సిరియా: ‘అధ్యక్షుడు అల్ అసద్ పారిపోయారు, రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకున్నాం’ - ప్రకటించిన రెబల్స్

సిరియా రెబల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిరియాలో బషర్ అల్-అసద్ పాలన అంతమైందని రెబల్స్ ప్రకటించారు.
    • రచయిత, సెబాస్టియన్ అషర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి పారిపోయారని, రాజధాని డమాస్కస్‌ నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న హయత్ తహ్రీర్ అల్-షామ్ సంస్థ ప్రకటించింది.

అసద్ పారిపోవడంతో సిరియా మొత్తం విముక్తి పొందిందని ఆ సంస్థ పేర్కొంది. ఒక అధ్యాయం ముగిసిందని, కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని తమ టెలిగ్రామ్ చానెల్‌లో హయత్ తహ్రీర్ అల్-షామ్ సంస్థ పేర్కొంది.

సిరియాలో అసద్ పాలన అంతమైందని, రాజకీయ ఖైదీలను విడుదల చేశామని రెబల్ గ్రూపు నేతలు ఆ దేశ అధికారిక టీవీ చానల్‌, రేడియోలలో ప్రకటించారు.

అసద్ నియంతృత్వ పాలన కారణంగా గత ఐదు దశాబ్దాలుగా నిరాశ్రయులైన, జైలులో గడిపిన ప్రజలంతా ఇప్పుడు స్వస్థలాలకు రావచ్చని తిరుగుబాటు సంస్థ చెప్పింది. కొత్త సిరియాలో అందరూ శాంతియుతంగా బతుకుతారని వ్యాఖ్యానించింది.

డమాస్కస్ నుంచి అధ్యక్షుడు బషర్ అల్-అసద్ బయలుదేరివెళ్లినట్లు ఇద్దరు సీనియర్ సిరియా అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారనేది మాత్రం చెప్పలేదు.

ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు ఎవరూ అసద్ ఎక్కడున్నారన్న విషయాన్ని ఇంత వరకు అధికారికంగా చెప్పలేదు. ఆయన దేశం విడిచి వెళ్లారని కూడా వెల్లడించలేదు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డమాస్కస్ వీధుల్లో రెబల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డమాస్కస్ వీధుల్లో సంబరాలు చేసుకుంటున్న జనాలు

మరోవైపు సిరియా ప్రతిపక్ష నేత హాదీ అల్ బ్రహా కూడా సిరియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారని చెప్పారు. అసద్ పాలన కూలిందని, సిరియాలో చీకటి చరిత్ర ముగిసిందని ఆయన మీడియా సంస్థ అల్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

డమాస్కస్‌లో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని, ప్రజలు కంగారుపడవద్దని ఆయన సూచించారు.

‘‘ఇప్పటి నుంచి ఎవరి మీద పగ ప్రతీకారాలు ఉండవు. ఇతరుల మీద మీరు దాడులకు దిగనంత వరకు మీకు వచ్చే ఇబ్బంది ఏదీ ఉండదు. ఇక్కడ మానవహక్కుల ఉల్లంఘనలు ఉండవు. ప్రజల గౌరవాన్ని రక్షిస్తాం’’ అని హాదీ స్పష్టం చేశారు.

మరోవైపు, బషర్ అల్ అసద్ దేశం నుంచి పారిపోయారన్న తిరుగుబాటు దారుల ప్రకటనతో పలు పట్టణాల్లో అసద్ వ్యతిరేకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు.

‘‘2011 నుంచి సాగిస్తున్న పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఇది నిజమైన స్వేచ్ఛ. మా కలలు నిజమయ్యాయి’’ అని ఒక పౌరుడు వ్యాఖ్యానించారు.

సిరియా తిరుగుబాటు

ఫొటో సోర్స్, AFP

గందరగోళం

అంతకు ముందు డమాస్కస్‌లో గందరగోళం, భయానక వాతావరణం కనిపించింది. అసలేం జరుగుతుందో ప్రజలకు అర్ధం కావడం కావడం లేదు.

అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఎవరికీ కనిపించకపోవడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది.

రాజధాని డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న అనేక పట్టణాలు, గ్రామాలలో అధ్యక్షుడు అల్-అసద్‌కు, ఆయన కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను, అధికార చిహ్నాలను తిరుగుబాటుదారులు ధ్వంసం చేశారు.

దేశంలోని అనేక పెద్ద నగరాల్లో అసద్, అతని కుటుంబ సభ్యుల విగ్రహాలను కూల్చివేసిన వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.

దేశవ్యాప్తంగా తిరుగుబాటు గ్రూపులు స్వాధీనం చేసుకున్న నగరాలు, పట్టణాలు, గ్రామాలకు అలాంటి భద్రతను అందించడంలో ప్రభుత్వ దళాలు విఫలమయ్యాయి.

మరోవైపు అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఆచూకీ గురించి వదంతులు వేగంగా విస్తరిస్తున్నాయి.

ఆయన దేశంలోనే ఉన్నారా లేదా మరెక్కడికైనా వెళ్లిపోయారా అని కనుక్కోవడానికి ప్రజలు డమాస్కస్‌కు వచ్చిపోయే విమానాలలోని ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు.

దేశం విడిచి వెళ్లిపోయి ఉండొచ్చన్న వదంతులను అధ్యక్షుడు అసద్ కార్యాలయం ఖండించింది. ఆయన ఇప్పటికీ డమాస్కస్‌లో ఉన్నారని, తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వ అధికారులు చెప్పారు.

అయితే, గత కొన్ని రోజులుగా ఆయన పబ్లిక్‌గా కనిపించలేదు.

సిరియా తిరుగుబాటు

ఫొటో సోర్స్, Getty Images

సిరియా గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం తాలూకు సంఘర్షణలతో ఇబ్బందులు పడుతోంది. అయినా, అధ్యక్షుడు అసద్, రెండు వారాల కిందట మొదలైన మరో తిరుగుబాటు వరకు తన ఉనికి కాపాడుకుంటూ వచ్చారు.

ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్న గ్రూపులు, దేశంలోని కీలకమైన నగరాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నామని చెబుతున్నాయి.

గత రెండు మూడు రోజుల్లో ఒక నగరం తర్వాత మరొకటి తమ ఆధీనంలోకి వచ్చినట్లు తిరుగుబాటుదారులు ప్రకటిస్తున్నారు.

దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం సమయంలో తన తోటి అరబ్ నాయకులతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సంబంధాలు క్రమంగా మెరుగుపడ్డాయి.

సిరియా తిరుగుబాటు

ఫొటో సోర్స్, OMAR HAJ KADOUR/AFP via Getty Images

ఒకవేళ ఇప్పుడాయన దేశం విడిచి వెళ్లడమే నిజమైతే ఇక్కడ మళ్లీ అధికార శూన్యత ఏర్పడుతుంది. ప్రస్తుతానికి దాన్ని ఎలా, ఎవరు భర్తీ చేస్తారనే దానిపై స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదు.

ఆయన స్థానంలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తున్న చరిత్రే.

అధ్యక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా కొత్తగా తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న గ్రూపు పునాదులు అల్-ఖైదా నుంచి ఉన్నాయి.

అయితే, దానికి నాయకత్వం వహిస్తున్న అల్ జులానీ మాత్రం సిరియాలోని ఇతర వర్గాలకు భరోసా ఇస్తున్నారు. తన భావజాలాన్ని వారిపై రుద్దబోనని చెబుతున్నారు.

ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)