పోలీస్ కమిషనర్ ఎదుట హాజరైన మంచు మనోజ్, విష్ణు.. మోహన్ బాబు గైర్హాజరు

ఫొటో సోర్స్, Insta/X
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుల నేపథ్యంలో.. మోహన్ బాబు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌లకు రాచకొండ పోలీసు కమిషనర్ వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు.
''శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నందున ఏడాదిపాటు సత్ప్రవర్తనతో ఉంటానని, రూ.లక్ష పూచీకత్తుతో ఎందుకు బాండు ఇవ్వకూడదో చెప్పాలి'' అని నోటీసులో పేర్కొన్నారు.
అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట మంచు విష్ణు, మనోజ్‌లు విచారణకు హాజరుకాగా...మోహన్ బాబు గైర్హాజరయ్యారు.
కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని మనోజ్, విష్ణులకు కమిషనర్ సుధీర్ బాబు సూచించారు.
శాంతికి భంగం కలిగించే విధంగా ఏదైనా జరిగితే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
కమిషనర్ నోటీసుల మేరకు.. ఒక సంవత్సరం పాటు శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగబోనని సీపీకి మంచు మనోజ్ బాండ్ సమర్పించారు.
మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్న కారణంగా హాజరు కాలేదని వారి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు, విష్ణు.
ఈ నెల 24 వరకు పోలీసుల ముందు విచారణకు హాజరు కాకుండా మినహాయింపునిస్తూ హైకోర్టు వెసులుబాటు కల్పించింది. మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మోహన్ బాబు లైసెన్స్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం రాత్రి మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను జల్ పల్లి నుంచి కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.
ఒళ్లు నొప్పులు, హైబీపీ, పల్స్ రేటులో మార్పు, కళ్లు తిరగడం తదితర అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆసుపత్రికి వచ్చారని, వైద్యం కొనసాగుతోందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఎడమ కంటి కింది భాగంలో గాయం అయ్యిందని తెలిపారు.

మీడియాపై దాడి
మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు మనోజ్. గేటుకు ఉన్న షీటు తొలగించి.. నెట్టుకుంటూ లోనికి వెళ్లారు . ఆ తర్వాత కాసేపటికీ తనపై దాడి జరిగిందంటూ మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు.
ఆ సమయంలో మీడియా ప్రతినిధులు లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా.. మోహన్ బాబు నమస్కరిస్తూ బయటకు వచ్చారు.
మోహన్ బాబుతో టీవీ9 ఛానెల్ ప్రతినిధి రంజిత్.. ''సర్.. చెప్పండి..'' అనగానే.. మోహన్ బాబు బూతులు తిడుతూ మైకు లాక్కొని దాడి చేయడం కలకలం రేపింది. తర్వాత అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది తోసివేయడంతో టీవీ 5 ఛానెల్ కెమెరామెన్ సూర్యం కింద పడిపోయారని, ఆయనకు గాయాలయ్యాయని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో అందిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. బుధవారం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు నిరసనలు తెలిపారు.
మోహన్ బాబు ఆడియో సందేశం
మంగళవారం సాయంత్రం మోహన్ బాబు మాట్లాడిన ఆడియో ఒకటి మీడియాకు చేరింది. మనోజ్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్లుగా రికార్డు ఉంది.
''మనోజ్ నన్ను కొట్టలేదు. కేవలం ఘర్షణ పడ్డాం. చేయి చేసుకోవడం వేరు.. ఘర్షణ పడటం వేరు. మనోజ్.. విష్ణును చంపుతానని అంటావా? వినయ్‌ను బూతులు తిడతావా?'' అని అందులో ప్రశ్నించారు మోహన్ బాబు. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరినా.. ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారాయన. అంతేకాదు మనోజ్ పై కొన్ని ఆరోపణలు కూడా చేశారు.
''భార్య మాటలు విని తాగుడుకు బానిసై.. ఇంట్లో సిబ్బందిని కొడుతున్నావు. ఇది కరెక్టు కాదు. మోహన్ బాబు కొడతారని సినీ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది కేవలం షూటింగ్ సమయంలో ఏదో జరిగి ఉంటుంది గానీ, ఇంట్లో స్టాఫ్‌ను ఎప్పుడూ కొట్టలేదు. అలాంటిది తాగి స్టాఫ్‌ను కొడతావా? ఆస్తుల పంపకం అంటావా.. అది ఎవరికి ఇవ్వాలనేది నా ఇష్టం'' అని మోహన్ బాబు అన్నారు.
నిన్ను కనడమే నేను చేసిన పాపమా? అని ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ బాబు.
ఆడియోపై మీడియాతో మనోజ్ మాట్లాడారు.
''మా నాన్న దేవుడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదు. అన్న విష్ణు.. వినయ్ ఆయన్ను ప్రబావితం చేసి.. ఇలా గొడవలకు కారణమయ్యారు. నేను మద్యం తాగి ఎవర్నీ కొట్టలేదు. కావాలంటే ఇంట్లో సీసీ కెమెరాల ఫుటేజీ చూస్తే మీకే అర్థమవుతుంది. నా కోసం నిలబడిన మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. అందుకు నన్ను క్షమించండి'' అని తెలిపారు మనోజ్.
మంచు విష్ణు ఏమన్నారంటే…
మనోజ్ చేసిన ఆరోపణలపై మంచు విష్ణు స్పందించారు. ఇది పూర్తిగా తమ కుటుంబ వ్యవహారమని చెప్పారాయన.
''మీడియాపై దాడి జరిగి ఉండాల్సింది కాదు. ఇది దురదృష్టకరం. ఆ రిపోర్టర్ కుటుంబంతో నేను మాట్లాడాను'' అని అన్నారు.
గొడవలకు కారణం అన్న విష్ణునే అని మనోజ్ చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. 'ఆ విషయం గురించి నేనేమీ మాట్లాడను'' అని అన్నారు.
''ఒకరికి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం, మరొకరికి ఇష్టం ఉండదు. మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే. కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజిల్స్‌లో ఉన్నా. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలిసి వచ్చాను. వినయ్ నాకు అన్న లాంటి వారు. వినయ్‌తో నాకు 15 సంవత్సరాల అనుబంధం ఉంది. నాన్న కూడా ఆయన్ను ఎంతో అభిమానిస్తారు. వినయ్ నాకు పెద్ద కొడుకులాంటి వాడు అని ఆయనే చాలాసార్లు చెప్పారు'' అని అన్నారు విష్ణు.
తమ విద్యాసంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని విష్ణు స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Insta/manojkmanchu
ఇంతకుముందు ఏం జరిగింది?
తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్‌బాబు డిసెంబర్ 9న (సోమవారం) రాచకొండ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.
''మంచు మనోజ్, అతని భార్య సహా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవాలి'' అంటూ కమిషనర్‌కు రాసిన లేఖలో మోహన్‌బాబు కోరారు.
మరోవైపు, తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మంచు మనోజ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోహన్‌బాబుకు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయని, గొడవలు జరిగాయని రెండు, మూడు రోజులుగా చర్చ జరుగుతోంది. స్థానిక మీడియాలోనూ విస్తృతంగా కథనాలు వచ్చాయి.
మోహన్‌బాబు పేరిట సోమవారం లేఖ బయటికి రావడంతో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి.

ఫొటో సోర్స్, Insta/mounikabhumamanchu
లేఖలో ఏముంది?
78 ఏళ్ల వయసున్న తనకు.. తన కుమారుడు మంచు మనోజ్, అతని భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందని, భయపెట్టి అక్రమంగా ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని పోలీసు కమిషనర్‌కు రాసిన లేఖలో మోహన్‌బాబు ఆరోపించారు.
ఈ ఆరోపణలను మంచు మనోజ్ ఖండించారు. అవన్నీ నిరాధారమని చెప్పారు.
మోహన్ బాబు రాసిన లేఖలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయనేది పరిశీలిస్తే…
''నా చిన్న కుమారుడు మనోజ్ గతంలో ఇల్లు వదిలి వెళ్లి, నాలుగు నెలల కిందట తిరిగి వచ్చాడు. డిసెంబరు 8న కొందరు సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి ఇంట్లోకి వచ్చి అల్లర్లు సృష్టించారు. ఆ తర్వాత ఏడు నెలల కుమార్తెను ఆయాల వద్ద వదిలి మంచు మనోజ్ , అతని భార్య మౌనిక బయటకు వెళ్లి రాత్రి తొమ్మిది గంటల సమయంలో తిరిగి వచ్చారు. ఆ సమయానికి నేను నిద్రపోయాను'' అని లేఖలో రాశారు.
మరుసటి రోజు మంచు మనోజ్ సహాయకులమని చెబుతూ 30 మంది వ్యక్తులు అక్రమంగా తన ఇంట్లోకి చొరబడ్డారని మోహన్ బాబు చెప్పారు.
తమ అనుమతి లేనిదే ఇంట్లోకి వచ్చేందుకు వీల్లేదంటూ బెదిరిస్తున్నారని మోహన్ బాబు చెప్పారు. మంచు మనోజ్, అతని భార్య మౌనిక ఆదేశాల మేరకు పనిచేస్తూ తన ఇంటిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
వారి నుంచి తనకు, తన ఆస్తికి, విలువైన వస్తువులకు ముప్పు ఉందని మోహన్ బాబు అన్నారు.
ఈ విషయంలో మంచు మనోజ్, అతని భార్య మౌనికతో పాటు వారి సహాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మోహన్ బాబు కోరారు.
''నా ఇంటి నుంచి మనోజ్‌ను, మౌనికను, వారి సహాయకులను ఖాళీ చేయించాలి. నాకు భద్రత కల్పించి ఇంట్లోకి స్వేచ్ఛగా వెళ్లేలా చూడాలి'' అని లేఖలో పేర్కొన్నారు మోహన్ బాబు.

ఫొటో సోర్స్, X/Manoj Manchu
పోలీస్‌స్టేషన్‌లో మనోజ్ ఫిర్యాదు
మోహన్ బాబు, మనోజ్‌ల మధ్య డిసెంబరు 8న(ఆదివారం) గొడవలు జరిగినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆసుపత్రికి వచ్చారు.
ఆ సమయంలో ఆయన కుంటుకుంటూ, మరొక వ్యక్తి సాయంతో లోపలికి వచ్చారు. ఆయన వెంట భార్య మౌనిక కూడా ఉన్నారు. కొంతమంది వ్యక్తులు మనోజ్‌పై దాడిచేయడంతో గాయాలతో వచ్చినట్లుగా ఆసుపత్రి కేస్ షీట్‌లో రాసి ఉంది.
మనోజ్‌కు వెన్నెముక, పొట్ట సిటి స్కాన్ చేశారు వైద్యులు. పొట్ట, వెన్నెముక, మెడ, ఎడమ తొడ భాగంలో గాయాలున్నట్లుగా మెడికో లీగల్ రిపోర్టులో ఉంది.
సోమవారం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు.
కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని పహాడీ షరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువా రెడ్డి చెప్పారు.
‘‘మోహన్ బాబు, కుటుంబ సభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు. ఇంట్లో ఉండగా పది మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు పారిపోయారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి అనేవారు సీసీ ఫుటేజీని మాయం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం'' అని గురువా రెడ్డి మీడియాకు చెప్పారు.
మంచు మనోజ్ ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, X/Manoj Manchu
గొడవలు దేనికోసం?
మోహన్ బాబు గత పదేళ్లుగా హైదరాబాద్ శివారులోని జల్‌పల్లి వద్దనున్న మంచు టౌన్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటి విషయంలోనూ మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని మోహన్ బాబు రాసిన లేఖలోని విషయాల ద్వారా స్పష్టమవుతోంది.
మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్, కుమార్తె మంచు లక్ష్మీ ఉన్నారు.
విష్ణు, లక్ష్మీ మోహన్ బాబు మొదటి భార్య అయిన విద్యాదేవి పిల్లలు కాగా, మనోజ్ రెండో భార్య నిర్మలాదేవి సంతానం.
గతంలోనే పిల్లలకు ఆస్తుల పంపకాలు చేపట్టినట్లు మోహన్ బాబు సన్నిహితులు చెబుతున్నారు.
అయితే, మోహన్ బాబు ఉంటున్న మంచు టౌన్‌లోని ఇంటి విషయంపై వివాదం నడుస్తున్నట్లుగా తాజా ఘటనతో స్పష్టమవుతోంది.
ఇల్లుతోపాటు మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో వివాదం ఉన్నట్లుగా మంచు మనోజ్ లేఖతో తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Insta/manojkmanchu
నా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు : మనోజ్
మోహన్ బాబు లేఖపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు మనోజ్.
ఈ వ్యవహారంలో పారదర్శకంగా విచారణ చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ డీజీపీని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కోరారు.
తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన పేరు మర్యాదలను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఈ వ్యవహారంలోకి తన ఏడు నెలల చిన్నారిని కూడా లాగడం దారుణమని చెప్పారు.
''మంచు విష్ణు దుబాయ్‌కి వెళ్లిపోవడంతో నా తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. మోహన్ బాబు, ఆయన శ్రేయోభిలాషుల కోరిక మేరకు నేను ప్రస్తుతం ఉంటున్న ఇంటికి ఏడాది కిందట వచ్చాను. కేవలం నాలుగు నెలల కిందటే ఇంటికి వచ్చానని చెప్పడం పూర్తిగా నిరాధారం. గత ఏడాది కాలంగా నా ఫోన్ సిగ్నల్ లోకేషన్‌ను వెరిఫై చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నా. ఎందుకంటే, దాని ఆధారంగా నేను అక్కడే ఉంటున్నట్లు మీకు తెలుస్తుంది'' అని మనోజ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటున్న తన భార్య మౌనికపైనా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మనోజ్ చెప్పారు.
ఘటన జరిగిన రోజున సీసీ ఫుటేజీ ఎలా మాయమైందనే విషయంపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
''మంచు విష్ణు సహాయకులు విజయ్ రెడ్డి, కిరణ్ సీసీ టీవీ ఫుటేజీ హార్డ్ డిస్కులు మాయం చేశారా? అలాగైతే ఏం దాచాలని వారు ప్రయత్నిస్తున్నట్లు? నేను ఆస్తులు అడిగానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. కుటుంబ ఆస్తులు లేదా వారసత్వంగా వచ్చినవి నేనేప్పుడూ అడగలేదు'' అని మనోజ్ చెప్పారు.
మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు, స్థానిక వ్యాపారులకు తాను మద్దతు ఇస్తున్నందునే ఈ ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ అన్నారు.
''నాపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడే ఎందుకంటే, ఎంబీయూ విద్యార్థులు, స్థానిక వ్యాపారులను విష్ణు, అతని అనుచరుడు వినయ్ మహేశ్వరి దోపిడీ చేస్తున్నారు. ఆ విద్యార్థులు, వ్యాపారులకు నేను మద్దతుగా నిలబడ్డాను. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అన్ని ఆధారాలూ నా వద్ద ఉన్నాయి. మీరు(ముఖ్యమంత్రులు, మంత్రులు) విచారణ చేయిస్తామంటే, అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను'' అని మంచు మనోజ్ చెప్పారు.
మనోజ్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు: వినయ్
మంచు మనోజ్ ఆరోపణలపై బీబీసీతో మాట్లాడిన వినయ్ మహేశ్వరి.. ‘‘నేను మోహన్ బాబు యూనివర్సిటీకి కన్సల్టెంట్‌గా పని చేసిన మాట నిజమే గానీ.. మనోజ్ అలా ఎందుకు ఆరోపణలు చేశారో నాకు తెలియదు’’ అని అన్నారు.
ప్రస్తుతం తాను అక్కడి వ్యవహారాలు చూడటం లేదని, ఇప్పుడు దిల్లీలో ఉంటున్నానని వినయ్ తెలిపారు.
తనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న విషయం కూడా తనకు తెలియదని వినయ్ మహేశ్వరి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














