పృథ్వీ షా: భారత క్రికెట్ వండర్ బాయ్‌గా పేరు, సచిన్ అంతటివాడు అవుతాడంటూ అంచనాలు... మరి అతనికి ఏమైంది?

పృథ్వీ షా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ షా‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు
    • రచయిత, అయాజ్ మీనన్
    • హోదా, క్రికెట్ రచయిత

రిషభ్ పంత్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సౌదీ అరేబియాలో గత నెల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను దక్కించుకుంది.

దిల్లీ క్యాపిటల్స్‌లో పంత్ సహచరుడు పృథ్వీ షా పట్ల వేలంలో ఏ జట్టు ఆసక్తి కనబరచకపోవడం, అమ్ముడవ్వని ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షా ఉండటం వార్తల్లో నిలిచింది.

వేలంలో ఆటగాళ్ల కోసం బిడ్లు వేసే స్థానంలో సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు ఉన్నారు. వీరంతా పృథ్వీ షాను సన్నిహితంగా గమనించినవారే. దిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ ఆడిన సమయంలో సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్, 2018లో పృథ్వీ షా నేతృత్వంలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు భారత కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వేలంలో వీరు కూడా పృథ్వీపై నిరాసక్తత కనబరిచారు. వేరే జట్లు కూడా ఆసక్తి చూపకపోవడంతో పృథ్వీ ‘అన్‌సోల్డ్‌’గా మిగిలిపోయాడు.

2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి తొమ్మిది నెలల ముందు రిషభ్ పంత్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది.

2022 డిసెంబర్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో రిషభ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, అతనికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే, ఉక్కులాంటి సంకల్పం, క్రమశిక్షణ, అద్భుతమైన పట్టుదలతో రిషభ్ మళ్లీ కోలుకొని ఫిట్‌గా తయారయ్యాడు. ముగిసిపోయిందనుకున్న క్రికెట్ కెరీర్‌లో ఆకాశానికి ఎగిశాడు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పృథ్వీ షా ఫామ్ లేమి కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు

పంత్ 2024 ఐపీఎల్‌లో సవాళ్లను ఎదుర్కొన్నాడు, వాటి నుంచి మెరుగ్గా రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ అడుగుపెట్టి ఆకట్టుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన బృందంలో కూడా పంత్ సభ్యుడు. దేశవాళీల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించాడు. దులీప్ ట్రోఫీలో ఆకట్టుకొని టెస్టు క్రికెట్‌లోకి మార్గం సుగమం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

మరోవైపు పృథ్వీ షా, వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో పేలవ ప్రదర్శనతో ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఒకదాని తర్వాత మరో సంకటంలోకి దిగజారాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీ షా నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. సీజన్ మధ్యలోనే తుది జట్టులో చోటు కోల్పోయాడు.

తాజా దేశవాళీ సీజన్‌లో వరుసగా తక్కువ స్కోర్ల కారణంగా ముంబయి రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం దక్కలేదు. పైగా ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీని తీసుకునేందుకు ఏ జట్టూ ముందుకు రాకపోవడం, అతని క్రికెట్ కెరీర్‌ను ముగింపు దిశగా తీసుకెళ్తోంది.

యువకుడైన 25 ఏళ్ల పృథ్వీ షాకు ఇది భారీ పతనం. కొన్నేళ్ల క్రితం పృథ్వీ షా గురించి భారత క్రికెట్‌లో 'నెక్ట్స్ బిగ్ థింగ్' అని వర్ణించేవారు.

2013 నవంబర్‌లో, 14 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక హారిస్ షీల్డ్‌ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో రిజ్వీ స్ప్రింగ్‌ఫీల్డ్ తరఫున 546 పరుగులు చేసి పృథ్వీ షా ముఖ్యాంశాల్లో నిలిచాడు. అప్పట్లో మైనర్ క్రికెట్‌లో ప్రపంచంలోనే ఇది అత్యధిక స్కోరు.

అప్పటికి కేవలం వారం రోజుల ముందు, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రిటైర్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్‌తో పృథ్వీ షాను వెంటనే మ్యాస్ట్రో సచిన్‌తో పోల్చడం మొదలుపెట్టారు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2011లో స్కూల్ క్రికెట్ ఆడటం మొదలెట్టిన పృథ్వీ షా, రెండేళ్ల తర్వాత ఒక ఇన్నింగ్స్‌లో 546 పరుగులు చేశాడు

1987లో ఒక స్కూల్ గేమ్‌లో వినోద్ కాంబ్లీతో కలిసి ప్రపంచ రికార్డు 664 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత సచిన్ అద్భుతంగా ఎదిగిన తీరు ఎంతోమంది యువకులను ప్రేరేపించింది. ముఖ్యంగా ముంబయి ప్లేయర్లకు ఎంతో స్ఫూర్తి కలిగించింది. ఇలా ప్రేరణ పొందిన వారిలో షా కూడా ఒకరు.

పొట్టిగా, దృఢంగా ఉండే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ పృథ్వీ షాకు, తెందూల్కర్‌కు టీనేజీలోనే ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యం లేదు. కానీ, అత్యుత్తమ టైమింగ్‌ పృథ్వీ షా సొంతం. ఇదే టైమింగ్‌తో బౌలర్లపై ఎదురుదాడి చేసిన తీరు సెలెక్టర్లను తక్షణమే ఆకర్షించింది.

సచిన్ తరహాలోనే చిన్నవయస్సులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌ల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో వీరిద్దరిని పోల్చడం మరింత పెరిగింది.

2018లో పృథ్వీ షాకు టెస్టు జట్టులోకి పిలుపు వచ్చింది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో టెస్టు అరంగేట్రం చేశాడు. కళ్లు చెదిరే డ్రైవ్స్, కట్ షాట్లు, పుల్ షాట్లతో 154 బంతుల్లో 134 పరుగులు చేశాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 19 ఏళ్లే. భారత క్రికెటర్లలో కేవలం సచిన్ మాత్రమే చిన్న వయస్సులో తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు.

సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీకి అసలైన వారసుడిగా పేరు పొందిన పృథ్వీ షా భారీ సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కానీ, అప్పటినుంచి ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు.

టెస్టు క్రికెట్‌లోకి సంచలన అరంగేట్రం తర్వాత ఈ ఆరేళ్లలో అతను మరో 4 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ఆరు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎంతో సుదీర్ఘ, అద్భుతమైన కెరీర్ ఉంటుందని భావించిన ఒక ఆటగాడు, ఇన్నేళ్లలో ఇంత తక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటం దురదృష్టకరమనే చెప్పుకోవాలి.

దురదృష్టవశాత్తు పాదానికి అయిన గాయంతో, 2020 ఆస్ట్రేలియా పర్యటన నుంచి పృథ్వీ షా వెనక్కి రావాల్సి వచ్చింది. ఇక్కడి నుంచే అతనికి సమస్యలు మొదలయ్యాయి. ఆ మరుసటి ఏడాది పృథ్వీ షా ఒక నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. అదృష్టవశాత్తు అతను చిన్న శిక్షతో బయటపడ్డాడు. ఆ తర్వాతి నుంచి బ్యాటింగ్ ఫామ్ క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. సెలెక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు.

పృథ్వీ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018లో న్యూజీలాండ్‌లో అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా వార్మప్ చేస్తోన్న పృథ్వీ షా

మరోవైపు పృథ్వీ షా వైల్డ్ పార్టీలు, గొడవల్లో చిక్కుకున్నట్లు కథనాలు వ్యాప్తి చెందాయి. 2024 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే తుది జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ మెగా వేలం తర్వాత అతని కెరీర్ అనిశ్చితిలో పడింది.

గాయాలు, అనారోగ్యం, ఫామ్‌ను కోల్పోవడం వంటివి ఉత్తమ ఆటగాళ్లను కూడా గాడి తప్పిస్తాయి. కానీ, పృథ్వీ షా పతనంలో దురదృష్టం అనేది కేవలం చిన్న పాత్రే పోషించిందని అతని సన్నిహితులు అంటుంటారు.

''అతనికి సలహాలు మాత్రమే ఇవ్వగలం, అతన్ని గాడిలో పెట్టడానికి చాలా సార్లు ప్రయత్నించాం. చేయగలిగింది ఇంతే'' అని దిల్లీ క్యాపిటల్స్ కోచ్, పృథ్వీ షాతో సన్నిహితంగా పనిచేసిన రికీ పాంటింగ్ అన్నారు.

భారత మాజీ బ్యాట్స్‌మన్, దిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రే మాట్లాడుతూ, ''ఐపీఎల్ ఫేమ్‌ను, డబ్బును హ్యాండిల్ చేయగలడంలో పృథ్వీషా అసమర్థతే అతని వైఫల్యానికి కారణం. అతనితో చాలాసార్లు మాట్లాడాను. క్రమశిక్షణా లేమి కారణంగా కెరీర్‌ను కోల్పోయిన వినోద్ కాంబ్లీని ఒక ఉదాహరణగా కూడా అతనికి చూపించాను'' అని ఒక జాతీయ దినపత్రికకు చెప్పారు.

యువ క్రికెటర్ల జీవితాలను ఐపీఎల్ ఎంతో మార్చింది. టాలెంట్‌ ప్రదర్శనకు, జీవనోపాధికి ఒక వేదికగా నిలిచింది. అయితే, కెరీర్ ఆరంభంలోనే వెంటనే వచ్చే కీర్తి, సక్సెస్, వేగంగా వచ్చి పడే సంపద వంటివి సవాళ్లను విసురుతుంటాయి. క్రికెటర్లను సరైన గాడిలో ఉంచడానికి జూనియర్ స్థాయిలోనే బలమైన మార్గదర్శకత్వం అవసరమని అండర్-19, భారత- ఎ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ నొక్కి చెప్పారు. పృథ్వీ షా కెరీర్, ద్రవిడ్ అభిప్రాయాన్ని బలపరుస్తుంది.

పృథ్వీ షా భవిష్యత్ ఎలా ఉండబోతుందో రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.

25 ఏళ్ల పృథ్వీ షాకు ఇంకా క్రికెట్ ఆడే వయస్సు ఉంది. కానీ, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ప్రతిభతో నిండిపోయింది. జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పుడు జట్టులోకి పునరాగమనం చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

''క్రీడల్లోని కొన్ని గొప్ప కథలు పునరాగమనానికి సంబంధించినవే. పృథ్వీ షా దీర్ఘకాల విజయాన్ని కాంక్షించే వారు ఒకవేళ అతని చుట్టూ ఉంటే, ముందుగా అతన్ని సోషల్ మీడియాకు దూరం చేసి, మళ్లీ అతను సూపర్ ఫిట్‌గా మారేలా శిక్షణ ఇస్తారు. ఇలా చేస్తే అతను మళ్లీ సరైన మార్గంలోకి వెళ్లగలడు. గతం తరహాలో విజయాలను మళ్లీ సాధించగలడు'' అని ఎక్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశారు.

ఇది పృథ్వీషాకు ఆయన ఇచ్చిన స్పష్టమైన సందేశం. మిగతాదంతా ఇక అతని చేతుల్లోనే ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)