ఆస్మా: అసద్ భార్యను ‘ఎడారి గులాబీ’ అని ఎందుకన్నారు? ఆ కథనాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images
బషర్ అల్-అసద్ సుమారు 25 ఏళ్ల పాటు సిరియా అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం బ్రిటిష్ సంతతికి చెందిన ఆయన భార్య ఆస్మా అల్ అసద్ ఆయన వెన్నంటే నిలిచారు.
సిరియా ఆధునికీకరణకు ఒకప్పుడు ముఖచిత్రంగా కనిపించిన ఈ 49 ఏళ్ల మహిళ.. 2011 మార్చిలో దేశంలో తీవ్ర అంత్యరుద్ధ్యం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలకు కనిపించడం తగ్గింది.
పశ్చిమ లండన్‌లోని ఆక్టన్‌లో సిరియన్ దంపతులకు పుట్టారు ఆస్మా అఖ్రాస్. ఆస్మా తల్లిదండ్రులలో ఒకరు కార్డియాలజిస్ట్, మరొకరు దౌత్యవేత్త.
ఆస్మా ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నారు. తనని అక్కడ స్నేహితులందరూ 'ఎమ్మా' అని పిలిచేవారు. ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజీ లండన్‌లో కంప్యూటర్ సైన్స్ చదివారు ఆమె. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయ్యారు.
ఆస్మా, బషర్ అల్-అసద్‌లు లండన్‌లో కలుసుకున్నారు. బషర్ అసద్ అప్పటికి క్వాలిఫైడ్ ఐ సర్జన్. ఆయన అక్కడే చదువుకున్నారు.
తండ్రి హఫీజ్ అల్-అసద్ మరణించిన తర్వాత 34 ఏళ్లకే బషర్ అల్-అసద్ అధ్యక్షుడయ్యారు.
ఆయన అధ్యక్షుడైన కొన్ని నెలల తర్వాత ఆస్మా 2000 సంవత్సరంలో సిరియాకు వెళ్లారు. అదే ఏడాది ఆస్మా, బషర్ అల్-అసద్‌ల వివాహమైంది.
వారికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఆస్మా బ్రిటిష్ మూలాలు సిరియాలో రాజకీయ సంస్కరణలకు ప్రోత్సాహంగా ఉంటాయని చాలా కాలం పాటు పశ్చిమ దేశాలలో ఆశ ఉండేది.
అంతర్జాతీయంగా సిరియా ఇమేజ్‌ను పెంచేందుకు ఆమెను ముఖచిత్రం చేయడానికి వీలుగా బ్రిటన్‌కు చెందిన ఒక పీఆర్ సంస్థ కూడా పనిచేసేది.
సిరియాను ప్రపంచానికి ఆధునికంగా చూపించడానికి ఆమె కీలకం అవుతారన్న ఉద్దేశంతోనే అసద్ ఆమెను వివాహం చేసుకున్నారని 2012లో ఒక విశ్వసనీయ వ్యక్తి బీబీసీతో అన్నారు.
సిరియా ఫస్ట్ లేడీగా ఆమె పోషించిన పాత్ర విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.
అధ్యక్షుడి చెల్లెలు బుష్రా, ఆయన తల్లి అనిషె ప్రజలతో చాలా తక్కువగా మమేకమయ్యేవారు.
ఆస్మా పీఆర్ వ్యూహం కొంతవరకు విజయం సాధించింది. 2011 ఫిబ్రవరిలో వోగ్ పత్రిక ''ఏ రోజ్ ఇన్ ద డిజర్ట్'' శీర్షికతో ఆమె ప్రొఫైల్‌ను ప్రచురించింది.
ఈ ఆర్టికల్‌ను ఆ తర్వాత ప్రింట్, ఆన్‌లైన్ నుంచి వెనక్కి తీసుకున్నారు.
ఈ ఆర్టికల్‌లో ఆమెను దేనినైనా విశ్లేషించే నేర్పరితనంతో సన్నగా, ఎత్తుగా ఉండే ఒక అందమైన యువతిగా అభివర్ణించారు.
అంతేకాక, గ్లామరస్, యంగ్, అత్యంత నేర్పు గల మహిళగా పేర్కొన్నారు.
ఈ ఆర్టికల్ రాసిన జూలియెట్ జాన్ బక్ అనే జర్నలిస్ట్ దీనిపై తీవ్రంగా బాధపడుతున్నట్టు చెప్పారు.
ఈ వ్యాసం రాసిన తర్వాత తన కెరీర్‌ను దెబ్బతిందని, వోగ్‌తో ఉన్న అనుబంధం ముగిసిపోయిందని తెలిపారు.
ఈ ప్రొఫైల్ ప్రచురితమైన సుమారు నెల రోజుల తరువాత సిరియాలో ప్రజాస్వామ్య అనుకూల, శాంతియుత నిరసనలను బషర్ అల్ అసద్ అణచివేశారు.
ఇది ఆ దేశంలో తీవ్ర అంతర్యుద్ధానికి దారితీసింది. దీంతో, 5 లక్షల మంది చనిపోయారు. 1.2 కోట్ల మంది ప్రజలు గత్యంతరం లేక తమ ఇళ్లను విడిచి పారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత 2012 ఫిబ్రవరిలోఆస్మా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
‘ది టైమ్స్’కు ఇచ్చిన ప్రకటనలో ఆమె తన భర్తకు మద్దతునిస్తూ.. ''అధ్యక్షుడంటే సిరియాకు అధ్యక్షుడే. కొందరికి మాత్రమే కాదు. దేశ ప్రథమ మహిళగా ఆయనకు అండగా ఉంటాను’ అన్నారామె.
అదే ఏడాది, ఆమె ఇమేజ్‌ను దెబ్బతీసేలా.. కొన్ని వేల ప్రైవేట్ ఈమెయిల్స్‌ను యాక్టివిస్ట్‌లు బయటపెట్టారు. విలాస వస్తువులపై ఆస్మాకు ఉన్న ఇష్టాన్ని తెలిపేలా ఉన్న ఆ ఈమెయిల్స్ ఆమె ఇమేజ్‌ను దెబ్బతీశాయి.
ఈ ఈమెయిల్స్‌ను తొలుత బ్రిటీష్ వార్తాపత్రిక గార్డియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ సమయంలో దేశంలో తీవ్ర అనిశ్చితికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆస్మా 5 వేల డాలర్ల విలువైన 16సెంటిమీటర్ల హైహీల్స్ కోసం వెతికినట్లు ఈ ఈమెయిల్స్ ద్వారా తెలిసింది.
అసద్ కుటుంబ నికర ఆస్తి 100 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్ల వరకు(సుమారు రూ. 8,400 కోట్ల నుంచి రూ. 16,900 కోట్లు) ఉండొచ్చని 2022లో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అంచనావేసింది.
సిరియాను విడిచి వెళ్లేందుకు తనకు ఆఫర్లు వచ్చినట్లు రష్యా ప్రభుత్వ టీవీ రోసియా 24కు చెప్పేంత వరకు అంటే 2016 వరకు ఆమె విదేశీ మీడియాతో మాట్లాడలేదు. కానీ, ఆ ఆఫర్లను తిరస్కరించినట్లు చెప్పారు. అయితే, ఆ ఆఫర్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఆమె చెప్పలేదు.
'మొదట్నుంచి ఇక్కడ ఉన్నా. ఇంకెక్కడైనా ఉండాలని నేను అనుకోలేదు. సిరియాను విడిచివెళ్లేందుకు నాకు అవకాశాలు వస్తున్నాయి. ఈ ఆఫర్లలో నాకు, నా పిల్లల భద్రతకు గ్యారంటీ ఉంటుంది. ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. అసలు వీళ్లు ఏం చేశారో తెలుసుకునేందుకు మేధావులే అవసరం లేదు. అధ్యక్షుడిపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఇవి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2018లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు
యుద్ధం కొనసాగుతున్నప్పుడే, ఆస్మా చారిటీ కార్యక్రమాలు చేపట్టారు. చనిపోయిన సైనికుల కుటుంబాలను కలిశారు.
‘సిరియా ట్రస్ట్ ఫర్ డెవలప్‌మెంట్’ బాధ్యతలు చూసుకున్నారు.
2018లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రాథమిక దశలో ప్రాణాంతక కణితికి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి ఆమె పూర్తిగా కోలుకున్నట్టు ప్రకటించారు.
2024 మే నెలలో ఆస్మాకు లుకేమియా వచ్చినట్టు సిరియన్ ప్రెసిడెన్సీ ప్రకటించింది. ప్రజా కార్యక్రమాల నుంచి బ్రేక్ తీసుకుని, ఐసోలేట్ అయ్యేందుకు అవసరమైన ప్రత్యేక ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్‌ను ఆమె ప్రారంభించనున్నారని ఆ ప్రకటనలో తెలిపింది.
రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆదివారం సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్-అసద్ వైదొలగడంతో, ఫస్ట్ లేడీగా ఆమె హోదా కూడా పోయింది.
అసద్ ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. రాజకీయ శరణార్థిగా రష్యాలో ఆయన ఆశ్రయం పొందినట్లు రష్యన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














