గ్రేట్ నికోబార్ దీవిలో భారత్ కట్టే భారీ ప్రాజెక్టుతో ఆదిమ తెగకు ముప్పు పొంచి ఉందా? ఏమిటా ప్రాజెక్టు?

ఫొటో సోర్స్, India Shipping Ministry/X
- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
''అడవే మాకు సూపర్ మార్కెట్. ఇక్కడ దొరకనిదంటూ ఏమీ ఉండదు. ఈ దీవుల్లోని అడవుల్లో మాకన్నీ దొరుకుతాయి. వాటిపైనే ఆధారపడి మేం బతుకుతున్నాం'' అని అనీస్ జస్టిన్ చెప్పారు.
భారత్‌కు తూర్పు తీరంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో పెరిగి పెద్దయ్యారు జస్టిన్. ఆయనొక ఆంత్రోపాలజిస్ట్.
కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు 836 దీవుల సమూహం. వీటిలో 38 దీవులు మాత్రమే జనవాసాలకు అనువైనవి.
నికోబార్ దీవులు, అండమాన్ ద్వీపానికి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో, ఈ కేంద్రపాలిత ప్రాంతం దక్షిణ భాగంలో ప్రత్యేక దీవుల సమూహంగా ఉన్నాయి.
నికోబార్ దీవుల సమూహంలో అతిపెద్ద, అత్యంత ఏకాంత ప్రాంతంగా ఉండే గ్రేట్ నికోబార్ దీవిలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో 'హాంకాంగ్ తరహా' భారీ ప్రాజెక్టును చేపట్టాలని భారత్ ప్లాన్స్ చేస్తోంది. ఈ ప్రణాళికల పట్ల జస్టిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 72,000 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 166 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
ఈ ప్రాజెక్టులో రవాణా నౌకాశ్రయం, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, కొత్త టౌన్‌షిప్ ఉంటాయి. ఇవన్నీ హిందూ మహాసముద్రం, సూయజ్ కాలువ గుండా ఉన్న కీలకమైన ప్రపంచ వాణిజ్య మార్గాలతో ఈ ప్రాంతాన్ని అనుసంధానించడానికి రూపొందిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధికి సమీపంలో భారత్ ఈ ప్రాజెక్టు చేపడుతోంది.
ఈ ప్రాజెక్టు వల్ల అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 30 ఏళ్లు పడుతుందని, అప్పటికి ఈ దీవిలో నివాసం ఉండే ప్రజల సంఖ్య 6,50,000కి చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సమీప ప్రాంతాల్లో పెరుగుతోన్న చైనా ఆధిపత్యానికి కౌంటర్‌గా భారత్ పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యాలలో ఒకటి ఈ భారీ ప్రాజెక్టు అని నిపుణులు చెబుతున్నారు.
కానీ, ఇదే సమయంలో ఈ ప్రాజెక్టుపై ఆందోళనలు కూడా ఉన్నాయి.
తమ భూమిని, సంస్కృతిని, జీవనాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఇక్కడి ప్రజలలో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టు తమను వినాశనం అంచుకు నెట్టే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండే అరుదైన తెగలకు నెలవు అండమాన్, నికోబార్ దీవులు. అందులో జరవాస్, నార్త్ సెంటినలీస్, గ్రేట్ అండమానీస్, ఒంగే, షాంపెన్ తెగలు ఉన్నాయి.
గ్రేట్ నికోబార్ దీవిలో 400 మంది వరకు ఉండే షాంపెన్‌లు బాహ్య ఒత్తిళ్ల కారణంగా తమ జీవనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ తెగ వారిలో చాలా మంది అడవుల్లో చాలా లోపల ఉంటారు. వారి సంస్కృతి, జీవనవిధానం గురించి బయటి ప్రపంచంలో చాలా మందికి తెలియదు. బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు చాలా తక్కువ.
''బయటి ప్రపంచం అభివృద్ధి అని పిలుస్తోన్న ఈ ప్రాజెక్టు వారికెలాంటి ఆసక్తి కలిగించదు. వారికంటూ సొంతంగా ఒక సంప్రదాయ జీవన విధానం ఉంది'' అని జస్టిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రాజెక్టు ప్రభావం ఇక్కడి పర్యావరణంపై తీవ్రంగా ఉంటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. 921 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేట్ నికోబార్ దీవి 80 శాతం వర్షారణ్యంతోనే ఉంది. 1800కి పైగా జంతువులు, 800 వృక్ష జాతులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడే ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ఈ ప్రాజెక్టు కోసం ఈ దీవిలో కేవలం 14 శాతం లేదా 130 చదరపు కిలోమీటర్లను చదును చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయినా, అంత విస్తీర్ణంలో దాదాపు 9,64,000 చెట్లు ఉంటాయని అంచనా. అయితే, తొలగించే చెట్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
''కేవలం అడవిలో కొంత భాగం మాత్రమే చదును చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అక్కడ ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు మరింత కాలుష్యానికి దారి తీస్తాయి. దీనివల్ల, అక్కడున్న మొత్తం ఆవాసాలపై ప్రభావం పడుతుంది'' అని పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ చెప్పారు.
అయితే, దీనిపై పర్యావరణ శాఖ మంత్రితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
అక్కడ నివసిస్తోన్న తెగల వారికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా లేదా వారిని నిరాశ్రయుల్ని చేయకుండా ప్రాజెక్టును చేపడతామని ఆగస్టులో పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు.
పర్యావరణం పరంగా అన్నిరకాల పరిశీలనలు చేపట్టి, భద్రతాపరంగా అన్ని చర్యలూ తీసుకున్న తర్వాతే పర్యావరణ అనుమతులు పొందినట్లు ఆయన తెలిపారు.
అయితే, దీనిపై అందరూ అంగీకరించడం లేదు.

ఫొటో సోర్స్, Archeological Survey of India
ఈ ఏడాది ప్రారంభంలో వివిధ రంగాలకు చెందిన 39 మంది అంతర్జాతీయ నిపుణులు మాత్రం.. ఈ అభివృద్ధి ప్రాజెక్టు షాంపెన్ తెగకు ''మరణ శిక్ష'' అవుతుందని, వారి ఆవాసాలను పూర్తిగా నాశనం చేస్తుందని హెచ్చరించారు.
ఇదే భయాన్ని జస్టిన్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ''పారిశ్రామిక ప్రపంచంలో ఎలా బతకాలో షాంపెన్ ప్రజలకు తెలియదు, వారికి అవగాహన కూడా లేదు'' అని అన్నారు.
నికోబారీల మాదిరి వీరి పరిస్థితి కూడా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దీవిలో అతిపెద్ద ట్రైబల్ గ్రూప్ నికోబారీలదే.
అయితే, హిందూ మహాసముద్రంలో భారీ సునామీ వచ్చినప్పుడు చాలా గ్రామాలు కొట్టుకుపోవడంతో, 2004లో వీరు వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది.
చాలా ఏళ్లు వీరికి వివిధ ప్రాంతాల్లో పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగింది.
''చాలామంది నికోబారీలు ప్రస్తుతం కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి పూర్వీకుల భూమిపై కాకుండా పునరావాస కేంద్రాల్లో బతుకుతున్నారు'' అని జస్టిన్ అన్నారు.
వారు పంటలను పండించేందుకు లేదా పశువులను పెంచి పోషించుకునేందుకు సొంతంగా ఎలాంటి స్థలం లేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రాజెక్టు షాంపెన్ తెగను వ్యాధుల బారిన పడేయనుందనే భయాందోళనలు కూడా ఉన్నాయి.
''బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ప్రజల్లో ఫ్లూ వంటి బయటి వ్యాధులను తట్టుకునేందుకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ కాంటాక్ట్ తర్వాత వారి జనాభాలో మూడింట రెండొంతులు కోల్పోతారు'' అని కన్జర్వేషన్ గ్రూప్ సర్వైవల్ ఇంటర్నేషనల్ అధికారి కాల్లమ్ రస్సెల్ అన్నారు.
పర్యావరణానికి సంబంధించి ఇతర ఆందోళనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న సముద్ర జీవులపై ప్రభావం పడొచ్చు. శతాబ్దాలుగా భారీ లెదర్ బ్యాక్ సముద్ర తాబేళ్లకు నెలవుగా ఉండే ఈ దీవిలోని ఆగ్నేయంలో ఉండే గలాథియా బేపై ప్రభావం పడొచ్చని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఉప్పునీటి మొసళ్లు, చేపలు వంటివాటిపై కూడా ఈ ప్రాజెక్టు ప్రభావం చూపుతుందని సామాజిక, పర్యావరణ వేత్త డాక్టర్ మనీష్ చాందీ అన్నారు.
ఇంకా చాలా రకాల జీవులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉంటాయని చాందీ చెప్పారు. ‘‘జీవవైవిధ్యం, జీవజాతుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది?'' అని చాందీ ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి 30 ఏళ్లు పట్టినప్పటికీ, పర్యావరణం, ఈ దీవుల్లోని స్థానిక ప్రజల జీవనాన్ని ఇదెలా మార్చనుందోనని ప్రజలు ఆందోళన చెందకుండా ఉండలేరు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














