ప్రపంచంలోనే తొలి రాగి స్టాంప్ భారత్‌లోనే విడుదలైంది, ప్రస్తుతం ఈ రెండు స్టాంపుల విలువ ఎంతంటే...

పోస్టల్ స్టాంపులు
    • రచయిత, సీటూ తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోనే మొట్టమొదటి రాగి పోస్టల్ స్టాంప్‌‌ 250 ఏళ్ల కిందట బిహార్ రాజధాని పట్నాలో విడుదలైంది.

1774 మార్చి 31న జారీ చేసిన ఒక అణా, రెండు అణాల స్టాంపులను అప్పట్లో వన్ వే ప్రీపెయిడ్ టోకెన్లుగా వాడేవారు.

ఈ రెండు స్టాంప్‌ల విలువ ఇప్పటి కరెన్సీలో చెప్పుకుంటే సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని బిహార్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అనిల్ కుమార్ చెప్పారు.

ఈ స్టాంపును అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలోని ఈస్ట్ ఇండియా బెంగాల్ ప్రెసిడెన్సీ విడుదల చేసింది.

ఇందులోని రెండు అణాల స్టాంపు వ్యాసం 26.4 మి.మీ కాగా, బరువు 8.95 గ్రాములు.

గుండ్రంగా ఉన్న రెండు అణాల స్టాంప్‌ మీద ఒకవైపు 'పట్నా పోస్ట్ దో అణా' అని ఇంగ్లిష్‌లో, రెండో వైపున పర్షియన్ భాషలో 'అజీమాబాద్ ఢాక్ దో అణా' అని రాసి ఉంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రాగి స్టాంప్‌కు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, బిహార్ రాజధాని పట్నాలో 'పోస్టల్ స్టాంప్స్ ఎగ్జిబిషన్' నిర్వహించారు.

ఇందులో దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 వేల పోస్టల్ స్టాంపులను ప్రదర్శించారు.

అరుదైన స్టాంప్ బ్రిటీష్ గయానా వన్ సెంట్ మెజెంటా కూడా ఈ ప్రదర్శనలో ఉంది. బ్రిటీష్ వలస కాలనీ గయానాలో స్టాంపుల సరఫరా ఆలస్యమైనప్పుడు మూడు తాత్కాలిక స్టాంపులను విడుదల చేశారు. 1856లో వీటిని వాడారు. స్టాంపులు వచ్చాక వీటి చెలామణి ఆగిపోయింది. ఆ మూడింటిలో ఒక్కటి మాత్రమే దొరికింది.

1873లో గయానాకు చెందిన 12 ఏళ్ల బాలుడు తన ఇంటి దగ్గర ఉన్న పాత పేపర్లలో వన్ సెంట్ మెజెంటా స్టాంప్‌ను గుర్తించాడు.

ఈ బాలుడు ఆ స్టాంప్‌ను నీల్ ఆర్. మెకెన్నాన్‌ అనే వ్యక్తికి 6 షిల్లింగ్‌లకు అమ్మాడు. ఆ తర్వాత ఈ స్టాంప్ చాలామంది చేతులు మారింది. 1922 ఏప్రిల్‌లో దీనిని ఒక అమెరికన్ పారిశ్రామికవేత్త 7343 పౌండ్ల (ఇప్పటి విలువలో సుమారు రూ. 7,92,203 )కు కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఒక స్టాంప్‌కు చెల్లించిన అత్యధిక ధర ఇదే.

పోస్టల్ స్టాంపులు

ఈ ప్రదర్శనలో పెట్టిన అనేక రకాల స్టాంపుల వెనక అనేక కథలు ఉన్నాయి. రోమన్ల నమ్మకాలకు సంబంధించిన అనేక స్టాంపులు కూడా కనిపిస్తాయి.

రోమన్ల విశ్వాసం ప్రకారం మన్మథుడికి కూడా దేవుడి హోదా ఉంది. ఆయన్ను ప్రేమ, మోహాలకు సంబంధించిన దేవుడిగా భావిస్తారు. మన్మథుడు, ఆయన ప్రేమ బాణం చిహ్నాలను యువ ప్రేమికులు ఇప్పటికీ వాడుతుంటారు.

పోస్టల్ స్టాంపులు

'మల్లికా-ఎ-గజల్' బేగం అక్తర్‌పై పోస్టల్ స్టాంప్

భారతదేశంలోని ప్రసిద్ధ గజల్ గాయని బేగం అక్తర్‌పై విడుదల చేసిన తపాలా స్టాంపు కూడా ఇక్కడ ప్రదర్శించారు.

దీని తయారీలో ఉపయోగించిన ఇంక్, ఈ స్టాంప్ తడిస్తే కరిగిపోతుంది. అందుకే 1994లో విడుదలైన ఈ స్టాంప్‌ను తర్వాత చలామణి నుంచి తొలగించారు.

పోస్టల్ స్టాంపులు

స్టాంపుల సేకరణ ఒక హాబీ

స్టాంప్ కలెక్షన్‌ అనేది ‘కింగ్ ఆఫ్ హాబీస్‌’గా చెబుతుంటారు.

"ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ప్రజలు స్టాంపుల సేకరణ జరుపుతున్నారు" అని అనిల్ కుమార్ చెప్పారు.

పోస్టల్ స్టాంపులు

భారతదేశంలో లేఖలు పంపడం, స్వీకరించడం ప్రారంభమైన రోజుల్లో తపాల తీసుకువెళ్లే విధానాలను వివరించే స్టాంపులు కూడా ఈ ప్రదర్శనలో పెట్టారు.

రన్నర్ (లెటర్ డెలివరీ పర్సన్)తో పాటు బల్క్ ట్రైన్, పారాచూట్ మెయిల్, మోటర్ మెయిల్, ఎడారి ప్రాంతాలలో తపాలా చేరవేతకు ఉపయోగించిన ఒంటె వంటివి కూడా ఈ స్టాంపులపై కనిపిస్తాయి.

ఈ స్టాంప్ ఎగ్జిబిషన్‌లో మహారాజా రంజిత్ సింగ్‌పై విడుదల చేసిన స్టాంపు కూడా ఉంది. ఆయన పేరు మీదనే 1934లో రంజీ ట్రోఫీ మొదలైంది.

పోస్టల్ స్టాంపులు
ఫొటో క్యాప్షన్, బీబీసీ హిందీ సర్వీస్ పేరుతో విడుదలైన మేఘదూత్ పోస్ట్‌కార్డ్

బీబీసీ పేరిట స్టాంపులు

ఇవే కాకుండా, బీసీసీఐ వ్యవస్థాపకుడు సుబ్రమణ్యం నుంచి, 1932లో ఇంగ్లండ్‌లో మొదటి టెస్ట్ టూర్‌కు వెళ్లిన కెప్టెన్ సర్ నట్వర్ సింగ్ బహదూర్ వరకు అనేకమంది వ్యక్తుల ఫోటోలతో స్టాంపులు ఉన్నాయి.

ఎయిరిండియా 1948 జూన్ 8న బొంబాయి (ప్రస్తుతం ముంబయి) నుంచి లండన్‌కు మొదటి విమానాన్ని నడిపింది. ఆ సందర్భంగా విడుదల చేసిన సావనీర్, స్టాంప్‌లకు కూడా ఈ ప్రదర్శనలో చోటు దక్కింది.

బీబీసీ హిందీ రేడియో సేవలు 1940 మే 11న ప్రారంభమయ్యాయి. బీబీసీ హిందీ సర్వీస్ పేరుతో విడుదలైన మేఘదూత్ పోస్ట్‌కార్డ్ కూడా ఈ ప్రదర్శనలో పెట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)