'రాత్రి ఎవరూ నిద్రపోలేదు'- సిరియా అధ్యక్షుడు అసద్ పారిపోయారని ఎలా తెలిసిందంటే...
- రచయిత, గాబ్రియేలా పొమెరాయ్
- హోదా, బీబీసీ న్యూస్

ఫొటో సోర్స్, Getty Images
సిరియా నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యా రాజధాని మాస్కోలో ఉన్నారని రష్యా అధికారిక మీడియా తెలిపింది. అసద్‌తో పాటు ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం కల్పించనుందని కథనాలు వస్తున్నాయి.
అంతకుముందు, సిరియాలో నాటకీయ పరిణామాలు జరిగాయి. దేశ రాజధాని డమాస్కస్‌లో శనివారం రాత్రి జరిగిన పరిణామాల గురించి తెలుసుకోవడానికి ఉత్కంఠగా ఎదురుచూశామని అక్కడి ప్రజలు చెప్పారు.
తిరుగుబాటుదారులు డమాస్కస్‌ను సమీపిస్తున్నారన్న వార్తలు వెలువడిన కొన్ని గంటల తర్వాత, బషర్ అల్ అసద్ ఆదివారం ఉదయమే డమాస్కస్‌ను వదిలి పారిపోయారని తిరుగుబాటు దళాలు ప్రకటించాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అనధికారిక వీడియోల్లో.. ప్రజలు వీధుల్లో ఉత్సాహంగా రెబల్ ఫైటర్లను స్వాగతిస్తున్నట్లుగా, సెడ్‌నాయ జైలు నుంచి ఖైదీలు విడుదలవుతున్నట్లుగా కనిపిస్తోంది.


ఫొటో సోర్స్, Rania Kataf
'శనివారం రాత్రి సిరియాలో ఎవరూ నిద్రపోలేదు. విదేశాల్లో ఉన్న సిరియన్లు కూడా నిద్రపోలేదు' అని హ్యూమన్స్ ఆఫ్ డమాస్కస్ అనే ఫేస్‌బుక్ పేజీని నిర్వహించే రానియా కాతఫ్ చెప్పారు.
'మేమంతా మా ఫోన్లు ముందేసుకుని వార్తల కోసం ఊపిరి బిగబట్టుకొని ఎదురు చూశాం. నాకు చాలా ఉద్వేగంగా ఉంది. 13 ఏళ్లుగా నిండా నీటిలో మునిగిపోయిన మాకు ఇప్పుడు ఊపిరి అందినట్లుగా అనిపిస్తోంది. నాకంటే వయసులో పెద్దవారైన ఎంతో మంది మాకంటే ఎక్కువ బాధల్ని అనుభవించి ఉంటారని నాకు తెలుసు'' అని ఆమె వివరించారు.
రెబల్ గ్రూప్స్ తిరుగుబాటు మొదలైనప్పుడు భయపడ్డానని, ఇప్పుడు తనకు ఆ భయం పోయిందని ఆమె అన్నారు.
''గతంలో నా అభిప్రాయాన్ని పంచుకునేందుకు చాలా భయపడేదాన్ని. అంతెందుకు.. సోషల్ మీడియాలో ప్రతిపక్షం వారు పెట్టే పోస్టులకు లైక్ కొట్టాలన్నా భయం వేసేది'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Danny Makki
తన వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని మరొక డమాస్కస్ నివాసి బీబీసీతో మాట్లాడుతూ, ''మొట్టమొదటిసారి నిజమైన స్వేచ్చానుభూతి కలుగుతోంది'' అని అన్నారు.
''మాకు కలుగుతున్న అనుభూతి, ఇన్ని సంవత్సరాలు మేము అనుభవించిన వ్యథకు నిదర్శనం. 2011లో తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడు జరుగుతున్నది మా కలకు కొనసాగింపు. భవిష్యత్తుపై మాకు స్పష్టత లేదు. కానీ ఈ రోజు సిరియన్లందరూ వేడుకలు చేసుకుంటారు'' అని ఆయన చెప్పారు.
రక్షణ శాఖ, సిరియా సాయుధ దళాలతో సహా అనేక కీలక ప్రభుత్వ సంస్థలకు నిలయంగా ఉన్న ఉమయ్యాడ్ స్క్వేర్ వీధుల్లో ఆదివారం నాటి దృశ్యాల గురించి డమాస్కస్‌లో నివసించే జర్నలిస్ట్ డానీ మక్కీ వివరించారు.
''ప్రజలు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. డ్యాన్స్ చేస్తున్నారు. ఫోటోలు దిగుతున్నారు. కొందరు ఏడుస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Yazan Al Amari
హయత్ తెహ్రీర్ అల్-షామ్ అనుబంధ దళాలు ఆక్రమించిన డేరా నగరంలో యాజన్ అల్ అమారి ఒక చిన్న మొబైల్ షాపును నిర్వహిస్తున్నారు. ఈ నగరం డమాస్కస్‌కు దక్షిణాన ఉంది.
దేశ రాజధానిలో సంబరాలు చేసుకునేందుకు తన స్నేహితులతో కలిసి డమాస్కస్‌కు వెళుతున్నట్లు ఆయన బీబీసీకి చెప్పారు.
''పొద్దునే లేచి ఆ వార్త చదవగానే మొదట నమ్మశక్యంగా అనిపించలేదు. నిజమా? కాదా? అని గ్రహించేందుకే మాకు సమయం పట్టింది. పుకార్లతో అప్పటికే ప్రజలు భయపడుతున్నారు. కానీ, ఈ వార్త నిజమని స్పష్టంగా తెలిశాక మేం కార్లు తీసుకొని డమాస్కస్‌కు బయల్దేరాం'' అని ఆయన వివరించారు.
''ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. కొంత మంది భావోద్వేగానికి గురవుతున్నారు. ఇన్ని రోజులుగా మేమంతా చాలా భయంతో బతికాం. చాలా ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా మాట్లాడటం ఇదే తొలిసారి. గతంలో స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్లలేకపోయేవాళ్లం. కానీ, ఇప్పుడు నేను వెళ్లాలనుకున్న చోటుకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు'' అని ఆయన చెప్పుకొచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














