బషర్ అల్ అసద్ ఎక్కడ? పబ్లిక్‌లో కనిపించిన చివరి ఫొటో ఇదేనా

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డేవిడ్ గ్రిటెన్
- హోదా, బీబీసీ న్యూస్
సిరియా రాజధాని నగరాన్ని రెబల్స్ అధీనంలోకి తీసుకున్న తర్వాత బషర్ అల్ అసద్, అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారని, దేశాన్ని విడిచి వెళ్లిపోయారని రష్యా ప్రకటించింది.
అయితే, ఆయన ఆచూకీ వివరాలను రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.
సిరియా నుంచి అసద్ పారిపోయినట్లు వచ్చిన తొలి అధికారిక ప్రకటన ఇదే.
వారం రోజుల కిందట డమాస్కస్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రితో భేటీ తరువాత నుంచి అసద్‌కు సంబంధించిన ఫొటోలేవీ కనిపించలేదు.
రెబల్స్‌ను అణచివేస్తామంటూ ఆయన అదే రోజున ఆయన ప్రతిజ్ఞ చేశారు.
ఆదివారం తెల్లవారుజామున ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) సాయుధులు డమాస్కస్‌లోకి ప్రవేశించారు. వారికి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.
'నిరంకుశ బషర్ అల్ అసద్ దేశం నుంచి పారిపోయాడని' హెచ్‌టీఎస్, దాని మిత్రపక్షాలు ప్రకటించాయి.

అసద్‌ను తీసుకెళ్తున్నట్లుగా భావిస్తున్న ఒక విమానం డమాస్కస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిందని యూకేకు చెందిన ఒక మానిటరింగ్ గ్రూప్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ (ఎస్‌ఓహెచ్‌ఆర్) అధిపతి రమి అబ్దుల్ రహమాన్ పేర్కొన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటలకు ఈ విమానం టేకాఫ్ అవుతుందని తనకు సమాచారం ఉందని ఆయన తెలిపారు.
అయితే.. 'ద ఫ్లైట్ రాడార్ 24' వెబ్‌సైట్, ఆ సమయంలో విమాన నిష్క్రమణను రికార్డు చేయలేదు. కానీ, చామ్ వింగ్స్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ ఎ320 అనే ప్రయాణికుల విమానం ఆదివారం ఉదయం 00:56 గంటలకు యూఏఈలోని షార్జాకు బయలుదేరింది.
ఆ విమానం సరైన సమయానికి షార్జాలో దిగింది. యూఏఈలో అసద్ ఉన్నారో లేదో తనకు తెలియదని బహ్రెయిన్‌లో రిపోర్టర్ల మాట్లాడుతూ యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఒకరు చెప్పారు.
ఆదివారం తెల్లవారుజామున డమాస్కస్ ఎయిర్‌పోర్ట్‌లో సిరియాకు చెందిన ఒక విమానంలో అసద్ ఎక్కినట్లు ఇద్దరు సీనియర్ అధికారులను (సిరియా) ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
సిరియన్ ఎయిర్ ఇల్యుషిన్2- 76టి కార్గో విమానం ఒకటి ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిందని, దాని గమ్యస్థానం ఎక్కడికో తెలియదని కూడా రాయిటర్స్ తెలిపింది.
ఫ్లైట్‌రాడార్ 24 వెబ్‌సైట్ డేటా ప్రకారం, ఆ విమానం మొదట రాజధాని నుంచి తూర్పు దిశగా వెళ్లింది. తర్వాత వాయువ్యం వైపు తిరిగి మధ్యధరా తీరం వైపు మళ్లింది.
ఇది రష్యా నౌకా, వైమానిక స్థావరాలకు నిలయం. అలాగే అసద్‌కు చెందిన అలవైట్ సెక్ట్‌కు మంచి పట్టున్న ప్రాంతం.
తర్వాత హోమ్స్ నగరం మీదుగా 20 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఈ విమానం యూ టర్న్ తీసుకొని ఎత్తు తగ్గుతూ.. మళ్లీ తూర్పు వైపు ఎగరడం మొదలుపెట్టింది.
సెంట్రల్ సిటీ అయిన హోమ్స్‌ను శనివారం రాత్రి రెబెల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు.
సుమారు 4:39 గంటల సమయంలో విమానం ట్రాన్స్‌ప్లాండర్ సిగ్నల్ కోల్పోయింది. ఆ సమయంలో హోమ్స్ నగరానికి పశ్చిమాన 13 కి.మీ దూరంలో, 1,625 అడుగుల ఎత్తులో ఆ విమానం ఎగురుతోంది.
''పాతదైన ఆ విమానంలోని పాత తరానికి చెందిన ట్రాన్స్‌ప్లాండర్ ఉంది. కాబట్టి అందులోని డేటా కనిపించి ఉండకపోవచ్చు. జీపీఎస్ జామింగ్ ప్రాంతంలో ఎగురుతున్నందున అందులోని డేటా తప్పుగా కూడా చూపించి ఉండొచ్చు'' అని ఎఫ్లైట్‌రాడార్24 ట్వీట్ చేసింది.
సిగ్నల్ కోల్పోయిన ప్రాంతంలో విమాన ప్రమాదం జరిగినట్లుగా ఎలాంటి రిపోర్టులు లేవు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














