నితీశ్ కుమార్ రెడ్డి: యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ వంటి టాప్ బ్యాటర్లు విఫలమైన మ్యాచ్‌లో రాణించిన తెలుగు కుర్రాడు

ఫొటో సోర్స్, Getty Images
వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి టీమిండియా తరఫున ఆడిన తొలి టెస్టులో రాణించాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి మ్యాచ్‌తో నితీశ్ కుమార్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
జట్టులో అందరికంటే ఎక్కువగా 41 పరుగులు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది.
నితీశ్ 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా అవుటయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్ కాగా, కోహ్లీ 5 పరుగులే చేశాడు.
రిషబ్ పంత్ (37), రాహుల్ (26) కాసేపు క్రీజులో నిలిచారు.
పంత్, రాహుల్ తరువాత ఈ ఇన్నింగ్స్‌లో ఎక్కువ బంతులు ఎదుర్కొన్నది నితీశే.
పంత్ 78, కేఎల్ రాహుల్ 74 బంతులు ఆడగా నితీశ్ రెడ్డి 59 బంతులు ఎదుర్కొని అందరి కంటే ఎక్కువగా 69.49 స్ట్రైక్ రేట్‌తో 41 పరుగులు సాధించాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ నితీశ్ కుమార్ రెడ్డి?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి వయస్సు 21 ఏళ్లు.
ఆయన 2003 మే 26న జన్మించారు.
2023 సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కానీ, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో నితీశ్ గుర్తింపు పొందాడు.
2024 ఐపీఎల్ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన నితీశ్ 142 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు చేశాడు. 3 వికెట్లు తీశాడు.
దీనికంటే ముందు ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు.
ఇందులో అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ వికెట్లు కూడా ఉన్నాయి.
విరాట్ కోహ్లీని అభిమానించే నితీశ్ కుమార్‌కు తానో విలువైన ఆటగాడిగా నిరూపించుకునే ప్రతిభ ఉందని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం హర్దిక్ పాండ్యాలా ఫాస్ట్ బౌలింగ్ కోటాలో ఆల్‌రౌండర్‌గా పరిగణించాల్సిన కొద్ది మంది ఆటగాళ్లలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఒకరని విమల్ అభిప్రాయపడ్డారు.
నిరుడు క్రికెట్ దిగ్గజాలు బ్రయాన్ లారా, డేల్ స్టెయిన్‌తో నితీశ్ కుమార్ ఎక్కువ సమయం గడిపాడు.
నితీశ్ కుమార్ గురించి మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఐపీఎల్ సమయంలో మాట్లాడుతూ, నితీశ్ అరుదైన ఆటగాడని, అతనిపై బీసీసీఐ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అనుకున్నట్లే నితీశ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
ముందుగా టి20ల్లో..
టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే జింబాబ్వేలో పర్యటించే భారత టీ20 జట్టుకు నితీశ్ ఎంపికయ్యాడు.
5 మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో భారత తుదిజట్టులో నితీశ్‌కు చోటు దక్కలేదు.
తర్వాత అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు ఎంపికైన నితీశ్ అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశాడు. గ్వాలియర్‌లో జరిగిన తొలి టి20లో అజేయంగా 16 పరుగులు, దిల్లీలో జరిగిన రెండో టి20లో 74 పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టి20లో డకౌట్ అయ్యాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














