పట్టణం హామ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించిన తిరుగుబాటు దళాలు

సిరియా రెబల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిరియాలోని కీలక పట్టణాలను రెబల్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు

సిరియాలోని మూడో అతిపెద్ద పట్టణం హామ్స్‌పై పూర్తిగా పట్టు సాధించినట్లు తిరుగుబాటు దళాలు ప్రకటించాయి. అయితే సిరియా మిలిటరీ దీన్ని ఖండించింది.

హామ్స్ పట్టణంపై అదుపు సాధించామని, దీన్ని సంపూర్ణంగా విముక్తం చేసేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నామని తిరుగుబాటు దళాలకు చెందిన నాయకుడు హసన్ అబ్దుల్ ఘనీ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.

అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ నుంచి సిరియాను స్వాధీనం చేసుకోవడంలో తిరుగుబాటుదారులకు హామ్స్ పట్టణ ఆక్రమణ కీలకమని చెబుతున్నారు.

అంతకు ముందు తిరుగుబాటు సంస్థ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హయత్ తహ్రీర్ అల్-షామ్ (హెచ్‌టీఎస్) సిరియాలోని ప్రధాన నగరమైన అలెప్పోను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అబూ మొహమ్మద్ అల్ జులానీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2016లో రికార్డు చేసిన ఒక వీడియో సందేశంలో అబూ మొహమ్మద్ అల్ జులానీ

అబూ మొహమ్మద్ అల్-జులానీ ఎవరు?

తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహిస్తున్న హయత్ తహ్రీర్ అల్-షామ్ నేత మొహమ్మద్ అల్ జులానీ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా ఆయన ప్రపంచం ముందు ఉదారవాదిగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

జులానీని పట్టుకోవడానికి అమెరికా రూ. 84.67 కోట్ల (10 మిలియన్ డాలర్లు) నిధులను కేటాయించింది.

అబూ మొహమ్మద్ అల్-జులానీ అనేది మారుపేరు. ఆయన అసలు పేరు, వయసుపై స్పష్టత లేదు.

అమెరికా చానల్ పీబీఎస్, 2021 ఫిబ్రవరిలో అల్ జులానీని ఇంటర్వ్యూ చేసింది.

పుట్టినప్పుడు తన పేరు అహ్మద్ అల్ షారా అని, తాను సిరియా వ్యక్తినని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వారి కుటుంబీకులు గోలన్ ప్రాంతానికి చెందినవారు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తాను జన్మించానని, అక్కడే ఆయన తండ్రి పనిచేసేవారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ఆయన సిరియా రాజధాని డమాస్కస్‌లో పెరిగారు.

అబూ మొహమ్మద్ అల్ జులానీ, తూర్పు సిరియాలోని దైర్ ఎజ్-జోర్‌లో జన్మించారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదిగా మారడానికి ముందు ఆయన మెడిసిన్ చదివారని చెబుతుంటారు.

ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ నివేదికల్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన 1975-1979 మధ్య జన్మించి ఉంటారు.

అబూ మొహమ్మద్ అల్ జులానీ 1979లో జన్మించారని ఇంటర్‌పోల్ చెబుతోంది. అయితే, అస్-సఫీర్ నివేదికలో ఆయన పుట్టిన సంవత్సరం 1981 అని పేర్కొన్నారు.

అల్ జులానీ

ఫొటో సోర్స్, Hayat Tahrir al-Sham

ఇస్లామిక్ గ్రూపు‌నకు ఎలా నాయకుడయ్యారు?

అమెరికా, సంకీర్ణ దళాలు 2003లో ఇరాక్‌పై దాడి చేసిన తర్వాత అల్-జులానీ, జిహాదీ గ్రూపు అల్ ఖైదాలో చేరినట్లు చెబుతారు.

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు, అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అధికారం నుంచి తొలగించాయి. అయితే, అవి వివిధ తీవ్రవాద సమూహాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అమెరికా సైన్యం 2010లో అల్-జులానీని ఇరాక్‌లో అరెస్టు చేసి, కువైట్ సమీపంలోని బుకా జైలులో బందీగా ఉంచింది.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపును ఏర్పాటు చేసిన జిహాదీలను అబూ మొహమ్మద్ అల్ జులానీ ఇక్కడే కలిసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇరాక్‌లో ఐఎస్ నాయకుడిగా మారిన అబూ బక్ర్ అల్-బాగ్దాదీని కూడా ఆయన ఇక్కడే కలుసుకుని ఉండొచ్చు.

అల్ ఖైదా చీఫ్ అబూ బక్ర్ అల్ బాగ్దాదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అల్ ఖైదా చీఫ్ అబూ బక్ర్ అల్ బాగ్దాదీ

2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభమైనప్పుడు, ఒక గ్రూపు శాఖను ఏర్పాటు చేసేందుకు అల్ బాగ్దాదీ తనను అక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారని మీడియాకు అల్ జులానీ తెలిపారు.

దీని తర్వాత నుస్రా ఫ్రంట్ అనే సాయుధ గ్రూప్‌కు అల్ జులానీ కమాండర్ అయ్యారు. ఇస్లామిక్ స్టేట్‌తో ఈ గ్రూప్‌కు రహస్య సంబంధాలు ఉండేవి.

ఐఎస్‌తో నుస్రా ఫ్రంట్ సంబంధాలను 2013లో తెంచేసిన అల్ జులానీ, నుస్రా ఫ్రంట్‌ను అల్-ఖైదా నియంత్రణలోకి తీసుకొచ్చారు.

ఆల్-ఖైదా నుంచి కూడా విడిపోతున్నట్లు 2016లో రికార్డు చేసిన ఒక సందేశంలో ప్రకటించారు.

తమ దళాలు సిరియాలోని ఇతర తిరుగుబాటు గ్రూపులతో కలిసిపోయి హయత్ తహ్రీర్ అల్ షామ్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు 2017లో అల్ జులానీ ప్రకటించారు.

ఈ మొత్తం గ్రూప్‌కు అల్-జులానీ నాయకత్వం వహిస్తున్నారు.

అల్ జులానీ

ఫొటో సోర్స్, Hayat Tahrir al-Sham

అల్-జులానీ ఎలాంటి నాయకుడు?

అల్-జులానీ నాయకత్వంలో హెచ్‌టీఎస్, వాయువ్య సిరియాలోని ఇద్లిబ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధిపత్య గ్రూపుగా మారింది.

యుద్ధానికి ముందు ఈ నగర జనాభా 27 లక్షలు. నిర్వాసితుల రాక కారణంగా నగర జనాభా ఒక సమయంలో 40 లక్షలకు చేరిందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.

హెచ్‌టీఎస్ గ్రూప్ ఇద్లిబ్ ప్రాంతంలో 'సాల్వేషన్ గవర్నమెంట్'ని నియంత్రిస్తుంది. ఆరోగ్యం, విద్య, అంతర్గత భద్రతను అందించడంలో స్థానిక పరిపాలన యంత్రాంగంలా ఇది పనిచేస్తుంది.

అల్‌ ఖైదాకు చెందిన గ్లోబల్ జిహాదీ వ్యూహాన్ని తాము అనుసరించలేదని 2021లో పీబీఎస్‌తో అల్ జులానీ చెప్పారు.

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను అధికారం నుంచి తొలగించడమే తమ ప్రధాన లక్ష్యమని అల్ జులానీ వ్యాఖ్యానించారు.

ఇద్లిబ్‌లోని అల్-ఖైదా స్థావరాలను 2020లో హెచ్‌టీఎస్ మూసి వేయించింది. ఆయుధాలను స్వాధీనం చేసుకొని, కొంతమంది నాయకులను జైలుకు పంపించింది.

ఇద్లిబ్‌లో ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలను కూడా అరికట్టించింది.

హెచ్‌టీఎస్ తన నియంత్రణలోని ప్రాంతాల్లో ఇస్లామిక్ చట్టాన్ని విధించింది. అయితే ఇతర జిహాదీ గ్రూపులతో పోలిస్తే వీరి చట్టం కాస్త మెరుగు.

క్రైస్తవులు, ముస్లిమేతరులతో హెచ్‌టీఎస్ బహిరంగంగానే చర్చిస్తుంది. ఈ ఉదారవాద వైఖరి కారణంగా ఇతర జిహాదీ గ్రూపుల నుంచి విమర్శలను ఎదుర్కొంది.

ప్రజల నిరసనలను అణిచివేస్తుందని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని హెచ్‌టీఎస్‌పై మానవ హక్కుల సంస్థలు ఆరోపణలు చేశాయి.

ఈ ఆరోపణలను అల్-జులానీ ఖండించారు.

పశ్చిమ, మధ్యప్రాచ్య ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ సంస్థను తీవ్రవాద సంస్థగా గుర్తించాయి. ఎందుకంటే అల్-జులానీ గతం అల్ ఖైదాతో ముడిపడి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)