రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చింది? ప్రతిపక్షం అభ్యంతరాలేంటి?

తెలంగాణ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఫొటో సోర్స్, I&PR Telangana

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

గతంలో ఉన్న విగ్రహంతో పోల్చితే ప్రస్తుత విగ్రహం రూపురేఖలు మార్చడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

అయితే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన తల్లిని చూసిన అనుభూతి కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించినట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ తల్లి, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, telangana cmo

తెలంగాణ తల్లి రూపంపై నిబంధనలు ఏం చెబుతున్నాయి?

తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకు ఆమోదం తెలుపుతూ డిసెంబర్ 9న ప్రభుత్వం జీవో నం.1946 జారీ చేసింది. ఈ ఉత్తర్వును అచ్చ తెలుగులో విడుదల చేసింది ప్రభుత్వం.

''తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి, తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడం నిషేధం'' అని జీవోలో పేర్కొంది.

తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను అధికారికంగా గుర్తిస్తూ జీవో జారీ చేసినందున కొన్ని నియమ, నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

''తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ, ఇతర ప్రదేశాల్లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ, సామాజిక మాధ్యమాల్లో గాని, మాటలు లేదా చేతల్లో గానీ అగౌరవ పరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించడమవుతుంది'' అని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం.

తెలంగాణ తల్లి, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, telangana cmo

ఎవరు డిజైన్ చేశారు? ఎవరు మలిచారు?

సుమారు రూ.5.30 కోట్ల అంచనా వ్యయంతో విగ్రహాన్ని రూపొందించినట్లుగా చెప్పాయి ప్రభుత్వ వర్గాలు.

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ.గంగాధర్ విగ్రహ రూపకర్త కాగా,విగ్రహ శిల్పి రమణారెడ్డి.

''మొత్తంగా విగ్రహానికి రూపు తీసుకురావడానికి ఐదు నెలల సమయం పట్టింది. అందులో మూడు నెలలపాటు డ్రాయింగ్స్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పులు, చేర్పులు చెప్పారు. ప్రొఫెసర్ గంగాధర్ అవసరమైన మార్పులు చేశాక, విగ్రహం చెక్కాం'' అని బీబీసీతో చెప్పారు రమణారెడ్డి.

ఈయన గతంలో తెలంగాణ అమరవీరుల స్తూపం, సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కూడా శిల్పిగా ఉన్నారు.

అలాగే, ప్రొఫెసర్ గంగాధర్‌ను ఇటీవలే జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతిగా నియమించింది ప్రభుత్వం.

తెలంగాణ తల్లి, కేసీఆర్, కేటీఆర్

ఫొటో సోర్స్, brs party

విపక్ష బీఆర్ఎస్ అభ్యంతరాలేమిటి?

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో బంగారు అంచుతో ఎర్రరంగు చీర, తలపై కిరీటం, ఒక చేతిలో కంకులు, మరో చేతిలో బతుకమ్మ, జుట్టు విరబోసుకుని ఉన్నట్లుగా, నడుముకు వడ్డాణంతో ఉన్న మహిళ రూపంలో విగ్రహం ఉండేది.

తెలంగాణ భవన్, తెలుగు యూనివర్సిటీ సహా చాలాచోట్ల ఈ విగ్రహాలు కనిపిస్తుంటాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విగ్రహం రూపంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

అయితే, "సచివాలయంలో ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా? కాంగ్రెస్ తల్లి విగ్రహమా?" అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

బీఆర్ఎస్ పార్టీ కూడా తన ప్రొఫైల్ పిక్‌గా గత ప్రభుత్వంలో రూపొందించిన విగ్రహాన్ని ఉంచింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

తెలంగాణ తల్లి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్

ఫొటో సోర్స్, telangana cmo

ప్రస్తుత విగ్రహం ఎలా ఉందంటే…

ప్రభుత్వం ఆవిష్కరించబోతున్న విగ్రహంలో బంగారపు అంచు ఉన్న ఆకుపచ్చ చీర, ఒక చేయి అభయం ఇస్తున్నట్లుగానూ, మరో చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు, మెడకు కంఠె, ముక్కుపుడక, సిగ, నడుముకు చీర కొంగు చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.

''ఆకుపచ్చ చీర అనేది హరిత తెలంగాణకు సూచిక. నడుముకు చీర కొంగు కట్టుకోవడమనేది పనికి వెళ్తున్నప్పుడు లేదా ఉద్యమం లేదా యుద్దానికి వెళ్తున్న మహిళకు చిహ్నంగా ఉంటుంది. మెడలో కంఠె, కాళ్లకు కడియాలు, మెట్టెలు.. ఇలా తెలంగాణలోని సామాన్య మహిళకు ప్రతిరూపంగా ఈ విగ్రహం కనిపిస్తుంది'' అని బీబీసీతో అన్నారు శిల్పి రమణారెడ్డి.

''తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం. తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయం'' అని ఎక్స్‌లో స్పందించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

రమణా రెడ్డి

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో స్పందించారు.

అధికారికంగా తెలంగాణ తల్లి ప్రతిరూపం ఇప్పటివరకు గత పదేళ్లలో ఎక్కడా ప్రకటించలేదని చెప్పారాయన.

''ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి.. రెండు అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి.

వజ్ర వైఢూర్యాలు, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా? అనే ప్రశ్న వచ్చినప్పుడు... తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాం'' అని అసెంబ్లీలో వెల్లడించారు రేవంత్ రెడ్డి.

ఈ అంశంపై రమణారెడ్డి కూడా బీబీసీతో మాట్లాడారు.

''గతంలో ఉన్న విగ్రహం దేవతామూర్తిలా కనిపిస్తుంది. కిరీటాలతో మన ఇంట్లో ఉన్న తల్లిని ఊహించుకోలేం. కాబట్టి తెలంగాణ తల్లి అన్నప్పుడు సాధారణ మహిళ రూపాన్ని తీసుకురావాలని భావించి అందుకు తగ్గట్టుగా మలిచాం. తల్లి రూపం కూడా ఉద్యమాల ద్వారా ఏర్పడిందనేది ఈ విగ్రహం చెబుతుంది'' అని చెప్పారు.

చేతిలో బతుకమ్మ లేదన్న బీఆర్ఎస్ విమర్శలపై స్పందిస్తూ.. ''బతుకమ్మ ఒక్కటే కాదు, బోనాలు, సదర్, సమ్మక్క-సారక్క ఉత్సవాలు.. ఇలా ఎన్నో తెలంగాణ సంస్కృతిలో భాగం. ఏ ఒక్క పండుగకో కాదు... అన్ని పండుగలకు ప్రాధాన్యం ఉంటుంది'' అని రమణారెడ్డి స్పష్టం చేశారు.

ఇక నుంచి ప్రతి ఏటా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

''ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ర్ట, జిల్లా, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక కార్యక్రమంగా జరపాలని నిర్ణయించింది'' అని తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)