ఐపీఎల్ వేలం: రూ.27 కోట్లు పలికిన రిషబ్ పంత్, ఇంకా ఎవరెవరు ఎంతెంత ధర పలికారంటే..

రూ.27కోట్లు పలికిన రిషబ్ పంత్

ఫొటో సోర్స్, Paul Kane/Getty Images

ఫొటో క్యాప్షన్, రికార్డు ధరకు రిషబ్‌ పంత్‌ను దక్కించుకున్న లఖ్‌నవూ జట్టు

‘ఐపీఎల్‌ 2025’ వేలంలో తొలిరోజు రిషబ్ పంత్ అత్యధిక ధర పలికాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు పంత్‌ని దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతడు నిలిచాడు.

పంత్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్‌ని పంజాబ్ జట్టు రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది.

తొలిరోజు వేలం ప్రారంభమైన మొదట్లో ఇది రికార్డు అత్యధిక ధరగా నిలిచింది. కానీ కొన్ని నిమిషాల తర్వాత రిషబ్ పంత్ పలికిన ధరతో శ్రేయాస్ అయ్యర్ రికార్డు బద్ధలయింది.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోసం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు వెచ్చించడంతో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ అన్ని రికార్డులనూ చెరిపివేశాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో పంత్ దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. కారు ప్రమాదంతో పంత్ ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

సౌదీ అరేబియాలోని జెద్దాలో రెండురోజుల పాటు ఐపీఎల్ వేలం జరగనుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కోల్‌కతాకు ట్రోఫీ బహూకరణ

ఫొటో సోర్స్, R.SATISH BABU/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్ 2024 ట్రోఫీ గెలుచుకున్న కోల్‌కతా

ఎన్ని టీమ్‌లు, ఎంతమంది ప్లేయర్లు?

ఈ వేలంలో పది టీమ్‌లు పాల్గొంటున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ వేలంలో పాల్గొంటున్నాయి.

2,000 మందికి పైగా క్రీడాకారుల జాబితా నుంచి 577 మంది క్రికెటర్లను వేలం కోసం షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో 367 మంది భారత క్రికెటర్లు కాగా, 210 మంది విదేశీ ఆటగాళ్లు.

రిటెయిన్డ్ ప్లేయర్లతో కలిపి ఒక్కో టీమ్‌కు రూ.120 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

అన్ని జట్లకు ఆరుగురు ప్లేయర్లను రిటెయిన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వారిలో ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండాలి.

యజువేంద్ర చాహల్‌ కోసం బిడ్ వేసిన సన్‌రైజర్స్

ఫొటో సోర్స్, R.SATISH BABU/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, యజువేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్

రైట్ టు మ్యాచ్ కార్డ్ అంటే ఏంటి?

గత ఐపీఎల్ వేలంలో రైట్ టు మ్యాచ్(ఆర్‌టీఎమ్)కార్డు ఉపయోగించారు.

రైట్ టు మ్యాచ్ కింద ఒక జట్టు తన మాజీ ఆటగాడిని రిటెయిన్ చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఒక టీమ్ ఆర్‌టీఎమ్‌ను ఉపయోగిస్తే... అత్యధిక బిడ్ వేసిన జట్టుకు ధర పెంచి తుది బిడ్ వేయడానికి అవకాశం కలుగుతుంది. తుది బిడ్‌లో పాత ఫ్రాంచైజీ ఆర్టీఎమ్‌ను ఉపయోగించుకోవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం

ఫొటో సోర్స్, facebook.com/sunrisershyderabad

ఫొటో క్యాప్షన్, వేలంలో పాల్గొన్న కావ్యమారన్
రూ.10కోట్లకు షమీని దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ షమీ(పాతచిత్రం)

ఎవరెవరు.. ఎంతకెంతకు అమ్ముడుపోయారంటే...

రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ సంగతి పక్కనపెడితే 20 కోట్లకు పైగా ధర పలికిన ఆటటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ ఉన్నాడు. కోల్‌కతా వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.7కోట్లకు దక్కించుకుంది.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ రూ.14కోట్లకు సొంతం చేసుకుంది. కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ, చెన్నై కేఎల్ రాహుల్ కోసం బిడ్ వేశాయి. చెన్నై రాహుల్‌ కోసం రూ.13.75కోట్లు వెచ్చించేందుకు సిద్ధపడగా, దిల్లీ రూ.14కోట్లకు బిడ్ వేసింది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, స్పిన్నర్ లియామ్ లివింగ్‌స్టోన్‌నను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.8.75కోట్లకు సొంతం చేసుకుంది.

మహ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.12.25కోట్లకు దక్కించుకుంది. రాజస్థాన్ సిరాజ్ కోసం రూ.12కోట్ల బిడ్ వేసింది. తర్వాత గుజరాత్ ధరను పెంచి సొంతం చేసుకుంది.

యజువేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18కోట్లకు దక్కించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజువేంద్ర చాహల్ కోసం 17.75కోట్ల బిడ్ వేసింది కానీ 18 కోట్లతో పంజాబ్ అతన్ని సొంతం చేసుకుంది.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.7.05కోట్లతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్‌ను కొనుగోలు చేసింది. గుజరాత్ అతని కోసం రైట్ టు మ్యాచ్ ఉపయోగించుకోలేదు.

మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.10కోట్లకు దక్కించుకుంది.

మిచెల్ స్టార్క్ కోసం బెంగళూరు రూ.10.50కోట్లకు బిడ్ వేయగా దిల్లీ క్యాపిటల్స్ రూ.11.75కోట్లకు దక్కించుకుంది.

జోస్ బట్లర్‌ కోసం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.13.75 కోట్లకు బిడ్ వేయగా, గుజరాత్ టైటాన్స్ రూ.15.75 కోట్లకు సొంతం చేసుకుంది.

గతంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉండేవాడు. కోల్‌కతా అతన్ని 24.75 కోట్లకు దక్కించుకుంది.

రబాడాను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది. రబాడా కోసం పంజాబ్ జట్టు ‘రైట్ టు మ్యాచ్’ను ఉపయోగించలేదు.

అర్షదీప్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు దక్కించుకుంది. అతని మీద బిడ్ రూ.రెండు కోట్ల నుంచి రూ.15.75 కోట్లకు పెరిగింది. పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ ఉపయోగించి అతన్ని సొంతం చేసుకుంది.

రైట్ టు మ్యాచ్‌తో అర్షదీప్‌ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రూ.18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

  • రిషబ్ పంత్‌ - ఐపీఎల్ 2025లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు దక్కించుకుంది.
  • శ్రేయాస్ అయ్యర్ - ఐపీఎల్ 2025లో పంజాబ్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది.
  • మిచెల్ స్టార్క్ - ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75కోట్లకు దక్కించుకుంది.
  • పాట్ కమిన్స్ - ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు సొంతం చేసుకుంది.
  • సామ్ కరన్ - ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ రూ.18.50కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ మెగావేలం

ఫొటో సోర్స్, Pakaj Nangia/Getty Images

ఫొటో క్యాప్షన్, 2023 ఐపీఎల్ ట్రోఫీ

ఐపీఎల్ వేలం అంటే ఏంటి?

ఐపీఎల్ మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహిస్తుంది. ఐపీఎల్ జట్లు రాబోయే టోర్నమెంట్ కోసం కొత్త ప్లేయర్లను ఈ వేలంలో దక్కించుకుంటాయి.

2008లో మొదటిసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ప్రతి మూడేళ్లకు ఈ వేలం నిర్వహిస్తున్నారు.

ఐపీఎల్ వేలం ఎలా నిర్వహిస్తారు?

ప్రతి ఆటగాడికి బేసిక్ ధర ఉంటుంది. ఈ ధర నుంచి బిడ్డింగ్ మొదలవుతుంది. ఆ ధర కన్నా ఎక్కువ వెచ్చించడం ద్వారా ఏ జట్టు అయినా ఆ ఆటగాడిని దక్కించుకోవచ్చు.

ఆ ఆటగాడిని ఒక ఫ్రాంచైజీ కన్నా ఎక్కువ జట్లు కోరుకుంటే, వేలం మొదలవుతుంది. ఎవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో ఆ జట్టుకు అతడు సొంతమవుతాడు.

ఒక ఆటగాడిపై ఎవరూ బిడ్ వేయకపోతే, అతను అమ్ముడుపోని ఆటగాడిగా ఉంటాడు. ఆటగాళ్లందరికీ బిడ్డింగ్ వేసిన తర్వాత, అమ్ముడుపోని ఆటగాళ్ల పేర్లను మళ్లీ బిడ్డింగ్‌లో ఉంచుతారు. రెండో రౌండ్‌లో జట్లు ఆ ఆటగాళ్లను సొంతం చేసుకోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)