తిలక్ వర్మ సెంచరీ: దక్షిణాఫ్రికాను విజయానికి దూరం చేసిన తెలుగు కుర్రాడి దూకుడు

tilak varma

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది.

మూడో టీ20లో భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులే చేయగలిగింది.

దీంతో, 11 పరుగులతో టీం ఇండియా విజయం సాధించింది.

ఈ మ్యాచులో తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించడంతో టీం ఇండియా 219 పరుగులు చేయగల్గింది.

టీం ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తిలక్ వర్మ, టీం ఇండియా, దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన తిలక్ వర్మ

ఒక్కడే చివరి వరకు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియాకు మొదట్లోనే షాక్ తగిలింది.

మొదటి మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్ ప్రదర్శించిన ఓపెనర్ సంజూ శాంసన్ ఆ తరువాత వరుసగా రెండో మ్యాచులోనూ డకౌట్ అయ్యాడు.

తొలి ఓవర్లోనే శాంసన్ అవుట్ కావడంతో తిలక్ వర్మ ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు.

మిడిల్ ఆర్డర్‌లో ఆడే వర్మ టాప్ ఆర్డర్‌లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.

గత కొన్ని మ్యాచుల్లో విఫలమవుతున్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి స్కోరు పరుగుపెట్టించాడు.

దాంతో పవర్ ప్లే ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేయగలిగింది.

అయితే, అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 పరుగులు చేసి వెనుదిరగడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది.

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కీలక బ్యాటర్లు సూర్య కుమార్ యాదవ్(1), హార్దిక్ పాండ్య (18), రింకూ సింగ్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

అయినప్పటికీ, తిలక్ వర్మ మాత్రం తన జోరు తగ్గించలేదు.

51 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మొత్తంగా 56 బంతుల్లో 7 సిక్సులు, 8 ఫోర్లతో 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇదే అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు.

యశస్వి జైస్వాల్ తరువాత భారత్ తరఫున సెంచరీ కొట్టిన రెండో అతి పిన్న వయస్కుడిగా తిలక్ వర్మ రికార్డు సాధించాడు.

తిలక్ వర్మ, టీ20

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ తరఫున సెంచరీ కొట్టిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు

ఇక, 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

పది ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.

ఆ సమయంలో హెన్రిచ్ క్లాసెన్ 22 బంతుల్లో 41 పరుగులు, జాన్సెన్ 17 బంతుల్లోనే 5 సిక్సులు, 4 ఫోర్లతో 54 పరుగులు చేసి జట్టును లక్ష్యం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

వీరిద్దరి హిట్టింగ్‌తో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది.

అయినప్పటికీ, జోరుమీదున్న వీరిని అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది.

ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్‌లో 2-1తో భారత్ ముందంజలో ఉంది.

సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.

tilak varma

ఫొటో సోర్స్, Getty Images

టాప్ ఆర్డర్‌లోకి రాగానే..

మొదటి రెండు మ్యాచుల్లో తిలక్ వర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచులో మాత్రం మూడో స్థానంలో దిగి సెంచరీతో రాణించాడు.

“రెండో టీ20 తరువాత నా దగ్గరికి వచ్చి మూడో స్థానంలో తనను పంపాలని తిలక్ వర్మ అడిగాడు. ఆ స్థానంలో మెరుగైన ప్రదర్శన చేస్తానని చెప్పాడు. అలా ఆ రోజు అడిగాడు ఈ రోజు నిరూపించుకున్నాడు” అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ చెప్పాడు.

“టీం ఇండియా తరఫున సెంచరీ చేయడం నా కల. కీలకమైన మ్యాచులో సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. నన్ను మూడో స్థానంలో పంపి ఈ స్థాయిలో ప్రదర్శన చేసే అవకాశమిచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌దే ఈ క్రెడిట్ అంతా” అని తిలక్ వర్మ మ్యాచ్ అనంతరం తెలిపాడు.

“తిలక్ వర్మ మెచ్యుర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియాకు క్విక్ రన్స్ అవసరం. అయినప్పటికీ, రిస్క్‌తో కూడిన షాట్లు ఆడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు” అని క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్ బీబీసీతో చెప్పారు.

“సాధారణంగా నంబర్ 3 స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడుతాడు. నంబర్ 3 స్థానంలో తిలక్ వర్మ కూడా సరిపోతాడు. కాబట్టి, రైట్ హ్యాండ్-లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌లో భాగంగా ఓపెనర్లలో రైట్ హ్యాండర్ అవుటైతే సూర్యను, లెఫ్ట్ హ్యాండర్ అవుటైతే తిలక్‌ను పంపిస్తే బాగుంటుంది” అని వెంకటేశ్ అన్నారు.

ముంబయి ఇండియన్స్, తెలుగు, హైదరాబాద్

ఫొటో సోర్స్, @TilakV9

ఫొటో క్యాప్షన్, తిలక్ వర్మ

సురేశ్ రైనా స్ఫూర్తితో

తిలక్ వర్మ స్వస్థలం మేడ్చల్. సాధారణ మధ్య తరగతి కుటుంబం. అతని చిన్నప్పుడే బీహెచ్ఈఎల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. తండ్రి నాగరాజు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. తిలక్ తల్లి పేరు గాయత్రి దేవి. అన్న తరుణ్ వర్మ బ్యాడ్మింటన్ ప్లేయర్.

11 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన తిలక్ వర్మ, క్రికెట్ ఆడుతూనే చదువునూ కొనసాగించాడు. బార్కాస్ వద్ద కోచ్ సలామ్ బయాష్ వద్ద క్రికెట్ ఆటలో శిక్షణకు వెళ్లాడు.

2019లో విజయనగరంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్ తో తిలక్ వర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. అదే ఏడాదిలో హైదరాబాద్ తరఫున సౌరాష్ట్రతో లిస్ట్ ఎ మ్యాచ్, సర్వీసెస్ తో టీ20 మ్యాచ్ లను తొలిసారిగా ఆడాడు.

తిలక్ వర్మకు క్రికెటర్ సురేశ్ రైనా అంటే ఎంతో ఇష్టం. వీరిద్దరి మధ్య కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి.

రైనా తరహాలోనే తిలక్ వర్మ కూడా ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేస్తాడు.

రైనాలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్ ఆడటం తిలక్ వర్మకు ఇష్టం.

‘‘మా అబ్బాయికి సురేశ్ రైనా అంటే ఇష్టం. అందుకే అతనిలా ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో బౌలింగ్ చేస్తుంటాడు’’ అని తండ్రి నాగరాజు బీబీసీతో చెప్పారు.

ముంబయి ఇండియన్స్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్

ఫొటో సోర్స్, https://www.mumbaiindians.com

ఫొటో క్యాప్షన్, ముంబయి ఇండియన్స్ జట్టు రిటెయిన్ లిస్ట్

ముంబయి ఇండియన్స్‌ జట్టులో కీలక ప్లేయర్

తిలక్ వర్మ మొదటిసారిగా 2022లో ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత సీజన్‌లోనూ ముంబయి ఇండియన్స్ తరఫున మంచి ప్రదర్శనలు చేయడంతో టీం ఇండియాలో చోటు దక్కింది.

మిడిల్ ఆర్డర్‌లో బ్యాటర్‌గా, అవసరమైన సమయాల్లో బౌలర్‌గా కూడా రాణిస్తుండటంతో 2025 రిటెయిన్ లిస్ట్‌లో తిలక్ వర్మకు ముంబయి ఇండియన్స్ చోటు కల్పించింది.

రూ.8 కోట్లు చెల్లించి అతడిని జట్టులో రిటెయిన్ చేసుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)