ఫిట్‌నెస్ ట్రాకర్స్: ఆరోగ్యం గురించి ఇవి ఇచ్చే సమాచారం సరైనదేనా, డాక్టర్ల ఆందోళన ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో క్లీన్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న స్మార్ట్ వాచీలు, ఫిట్‌నెస్ ట్రాకర్లలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ప్రపంచవ్యాప్తంగా మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారాయి.
రోజూ మనం ఎలా ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం, శరీర ఉష్ణోగ్రత ఎంత, హార్ట్ రేటు ఏంటి, నెలసరి ఎలా ఉంటుంది, నిద్రపోయే సరళిలాంటి వాటిని ఈ గాడ్జెట్లు నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు ఆయా ఎక్సర్‌సైజులు, శరీర ధర్మాలకు చెందిన ప్రమాణాలను మనకు చూపిస్తూ ఉంటాయని ఆయా పరికరాలు తయారు చేసే కంపెనీలు చెబుతుంటాయి.
అయితే, ఈ గాడ్జెట్ల పని తీరుపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి వెల్లడించే ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా నమ్మలేమని వారు అంటున్నారు.
ఇంగ్లండ్ లో లక్షలమంది పేషంట్లకు ఈ పరికరాలను ఇవ్వాలని యూకే హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ ఇటీవల ప్రతిపాదించారు.
క్యాన్సర్ చికిత్సకు పేషంట్ల శరీరం స్పందించే తీరువంటి అనేక ఇతర సూచనలను, సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఈ పరికరాలు కల్పించగలవని ఆయన అన్నారు.

నేను (ఈ కథనం రచయిత) ప్రస్తుతం అల్ట్రా హ్యూమన్ బ్రాండ్ వారి స్మార్ట్ రింగ్‌ను ఉపయోగిస్తున్నాను. నాకు అస్వస్థత కలుగుతున్న సంగతి నాకంటే ముందే ఈ రింగ్ గుర్తించగలిగింది.
నీ ఒళ్లు కాస్త వేడెక్కిందని, కొన్ని రోజులుగా నీకు సరిగా నిద్రలేదంటూ అది నన్ను అప్రమత్తం చేసింది. త్వరలోనే నువ్వు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని కూడా అది నాకు సూచించింది.
పెరిమెనోపాజ్ సంకేతమేమో అనుకుని నేను నిర్లక్ష్యం చేసా. కానీ రెండు రోజుల తరవాత గ్యాస్ట్రిక్ ఫ్లూ వచ్చి మంచాన పడ్డాను.
నాకు ఎదురైనది వైద్య సహాయం కోరాల్సినంత తీవ్రమైన అస్వస్థత అయితే కాదు. కానీ ఒకవేళ ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తే ఈ రింగ్ అందించిన సమాచారం డాక్టర్లు నాకు అందించే చికిత్సలో ఉపయోగపడేవా? అవుననే అంటున్నాయి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల బ్రాండ్లు.
ఇవి సేకరించే సమాచారాన్ని వైద్యులకు చూపించాలని ఇవి ప్రోత్సాహిస్తున్నాయి కూడా.
ఉదాహరణకు ‘ఔరా‘ బ్రాండ్ వారి స్మార్ట్ రింగ్. దానిని ధరించిన వారి ఆరోగ్య సమాచారాన్ని ఒక రిపోర్ట్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోగలిగే వీలును ఇది కల్పిస్తుంది. ఈ రిపోర్ట్ వైద్యులకు చూపించవచ్చని కూడా బ్రాండ్ అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరికరాల వాడకాన్ని యూఎస్‌కు చెందిన డా. జేక్ డోయిచ్ ప్రోత్సహాహిస్తున్నారు. ఒక పేషంట్ మొత్తం ఆరోగ్య స్థితిని మరింత ఖచ్చితంగా అంచనా వేసే అవకాశం ఇవి కల్పిస్తాయని ఆయన అంటున్నారు. కానీ ఈ అభిప్రాయాన్ని ఇతర వైద్యులు అంగీకరించడం లేదు.
డా. హెలెన్ సాలిస్బరీ ఆక్స్‌ఫర్డ్ లోని ఒక ఆసుపత్రిలో జనరల్ ఫిజీషియన్‌గా చేస్తున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చే వారంతా ఈ పరికరాలు ధరించిరారు. కానీ, వాటి వాడకం మెల్లగా పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
"అలాంటి పరికరాలు ఉపయోగపడే సందర్భాలు ఉండొచ్చు. కానీ అవి ఉపయోగపడని సందర్భాలే ఎక్కువ అనేది నా అభిప్రాయం. అంతే కాకుండా ఇలాంటి పరికరాల వల్ల జబ్బున పడ్డామన్న అనుమానం, ఆ జబ్బును నియంత్రించాలన్న ఆతృత వంటి మనస్తత్వాలను పెంపొందే సమాజం తయారవుతోందన్నది నా ఆందోళన" అని ఆమె అన్నారు.
"ప్రతిదాన్ని అనుమానించే అలవాటును ఈ పరికరాలు ప్రోత్సాహిస్తాయని నేను అనుకుంటున్నా. మనకు నిజంగా అస్వస్థత అనిపించినప్పుడు కాకుండా ఈ పరికరం మనకు ఆ విషయం చెప్పినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లే ప్రమాదం కూడా ఉంది" అని డా.సాలిస్బరీ అన్నారు.
ఈ గాడ్జెట్లు చూపించే ప్రతిచిన్న సమాచారానికీ భయపడిపోయి అనవసరంగా హెల్త్ ఇన్సూరెన్స్‌లను కూడా దుర్వినియోగం చేసుకునే అవకాశం లేకపోలేదు.
ఉదాహరణకు శరీరంలో ఒక క్యాన్సర్ ట్యూమర్‌ని వాచ్ గానీ, యాప్ గానీ గుర్తించే అవకాశం తక్కువ. స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే మరికొన్ని పరికరాలు మనలో మంచి అలవాట్లను ప్రోత్సాహిస్తాయన్న విషయం కూడా వాస్తవమే. అయితే మనం వాటి నుంచి నేర్చుకోగల అత్యంత మంచి విషయం మాత్రం తరతరాలుగా వైద్యులు ఇచ్చే సలహాయే.
అంటే ఎక్కువగా నడవడం, మద్యాన్ని మితంగా సేవించడం, శరీర బరువును ఆరోగ్య పరిమితులలో ఉంచుకోవడంలాంటివి. ఇది నిత్యం అందరికీ ఉపయోగపడే సలహా అని ఆమె అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత అధికంగా అమ్ముడుపోయే స్మార్ట్ వాచ్- ఆపిల్ వాచ్. అయితే వాటి అమ్మకాలు ఇటీవలి కాలంలో కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. కానీ, ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆపిల్ నిరాకరించింది.
తమ వాచ్ లోని హార్ట్ ట్రాకింగ్ ఫీచర్ వల్ల ప్రాణాలు దక్కిన సందర్భాలను ఆ కంపెనీ తమ వాచ్ ప్రమోషన్ యాడ్స్‌లో వాడుకుంటోంది. అలాంటి సంఘటనల గురించి నేను కూడా విన్నాను. కానీ అందులో తప్పుడు అలర్ట్ వచ్చిన సంఘటనలు ఎన్నో అది చెప్పదు.
అనేకసార్లు ఈ పరికరాలు సేకరించిన ఆరోగ్య సమాచారాన్ని పేషంట్లు అందించినప్పుడు, వైద్యులు వాటిని గుడ్డిగా నమ్మకుండా, ఆసుపత్రిలోని ప్రామాణిక పరికరాలతో ఆ డాటాను ధ్రువీకరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడానికి మంచి కారణాలే ఉన్నాయి.
"మీరు ఆసుపత్రికి వెళ్లి ఈసీజీ పరీక్ష చేయించుకుంటున్నప్పుడు, ఆ ఈసీజీ యంత్రం ఎంత కరెంటును వాడుతున్న విషయం గురించి మీరు ఆందోళన చెందాల్సిన పని ఉండదు. ఒక ఈసీజీ యంత్రమంత ఖచ్చితంగా మీ వాచ్ మీ హార్ట్ రేటును వెల్లడించే అవకాశం లేదు. ఎందుకంటే ఇవి బ్యాటరీ సహాయంతో నడుస్తాయి. నిరంతరం వాడటం వల్ల వాటి శక్తి తగ్గిపోతుంది" డాక్టర్ యాంగ్ వీ అన్నారు. ఈయన నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్శిటీలో వేరబుల్ టెక్నాలజీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్.
అంతేకాకుండా ఆ గాడ్జెట్‌ను ధరించిన వ్యక్తి చేతి కదలికలు, ఆ వ్యక్తి మొత్తం కదలికల వల్ల కూడా ఆ పరికరం అందించే సమాచారం కొంత మార్పులకు లోనుకావచ్చు. అందువల్ల అలాంటి సమాచారాన్ని పూర్తిగా నమ్మలేమన్నది నిపుణుల అభిప్రాయం.

ఫొటో సోర్స్, Helen Salisbury
డా. యాంగ్ వీ నా స్మార్ట్ రింగ్‌ను చూపిస్తూ ‘‘ ఒక వ్యక్తి హార్ట్ రేటును కొలవాలంటే మణికట్టు నుంచిగానీ, లేదంటే నేరుగా గుండె నుంచి గానీ కొలవడం మంచింది. వేళ్ల నుంచి వచ్చే సమాచారం కచ్చితమైనది కాకపోవచ్చు’’ అని అన్నారు.
ఈ పరికరాల్లోని సమాచార లోపాలను సవరించే బాధ్యత ఆయా సాఫ్ట్‌వేర్‌లది. కానీ ఈ పరికరాల సమాచార సేకరణ విధానాలకుగానీ, వాటి సెన్సర్లకు గానీ, ఆఖరికి అవి వెల్లడించే సమాచారానికిగానీ ఎలాంటి అంతర్జాతీయ ప్రమాణాలు లేవు.
ఒక పరికరాన్ని తరచూ ధరించడం వల్ల దాని నుంచి సరైన సమాచారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇక్కడొక సమస్య కూడా ఉంది. దానికి ఉదాహరణే ఈ ఘటన.
బెన్‌వుడ్ అనే వ్యక్తి ఒక రోజు బయటకు వెళ్ళినప్పుడు కారు ప్రమాదంలో చిక్కుకున్నారని ఆయన ధరించిన ఆపిల్ వాచ్ నుంచి ఆయన భార్యకు అదే పనిగా నోటిఫికేషన్లు వెళ్లాయి.
వాటిని బెన్ భార్య చూసారు. నీ భర్తకు కాల్‌కు బదులు మెసేజ్ చేయమని ఆ వాచ్ సలహా ఇచ్చింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే ఇతర సర్వీసులకు ఫోన్ చేయడానికి (హాస్పిటల్‌కు లేదా రెస్క్యూ సర్వీసులకు) ఆయన కాల్ సదుపాయాన్ని వాడుకుంటారని, ఆ సమయంలో కాల్ చేయడం మంచిది కాదని అది అలా సూచించింది.
బెన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఆయన భార్య నెంబర్‌కు ఈ అలర్ట్ మేసేజులు వెళ్లాయి. ఈ అలర్ట్ లు నిజమే. కానీ అవి అసందర్భం, అనవసరం.
బెన్ ఒక రేస్ ట్రాక్‌లో కొన్ని కార్లను వేగంగా నడిపారంతే. రేస్ కార్లు నడపడంలో ఎక్స్‌పర్ట్ కాకపోయినా అవి నడుపుతున్నంతసేపు తాను సురక్షితంగానే ఉన్నానని ఆయన అన్నారు. కానీ, ఆయన ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా అలర్ట్ మెసేజ్ వెళ్లింది.
"సంఘటనకు, అలర్ట్‌కు మధ్య ఉన్న సన్నని రేఖను జాగ్రత్తగా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. ఈ సాంకేతికత గురించి ఈ పరికరాల తయారీదారులు, ఎమర్జెన్సీ సేవలందించేవారు, ఘటనలకు మొదట స్పందించేవారు భవిష్యత్తులో ఎలా ఆలోచించస్తారో నాకు తెలుసుకోవాలనుంది'' అని ఆయన ఒక బ్లాగ్ పోస్టులో అన్నారు.

ఫొటో సోర్స్, Oura
"ఈ పరికరాలు వెల్లడించే సమాచారాన్ని మా వైద్య వ్యవస్థలలోకి అనుసంధానించడంలో చాలా సవాళ్లు ఉన్నాయన్నది వాస్తవమే. దీనిపై యూకేలో కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నా, ఒక పరిష్కారానికి రాలేకపోయాము.'' అని కింగ్స్ ఫండ్‌లో డిజిటల్ టెక్నాలజీస్ ఫెలో ప్రితేష్ మిస్త్రీ అన్నారు.
ఆరోగ్య సంరక్షణను ఆసుపత్రుల నుంచి సమాజంలోకి తీసుకురావడానికి యూకే ప్రభుత్వం సరైన కారణం వెతకాల్సి ఉందని ఆయన అన్నారు.
ఈ మార్పును ప్రవేశపెట్టడానికి అనేక సవాళ్లు ఉన్నాయి. దీనికన్నా ముందు సరైన సాంకేతిక మౌలిక సదుపాయాలు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది సమస్యగానే మిగిలిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














