డియెగో గార్సియా: రహస్య సైనిక ద్వీపంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన తమిళ కుటుంబం

డియెగో గార్సియా
ఫొటో క్యాప్షన్, ద్వీపంలోని శిబిరం "ఓపెన్ జైలు లాంటిది" అని శాంతి చెప్పారు.
    • రచయిత, ఆలిస్ కడ్డీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక మారుమూల బ్రిటిష్ ద్వీపమైన డియెగో గార్సియాలోని తాత్కాలిక శిబిరమది. ఉదయం శాంతి (పేరు మార్చాం) భర్త లేచేసరికి సైనికులు ఏర్పాటు చేసిన కంచె వైపు చూస్తూ వారి పిల్లలు కనిపించారు.

కంచెకు అవతలి వైపున, హిందూ మహాసముద్రంలో యూకే- యూఎస్ రహస్య సైనిక స్థావరం ఉంది. అక్కడ ఒక అధికారితో పాటు ఓ కాపలా కుక్క ఉంది.

‘‘మనకంటే ఆ కుక్కలకే ఎక్కువ స్వేచ్ఛ ఉంది నాన్నా’’ అని పిల్లలు తండ్రితో అన్నారు.

‘‘అది విన్నాక నా గుండె పగిలింది’’ అని శాంతి భర్త అన్నారు.

ఆ క్షణం వారి కుటుంబం మూడేళ్లుగా చేస్తున్న పోరాటానికి అద్దం పడుతుంది. శాంతి కుటుంబం అనుకోకుండా ఈ రహస్య సైనిక స్థావరంలో చిక్కుకున్నారు. ఆ సమయంలో ఐదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల కూతురిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది.

చిన్న శిబిరంలో సాధారణ జీవితాన్ని గడపడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వాళ్లను వాళ్లు ఎంటర్‌టైన్ చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, పంట వేస్తున్నారు, ప్రత్యేక సందర్భాలలో వేడుకలు జరుపుకుంటారు.

కెనడా ప్రయాణం కోసం సేవింగ్స్ నుంచి రూ.4 లక్షలకు పైగా వెచ్చించానని, తన నగలన్నీ స్మగ్లర్లకు ఇచ్చానని శాంతి చెబుతున్నారు. శాంతి కుటుంబం 12,000 కి.మీ. దూరంలో ఉన్న కెనడాకు శ్రీలంక తమిళులతో కలిసి ప్రయాణించింది.

2009లో ముగిసిన శ్రీలంక అంతర్యుద్ధంలో ఓడిపోయిన తమిళ టైగర్ రెబల్స్‌తో అందులో కొంతమందికి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక, భారత్‌లలో వేధింపుల నుంచి తప్పించుకొని పారిపోతున్నామని ఆ బృందం తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళుల వలస
ఫొటో క్యాప్షన్, శాంతి, ఆమె కుటుంబం 2021లో శ్రీలంక నుంచి వచ్చేశారు

బోట్ లీక్ కావడంతో..

వలసదారులు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ సముద్రంలో లీక్ కావడం ప్రారంభించింది. దీంతో 2021 అక్టోబర్‌లో బ్రిటీష్ రాయల్ నేవీ వారిని రక్షించి, డియెగో గార్సియాకు తరలించింది. వారందరినీ అక్కడ చుట్టూ కంచె ఉన్న వలసదారుల శిబిరంలో ఉంచారు. ఆ సమయంలో 'కెనడా వచ్చామా?' అని తన కొడుకు అడగడం శాంతికి ఇంకా గుర్తుంది.

ద్వీపంలో మొదటి ఆరు నెలల పాటు పిల్లలకు సరైన పాఠశాల లేదు. శాంతి శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలు కావడంతో శిబిరంలోని పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం ప్రారంభించారు.

"బేసిక్స్‌తో పాఠాలు ప్రారంభించాం. వర్ణమాల, నామవాచకాలు, క్రియలు.. అలా మొదలుపెట్టాం" అని శాంతి చెప్పారు.

పిల్లల కోసమని చెక్కలతో ఒక డెస్క్ తయారు చేశారు శాంతి భర్త. దీంతో పిల్లలు టెంట్‌లో తమ హోంవర్క్‌లు చేయగలిగారు.

సాయంత్రం బోర్ కొడుతోందని పిల్లలు అనడం ప్రారంభించారు. దీంతో భరతనాట్యం నేర్చుకున్న శాంతి వారికి డ్యాన్స్ నేర్పడం ప్రారంభించారు. మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసిన సాంగ్స్ ప్లే చేస్తూ, ఆమె నేర్పించారు.

యూకే, అమెరికా సైనిక స్థావరం

బయటికి పంపాలని లేఖ

శిబిరంలో మూడేళ్లు గడిపిన తర్వాత ఆ కుటుంబాన్ని ఇటీవలే బ్రిటన్‌కు పంపారు. వారి బాగోగుల కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయం ఇదని చెప్పారు.

"అది ఓపెన్ జైలు లాంటిది, బయటికి వెళ్లలేం. కంచె లోపల, చిన్న గుడారంలో నివసించాం" అని లండన్ సమీపంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శాంతి (30) చెప్పారు. ప్రతి రోజూ మాకు ఒకేలా ఉండేదని, పంజరంలో జీవిస్తున్నట్లు ఉండేదని ఆమె తెలిపారు.

వారిని కాపలాదారులు పర్యవేక్షిస్తుండేవారు. అప్పుడప్పుడు మిలిటరీ జెట్‌లు ఆకాశంలో తిరుగుతుండేవి.

శాంతి, ఇతర తమిళులు తమను సురక్షితమైన దేశానికి పంపాలని కోరుతూ ద్వీపంలోని బ్రిటిష్ దళాలకు ఒక లేఖ ఇచ్చారు. ఆ భూభాగంలో ఉంటున్నవారు తమకు వేరే దేశంలో ఆశ్రయం కల్పించాలంటూ అలా అభ్యర్థించడం ఇదే మొదటిసారి.

దీంతో 6,000 మైళ్ల (9,656 కిలోమీటర్లు) దూరంలోని యూకేలో సుదీర్ఘ న్యాయ పోరాటం ప్రారంభమైంది. కేసు తీర్పు వచ్చే వరకు వారు వేచి ఉన్నారు.

డియెగో గార్సియాలోని వలస శిబిరం
ఫొటో క్యాప్షన్, డియెగో గార్సియాలో వలసదారుల శిబిరం ఉంది

'ఆహారం తినలేకపోయేవాళ్లం'

సొంతంగా ఆహారాన్ని వండుకోవడానికి తమిళులకు అనుమతి ఉండేది కాదు. అయితే, శిబిరంలో చాలా కొబ్బరి చెట్లు ఉండేవి. అలాగే వారు మిర్చి, వెల్లుల్లి, దోసకాయ వంటి కూరగాయలను పండించేవారు.

"వారు కొన్నిసార్లు మాకు మిరప కాయలు ఇచ్చారు. మేము వాటిని ఎండబెట్టి, విత్తనాలను సేకరించి, నాటాం. సలాడ్‌లో దోసకాయ వస్తే, వాటి విత్తనాలను తీసి ఎండబెట్టాం, ఆపై వాటితో దోసకాయలు పండించాం" అని శాంతి చెప్పారు.

బేస్‌లో తమిళులు అమెరికన్ ఆహారం తినలేకపోయేవారు. అందుకే వారు కూరగాయలు, వెల్లుల్లి, మిరపకాయలతో కూరలు చేసుకునేవారు.

ముఖ్యంగా శిబిరంలో ఉన్న 16 మంది పిల్లలకు బట్టలు తక్కువగా ఉండటంతో శాంతి, ఇతర మహిళలు బెడ్ షీట్లతో దుస్తులు తయారు చేశారు. క్రిస్మస్ సమయంలో కాగితం నాప్‌కిన్‌ల నుంచి పువ్వులు తయారు చేశారు. చెట్టును అలంకరించడానికి ఆహార పాత్రలను కత్తిరించి చంద్రుడు, నక్షత్రాల ఆకారాలను రూపొందించేవారు.

కాపలాదారులతో మాట్లాడటం కష్టంగా ఉండేది. అందుకే, శాంతి కొన్ని రకాల సంజ్ఞలను గుర్తుచేసుకున్నారు. దీపావళి సందర్భంగా 'ఓ అధికారి బిర్యానీ తీసుకొచ్చారు' అని శాంతి చెప్పారు . మరొక సమయంలో తన కొడుకు పుట్టినరోజుకు ఒక గార్డు కేక్ తెచ్చారని ఆమె తెలిపారు.

గుడారాలు
ఫొటో క్యాప్షన్, తుపానుల సమయంలో గుడారాలు వర్షంతో నిండిపోతాయి

ఐదు దశాబ్దాల నుంచి ఎవరూ ఉండటం లేదు

చాగోస్ ద్వీపసమూహంలో భాగమైన ఈ ద్వీపానికి వెళ్లడం చాలా కష్టం. సైనిక స్థావరాన్ని నిర్మించడానికి అక్కడున్న యూకే నివాసితులందరినీ ఖాళీ చేయించారు. దీంతో 1970 నుంచి అక్కడ ఎవరూ ఉండటం లేదు.

"కొన్నిసార్లు ఎలుకలు మా పిల్లల కాళ్లు, చేతులను కొరికేవి. మా ఆహారాన్ని ఎత్తుకెళ్లేవి. పీతలు, చీమలు కూడా శిబిరంలోకి ప్రవేశించేవి'' అని శాంతి అన్నారు.

తుపానుల సమయంలో టెంట్‌లలోని రంధ్రాల ద్వారా వర్షపు నీరు వచ్చేది. అవి ఇంతకు ముందు కోవిడ్ రోగుల కోసం ఉపయోగించారు.

ఐక్యరాజ్యసమితి ఇన్వెస్టిగేటర్స్ గత సంవత్సరం చివర్లో శిబిరాన్ని సందర్శించినప్పుడు పిల్లలు పిక్నిక్‌కి వెళ్లాలని, బైక్‌పై వెళ్లాలని లేదా ఐస్‌క్రీం తినాలని కలలు కన్నారని చెప్పారు.

ఈ శిబిరం పూర్తి సంక్షోభంలో ఉందని, ప్రజలు తమకు తాము హాని కలిగించుకుంటున్నారని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారని 2024 ప్రారంభంలో ఒక వైద్య అధికారి చెప్పారు.

"నా కూతురు జరిగినదంతా చూసింది. 'అమ్మా, వాళ్లు తమను తాము కోసుకున్నారు. నేనూ కోసుకోవాలా? అని అడిగింది. లేదు, నువ్వు అలా చేయకూడదు. నేను నిన్ను కాపాడుకుంటా. మనం సంగీతం విందాం, కొన్ని బొమ్మలు గీద్దాం'' అని చెప్పాను అంటూ శాంతి ఏడుస్తూ గుర్తుచేసుకున్నారు.

పాప రెండు సార్లు చనిపోవడానికి ప్రయత్నించిందని శాంతి, ఆమె భర్త ఏడుస్తూ చెప్పారు.

"రెండుసార్లు భయంకరంగా అనిపించింది. నాకర్థం కాలేదు. తను చనిపోతే పేరెంట్స్, తమ్ముడు సురక్షితమైన దేశానికి వెళతారని అలా చేశానని ఆమె చెప్పింది" అని శాంతి గుర్తుచేసుకున్నారు.

యూకే, యూఎస్ సైనిక స్థావరం మ్యాప్
ఫొటో క్యాప్షన్, యూకే, యూఎస్ సైనిక స్థావరం మ్యాప్

యూకేలో ఆరు నెలలు

శిబిరంలో పిల్లలపై ఇతర వలసదారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రిపోర్టులు కూడా ఉన్నాయి.

"మూడేళ్లలో మేము చాలా బాధపడ్డాం. ఎలా బతికున్నామో తెలియదు" అని శాంతి చెప్పారు.

ద్వీపంలోని శిబిరం తమిళులకు సరైన ప్రాంతం కాదని బ్రిటీష్ అధికారులు అంగీకరించారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వలసదారుల భద్రత, శ్రేయస్సు "మా ప్రాధాన్యత" అని ప్రభుత్వం తెలిపింది.

యూకేకు తీసుకువెళతామని అధికారులు ప్రకటించినప్పుడు శిబిరంలోని వలసదారులు చాలా సంతోషించారని శాంతి చెప్పారు. వారు అక్కడ ఆరు నెలల పాటు ఉండేందుకు అనుమతి దక్కింది. దీంతో ఆ రాత్రి శిబిరంలో ఎవరూ నిద్రపోలేదని ఆమె గుర్తుచేసుకున్నారు.

యూకేకు రాగానే చలికి షాక్ అయ్యానని శాంతి చెప్పారు. కోమా నుంచి లేచినట్లు అనిపించిందని అన్నారు. యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాట్సాప్ మెసేజ్‌లు పంపడం లేదా స్టోర్‌లలో చెల్లించడం కూడా ఆమె మరచిపోయారు. ఆమె పిల్లలు ఇప్పుడు పాఠశాలకు వెళ్లడం, కొత్త స్నేహితులను వెతకడం, డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించడం గురించి మాట్లాడుతున్నారు.

కానీ ఆ కుటుంబం భవిష్యత్తు ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. వారు యూకేలోనే ఉండాలనే ఆశతో ఆశ్రయానికి దావా దాఖలు చేశారు. వారి వాదనలు తిరస్కరణకు గురైతే వారిని తిరిగి శ్రీలంకకు పంపవచ్చు.

ఈ సంవత్సరం ప్రారంభంలో చాగోస్ దీవులను మారిషస్‌కు ఇచ్చేందుకు యూకే అంగీకరించింది. ఇంకా సంతకం చేయని ఈ ఒప్పందం ప్రకారం.. డియెగో గార్సియా యూకే- యూఎస్ సైనిక స్థావరంగానే ఉంటుంది. అయితే భవిష్యత్తులో అక్కడకు వచ్చే వలసదారుల బాధ్యతను మారిషస్ తీసుకుంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)