ఇండియాలో టిక్‌టాక్‌ను నిషేధించినప్పుడు ఏమైంది? ఇప్పుడు అమెరికాలో ఏం జరగనుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, థామస్ జర్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2020లో నిషేధానికి గురైన సమయానికి భారత్‌లో టిక్‌టాక్ ప్రజాదరణ పొందిన యాప్‌లలో ఒకటి.
ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి వస్తే ఏం జరుగుతుందో అంచనా వేయడానికి భారత్‌లో జరిగిన దానిని ఒక అనుభవంగా చూడొచ్చు.
4 ఏళ్ల క్రితం వరకు టిక్‌టాక్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్‌గా ఉండేది. 20 కోట్ల మంది యూజర్స్ ఉండేవారు.
తమ జీవితాలను మార్చుకునే అవకాశాలను క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లకు సృష్టించి, సరికొత్త సంస్కృతికి ఊతమిచ్చింది.
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనే ముందు వరకు కూడా తమకు ఎదురేది లేనట్లుగా ఈ యాప్ దూసుకుపోయింది.
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 2020 జూన్ 29న ఈ యాప్‌ను నిషేధించారు. దీంతో, రాత్రికి రాత్రే భారత్‌లో టిక్‌టాక్ మాయమైంది.
కానీ, భారతీయుల టిక్‌టాక్ అకౌంట్లు, వీడియోలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి.

ఆ రోజు నుంచి టిక్‌టాక్ మాయం కానుందా?
అమెరికాలో ఏం జరగనుందోనని అంచనా వేయడానికి ఇదో ప్రివ్యూలా ఉపయోగపడుతుంది.
అమెరికాలో టిక్‌టాక్ యాప్ నిషేధం బిల్లుపై 2024 ఏప్రిల్‌లో అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. టిక్‌టాక్ యాజమాన్యమైన 'బైట్ డ్యాన్స్' 9 నెలల్లోగా తమ వాటాలను అమ్మేయాలి. ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించే అవకాశాన్ని చట్టం కల్పించింది. లేకపోతే దేశంలో నిషేధం తప్పదని చట్టం చెబుతోంది.
అయితే, యాప్‌ను అమ్మే ఉద్దేశం తమకు లేదని బైట్ డ్యాన్స్ సంస్థ తెలిపింది.
ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు డిసెంబర్ 6న తిరస్కరించింది.
దీంతో, జనవరి 29 నుంచి ఈ యాప్ అమెరికాలో కనిపించకపోవచ్చు. అయితే, ఈ వివాదం అమెరికా సుప్రీం కోర్టుకు చేరే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఒక భారీ సోషల్ మీడియా యాప్‌ను నిషేధించడం అమెరికా టెక్ చరిత్రలో ఒక అసాధారణ ఘటనగా చెప్పుకోవచ్చు.
అయితే, ఒక పెద్ద దేశం టిక్‌టాక్ వంటి పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించినప్పుడు ఏమి జరుగుతుందనడానికి భారత్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
టిక్‌టాక్‌ను నిషేధించిన దేశాల జాబితాలో భారత్ ఒక్కటే లేదు. 2023 నవంబర్‌లో నేపాల్ కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధించింది.
2020 నుంచి పాకిస్తాన్ ఆ యాప్‌పై అనేకసార్లు తాత్కాలిక నిషేధం విధించింది.
టిక్‌టాక్ నిషేధాన్ని యూజర్లు తొందరగా అర్థం చేసుకోగలరు.
టిక్‌టాక్‌ను నిషేధిస్తే టిక్‌టాక్ కల్చర్ కూడా చాలావరకు కనుమరుగు అవుతుందని భారత్ అనుభవంతో తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
హైపర్ లోకల్ కంటెంట్‌కు టిక్‌టాక్ ప్రాధాన్యం
ముంబయికి చెందిన సినిమా విమర్శకురాలు సుచరిత త్యాగి టిక్‌టాక్‌పై నిషేధం విధించే సమయానికి 11వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు. ఆమె వీడియోల్లో కొన్నింటికి మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయి.
"టిక్‌టాక్ చాలా పెద్దది. దేశంలోని ప్రజలంతా తమ డ్యాన్స్, స్కిట్స్‌ను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. మారుమూల పల్లెల్లో ఉన్నవారు సైతం తమ జీవితాల గురించి తెలిపేవారు. ఈ యాప్ కారణంగా ఎంతో మంది బయటికి ప్రపంచానికి తెలిశారు" అని సుచరిత అన్నారు.
ఆ యాప్ ప్రత్యేకంగా నిలవడానికి ప్రధాన కారణం...అల్గారిథమ్. ఈ అల్గారిథమ్ గ్రామీణ భారతీయులకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఇతర యాప్స్‌లో సాధ్యం కాని విధంగా సెలబ్రిటీ హోదాను అందుకోడంలో ఈ అల్గారిథమ్ కీలక పాత్ర పోషించింది.
"ఈ యాప్ మొదటిసారిగా కంటెంట్ క్రియేషన్‌లో ప్రజాస్వామ్యాన్ని సృష్టించింది" అని దిల్లీకి చెందిన టెక్నాలజీ రచయిత, విశ్లేషకులు ప్రశాంత్ కె. రాయ్ అన్నారు.
"తమను కూడా ఫాలో అయ్యే వాళ్లు ఉంటారా? అనుకునే ఆర్థికంగా-సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి వీడియోలు ప్రజాదరణ దక్కించుకోవడం చూశాం. ఎవరిని అయితే చూడాలనుకుంటున్నామో వారినే చూపించేలా టిక్‌టాక్ అల్గారిథమ్ పని చేసింది. హైపర్ లోకల్ వీడియోల పరంగా చూస్తే టిక్‌టాక్ లాంటిది ఎక్కడా లేదు" అని ఆయన అన్నారు

ఫొటో సోర్స్, Getty Images
మరిన్ని చైనా యాప్‌లపై అమెరికా నిషేధం విధిస్తుందా?
అమెరికాలోనూ టిక్‌టాక్ ఇలాంటి ప్రాధాన్యమే దక్కించుకుంది. అనేక ప్రత్యేకమైన కమ్యూనిటీలు, క్రియేటర్స్, వ్యాపారులు ఈ యాప్‌ను ఆధారంగా చేసుకుని జీవనోపాధిని సృష్టించుకున్నారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో ఇలాంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఉదాహరణకు ఇన్‌స్టాగ్రామ్‌ను తీసుకుంటే... ఇక్కడ ఎవరికైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారో వారికి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. టిక్‌టాక్ మాత్రం సాధారణ యూజర్స్ పోస్టులు పెట్టేలా ప్రోత్సహించడానికే అధిక ప్రాధాన్యమిస్తుంది.
టిక్‌టాక్‌తో పాటు చైనాకు చెందిన మరో 58 యాప్‌లను భారత్ నిషేధించింది. ఆ జాబితాలో ప్రస్తుతం అమెరికాలో మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఫ్యాషన్ షాపింగ్ యాప్ 'షీన్' కూడా ఒకటి.
ఆ తరువాత కూడా మొత్తంగా భారత్ వందకుపైగా చైనాకు చెందిన యాప్‌లను నిషేధించింది. అయితే, ఇటీవల జరిగిన చర్చల అనంతరం భారత్‌లో 'షీన్' మళ్లీ అందుబాటులోకి వచ్చింది.
అమెరికాలోనూ అదే జరగొచ్చు. ఇతర చైనా యాప్‌లపై చర్యలు తీసుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకునేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. టిక్‌టాక్ విషయంలో రాజకీయ నాయకులు లేవనెత్తుతున్న గోప్యత, జాతీయ భద్రత అంశాలు ఇతర యాప్‌లకు కూడా వర్తిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడైనా ఒక ప్రముఖ యాప్‌ను నిషేధిస్తే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతర సంస్థలు ప్రయత్నిస్తుంటాయి.
"టిక్‌టాక్‌ను నిషేధించిన తరువాత అది అనేక కోట్ల రూపాయల అవకాశాన్ని తెచ్చిపెట్టింది. దానిని అందిపుచ్చుకునేందుకు అనేక భారతీయ కంపెనీలు రంగంలోకి దిగాయి " అని నిఖిల్ పహ్వా తెలిపారు. ఈయన మీడియానామా అనే వార్తాసంస్థ వ్యవస్థాపకులు, అలాగే భారత టెక్ విధానాల విశ్లేషకులు కూడా.
టిక్‌టాక్‌పై నిషేధం తరువాత కొన్ని నెలల పాటు భారతీయ సోషల్ మీడియా కంపెనీలు వార్తల్లో ఉన్నాయి. చింగారి, మోజో, ఎమ్ఎక్స్ టకాటక్ వంటివి మాజీ టిక్‌టాక్ స్టార్లను తమ ప్లాట్‌ఫామ్స్ వైపు ఆకర్షించి, ప్రభుత్వ మద్దతు, పెట్టుబడులతో మొదట్లో విజయం సాధించాయి. అయితే, టిక్‌టాక్ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేకపోయాయి.
టిక్‌టాక్‌పై నిషేధం విధించిన కొన్ని నెలల్లోనే 2020 ఆగస్టులో షార్ట్ వీడియోలతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రారంభించింది. ఆ తరువాత యూట్యూబ్ కూడా షార్ట్స్ మొదలుపెట్టింది. అప్పటికే భారత మార్కెట్‌లో పాతుకుపోయిన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పెద్ద సంస్థలతో కొత్త స్టార్టప్స్ పోటీ పడలేకపోయాయి.
"టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన అనేక ఫ్లాట్‌ఫామ్స్‌పై బజ్ ఉండేది. కానీ, అవేవి ఎక్కువ కాలం మార్కెట్‌లో నిలబడలేకపోయాయి. చివరకు, ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటి లబ్ధి పొందింది" అని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతీక్ వాఘ్రే అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పెద్ద పెద్ద టిక్‌టాక్ స్టార్స్ మెటా, గూగుల్ యాప్స్‌లోకి మారడానికి పెద్ద సమయమేమి తీసుకోలేదు. ఆ యాప్స్‌లోనూ అదే స్థాయిలో విజయాన్ని అందుకున్నారు.
ఉదాహరణకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గీత్‌ను చూద్దాం. "అమెరికన్ ఇంగ్లిష్" పాఠాలు చెబుతూ టిక్‌టాక్‌లో మొదట్లో స్టార్‌డమ్ తెచ్చుకున్న వారిలో ఈమె ఒకరు. టిక్‌టాక్ నిషేధించే సమయానికి ఆమెకు చెందిన మూడు అకౌంట్లకు కోటి మంది ఫాలోవర్స్ ఉండేవారు.
టిక్‌టాక్‌పై నిషేధంతో తన భవిష్యత్‌పై ఆందోళనగా ఉందని 2020లో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గీత్ చెప్పారు. కానీ, 4 ఏళ్ల తరువాత ఆమె ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో 50 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.
అయితే, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లు టిక్‌టాక్ ట్రాఫిక్‌ను పొంది ఉండొచ్చు గానీ టిక్‌టాక్ లాంటి అనుభూతిని మాత్రం ఇవ్వలేకపోతున్నాయని అనేక మంది యూజర్లు, నిపుణులు బీబీసీతో చెప్పారు.
"ఇతర వాటితో పోల్చితే టిక్‌టాక్ భిన్నమైనది. టిక్‌టాక్‌లో రైతులు, కూలీలు, మూరుమూల పల్లెల్లోని ప్రజలు వీడియోలు అప్‌లోడ్ చేసేవాళ్లు. ఇప్పుడు అలాంటివి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లలో కనిపించట్లేదు. టిక్‌టాక్ డిస్కవరీ మెకానిజం చాలా భిన్నమైనది" అని పహ్వా తెలిపారు.
షార్ట్ వీడియోలకు చిరునామాగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్
ఒక వేళ అమెరికాలోనూ టిక్‌టాక్ నిషేధిస్తే, అమెరికా సోషల్ మీడియా రంగం కూడా ఇండియాను అనుసరించే అవకాశం ఉంది. భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించిన 4 ఏళ్ల తరువాత, ఇప్పుడు షార్ట్ వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లు చిరునామాగా మారిపోయాయి. లింక్డిన్ కూడా టిక్‌టాక్ తరహా వీడియో ఫీడ్‌తో ప్రయోగాలు చేస్తోంది.
అయితే, విజయం సాధించాలంటే టిక్‌టాక్ కల్చర్‌ను అనుసరించాల్సిన పనిలేదని కాంపిటేటర్స్ నిరూపించారు. ఏది ఏమైనప్పటికీ, భారత్‌లో జరిగినట్లుగా అమెరికాలోనూ హైపర్ లోకల్ కంటెంట్ మాయమయ్యే అవకాశం ఉంది.
ఫ్యూ రీసెర్చ్ సెంటర్ వివరాల ప్రకారం.. 18 నుంచి 29 ఏళ్ల వయసు గల అమెరికన్లలో మూడోవంతు మంది టిక్‌టాక్‌లోనే న్యూస్ చూస్తున్నారు.
భారత్‌తో పోల్చితే అమెరికాలో తక్కువగానే టిక్‌టాక్ యూజర్లు ఉన్నారు. భారత్‌లో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 20 కోట్ల మంది టిక్‌టాక్ యూజర్లు ఉండేవారు.
అమెరికాలో 17 కోట్ల యూజర్లు ఉన్నారు. అది అమెరికా జనాభాలో సగం కంటే ఎక్కువని టిక్‌టాక్ తెలిపింది.
"భారత్ నిషేధించే నాటికి టిక్‌టాక్ ఇప్పుడున్నంత పెద్దగా ఏమి లేదు. గత కొన్నేళ్లుగా ఇదో సాంస్కృతిగా విప్లవంగా మారింది. ఇప్పుడు అమెరికాలో నిషేధం ఎదుర్కోవడం ఆ సంస్థపై భారీ ప్రభావమే చూపే అవకాశం ఉంది" అని త్యాగి తెలిపారు.
ఈ నిషేధం వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందా?
అమెరికా ప్రభుత్వం నిర్ణయంపై టిక్‌టాక్ ప్రతిస్పందన భిన్నంగానే ఉంది. యూఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ పోరాటం సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లొచ్చు. భారత్ నిషేధించినప్పుడు టిక్‌టాక్ న్యాయపోరాటం చేయలేదు.
"చైనా కంపెనీలు భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లడానికి వెనుకాడడానికి కారణం ఉంది. వాళ్లు సానుభూతిపరులుగా కనిపిస్తారని అనుకోవట్లేదు" అని రాయ్ చెప్పారు.
టిక్‌టాక్‌పై నిషేధం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు.
"చైనా నుంచి ఇదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంది" అని పహ్వా తెలిపారు.
భారత్ నిషేధం విధించినప్పుడు ఆ నిర్ణయాన్ని చైనా ఖండించింది. కానీ, ప్రతీకార చర్యలకు దిగలేదు. ఇప్పుడు అమెరికా దీని నుంచి తప్పించుకోకపోవచ్చు.
భారత్‌లో టిక్‌టాక్ నిషేధంపై చైనా అలా స్పందించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, భారతీయ టెక్ ఇండస్ట్రీ ప్రధానంగా చైనాపై ఆధారపడలేదు. కానీ, అమెరికాకు అలా కాదు.
ఇప్పటికే "డిలీట్ అమెరికా" అనే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది. అందులో భాగంగా ఆ దేశంలో అమెరికా టెక్నాలజీ స్థానంలో దేశీయ టెక్నాలజీతో భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు టిక్‌టాక్‌పై నిషేధం నిర్ణయం దీనిని మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














